Read more!

English | Telugu

సినిమా పేరు:వినరో భాగ్యము విష్ణుకథ
బ్యానర్:జీఏ2 పిక్చర్స్‌
Rating:2.50
విడుదలయిన తేది:Feb 18, 2023

సినిమా పేరు: వినరో భాగ్యము విష్ణుకథ
తారాగణం: కిరణ్ అబ్బవరం, కాశ్మీరా పరదేశి, మురళి శర్మ, శుభలేక సుధాకర్, ప్రవీణ్, పమ్మి సాయి, ఎల్బీ ప్రసాద్, దేవి ప్రసాద్, ఆమని తదితరులు
సినిమాటోగ్రఫీ: డానియెల్ విశ్వాస్
సంగీతం: చైత‌న్య భ‌ర‌ద్వాజ్
ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్
రచన, దర్శకత్వం: మురళి కిషోర్ అబ్బూరు
సమర్పణ: అల్లు అరవింద్
నిర్మాత: బన్నీవాసు
బ్యానర్: జీఏ2 పిక్చర్స్‌
విడుదల తేదీ: ఫిబ్రవరి 18, 2023

'రాజావారు రాణిగారు, 'ఎస్ఆర్ కళ్యాణ మండపం' చిత్రాలతో ఆకట్టుకున్న యువ హీరో కిరణ్ అబ్బవరం ఆ తర్వాత వరుసగా మూడు చిత్రాలతో నిరాశపరిచాడు. ఇప్పుడు 'వినరో భాగ్యము విష్ణు కథ'తో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గీతా ఆర్ట్స్ కి చెందిన జీఏ2 పిక్చర్స్ నిర్మించిన చిత్రం కావడం.. టీజర్, ట్రైలర్ ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? కిరణ్ కి విజయాన్ని అందించేలా ఉందా?..

 

కథ:
తిరుపతికి చెందిన విష్ణు(కిరణ్ అబ్బవరం) ఓ లైబ్రేరియన్. చిన్నప్పుడే తల్లితండ్రులను కోల్పోవడంతో తాత(శుభలేక సుధాకర్) పెంపకంలో పెరుగుతాడు. అయితే తన తల్లిదండ్రులు ఎవరితోనూ సత్సంబంధాలు కలిగి ఉండకుండా, దురుసు ప్రవర్తనతో అందరినీ దూరం చేసుకోవడమే వారి చావుకి కారణమని తెలుసుకున్న విష్ణు.. తాత మార్గదర్శకత్వంలో ఉత్తమ లక్షణాలతో పెరుగుతాడు. భూమ్మీద ఉన్న మనుషులందరూ మన పొరుగువారే అని భావించే విష్ణు.. అందరితో కలుపుగోలుగా మంచిగా ఉంటూ, ఎవరు ఏ సాయం అడిగినా కాదనకుండా చేస్తుంటాడు. అలాంటి విష్ణు జీవితంలోకి నైబర్ నెంబర్ ద్వారా దర్శన(కాశ్మీరా పరదేశి) వస్తుంది. యూట్యూబర్ అయిన దర్శన బాగా ఫేమస్ అవ్వాలని భావించి.. తన ఫోన్ నెంబర్ కి ముందు వెనుక ఉన్న నెంబర్లను కాల్ చేసి వారిని కలిసి వీడియో చేయాలని వినూత్నంగా ఆలోచిస్తుంది. అలా విష్ణు, దర్శన, శర్మ(మురళి శర్మ) కలుస్తారు. ఈ క్రమంలో ముగ్గురూ మంచి స్నేహితులవుతారు.. విష్ణు దర్శనతో ప్రేమలో పడతాడు. అయితే సరదాగా సాగిపోతున్న వారి జీవితాల్లో కొన్ని అనూహ్య సంఘటనలు జరుగుతాయి. శర్మని చంపడానికి కొందరు ప్రయత్నిస్తుంటారు. మరోవైపు దర్శన జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అసలు ఇదంతా ఎవరు చేస్తున్నారు. శర్మని విష్ణు రక్షించగలిగాడా? తెలియని వాళ్లకి సాయం చేయడానికే ముందుండే విష్ణు తను ప్రేమించిన అమ్మాయి కోసం ఏం చేశాడు? చివరికి ఈ కథ ఎలాంటి మలుపులు తిరిగిందో తెలియాలంటే సినిమా చూడాల్సిందే.


ఎనాలసిస్ :

ముందు నుంచి 'వినరో భాగ్యము విష్ణు కథ' ఏ జోనర్ సినిమానో స్పష్టత లేదు. మేకర్స్ సైతం ఇది ఏ జోనర్ మూవీనో కనిపెట్టండి అంటూ ప్రచారం చేశారు. అయితే సినిమా చూశాక కూడా చెప్పడం కష్టమే. ఎందుకంటే ఫస్టాఫ్ లో రొమాంటిక్ కామెడీ, సెకండాఫ్ లో సస్పెన్స్ థ్రిల్లర్ ఇలా అన్నీ ఒకే సినిమాలో చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అయితే అలా రెండు పడవల మీద కాలేసి కొంతవరకే విజయం సాధించాడు. నెరేషన్ బాగుంది. కానీ హీరో చేత కథ చెప్పిస్తున్నాం కదా అని నచ్చినప్పుడు పాట వేసుకోవచ్చు, నచ్చినప్పుడు ట్విస్ట్ రివీల్ చేసుకోవచ్చు, లాజిక్స్ వదిలేసి ప్రేక్షకులను ఈజీగా మ్యాజిక్ చేయొచ్చు అనుకుంటేనే పొరపాటు. ఆ పొరపాటే ఈ చిత్ర దర్శకుడు చేశాడు.

ఎన్ఐఏ, టెర్రరిస్ట్ అంటూ సినిమా ప్రారంభమవుతుంది. నైబర్ నెంబర్ ద్వారా టెర్రరిస్ట్ ని హీరో కలవడం, అతనికి హీరో తన కథ చెప్పడంతో సినిమా ఆసక్తికరంగా మొదలవుతుంది. అయితే ఫస్టాఫ్ లో పెద్దగా కథ జరగకపోయినా.. పాటలు, కామెడీతో ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా నడిపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అందులో చాలావరకు సక్సెస్ అయ్యాడు కూడా. ముఖ్యంగా మురళి శర్మ కామెడీ సన్నివేశాలు అలరిస్తాయి. అలాగే ఇంటర్వెల్ డిజైన్ చేసిన తీరు కూడా ఆకట్టుకుంది. హీరో, హీరోయిన్ మధ్య ప్రేమ సన్నివేశాలు మాత్రం తేలిపోయాయి.

ఫస్టాఫ్ ని పాటలు, కామెడీ, ఇంటర్వెల్ ట్విస్ట్ తో గట్టెక్కించిన దర్శకుడు.. సెకండాఫ్ లో మాత్రం తడబడ్డాడు. ఇంటర్వెల్ తర్వాత సినిమా బాగా స్లో అయింది. ఏమాత్రం ఆసక్తికరంగా సాగలేదు. అనవసరపు పాట, లాజిక్ లేని సన్నివేశాలు విసిగిస్తాయి. మురళి శర్మ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా ఆకట్టుకోలేదు. అయితే నైబర్ నెంబర్ ద్వారా పరిచయమైన తన ప్రేయసిని.. ఆ నైబర్ నెంబర్ కాన్సెప్ట్ తోనే హీరో కాపాడుకోవాలనే ఆలోచన బాగుంది. అలాగే సినిమాని ముగించిన తీరు కూడా ఆకట్టుకుంది. ఇంటర్వెల్ మాదిరిగానే క్లైమాక్స్ కూడా అలరిస్తుంది.

మొత్తానికి ఫస్టాఫ్ లో కాస్త కామెడీ, ఇంటర్వెల్ ట్విస్ట్.. సెకండాఫ్ లో రెండు ట్విస్ట్ లతో అక్కడక్కడా అలరిస్తుంది ఈ చిత్రం. మురళి శర్మ పాత్ర మీద మరింత శ్రద్ధ పెట్టి, సెకండాఫ్ లో లాజిక్ తో కూడిన ఆసక్తికరమైన సన్నివేశాలు పెట్టుంటే ఫలితం మెరుగ్గా ఉండేది. అలాగే దర్శకుడు ఒకే సినిమాలో అన్నీ చూపించేయాలి అనుకోకుండా.. చూపించిన ఒకట్రెండు అయినా పూర్తిగా దృష్టి పెట్టి ప్రేక్షకులను కట్టిపడేసేలా మలిస్తే బాగుండేది. పక్కింటి కుర్రాడిలా కనిపించే కిరణ్ లాంటి యువ హీరోకి ఏదో పెద్ద కమర్షియల్ హీరోకి పెట్టినట్లు భారీ ఫైట్లు పెట్టడం మంచి ఆలోచన కాదు. చైతన్ భరద్వాజ్ సంగీతం ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలిచింది. 'వాసవ సుహాస', 'సోల్ ఆఫ్ తిరుపతి' పాటలు ఆకట్టుకున్నాయి. నేపథ్య సంగీతం కూడా మెప్పించింది. సంభాషణలు బాగున్నాయి. డేనియల్ విశ్వాస్ కెమెరా పనితనం బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. 

 

నటీనటుల పనితీరు:
తనకు అలవాటైన పక్కింటి కుర్రాడు లాంటి విష్ణు పాత్రలో కిరణ్ అబ్బవరం చక్కగా ఒదిగిపోయాడు. ఆ పాత్రలోని మంచి తనానికి, సాయం చేసే గుణానికి తగ్గట్లుగా చక్కగా ప్రవర్తించాడు. కామెడీ, ఎమోషన్ సన్నివేశాల్లో ఆకట్టుకున్నాడు. ఫేమస్ అయిపోవాలనుకునే యూట్యూబర్ దర్శన పాత్రలో కాశ్మీరా పరదేశి రాణించింది. సెకండాఫ్ లో ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేకపోయినా ఫస్టాఫ్ లో ఉన్నంతలో అలరించింది. డాగ్ కేర్ టేకర్ శర్మ పాత్రలో మురళి శర్మ మెప్పించాడు. కుర్రాడిలా మారిపోయి కాశ్మీరాతో కలిసి డ్యాన్స్ లు వేసి నవ్వించాడు. శుభలేక సుధాకర్, ప్రవీణ్, పమ్మి సాయి, ఎల్బీ ప్రసాద్, దేవి ప్రసాద్, ఆమని పాత్రల పరిధి మేరకు రాణించారు.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ లా ప్రారంభమై సస్పెన్స్ థ్రిల్లర్ లా టర్న్ తీసుకునే 'వినరో భాగ్యము విష్ణు కథ' అక్కడక్కడా అలరిస్తుంది. దర్శకుడు ఎంచుకున్న కథాంశం బాగున్నప్పటికీ పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయాడు. కొన్ని కామెడీ సన్నివేశాలు, ఒకట్రెండు ట్విస్ట్ లతో అక్కడక్కడా ఆకట్టుకునేలా ఉన్న ఈ చిత్రాన్ని ఒక్కసారి చూసేయొచ్చు.

-గంగసాని