Read more!

English | Telugu

సినిమా పేరు:సార్
బ్యానర్:సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్
Rating:3.00
విడుదలయిన తేది:Feb 17, 2023

సినిమా పేరు: సార్
తారాగణం: ధనుష్, సంయుక్తా మీనన్, సముద్రకని, సాయికుమార్, తనికెళ్ల భరణి, ఆడుకాలం నరేన్, హరీశ్ పేరడి, నాగమహేశ్, హైపర్ ఆది, నర్రా శ్రీనివాస్, తోటపల్లి మధు, పమ్మి సాయి, షా రా, ఇళవరసు, మొట్ట రాజేంద్రన్, ప్రవీణ
సంగీతం: జి.వి. ప్రకాశ్ కుమార్
సినిమాటోగ్రఫీ: జె. యువరాజ్
ఎడిటింగ్: నవీన్ నూలి
ప్రొడక్షన్ డిజైన్: అవినాశ్ కొల్లా
యాక్షన్: వెంకట్
సమర్పణ: శ్రీకర స్టూడియోస్
నిర్మాతలు: సూర్యదేవరన నాగవంశీ, సాయిసౌజన్య
రచన-దర్శకత్వం: వెంకీ అట్లూరి
బ్యానర్స్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ 
విడుదల తేదీ: 17 ఫిబ్రవరి 2023

ఒక తెలుగు దర్శకుడితో తమిళ స్టార్ యాక్టర్ ధనుష్ నటించిన తొలి సినిమా 'సార్'. ఆ దర్శకుడు.. వెంకీ అట్లూరి. ఈమధ్యే మరో తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లితో తమిళ టాప్ స్టార్ విజయ్ 'వారిసు' (తెలుగులో 'వారసుడు') సినిమా చెయ్యడం, అది ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధించడం చూశాం. ఇప్పుడు వెంకీతో ధనుష్ చెయ్యడం చూస్తుంటే.. మన దర్శకులు తమ కథలతో తమిళ స్టార్లను ఇంప్రెస్ చేస్తున్నారనే అభిప్రాయం కలుగక మానదు. 'సార్' ద్విభాషా చిత్రం. తమిళంలో 'వాతి' పేరుతో రిలీజయ్యింది. 

కథ:-

సిరిపురం అనే ఊళ్లో ఒక ఇంటర్మీడియేట్ చదువుతున్న కుర్రాడు జూనియర్ కాలేజీలో చదువుపేరుతో పెడుతున్న ఒత్తిడిని తట్టుకోలేక అత్తెసరు మార్కులు తెచ్చుకుంటూ ఉంటాడు. అతడికి ఎంసెట్‌లో మంచి ర్యాంక్ వచ్చే అవకాశం లేదని భావించిన తండ్రి అతడి ఇంజినీరింగ్ చదువు కోసం తమ వీడియో షాప్‌ను అమ్మేయడానికి సిద్ధపడతాడు. ఆ షాప్‌కు తన ఫ్రెండ్స్‌తో కలిసివెళ్లిన కుర్రాడికి అక్కడ కొన్ని పాత వీడియో క్యాసెట్లు దొరుకుతాయి. వాటిలో ఒక లెక్చరర్ చాలా సులువైన పద్ధతిలో మేథమేటిక్స్ చెప్పడం చూసి, అతనెవరో తెలుసుకోనే ప్రయత్నంలో కడప కలెక్టర్ ఎ.ఎస్. మూర్తి (సుమంత్)ని కలుస్తారు. వాళ్లకు కలెక్టర్ తన గురువు బాలు అలియాస్ బాలగంగాధర తిలక్ (ధనుష్) కథ చెప్తాడు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఆర్థిక సరళీకరణల విధానాలను తనకు అనుకూలంగా మార్చుకున్న త్రిపాఠి (సముద్రకని) విద్యను వ్యాపారంచేసి, ప్రభుత్వ జూనియర్ కాలేజీలను నిర్వీర్యం చేసి, డబ్బు గడించడానికి ప్రణాళికలు వేసి సక్సెస్ అవుతాడు. తన ప్లాన్‌లో భాగంగా ప్రభుత్వ కాలేజీలను దత్తత తీసుకుంటాడు. అలా సిరిపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు జూనియర్ లెక్చరర్‌గా వెళ్తాడు బాలు. కానీ అక్కడ చదువుకోవడానికి ఒక్కరూ రాకపోవడం చూసి, తోటి లెక్చరర్ మీనాక్షి (సంయుక్త)తో చాలెంజ్ చేసి మూడు రోజుల్లో అక్కడి స్టూడెంట్స్‌ను కాలేజీకి వచ్చేలా చేస్తాడు. ఈ క్రమంలో బాలు, మీనాక్షి ఒకరికొకరు మానసికంగా దగ్గరవుతారు. ఫస్ట్ యియర్‌లో త్రిపాఠి అంచనాలకు భిన్నంగా సిరిపురం కాలేజీ స్టూడెంట్స్ అందరూ ఫస్ట్ క్లాస్‌లో పాసవుతారు. ఇది అతడికి కంటగింపు అవుతుంది. తనకు, తనలాంటి వ్యాపారులకు మనుగడ కష్టమవుతుందని భావించిన అతడు బాలును అక్కడ్నించి పంపేయడానికి కుట్ర పన్ని, సక్సెస్ అవుతాడు. ఆ తర్వాత బాలు ఏం చేశాడు, తనను నమ్మి చదువుకోడానికి వచ్చిన స్టూడెంట్స్‌కు ఎలా న్యాయం చేశాడు.. అనేది మిగతా కథ. 


ఎనాలసిస్ :

ప్రధానిగా పీవీ నరసింహారావు, ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ ఉన్న కాలంలో తెచ్చిన సరళీకృత ఆర్థిక విధానాలు దేశాన్ని ప్రగతిబాటలో నడిపించాయి. అదే సమయంలో కొంతమంది స్వార్థపరులైన వ్యాపారులు విద్యను వ్యాపారం చేసి, ప్రభుత్వ స్కూళ్లను, కాలేజీలను నిర్వీర్యం చేసి, అక్కడ పనిచేసే ప్రతిభావంతులైన లెక్చరర్లను ఎక్కువ జీతాల ఆశచూపి ప్రైవేట్ కాలేజీల్లో చేరేలా చేశారని సార్ మూవీ ద్వారా చెప్పాడు డైరెక్టర్ వెంకీ అట్లూరి. దేశంలో.. ముఖ్యంగా తెలుగునాట చదువు అనేది ఒక వ్యాపారమైపోయి, పేదలకు అందని ద్రాక్షగా ఎలా మారిపోయిందో ఒక కమర్షియల్ స్టార్‌తో సాధ్యమైనంత వరకు రియలిస్టిగ్గా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఒకే కథలో చదువు ప్రాధాన్యం తెలియజేయడంతో పాటు, కులాల పేరిట పల్లెటూళ్లలో ఉండే అడ్డుగోడలను కూడా స్పృశించాడు వెంకీ. నిమ్న కులాల వారిని అగ్ర వర్ణాల పిల్లలు తమ పక్కన కూర్చోవడానికి ఒప్పుకోకపోతే, వారిని బాలు డీల్ చేసే విధానం ఆకట్టుకొనేలా ఉన్నా.. వాస్తవంలో అలా జరగడం ఆ రోజుల్లో చాలా కష్టం. కథలో ఎక్కువ భాగం 1998-2000 సంవత్సరాల మధ్య జరుగుతుంది. 

పిల్లలకు నిజాయితీగా చదువు చెప్పాలనుకొనే ఒక సామాన్యుడైన లెక్చరర్, డబ్బు సంపాదనే ధ్యేయంగా ఉండే ఒక బడా వ్యాపారిని తన తెలివితేటలతో ఎలా ఎదుర్కొని, తాను అనుకున్న విధంగా తన 46 మంది స్టూడెంట్స్‌ను ఎంసెట్‌లో మంచి ర్యాకులు వచ్చేలా చేయగలిగాడనే పాయింట్‌ను డైరెక్టర్ బాగానే డీల్ చేశాడు. ఇలాంటి కథలో మరో కమర్షియల్ డైరెక్టర్ అయితే హీరోయిజంను ఎలివేట్ చేయడానికి ట్రై చేసేవాడే. కానీ.. వెంకీ ఆ బాటలోకి వెళ్లకుండా బాలు పాత్రను పరిస్థితులకు తలొగ్గేవాడిగా చూపించి, ప్రతికూల పరిస్థితుల్లో ఎలా సక్సెస్ కావాలనే విషయాన్నీ ఆ పాత్రతోనే తెలియజేశాడు. బాలు మ్యాథ్స్ పాఠాలు చెప్పిన వీడియో క్యాసెట్లను సిరిపురం విద్యార్థులు భూషణం (మొట్ట రాజేంద్రన్)కు చెందిన లక్ష్మీ టూరింగ్ టాకీస్‌లో నెల రోజులపాటు సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు స్పెషల్ షోస్ పేరుతో వచ్చి తిలకిస్తుంటే, ప్రెసిడెంట్ (సాయికుమార్) సహా ఊళ్లో జనాలకు ఎలాంటి అనుమానం రాకపోవడం లాజికల్‌గా లేదు. చివరలో ఎప్పుడో తెలిశాక.. అంతదాకా విలన్లుగా ప్రవర్తించిన సబిన్‌స్పెక్టర్, ప్రెసిడెంట్ అప్పటికప్పుడు మంచివాళ్లుగా మారిపోవడం కూడా అలానే ఉంది. క్లైమాక్స్ మన ఊహలకు భిన్నమైనదైనా, కమర్షియల్ లెక్కల ప్రకారం బలహీనంగా ఉంది. లెక్చరర్ల పాత్రల్లో కనిపించిన హైపర్ ఆది, షా రా మధ్య తీసిన సీన్లు వినోదాన్ని పండించాయి. ద్విభాషా చిత్రం కావడంతో తెలుగు, తమిళ నటీనటులతో క్యాస్టింగ్‌ను బ్యాలెన్స్ చెయ్యడానికి ప్రయత్నించినట్లు అర్థమవుతుంది. 

ధనుష్ లాంటి స్టార్ ఉన్నప్పటికీ ఈ సినిమాలో భారీగా ఖర్చు పెట్టిన సన్నివేశాలు అత్యల్పం కావడం రిలీఫ్. కాకపోతే 1990ల చివరినాటి నేపథ్యం కావడంతో ఆ వాతావరణం ప్రతిబింబించే సెట్లకు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. సినిమాలో ఉన్న మూడు యాక్షన్ సీన్లకూ పెద్దగా ఖర్చవలేదు. అయితే సాంకేతికంగా మాత్రం సార్ రిచ్‌గా ఉంది. యువరాజ్ సినిమాటోగ్రఫీ టాప్ క్లాస్‌లో ఉంది. నేపథ్యానికి తగ్గ కలర్ టోన్‌తో కెమెరా వర్క్ ఫెంటాస్టిక్. జీవీ ప్రకాశ్ మ్యూజిక్ కూడా సింప్లీ సూపర్బ్. బీజీఎంను అదరగొట్టేశాడు. పాటలు కూడా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా మాస్టారూ మాస్టారూ పాట సంగీత పరంగానే కాకుండా చిత్రీకరణ పరంగానూ ఆకట్టుకుంది. ఉన్న మూడు పాటలూ సందర్భోచితమైనవే. తన షార్ప్ ఎడిటింగ్‌తో నవీన్ నూలి ఇంప్రెస్ చేశాడు. అవినాశ్ కొల్లా ఆర్ట్ వర్క్ ఉన్నత స్థాయిలో ఉంది. ఓవరాల్‌గా నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

నటీనటుల పనితీరు
బాలు అలియాస్ బాలగంగాధర తిలక్ పాత్రలో ధనుష్ ఉన్నత స్థాయి అభినయాన్ని ప్రదర్శించాడు. నటునిగా ఇప్పటికే దేశవ్యాప్తంగా మంచిపేరున్న అతను ఒక సాధారణ జూనియర్ లెక్చరర్ క్యారెక్టర్‌లోకి సునాయాసంగా పరకాయ ప్రవేశం చేశాడు. ఒక పాత్ర పోషణ ఇంత ఈజీనా అన్నట్లు చేశాడు. ఇటీవల కర్ణన్, అసురన్ లాంటి పాత్రల్లో ధనుష్ నట విశ్వరూపాన్ని చూసిన మనం.. ఇప్పుడు వాటికి భిన్నమైన బాలు పాత్రలోనూ అతడిని ఇష్టపడతాం. బయాలజీ లెక్చరర్ మీనాక్షి పాత్రలో సంయుక్త ఆకట్టుకుంది. ధనుష్‌తో ఆమె స్క్రీన్-కెమిస్ట్రీ బాగుంది. త్రిపాఠిగా సముద్రకని విలనీని ఎప్పట్లా బాగా పండించాడు. కారు డ్రైవర్‌గా బాలు తండ్రి పాత్రలో ఆడుకాలం నరేన్, సిరిపురం ప్రెసిడెంట్‌గా సాయికుమార్, సబిన్‌స్పెక్టర్‌గా నాగమహేశ్, కాలేజీ ప్రిన్సిపాల్‌గా తనికెళ్ల భరణి, లెక్చరర్లుగా హైపర్ ఆది, షా రా, నర్రా శ్రీనివాస్, లక్ష్మీ టూరింగ్ టాకీస్ యజమానిగా మొట్ట రాజేంద్రన్ పాత్రల పరిధి మేరకు నటించారు. కలెక్టర్ ఎ. సత్యనారాయణమూర్తిగా సుమంత్ గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చి ఆకట్టుకున్నాడు.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

ఒక మంచి పాయింట్, ఒక మంచి మెసేజ్‌తో వచ్చిన 'సార్' మూవీ నిస్సందేహంగా ఒక మంచి సినిమా. కమర్షియల్‌గా ఏ మేరకు వర్కవుట్ అవుతుందనేది, ప్రేక్షకాదరణ మీద ఆధారపడి ఉంది. ధనుష్ నటన కోసమైనా ఈ సినిమాని ఓసారి చూసేయొచ్చు.

- బుద్ధి యజ్ఞమూర్తి