English | Telugu

సినిమా పేరు:వాల్తేరు వీరయ్య
బ్యానర్:మైత్రీ మూవీ మేకర్స్
Rating:2.50
విడుదలయిన తేది:Jan 13, 2023

సినిమా పేరు: వాల్తేరు వీరయ్య
తారాగణం: చిరంజీవి, రవితేజ, శ్రుతి హాసన్, కేతరిన్ ట్రెసా, ప్రకాశ్ రాజ్, బాబీ సింహా, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, సప్తగిరి, షకలక శంకర్, శ్రీనివాస్ రెడ్డి, ప్రదీప్ రావత్, నాజర్, సత్యరాజ్ (గెస్ట్) 
కథ, మాటలు: బాబీ కొల్లి
స్క్రీన్‌ప్లే: కోన వెంకట్, కె. చక్రవర్తి రెడ్డి
మ్యూజిక్: దేవి శ్రీప్రసాద్
సినిమాటోగ్రఫీ: ఆర్థర్ ఎ. విల్సన్
ఎడిటింగ్: నిరంజన్ దేవరమణి
ప్రొడక్షన్ డిజైనింగ్: ఏఎస్ ప్రకాశ్
ఫైట్స్: రామ్-లక్ష్మణ్, పీటర్ హెయిన్స్
నిర్మాతలు: నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి
దర్శకత్వం: బాబీ కొల్లి
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
విడుదల తేదీ: 13 జనవరి 2023 

'వాల్తేరు వీరయ్య' ట్రైలర్ బయటకు వచ్చినప్పుడు చాలా రోజుల తర్వాత చిరంజీవి మంచి ఎంటర్‌టైనింగ్ రోల్‌లో కనిపించబోతున్నారనే అభిప్రాయం కలిగింది. 'ఆచార్య డిజాస్టర్' కావడం, 'గాడ్‌ఫాదర్' ఎక్స్‌పెక్ట్ చేసిన రేంజిలో వసూళ్లు చేయకపోవడంతో.. 'వాల్తేరు వీరయ్య'పై చిరుతో పాటు ఆయన అభిమానులు కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. చాలా కాలంగా ఒక బ్లాక్‌బస్టర్ కోసం ఎదురుచూస్తోన్న బాబీ డైరెక్ట్ చేసిన 'వాల్తేరు వీరయ్య'లో రవితేజ కూడా నటించడంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. ఇలాంటి నేపథ్యంతో వచ్చిన మూవీ ఎలా ఉందో చూద్దాం... 

కథ
ఒక ప్లేన్ క్రాష్ అయ్యి విశాఖపట్నం దగ్గర్లోని ఒక పొలంలో పడిపోతుంది. అందులో సాల్మన్ సీజర్ (బాబీ సింహా) అనే ఇంటర్నేషల్ డ్రగ్ స్మగ్లర్ ఉంటాడు. అతడిని దగ్గర్లోని ఒక పోలీస్ స్టేషన్‌కు తరలిస్తారు. అతని గ్యాంగ్ ఆ స్టేషన్‌పై ఎటాక్ చేసి పోలీసులనందర్నీ చంపేసి, సాల్మన్‌ను తీసుకొనిపోతారు. భార్య మెట్ల మీద నుంచి పడిపోయిందనే విషయం తెలిసి అంతకుముందే ఇంటికివెళ్లిన ఇన్‌స్పెక్టర్ సీతాపతి (రాజేంద్రప్రసాద్) ప్రాణాలు దక్కుతాయి. అయితే సాల్మన్‌ను పట్టుకొనే మగాడు వాల్తేరు వీరయ్య (చిరంజీవి) ఒక్కడే అని భావించిన సీతాపతి అతడిని కలిసి, రూ. 25 లక్షలకు డీల్ కుదుర్చుకుంటాడు. సాల్మన్‌ను పట్టుకోవడానికి వీరయ్య గ్యాంగ్, సీతాపతి, అతని బావమరిది (వెన్నెల కిశోర్) మలేషియా వెళ్తారు. సాల్మన్ కోసం అప్పటికే అక్కడ అతిథి (శ్రుతి హాసన్) సారథ్యంలో రా ఏజెంట్స్ అతడి హోటల్లోనే పనిచేస్తూ అదునుకోసం వెయిట్ చేస్తుంటారు. ఎట్టకేలకు సాల్మన్‌ను పట్టుకొని అంతం చేస్తాడు వీరయ్య. నిజానికి వీరయ్య వచ్చింది కేవలం సాల్మన్‌ను పట్టుకోవడం కోసమే కాదనీ, అతని అన్న డ్రగ్ కింగ్‌పిన్ అయిన్ మైఖేల్ సీజర్ (ప్రకాశ్ రాజ్)ను పట్టుకోవడానికి కూడా అనే విషయం అప్పుడు రివీల్ అవుతుంది. అసలు వీరయ్యకూ, మైఖేల్‌కూ ఉన్న కనెక్షన్ ఏమిటి? వీరయ్య సవతి తమ్ముడు ఏసీపీ విక్రమ్ సాగర్ (రవితేజ) మృతికీ, మైఖేల్‌కూ ఉన్న లింకేమిటి? సాగర్ హంతకుల్ని వీరయ్య ఎలా తుదముట్టించాడనే విషయాలు మిగతా కథ. 


ఎనాలసిస్ :

సీనియర్ స్టార్స్ తమకు స్వర్ణయుగం లాంటి కాలంలో చేసిన సినిమాల కోవలో మళ్లీ సినిమాలు చెయ్యాలని తహతహ లాడుతున్నట్లు కనిపిస్తోంది. అందుకే వింటేజ్ స్టఫ్ ఉన్న కథల్ని ఎంచుకుంటున్నారు. 'రౌడీ అల్లుడు', 'దొంగమొగుడు', 'ముఠా మేస్త్రి' లాంటి సినిమాల్లో చిరంజీవి చేసిన క్యారెక్టర్స్‌ను ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. ఆ తరహా ఎంటర్‌టైన్‌మెంట్ ఉన్న క్యారెక్టరైజేషన్‌తో వాల్తేరు వీరయ్య మనకు కనిపిస్తాడు. అయితే స్మగ్లర్ సాల్మన్‌ను పట్టుకోవడానికి వాల్తేరు వీరయ్యతో ఒక పోలీస్ ఇన్‌స్పెక్టర్ రూ. 25 లక్షల డీల్ కుదుర్చుకొని, అతనితో కలిసి మలేషియా వెళ్లడమేంటనే లాజిక్‌కు అందని ప్రశ్న వస్తే.. సమాధానం దొరకదు. తమ్ముడి హంతకుల్ని పట్టుకోవాలనే సీరియస్ లక్ష్యంతో ఉన్న వీరయ్య కామెడీ చేయడమేంటనే ప్రశ్నకూ తృప్తికరమైన సమాధానం లభిస్తుందని అనుకోను. 

జాలరి అయిన వాల్తేరు వీరయ్యకు చెందిన ఐస్ ఫ్యాక్టరీని అడ్డాగా చేసుకొని తన గ్యాంగ్‌తో ఐస్ గడ్డల్లో డ్రగ్ పాకెట్స్‌ను సప్లై చేస్తూ వచ్చిన కాలా (ప్రకాశ్ రాజ్), పాతిక మంది స్కూలు పిల్లల చావుకు కారణమై, ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఏసీపీ సాగర్‌ను కూడా చంపేసిన తర్వాత, నాలుగేళ్లకే మైఖేల్ సీజర్ అనే డ్రగ్ కింగ్‌పిన్‌గా దర్శనమివ్వడం, తన ఫ్యాక్టరీలో జరుగుతున్న బాగోతాన్ని వీరయ్య కనిపెట్టలేకపోవడం సినిమా కథల్లోనే సాధ్యం. అలాగే.. మలేషియాలోని సాల్మన్‌కు చెందిన హోటల్లో నలుగురో, ఐదుగురో రా ఏజెంట్స్ అందరూ ఉద్యోగస్తులుగా పనిచేయడం కూడా అదే బాపతు.

ఒకే తండ్రి (సత్యరాజ్)కీ, వేర్వేరు తల్లులకీ పుట్టిన వీరయ్య, సాగర్‌కి ఒకరంటే ఒకరికి ఏమాత్రం గిట్టదని పైకి చూపిస్తూ, లోపల ఒకరిపై మరొకరికి అంతులేని ప్రేమ ఉందని చూపడం ఏమిటో, అలా పైకి ఒకలా, లోపల ఇంకోలా ఉండాల్సిన అవసరం ఏమిటో బోధపడదు. అయితే సెకండాఫ్‌లో వచ్చే ఫ్ల్యాష్‌బ్యాక్ ఎపిసోడే సినిమాకు పెద్ద ప్లస్సయి కూర్చుంది. రవితేజ చేసిన ఏసీపీ సాగర్ క్యారెక్టర్ వచ్చాక కథలో వేగం పెరిగింది. సాల్మన్‌ను వీరయ్య వెంటాడి, వేటాడే ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా ఆడియెన్స్‌కు కనెక్ట్ అవుతుంది. ప్రకాశ్ రాజ్ చేసిన మైఖేల్ క్యారెక్టర్ బోరింగ్ అనిపిస్తుంది. దానివల్ల క్లైమాక్స్ కూడా తేలిపోయింది. రవితేజ క్యారెక్టర్ సెకండాఫ్‌లో కాకుండా ఫస్టాఫ్‌లోనే వచ్చినట్లయితే, ఆ తర్వాత స్టోరీ అంతటినీ ఒక ఫీల్‌తో రన్ చేసే అవకాశం ఉండేది. ఆ విషయాన్ని డైరెక్టర్ బాబీ గ్రహించలేకపోయాడు.

టెక్నికల్‌గా చూసినప్పుడు బాబీ రాసిన ఎంటర్‌టైనింగ్ డైలాగ్స్ అలరించాయి. కోన వెంకట్, చక్రవర్తిరెడ్డి స్క్రీన్‌ప్లే విషయంలో మరింత శ్రద్ధపెట్టి ఉండాల్సింది. దేవి శ్రీప్రసాద్ సంగీతం అందించిన పాటల్లో ఒకట్రెడు చిత్రీకరణ పరంగా బాగున్నాయి కానీ వాటికి సరైన ప్లేస్‌మెంట్ లభించలేదు. హీరో హీరోయిన్ల మధ్య రొమాన్స్ అనేది లేకపోవడం వల్ల ఆ పాటలు తేలిపోయాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం బాగుంది. ఆర్థర్ ఎ. విల్సన్ సినిమాటోగ్రఫీ ఉన్నత స్థాయిలో ఉంది. అయితే సముద్రంపై తీసిన చిరంజీవి ఇంట్రడక్షన్ ఫైట్ సీన్లలో సముద్రం సహజంగా కాకుండా అది గ్రాఫిక్ వర్క్ అని ఈజీగా తెలిసిపోయేట్లు ఉంది. ఏఎస్ ప్రకాశ్ ప్రొడక్షన్ డిజైనింగ్ ఎప్పట్లా టాప్ క్లాస్‌లో ఉంది.

నటీనటుల పనితీరు

వాల్తేరు వీరయ్యగా చిరంజీవి చెలరేగిపోయి చేశారు. చాలా రోజుల తర్వాత ఆయనను యాక్షన్ మేళవించిన కామిక్ రోల్‌లో చూడటం బాగుంది. ఆయన కామెడీ డైలాగ్స్, ఆ టైంలో ఆయన ఎక్స్‌ప్రెషన్స్ ఆకట్టుకుంటాయి. అయితే వయసు తెలీకుండా ఉండటానికి ముఖానికి ఓవర్ మేకప్ వేయడం తెలుస్తోంది. ఫస్టాఫ్‌లో కాస్త ఎక్కువ, సెకండాఫ్‌లో తక్కువ ప్రాధాన్యం ఉన్న రా ఏజెంట్ అతిథి పాత్రలో శ్రుతి హాసన్ గ్లామరస్‌గా ఉంది. చిరంజీవితో రెండు డ్యూయెట్లలో డాన్సులు వెయ్యడం మినహా ఆయనతో రొమాంటిక్ సీన్స్ లేకపోవడం ఒకరకంగా ప్లసూ, ఇంకోరకంగా మైనస్సూ కూడా. వీరయ్య తమ్ముడు సాగర్ రోల్‌లో రవితేజ అదరగొట్టేశాడు. అతని క్యారెక్టర్, ఆ క్యారెక్టర్‌లో అతని అభినయం సినిమాకు ఒక ఎస్సెట్. మెయిన్ విలన్ ప్రకాశ్ రాజ్ కంటే, అతని తమ్ముడిగా నటించిన బాబీ సింహా ఎక్కువ ఆకట్టుకున్నాడు. రాజేంద్రప్రసాద్, వెన్నెల కిశోర్ తమకు అలవాటైన పాత్రల్లో సునాయాసంగా ఇమిడిపోయారు. వీరయ్య అనుచరులుగా చేసిన సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి, షకలక శంకర్, ప్రదీప్ రావత్‌లకు పెద్దగా నవ్వించడానికి ఆస్కారం లభించలేదు. ప్రదీప్ రావత్ క్యారెక్టర్‌లో ఏమైనా ట్విస్ట్ ఉంటుందని అనుకున్నవాళ్లు పప్పులో కాలేసినట్లే. రవితేజ భార్యగా కేతరిన్ ట్రెసా నప్పింది. సుబ్బరాజు, నాజర్ పాత్రల పరిధి మేరకు చేశారు. వీరయ్య తండ్రిగా సత్యరాజ్ అతిథి పాత్రలో కనిపించారు. 


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

'వాల్తేరు వీరయ్య' అనే టైటిల్ చూసి, ఇది ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని భావించుకొని వెళ్లినవాళ్లు కాస్త అసంతృప్తికి గురయ్యే అవకాశం ఉంది. నిజానికి ఇది యాక్షన్ ఎంటర్‌టైనర్ జానర్ ఫిల్మ్. చిరంజీవి, రవితేజ చేసిన యాక్షన్ సీన్లు, చిరంజీవి కామెడీ సీన్లు నచ్చుతాయి. చిరు అభిమానులైతే ఈ మూవీని బాగా ఎంజాయ్ చేయడం ఖాయం. కథకు ఆద్యంతం ఉండాల్సిన ఒక ఎమోషన్, ఒక ఫీల్ మిస్సవడమే 'వాల్తేరు వీరయ్య'లోని ప్రధాన లోపం.

- బుద్ధి యజ్ఞమూర్తి