English | Telugu

విశ్వక్‌ సేన్‌ లైలా
సినిమా పేరు:విశ్వక్‌ సేన్‌ లైలా
బ్యానర్:సైన్ స్క్రీన్
Rating:1.50
విడుదలయిన తేది:Feb 14, 2025

తారాగణం: విశ్వక్‌ సేన్‌, ఆకాంక్ష శర్మ, అభిమన్యు సింగ్, కామాక్షి భాస్కర్ల, పృథ్వీ, పృథ్వీ రాజ్, వినీత్ కుమార్ తదితరులు
సంగీతం: లియోన్ జేమ్స్
డీఓపీ: రిచర్డ్ ప్రసాద్
ఎడిటర్: సాగర్ దాడి 
ఆర్ట్: బ్రహ్మ కడలి 
రచన: వాసుదేవ మూర్తి
దర్శకత్వం: రామ్‌ నారాయణ్‌ 
నిర్మాత: సాహు గారపాటి
బ్యానర్: షైన్ స్క్రీన్స్
విడుదల తేదీ: ఫిబ్రవరి 14, 2025

విశ్వక్‌ సేన్‌ (Vishwak Sen) కథానాయకుడిగా రామ్‌ నారాయణ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ 'లైలా' (Laila). షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మించిన ఈ సినిమా.. ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 14న విడుదలైంది. విశ్వక్‌ సేన్‌ మొదటిసారి లేడీ గెటప్ లో నటించడంతో ఈ చిత్రం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ప్రచార చిత్రాలు కూడా ఆకట్టుకున్నాయి. మరి ఈ లైలా సినిమా ఏ మేరకు మెప్పించింది అనేది రివ్యూలో తెలుసుకుందాం. (Laila Movie Review)

కథ:
సోను మోడల్ (విశ్వక్‌ సేన్‌) ఉమెన్ బ్యూటీ పార్లర్ నడుపుతుంటాడు. మేకప్ ఆర్టిస్ట్ గా సోనుకి ఎంతో మంచి పేరు ఉంటుంది. ఆ పార్లర్ తన తల్లి నుంచి రావడంతో ఎంతో పవిత్రంగా చూసుకుంటాడు. కస్టమర్లతో కుటుంబ సభ్యుడిలా ఉంటాడు. అయితే ఒకసారి ఓ కస్టమర్ కి సాయం చేయబోయి, అనుకోని సమస్యలలో చిక్కుకుంటాడు సోను. మరోవైపు జిమ్ ట్రైనర్ (ఆకాంక్ష శర్మ)ను ప్రేమించగా, ఆ ప్రేమ వల్ల కూడా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. వరుస సమస్యలతో సతమతమవుతున్న సోను, వాటి నుంచి బయటపడటం కోసం లేడీ గెటప్ వేసుకొని 'లైలా' అవతారమెత్తుతాడు. లైలా గా మారిన తర్వాత సోను జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? ఉన్న సమస్యల నుంచి బయటపడటం కోసం లైలా గా మారితే, కొత్తగా వచ్చిన సమస్యలేంటి? చివరికి ఆ సమస్యల నుంచి సోను ఎలా బయటపడ్డాడు? సోను ప్రేమ కథ ఏమైంది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.


ఎనాలసిస్ :

హీరో తన ప్రేమ కోసమో లేక ఏదైనా సమస్య నుంచి బయటపడటం కోసమో లేడీ గెటప్ వేయడమనేది గతంలో కొన్ని సినిమాల్లో చూశాం. ఆ పరంగా చూస్తే 'లైలా'లో ఎలాంటి కొత్తదనం లేదు. ఇలాంటి కథను తీసుకున్నప్పుడు రైటింగ్ తో మ్యాజిక్ చేయాలి. కామెడీతో ప్రేక్షకులకు కడుపుబ్బా నవ్వించి బోర్ కొట్టకుండా చేయగలగాలి. కానీ లైలా విషయంలో అది జరగలేదు. హీరో పాత్రతో సహా ఏ పాత్రనూ బలంగా రాసుకోలేదు. కామెడీ కూడా అవుట్ డేటెడ్ గా ఉంది. డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉంటే చాలు.. యూత్ ఎగబడిపోయి సినిమా చూసేస్తారు అనే భ్రమలో స్క్రిప్ట్ రాసుకున్నట్టున్నారు. ఇప్పుడు యువ దర్శకులు విభిన్న కథలతో ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేస్తున్నారు. ఇలాంటి టైంలో లైలా లాంటి సినిమా రావడం నిజంగా ఆశ్చర్యపరిచే విషయమే. కథలో కొత్తదనంలేదు, కథనంలో మెరుపుల్లేవు. కాలం చెల్లిన సన్నివేశాలు, కామెడీ ట్రాక్స్ తో సినిమాని చుట్టేశారు. విశ్వక్ తన కెరీర్ స్టార్టింగ్ లో కథల ఎంపికలో వైవిధ్యం చూపించి మెప్పించాడు. కానీ కొంతకాలంగా విశ్వక్ ట్రాక్ తప్పాడు. ముఖ్యంగా లైలా విషయంలో జడ్జిమెంట్ పూర్తిగా తప్పిపోయింది. ఇకనైనా విశ్వక్ స్క్రిప్ట్ ల విషయంలో కేర్ తీసుకోకపోతే.. కెరీర్ ప్రమాదంలో పడే అవకాశముంది.

నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు:
సోను మోడల్ మరియు లైలా గా రెండు విభిన్న  కోణాలున్న పాత్రలో విశ్వక్ సేన్ కనిపించాడు. సోను పాత్రను ఎప్పటిలాగే చలాకీగా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఇక లైలాగా విశ్వక్ ఆహార్యం, అభినయం ఆకట్టుకుంది. అయితే విశ్వక్ ఎంత బాగా నటించినప్పటికీ, రచనలో బలం లేకపోవడంతో ఆ పాత్ర తేలిపోయింది. ఆకాంక్ష శర్మ పాత్ర అందాల ఆరబోతకే పరిమితమైంది. కామెడీ విలన్ గా అభిమన్యు సింగ్ మెప్పించాడు. అభిమన్యు సింగ్ భార్యగా కామాక్షి భాస్కర్ల ఆకట్టుకుంది. పృథ్వీ, పృథ్వీ రాజ్, వినీత్ కుమార్ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు.

లియోన్ జేమ్స్ మ్యూజిక్ జస్ట్ ఓకే అనేలా ఉంది. రిచర్డ్ ప్రసాద్ కెమెరా పనితనం బాగానే ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. రైటర్ గా వాసుదేవ మూర్తి, డైరెక్టర్ గా రామ్‌ నారాయణ్‌ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. విశ్వక్ లాంటి హీరో, సాహు లాంటి నిర్మాత దొరికినా.. వచ్చిన అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోయారు.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

విశ్వక్‌ సేన్‌ లేడీ గెటప్ వేయడం తప్ప.. ఈ సినిమాలో కొత్తగా చెప్పుకోడానికి ఏమీ లేదు. కొత్తదనం లేని కథ, నవ్వు తెప్పించని కామెడీతో లైలా ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టేలా ఉంది.