Read more!

English | Telugu

సినిమా పేరు:కార్తికేయ 2
బ్యానర్:అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
Rating:3.00
విడుదలయిన తేది:Aug 13, 2022

సినిమా పేరు: కార్తికేయ-2
తారాగ‌ణం: నిఖిల్ సిద్ధార్థ్, అనుపమ పరమేశ్వరన్, అనుపమ్ ఖేర్, శ్రీనివాస్ రెడ్డి, వైవా హర్ష, తులసి, ఆదిత్య మీనన్, సత్య, ప్రవీణ్ 
మ్యూజిక్: కాలభైరవ
సినిమాటోగ్ర‌ఫీ: కార్తీక్ ఘట్టమనేని
ఎడిటింగ్: కార్తీక్ ఘట్టమనేని
నిర్మాతలు: అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వప్రసాద్
ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: చందూ మొండేటి
బ్యాన‌ర్: అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
విడుద‌ల తేదీ: 13 ఆగ‌స్ట్ 2022

నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిన 'కార్తికేయ' 2014లో విడుదలై ఘన విజయాన్ని అందుకుంది. అప్పుడు ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతినిచ్చింది. దాదాపు 8 ఏళ్ళ తర్వాత ఇప్పుడు వీరి కాంబినేషన్ లో రూపొందిన 'కార్తికేయ-2' ప్రేక్షకుల ముందుకొచ్చింది. 'కార్తికేయ'కు సీక్వెల్ కావడంతో పాటు టీజర్, ట్రైలర్స్ ఆకట్టుకోవడంతో 'కార్తికేయ-2'పై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. మరి 'కార్తికేయ-2' ఆ అంచనాలను అందుకుందా? కార్తికేయగా నిఖిల్ అలరించి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకోనున్నాడా? అనేది రివ్యూలో చూద్దాం.

కథ:

కలియుగం ప్రారంభం కావడానికి ముందు, ద్వాపర యుగం ముగింపు సమయంలో శ్రీకృష్ణుడి కాలి కడియం ఓ రహస్య ప్రదేశంలో ఉంచబడుతుంది. భవిష్యత్ లో మానవాళికి వచ్చే ముప్పుల నుంచి రక్షించే శక్తి అందులో ఉంటుంది. దానిని దక్కించుకోవడం కోసం వేల ఏళ్ళ నుంచి ఎందరో ప్రయత్నించి విఫలమవుతుంటారు. ఆ కడియం ఉన్న ప్రదేశాన్ని చేరుకోవాలంటే ఎన్నో రహస్యాలను ఛేదించాలి, ఎన్నో విపత్కర పరిస్థితులను దాటాలి. ఇప్పటికీ ఆ కడియం కోసం కొందరు అన్వేషణ సాగిస్తూనే ఉంటారు. అయితే సమాధానాలు తెలియని ప్రశ్నలకు ఛేదించడం, కొత్త విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్న డాక్టర్ కార్తికేయ(నిఖిల్).. తనకోసం తల్లి మొక్కిన మొక్కు తీర్చడానికి అయిష్టంగానే ద్వారకకి వెళ్తాడు. అక్కడికి వెళ్ళాక నిఖిల్ కి ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. కొందరు కార్తికేయను అంతమొందించే ప్రయత్నం చేస్తారు. అసలు కృష్ణుడి కాలి కడియానికి, కార్తికేయకి సంబంధమేంటి? కార్తికేయను ఎవరు, ఎందుకు చంపాలనుకుంటున్నారు? అయిష్టంగా ద్వారకకి వెళ్లిన కార్తికేయ ప్రయాణం ఆ తర్వాత ఎలాంటి మలుపులు తిరిగింది? ఈ ప్రయాణంలో అతను తెలుసుకున్న, ఛేదించిన విషయాలేంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.


ఎనాలసిస్ :

పార్ట్-1 లో కార్తికేయ ఒక గుడిలోని మిస్టరీని ఛేదిస్తే, పార్ట్-2 లో ఏకంగా ఒక దైవ రహస్యాన్ని ఛేదించే పనిలో ఉంటాడు. శ్రీకృష్ణుడి కాలి కడియం అనే కాన్సెప్ట్ ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమా ద్వారా డైరెక్టర్ చందూ మొండేటి చెప్పాలనుకున్న మెయిన్ పాయింట్.. వేల సంవత్సరాల క్రితమే మనం దేశంలో ఇప్పుడు మనం చూస్తున్న సైన్స్, టెక్నాలజీ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ ఉండేది. కృష్ణుడు, ద్వారక ఇవేవీ పురాణాలు కాదు.. మన చరిత్ర. అయితే ఈ విషయాన్ని చెప్పే క్రమంలో ఎన్నో లాజిక్స్ వదిలేసినట్లు అనిపిస్తుంది. ఆ లాజిక్స్ ని పక్కనపెట్టి ఒక సినిమాలా చూస్తే మాత్రం ఇది ఖచ్చితంగా ప్రేక్షకులను మెప్పించే అడ్వెంచర్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు.

చందూ మొండేటి చెప్పినట్లు పార్ట్-1 చూడని వాళ్ళకి కూడా పార్ట్-2 అర్థమవుతుంది. తెలియని విషయాలను తెలుసుకోవాలనే క్యూరియాసిటీ ఉన్న వ్యక్తిగా కార్తికేయ పాత్ర పరిచయమవుతుంది. కార్తికేయ ద్వారక వెళ్లడం, అక్కడ తన తల్లి మిస్ అవ్వడం, తనని కొందరు చంపడానికి చూడటం, ముగ్ద(అనుపమ పరమేశ్వరన్)తో పరిచయం వంటి సన్నివేశాలతో ఫస్ట్ హాఫ్ ఆసక్తికరంగా సాగింది. ఇక సెకండాఫ్ మరింత ఉత్కంఠభరితంగా, ఆకట్టుకునేలా సాగుతుంది. మనకి క్లైమాక్స్ ఏంటో తెలిసినప్పటికీ బోర్ కొట్టకుండా నడిపించిన విధానం ఆకట్టుకుంది. సెకండాఫ్ లో వచ్చే కొన్ని కొన్ని సన్నివేశాలు ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టిస్తాయి. ముఖ్యంగా అనుపమ్ ఖేర్ సన్నివేశం సినిమాకే హైలైట్ గా నిలిచింది. ఆయన కృష్ణుడి గురించి చెప్పే క్రమంలో వచ్చే సంభాషణలు కానీ, ఆ సన్నివేశానికి తగ్గట్లు వచ్చే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆడియన్స్ కి గూజ్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి.

కొన్ని కొన్ని సన్నివేశాలు నమ్మశక్యం కాని విధంగా ఉన్నప్పటికీ ఓవరాల్ గా మాత్రం సినిమా ఆకట్టుకునేలా ఉంది. అనవసరమైన లవ్ ట్రాక్, సాంగ్స్ ని ఇరికించే ప్రయత్నం చేయకుండా.. కథని పక్క దారి పట్టించకుండా దర్శకుడు తాను చెప్పాలనుకున్న పాయింట్ ని చెప్పడం బాగుంది. ఒకవేళ లవ్ ట్రాక్, సాంగ్స్ ఇరికించినట్లైతే నిడివి పెరిగి, కథనం ఇప్పుడున్నంత గ్రిప్పింగ్ గా అయితే సాగేది కాదు.

ఈ సినిమాకి కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ, కాలభైరవ మ్యూజిక్ ప్రధాన బలంగా నిలిచాయి. చందూ మొండేటి విజువలైజేషన్ కి కార్తీక్ సినిమాటోగ్రఫీ తోడై బ్యూటిఫుల్ అవుట్ పుట్ వచ్చింది. ఎడిటర్ కూడా కార్తీకే కావడం మరింత కలిసొచ్చింది. సన్నివేశాలను కెమెరాలో ఎంత అందంగా బందించాడో, ఆ సన్నివేశాల కూర్పు కూడా అంతే అందంగా చేశాడు. ఇక కాలభైరవ తన అనుభవానికి మించి అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. తన మ్యూజిక్ తో ఎన్నో సన్నివేశాలను మరోస్థాయికి తీసుకెళ్లాడు. వీఎఫ్ఎక్స్ వర్క్ కూడా ఆకట్టుకుంది. కొన్ని కొన్ని సన్నివేశాల్లో వీఎఫ్ఎక్స్ వర్క్ శభాష్ అనేలా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల పనితీరు:

కార్తికేయ పాత్రలో నిఖిల్ చక్కగా ఒదిగిపోయాడు. తన ముఖ కవళికలు, హావభావాలలో ఎంతో పరిణితి కనబరిచాడు. అనుపమ కూడా ముగ్ద పాత్రను సునాయాసంగా చేసింది. ప్రత్యేక పాత్రలో మెరిసిన అనుపమ్ ఖేర్ ఉన్నది కాసేపే అయినా తన నటనతో కట్టి పడేశారు. శ్రీనివాస్ రెడ్డి, వైవా హర్ష ఉన్నంతలో బాగానే నవ్వించారు. ముఖ్యంగా శ్రీనివాస్ రెడ్డి తన కామెడీ టైమింగ్, ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకున్నాడు. తులసి, ఆదిత్య మీనన్, సత్య, ప్రవీణ్ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

గత వారం విడుదలైన 'బింబిసార', 'సీతా రామం' సినిమాలు విజయాలను అందుకొని టాలీవుడ్ లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ఇప్పుడు 'కార్తికేయ-2' రూపంలో మరో విజయం వచ్చినట్లే అని చెప్పొచ్చు. థియేటర్స్ కి వచ్చిన ప్రేక్షకులను నిరాశపరచకుండా కథాకథనాలు, విజువల్ పరంగా మంచి థ్రిల్లింగ్ అనుభూతినిచ్చే సినిమా 'కార్తికేయ-2'.

-గంగసాని