English | Telugu
అల్లు అరవింద్ దెబ్బ.. అప్పుడు 'గాడ్ ఫాదర్', ఇప్పుడు 'శాకుంతలం'!
Updated : Apr 5, 2023
గతేడాది కన్నడ చిత్రం 'కాంతార'ను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తెలుగులో విడుదల చేసిన సంగతి తెలిసిందే. పెద్దగా అంచనాల్లేకుండా విడుదలైన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ.50 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి సంచలన విజయాన్ని అందుకుంది. ఆ సమయంలో విడుదలైన మెగాస్టార్ చిరంజీవి 'గాడ్ ఫాదర్' సినిమా వసూళ్లపై 'కాంతార' ప్రభావం చూపిందని, లేదంటే ఆ సినిమా ఇంకా ఎక్కువ వసూళ్లు రాబట్టేదనే అభిప్రాయం వ్యక్తమైంది. అయితే ఇప్పుడు 'కాంతార' తరహాలో అల్లు అరవింద్ మరో డబ్బింగ్ సినిమాని విడుదల చేయబోతున్నారు. దీని ప్రభావం సమంత నటించిన 'శాకుంతలం'పై పడే అవకాశముంది.
అవార్డు విన్నింగ్ డైరెక్టర్ వెట్రిమారన్ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'విడుతలై పార్ట్-1'. సూరి, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా మార్చి 31న విడుదలై విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల మెప్పు పొందుతోంది. త్వరలో ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. గీత ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ చిత్రం తెలుగులో విడుదల కానుంది. ఈ సినిమాని ఏప్రిల్ 14 లేదా 15న తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. కాగా గుణశేఖర్ దర్శకత్వంలో సమంత టైటిల్ రోల్ పోషించిన 'శాకుంతలం' ఏప్రిల్ 14న విడుదల కానుంది. ఇప్పటికే తమిళ్ లో విజయం సాధించిన 'విడుతలై' అదే సమయంలో విడుదలైతే.. తెలుగు రాష్ట్రాల్లో 'శాకుంతలం' వసూళ్లపై ఎంతో కొంత ప్రభావం ఉంటుంది. అల్లు అరవింద్ విడుదల చేస్తే ఎక్కువ సంఖ్యలో థియేటర్లలో విడుదలవుతుంది అనడంలో సందేహం లేదు. పైగా వెట్రిమారన్, విజయ్ సేతుపతి అనే బ్రాండ్స్ కూడా ఉన్నాయి. ఈ లెక్కన 'శాకుంతలం' వసూళ్ళకు 'విడుతలై' గండి కొట్టడం ఖాయమనే చెప్పాలి.