English | Telugu
'ఆదిపురుష్' ప్రభంజనం.. ఫస్ట్ డే 'బాహుబలి-2' రికార్డ్ ఔట్!
Updated : Jun 15, 2023
ఇప్పుడు అందరి దృష్టి 'ఆదిపురుష్' పైనే ఉంది. ప్రభాస్ శ్రీరాముడిగా నటించిన ఈ సినిమా రేపు(జూన్ 16) ప్రేక్షకుల ముందుకు రానుంది. అడ్వాన్స్ బుకింగ్స్ కి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. హైదరాబాద్ వంటి మహానగరాల్లో మొదటిరోజు దాదాపు అన్ని షోలు ఫుల్ అయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయి ఓపెనింగ్స్ రాబడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఆల్ టైం టాప్-2 ఓపెనర్ గా నిలిచే అవకాశం కనిపిస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో 'ఆదిపురుష్' బుకింగ్స్ ఆలస్యంగా ఓపెన్ అయినప్పటికీ.. ఓపెన్ చేసిన గంటల్లోనే రికార్డు స్థాయిలో టికెట్లు బుక్ అయ్యాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో బుకింగ్స్ కళ్లు చెదిరేలా ఉన్నాయి. మొదటిరోజు హైదరాబాద్ లో వెయ్యికి పైగా షోలు వేస్తుండగా.. ఇప్పటికే మెజారిటీ షోలు హౌస్ ఫుల్ అయ్యాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇదే జోరు కనిపిస్తోంది. ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే తెలుగు రాష్ట్రాల్లో మొదటిరోజు రూ.40 కోట్లకు పైగా షేర్ రాబడుతుందనే అంచనాలు ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో మొదటిరోజు కలెక్షన్ల పరంగా రూ.74 కోట్ల షేర్ తో 'ఆర్ఆర్ఆర్' టాప్ లో ఉండగా, రూ.43 కోట్ల షేర్ తో 'బాహుబలి-2' రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో రూ.35 కోట్లకు పైగా షేర్ తో 'సాహో', 'సైరా నరసింహారెడ్డి', 'సర్కారు వారి పాట' సినిమాలు ఉన్నాయి. మొన్నటివరకు 'ఆదిపురుష్' కూడా అదే స్థాయి ఓపెనింగ్స్ రాబడుతుందనే అభిప్రాయాలు ఉన్నాయి. కానీ ఎప్పుడైతే బుకింగ్స్ ఓపెన్ అయ్యాయో అప్పుడు 'ఆదిపురుష్' సత్తా అందరికీ అర్థమైంది. తెలుగు రాష్ట్రాల్లో మొదటిరోజు కలెక్షన్ల పరంగా 'ఆదిపురుష్' చిత్రం 'బాహుబలి-2'ని దాటేలా ఉంది.
సౌత్ లోని ఇతర రాష్ట్రాలతో పాటు, నార్త్ ఇండియా, ఓవర్సీస్ లోనూ 'ఆదిపురుష్' బుకింగ్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి. మొదట్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మొదటిరోజు రూ.100 కోట్ల గ్రాస్ రాబడుతుందనే అంచనాలు ఉండగా.. ఇప్పుడది రూ.120-150 కోట్ల రేంజ్ లో ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పాజిటివ్ టాక్ వస్తే ఫుల్ రన్ లో ఈ సినిమా సంచలనాలు సృష్టించే అవకాశముంది.