English | Telugu

సినిమా పేరు:అనగనగా ఒక రాజు
బ్యానర్:సితార ఎంటర్‌టైన్‌మెంట్స్
Rating:2.75
విడుదలయిన తేది:Jan 14, 2026

తారాగణం: నవీన్‌ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి, రావు రమేష్, చంద్ర, రంగస్థలం మహేష్, సమీరా భరద్వాజ్, రేవంత్, సత్యశ్రీ తదితరులు
సంగీతం: మిక్కీ జె. మేయర్
డీఓపీ: యవరాజు 
ఆర్ట్ డైరెక్టర్: గాంధీ గారు 
ఎడిటర్: వంశీ అట్లూరి 
రచన: నవీన్‌ పొలిశెట్టి, చిన్మయి
దర్శకత్వం: మారి
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
బ్యానర్స్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్
విడుదల తేదీ: జనవరి 14, 2026 

 

ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతి రత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి వంటి మూడు వరుస విజయాల తర్వాత నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన మూవీ 'అనగనగా ఒక రాజు'. ఈ చిత్రం ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా ట్రైలర్.. ఒక మంచి కామెడీ ఫిల్మ్ ని చూడబోతున్నామనే హామీ ఇచ్చింది. మరి సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ 'అనగనగా ఒక రాజు' ఎలా ఉంది? నవీన్ ఖాతాలో మరో హిట్ పడిందా? (Anaganaga Oka Raju Movie Review)

 

కథ:
రాజు(నవీన్ పోలిశెట్టి) గౌరవపురం జమీందారు గోపరాజు మనవడు. తాత జల్సాల పేరుతో ఆస్తులన్నీ ఆవిరి చేసేయడంతో.. రాజుకి పేరు తప్ప ఏం మిగలదు. అయినప్పటికీ అప్పో సొప్పో చేసి గొప్పలు చెప్పుకుంటూ తన కుటుంబ పరువు నిలబెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. తన బంధువుల్లో ఒకతను కోటీశ్వరాలైన అమ్మాయిని ప్రేమ పెళ్లి చేసుకొని ఒక్కసారిగా ఫుల్ రిచ్ అయిపోతాడు. దాంతో రాజు కూడా ఓ రిచ్ అమ్మాయిని పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోవాలి అనుకుంటాడు. ఈ క్రమంలోనే జమీందారు భూపతిరాజు(రావు రమేష్) కూతురు చారులత(మీనాక్షి చౌదరి)ను ప్రేమలో పడేసి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ఆమె ప్రేమను పొందటం కోసం ఎన్నో ప్లాన్ లు వేస్తాడు. మరి రాజు ప్రేమకథ సక్సెస్ అయిందా? చారులత గురించి అతను తెలుసుకున్న నిజమేంటి? పెళ్లి చేసుకొని కోట్లకు పడగలు ఎత్తుదామనుకున్న రాజు.. సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? వంటి విషయాలు సినిమా చూసి తెలుసుకోవాలి.


ఎనాలసిస్ :

కామెడీ సినిమాలకు పెద్ద కథ అవసరంలేదు. చిన్న కథను తీసుకొని.. పాత్రలు సరిగ్గా డిజైన్ చేసుకొని.. మంచి సన్నివేశాలు, సంభాషణలతో ఆ పాత్రల మధ్య అదిరిపోయే కామెడీని పండించి ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా చేయవచ్చు. 'అనగనగా ఒక రాజు' సినిమా కూడా ఆ కోవలోకే వస్తుంది.

సింపుల్ గా చెప్పాలంటే... ఒకప్పుడు గొప్పగా బతికిన జమిందారీ కుటుంబానికి చెందిన వ్యక్తి.. సాధారణ జీవితాన్ని గడపలేక రిచ్ అమ్మాయిని పెళ్లి చేసుకొని గొప్పగా బతకాలనుకుంటాడు. ఈ క్రమంలో అతనికి ఎదురైన సవాళ్లు ఏంటి? అనేది చిత్ర కథ. అయితే ఈ కథకి వినోదాన్ని జోడించి సరదాగా నడిపించే ప్రయత్నం చేశారు.

ఫస్ట్ హాఫ్ చాలా సరదాగా గడిచిపోయింది. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా.. పేరుకి జమీందారు కుటుంబం కానీ ఇరిగిపోయిన కుర్చీలు, రోజువారీ ఖర్చుల కోసం తిప్పలు తప్ప చెప్పుకోడానికి ఏం లేవు అన్నట్టుగా.. రాజు పాత్రను పరిచయం చేశారు. ప్రారంభ సన్నివేశాలు కాస్త నెమ్మదిగా ఉన్నట్టు అనిపిస్తాయి కానీ.. కథ నడుస్తున్న కొద్దీ కామెడీ డోస్ పెరుగుతుంది. ముఖ్యంగా చారులతను పడేయడానికి రాజు గారు చేసే విన్యాసాలు నవ్వులు పూయిస్తాయి. సీన్స్, డైలాగ్స్ ఫ్రెష్ గా అనిపిస్తాయి. అందుకు తగ్గట్టే తన ఎనర్జిటిక్ పర్ఫామెన్స్, అదిరిపోయే కామెడీ టైమింగ్ తో ఎక్కడా బోర్ కొట్టకుండా సినిమాని నడిపించే ప్రయత్నం చేశాడు నవీన్. ముఖ్యంగా డైలాగ్ కామెడీ బాగా వర్కౌట్ అయింది. చిన్న ట్విస్ట్ తో ఇచ్చిన ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా ఆకట్టుకుంది.

సరదా ప్రేమ కథతో ఫస్ట్ హాఫ్ నడవగా.. సెకండాఫ్ పొలిటికల్ టర్న్ తీసుకుంది. సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలోనే దాదాపు సెకండాఫ్ నడుస్తుంది. ఇలా ఊళ్ళో ఎన్నికల హడావుడి ట్రాక్ ని గతంలో చాలా సినిమాల్లో చూసుంటాం. అయితే ఈ పొలిటికల్ ట్రాక్ కి కూడా వినోదం జోడించి నవ్వించే ప్రయత్నం చేశారు. ఫస్ట్ హాఫ్ స్థాయిలో కాకపోయినా సెకండాఫ్ లో కూడా కామెడీ బాగానే వర్కౌట్ అయింది. ఇక క్లైమాక్స్ ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది. పతాక సన్నివేశాల్లో భావోద్వేగాలు బాగానే పండాయి.

అల్లరి నరేష్ నటించిన అత్తిలి సత్తిబాబు, కత్తి కాంతారావు వంటి సినిమాల ఛాయలు ఇందులో కనిపిస్తాయి. అయితే సీన్స్, డైలాగ్స్ లో కొత్తదనం చూపించారు. అందుకే ఈ సినిమా దాదాపు ఎక్కడా బోర్ కొట్టదు. ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండాఫ్ లో కామెడీ డోస్ కాస్త తగ్గినప్పటికీ.. క్లైమాక్స్ లో ఎమోషన్ వర్కౌట్ అయింది. దాంతో పర్లేదు పండగకి ఒక సినిమా చూశామని ఫీలింగ్ కలుగుతుంది. అయితే ట్రైలర్ చూసి ఇది పూర్తిస్థాయి కామెడీ సినిమా అనుకొని థియేటర్ లో అడుగుపెట్టిన వారు మాత్రం.. సెకండాఫ్ చూసి కాస్త నిరాశ చెందే అవకాశముంది.

 

నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు:
నవీన్‌ పొలిశెట్టి తన ఎనర్జిటిక్ పర్ఫామెన్స్ తో మెస్మరైజ్ చేశాడు. తనదైన కామెడీ టైమింగ్ తో మరోసారి నవ్వులు పూయించాడు. ఎమోషనల్ సీన్స్ లోనూ మెప్పించాడు. దాదాపు సినిమా అంతా నవీనే కనిపించాడు. ఓ రకంగా వన్ మ్యాన్ షో అని చెప్పవచ్చు. చారులత పాత్రలో మీనాక్షి చౌదరి మెప్పించింది. అమాయకత్వంతో కూడిన సంపన్న అమ్మాయి పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. రావు రమేష్, చంద్ర, రంగస్థలం మహేష్, రేవంత్, సత్యశ్రీ, సమీరా భరద్వాజ్ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.

నటుడిగానే కాదు, రచయితగానూ నవీన్ ప్రభావం చూపాడు. చిన్మయితో కలిసి నవీన్ ఈ స్క్రిప్ట్ రాయడం విశేషం. తెలిసిన కథే అయినా.. సీన్స్, డైలాగ్స్ బాగా రాసుకున్నారు. ముఖ్యంగా పంచ్ డైలాగ్స్ తో బాగా నవ్వించారు. ఇక తొలి సినిమా అయినా.. దర్శకుడిగా మారి తన బాధ్యతను చక్కగా నిర్వర్తించాడు. పేపర్ మీద రాసిన కామెడీ, ఎమోషన్ ని తెర మీద పండించడం దర్శకుడి చేతిలో ఉంటుంది. ఆ విషయంలో మారి సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు.

సాంకేతికంగా సినిమా బాగుంది. సినిమాకి తగ్గట్టుగా మిక్కీ జె. మేయర్ ఎనర్జిటిక్ మ్యూజిక్ అందించాడు. పాటలు, నేపథ్య సంగీతం ఆకట్టుకున్నాయి. యవరాజు కెమెరా పనితనం ఆకట్టుకుంది. ప్రతి ఫ్రేమ్ కలర్ ఫుల్ గా ఉంది. వంశీ అట్లూరి ఎడిటింగ్ బాగానే ఉంది. అయితే ఫస్ట్ లో ప్రారంభ సన్నివేశాలు, అలాగే సెకండాఫ్ ఇంకా షార్ప్ చేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

అనగనగా ఒక రాజు.. బాగానే నవ్వించారు. ఫస్ట్ హాఫ్ లో ఎన్నో నవ్వులు, సెకండ్ హాఫ్ లో మాత్రం కొన్నే నవ్వులు.

 

Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' discretion is advised before reacting to them.

తెలుగు వన్ రేటింగ్ : 2.50

తెలుగు వన్ రేటింగ్ : 2.50

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.00

తెలుగు వన్ రేటింగ్ : 3.00

తెలుగు వన్ రేటింగ్ : 2.25