Read more!

English | Telugu

సినిమా పేరు:యశోద
బ్యానర్:శ్రీదేవి మూవీస్
Rating:3.00
విడుదలయిన తేది:Nov 11, 2022

సినిమా పేరు: యశోద
తారాగణం: సమంత, వరలక్ష్మీ శరత్‌కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేశ్, మురళీ శర్మ, సంపత్ రాజ్, శత్రు, మధురిమ, కల్పిక గణేశ్, దివ్య శ్రీపాద, ప్రియాంక శర్మ 
డైలాగ్స్: పులగం చిన్నారాయణ, చల్లా భాగ్యలక్ష్మి
పాటలు: చంద్రబోస్, రామజోగయ్య శాస్త్రి
మ్యూజిక్: మణిశర్మ
సినిమాటోగ్రఫీ: ఎం. సుకుమార్
ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేశ్
ఆర్ట్: అశోక్
ఫైట్స్: వెంకట్, యానిక్ బెన్
నిర్మాత: శివలెంక కృష్ణప్రసాద్
డైరెక్టర్స్: హరి, హరీశ్
బ్యానర్: శ్రీదేవి మూవీస్
విడుదల తేదీ: 11 నవంబర్ 2022   

చాలా రోజులుగా తెలుగు ప్రేక్షకులు 'యశోద' సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. కారణం.. అది సమంత చేసిన సినిమా కావడం. నాగచైతన్యతో సమంత విడిపోయిన తర్వాత అనేక కళ్లు ఆమెను వాచ్ చేస్తూ వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఆమె పెట్టే పోస్టుల్ని భూతద్దంలోంచి చూస్తూ వస్తున్నాయి. విడాకులు ఆమె కెరీర్‌ని ఎలా ప్రభావితం చేస్తాయో చూడాలని కూడా అనేకమంది మనసుల్లో ఉంది. హరి శంకర్, హరీశ్ నారాయణ్ అనే ఇద్దరు తమిళ యువకులు డైరెక్ట్ చేసిన ఈ మొదటి తెలుగు సినిమాని సీనియర్ ప్రొడ్యూసర్ శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించారు. ఇలా ఈరోజు మన ముందుకు వచ్చేసింది 'యశోద'.

కథ:- యశోద (సమంత) ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి. ఆమెకు బృంద అనే ఒక చెల్లెలు మాత్రమే ఉంటుంది. ఆమెకు ఏదో జబ్బుచేసి, ఆపరేషన్ చేయాల్సి రావడంతో అందుకు అవసరమైన డబ్బు కోసం వేరే దారి తెలీక పెళ్లి కాకుండానే సరోగేట్ మదర్ కావడానికి ఒప్పుకుంటుంది. అలా ఈవా అనే హాస్పిటల్‌కు వెళ్తుంది. అక్కడ తనలాంటి ఎంతోమంది అమ్మాయిలు యశోదకు తోడవుతారు. ఆ హాస్పిటల్‌ను మధు (వరలక్ష్మీ శరత్‌కుమార్) అనే ఆమె నిర్వహిస్తుంటుంది. యశోదకు గౌతం (ఉన్ని ముకుందన్) అనే డాక్టర్ ట్రీట్‌మెంట్ ఇస్తుంటాడు. మరోవైపు ఒక కారు యాక్సిడెంట్‌లో ఒక పేరున్న వ్యక్తితో పాటు ఒక మోడల్ కూడా చనిపోతారు. అది యాక్సిడెంట్ కాదనీ హత్య అనీ తెలియడంతో ఆ కేసును పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తుంటారు. హాస్పిటల్‌లో యశోదకు విచిత్రమైన షాకింగ్ ఘటనలు ఎదురవుతాయి. ఆ హాస్పిటల్‌లో నిజానికి ఏం జరుగుతోంది? అక్కడి మిస్టరీ ఏమిటి? కారు ప్రమాదం వెనుక ఉన్న వ్యక్తులెవరు? ఈ రెండింటికీ ఏమైనా లింక్ ఉన్నదా? అనే విషయాలు మనకు మిగతా కథలో తెలుస్తాయి. 


ఎనాలసిస్ :

సరోగసీ పేరును అడ్డం పెట్టుకొని కొంతమంది చేసే అరాచకాల నేపథ్యంతో 'యశోద' కథను రాసుకున్నారు దర్శకులు హరి, హరీశ్. ఇలాంటి టిపికల్ స్టోరీని సెల్యులాయిడ్‌పైకి జనరంజకంగా తెరకెక్కించడం అంత ఈజీ కాదు. బలమైన సన్నివేశాలకు, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే తోడవ్వాలి. ఆ విషయంలో దర్శకులు సక్సెస్ అయ్యారు. సాధారణంగా మొదలై క్రమక్రమంగా కథలో లీనం చేసుకొని, తర్వాత ఏం జరుగుతుందోననే ఆసక్తిని పెంచుకుంటూ వెళ్లింది 'యశోద'. కథను రెండు అంశాల చుట్టూ నడుపుతూ, ఆ రెండు అంశాలకూ ఒక కామన్ పాయింట్ దగ్గర రీచ్ అయ్యేట్లు చేశారు. ఒక కథ హాస్పిటల్‌లో యశోద పాత్ర కేంద్రంగా నడుస్తుంటే, ఇంకో కథ కారు యాక్సిడెంట్ ఆధారంగా నడుస్తుంది. యశోద పాత్రను డైరెక్టర్స్ మలిచిన తీరు బాగుంది. సెంటిమెంట్, పెయిన్, బ్రేవ్‌నెస్, టార్గెట్ అనేవి ఆ క్యారెక్టర్‌ను బలంగా రూపొందించాయి. డబ్బు కోసం సరోగసీకి ఒప్పుకొని అద్దె గర్భాన్ని మోస్తూ, తమ కడుపులోని శిశువు చుట్టూ అనుబంధాన్ని ఏర్పరచుకొనే తల్లుల బాధ ఎలా ఉంటుందో ఈ చిత్రంలో మనం చూస్తాం. సరోగసీ పేరిట ఈవా హాస్పిటల్లో జరిగే అత్యంత అమానవీయ దారుణాలు చూసి చలించిపోతాం. హాస్పిటల్లో జరిగే దారుణాలను పసిగట్టిన యశోద, వాటిని ఎదుర్కోవడానికి చూపించే తెగువతో కనెక్టయిపోతాం. 

అయితే కారు యాక్సిడెంట్ దర్యాప్తుకు సంబంధించిన సీన్లు ఏమంత ఎఫెక్టివ్‌గా రాలేదు. కారణం.. యశోద క్యారెక్టర్‌ను ఎక్కువగా ప్రేమించడం వల్ల, దానిపై పెట్టిన ఫోకస్‌ను ఇన్వెస్టిగేషన్ సీన్లపై పెట్టలేకపోయారనిపిస్తుంది. వాటిని కూడా బాగా తీయగలిగినట్లయితే, సినిమా మరింత థ్రిల్ కలిగించి ఉండేది. సినిమాలో మనల్ని అబ్బురపరిచేది.. హాస్పిటల్ సీన్లు! జురాసిక్ పార్క్ తరహాలో అంతుచిక్కని మార్గాలు, గదులు ఆ హాస్పిటల్‌లో కనిపిస్తాయి. ఇదంతా ఆర్ట్ డైరెక్టర్ అశోక్ కుమార్ పనితనం. ఈవా హాస్పిటల్ సెట్‌ను ఆయన డిజైన్ చేసిన తీరును మెచ్చుకోకుండా ఉండలేం. ఈ సినిమాకు ఆయన పెద్ద సపోర్ట్.

థ్రిల్లర్స్‌కు మణిశర్మ లాంటి మ్యూజిక్ డైరెక్టర్ తోడైతే ఎలా ఉంటుంది! చాలా సీన్లు బ్యాగ్రౌండ్ స్కోర్ వల్ల బ్రహ్మాండంగా ఎలివేట్ అయ్యాయి. అయితే కొన్నిచోట్ల డైలాగ్స్‌ను ఆయన మ్యూజిక్ మింగేసింది. ఎం. సుకుమార్ సినిమాటోగ్రఫీ మరో ఎస్సెట్. 'యశోద మంచి క్వాలిటీతో కనిపించిందంటే.. అందుకు దోహదం చేసింది చక్కని విజువల్స్. ఇక సమంత చేసిన ఫైట్స్ కూడా ఆకట్టుకున్నాయి. ఆమె చేత అలా చేయించిన క్రెడిట్ స్టంట్ డైరెక్టర్స్ యానిక్ బెన్, వెంకట్‌లది. సినిమాలో మాటల గురించి కూడా కచ్చితంగా మాట్లాడుకోవాలి. సందర్భానికి తగ్గట్లు సంభాషణలు రాయడంలో పులగం చిన్నారాయణ, చల్లా భాగ్యలక్ష్మి కృతకృత్యులయ్యారు. డైలాగ్స్ ఎక్కడా ఓవర్ అనిపించలేదు, ఎక్కడా పేలవంగా తోచలేదు. అలా సరిగ్గా కుదిరాయంతే. ప్రొడక్షన్ క్వాలిటీస్ టాప్ క్లాస్‌లో ఉన్నాయి.

నటీనటుల పనితీరు:- యశోద క్యారెక్టర్‌లో సమంత ఇమిడిపోయిన తీరు అమోఘం. సినిమాని తన భుజాలపై మోసుకువెళ్లింది. ఆ క్యారెక్టర్‌లోని వివిధ కోణాల్ని, పెయిన్‌ని సూపర్బ్‌గా ప్రదర్శించింది. 'యశోద చూశాక సమంతకు ఆ క్యారెక్టర్ టైలర్ మేడ్ అని ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. హాస్పిటల్‌లో మొదట ఆమె ప్రదర్శించే అమాయకత్వం, ఆ తర్వాత గడుసుతనం, ఆ పైన ధైర్యం, మొండితనం, చివరన సెంటిమెంట్.. నటిగా ఆమె వేరే స్థాయిని అందుకుందనేది నిస్సందేహం. మధు మేడంగా వరలక్ష్మీ శరత్‌కుమార్ తన అభినయంతో మరోసారి ఇంప్రెస్ చేసింది. 'క్రాక్', 'నాంది' సినిమాల తర్వాత ఆమెకు మరోసారి 'యశోద'లో బలమైన పాత్ర లభించింది. మొదట సాఫ్ట్‌గా కనిపించి, తర్వాత తన అసలు కోణాన్ని బయటపెట్టే గౌతం పాత్రలో ఉన్ని ముకుందన్ రాణించాడు. సెంట్రల్ మినిస్టర్ గిరిధర్ క్యారెక్టర్ రావు రమేశ్‌కు నల్లేరు మీద నడక. మురళీ శర్మ, సంపత్ రాజ్, శత్రు, దివ్య శ్రీపాద, కల్పిక, మధురిమ, ప్రియాంక శర్మ.. తమ పాత్రలకు న్యాయం చేశారు.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

కొన్ని సీన్స్‌ను పక్కనపెడితే.. బలమైన క్యారెక్టరైజేషన్స్, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే, హై స్టాండర్డ్ టెక్నికల్ వాల్యూస్‌తో వచ్చిన 'యశోద' అసలు సిసలు సినీ ప్రియులను ఏమాత్రం నిరాశపరచదు.

- బుద్ధి యజ్ఞమూర్తి