Read more!

English | Telugu

సినిమా పేరు:విక్రాంత్ రోణ
బ్యానర్:కిచ్చా క్రియేషన్స్
Rating:2.50
విడుదలయిన తేది:Jul 28, 2022

సినిమా పేరు: విక్రాంత్ రోణ
తారాగ‌ణం: కిచ్చా సుదీప్, నిరూప్ భండారి, నీత అశోక్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్, రవిశంకర్ గౌడ, మధుసూదన్ రావు, వాసుకి వైభవ్
మ్యూజిక్: అజనీష్ లోక్ నాథ్
సినిమాటోగ్ర‌ఫీ: విలియం డేవిడ్
ఎడిటింగ్: ఆశిక్ కుసుగొల్లి
నిర్మాత‌లు: షాలినీ జాక్ మంజు, అలంకార్ పాండ్యాన్        
ద‌ర్శ‌క‌త్వం: అనూప్ భండారి
బ్యాన‌ర్: కిచ్చా క్రియేషన్స్, శాలిని ఆర్ట్స్, ఇన్వెనియో ఫిల్మ్స్ ఇండియా
విడుద‌ల తేదీ: 28 జూలై 2022


'ఈగ', 'బాహుబలి', 'సైరా నరసింహారెడ్డి' వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ తాజాగా 'విక్రాంత్ రోణ' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైన ఈ సినిమాపై సుదీప్ ఫ్యాన్స్ ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'కేజీఎఫ్' ఫ్రాంచైజ్ తర్వాత కన్నడ నుంచి వస్తున్న ఆ స్థాయి సినిమా అని చెప్పుకున్నారు. అయినా ఈ సినిమాపై తెలుగులో మాత్రం బజ్ క్రియేట్ కాలేదు. మరి మౌత్ టాక్ తో ప్రేక్షకులను థియేటర్స్ కి రప్పించే అంత కంటెంట్ ఈ మూవీలో ఉందో లేదో తెలుసుకుందాం.

 

కథ:-
అటవీ ప్రాంతంలో ఉండే కమరొట్టు అనే గ్రామంలో వరుస హత్యలు జరుగుతుంటాయి. చనిపోయిన వారిలో ఎక్కువగా చిన్న పిల్లలుంటారు. ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్న ఆ ప్రాంత ఇన్ స్పెక్టర్ కూడా దారుణంగా హత్య చేయబడతాడు. ఇదంతా కమరొట్టులోని పాత బంగ్లాలో ఉన్న భూతం పనేనని అక్కడి ప్రజలు నమ్ముతుంటారు. అటు వైపు వెళ్ళడానికి కూడా భయపడుతుంటారు. అలాంటి ప్రాంతానికి కొత్తగా ఇన్ స్పెక్టర్ గా వస్తాడు విక్రాంత్ రోణ(సుదీప్). వచ్చీ రాగానే, పాత ఇన్ స్పెక్టర్ ని ఎవరు హత్య చేశారు? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? దీని వెనక ఎవరున్నారు? అంటూ విచారణ మొదలుపెడతాడు. ఈ క్రమంలో విక్రాంత్ తెలుసుకున్న విషయాలేంటి? హత్యల వెనక ఎవరున్నారు? నిజంగానే అక్కడ భూతం ఉందా? అసలు విక్రాంత్ కి ఆ ఊరికి సంబంధం ఏంటి? అనేది మిగతా కథ.


ఎనాలసిస్ :

హర్రర్ సినిమాల ఊసు లేని ఇలాంటి సమయంలో 'విక్రాంత్ రోణ' అనేది కాస్త సర్ ప్రైజ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది హర్రర్ సినిమాలానే ప్రారంభమవుతుంది, మధ్య మధ్యలో హర్రర్ సన్నివేశాలు కూడా ఉంటాయి. అలా అని ఇది పూర్తిగా హర్రర్ ఫిల్మ్ కాదు. ఇదొక మిస్టరీ థ్రిల్లర్. ఈ సినిమాలో డైరెక్టర్ అనూప్ భండారి తనదైన ఫాంటసీ వరల్డ్ ని క్రియేట్ చేయగలిగాడు.. కానీ ఆడియన్స్ నే పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయాడు.

ఇలాంటి మిస్టరీ థ్రిల్లర్స్ కి స్క్రీన్ ప్లేనే ప్రధాన బలం. తర్వాత ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ ఆడియన్స్ లో కలిగేలా చేయాలి. అప్పుడే చిన్న చిన్న లాజిక్స్ గురించి ప్రేక్షకులు ఆలోచించడం మానేసి పూర్తిగా లీనమైపోయి సినిమా చూస్తారు. ఈ విషయంలో డైరెక్టర్ అనూప్ వెనకపడ్డాడు. ఆద్యంతం ఆసక్తికరంగా సాగేలా ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే తో నడిపించలేకపోయాడు.

అయితే హత్యలు ఎవరు చేస్తున్నారనే సస్పెన్స్ ని చివరివరకు మైంటైన్ చేయడంలో సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక్కోసారి ఒక్కొక్కరి మీద అనుమానం కలుగుతుంది. అసలు విలన్ ఎవరో క్లైమాక్స్ లోనే రివీల్ అవుతుంది. అయితే ఆ సస్పెన్స్ కి తగ్గట్లు బలమైన సన్నివేశాలు, ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే తోడవ్వలేదు. ముఖ్యంగా విక్రాంత్ చేసే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అంత ఆసక్తికరంగా సాగలేదు. ఒక్కోసారి ఒక్కొక్కరిపై అనుమానపడుతుంటాడు. అలా అనుమాన పడటానికి బలమైన కారణాలు, క్లూలు పెద్దగా ఉండవు. ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో వచ్చే కొన్ని సన్నివేశాలు కూడా సిల్లీగా అనిపిస్తాయి. విక్రాంత్ అక్కడికి వెళ్ళాలి, అక్కడ క్లూ ఉంటుంది అన్నట్లుగా ఆర్టిఫిషియల్ గా అనిపించాయి కొన్ని సన్నివేశాలు. ఇక ఈ మూవీలో తండ్రికూతుళ్ళ ఎమోషనల్ ట్రాక్ కి మంచి స్కోప్ ఉంది. కానీ దాన్ని హృదయానికి హత్తుకునేలా మలచలేకపోయారు. మొత్తానికి సినిమా ప్లాట్ బాగుంది, సస్పెన్స్ బాగుంది. కానీ కథనాన్ని ఆసక్తికరంగా మలిచి ఉంటే ఇంకా బాగుండేది.

'విక్రాంత్ రోణ' ఫిల్మ్ విజువల్ గా ఆకట్టుకునేలా ఉంది. విలియం డేవిడ్ కెమెరా పనితనం బాగుంది. అజనీష్ లోక్ నాథ్ సంగీతం ఆకట్టుకుంది. జాక్వెలిన్ ఫెర్నాండేజ్ చిందేసిన 'రా రా రక్కమ్మ' సాంగ్ ఎంత పెద్ద హిట్టో ముందే తెలిసిందే. అయితే మిగతా సాంగ్స్ మాత్రం పర్లేదు అనేలా ఉన్నాయంతే. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మాత్రం మెప్పించాడు. దాదాపు రెండన్నర గంటల నిడివి గల ఈ సినిమా అక్కడక్కదా ల్యాగ్ అనిపించింది. కనీసం మరో 15 నిమిషాలు ట్రిమ్ చేస్తే బాగుండేదన్న అభిప్రాయం కలిగింది. అలాగే తెలుగు డబ్బింగ్ మీద మరింత శ్రద్ధ తీసుకొని ఉంటే బాగుండేది. కొన్ని డైలాగ్స్, కొన్ని క్యారెక్టర్స్ కి డబ్బింగ్ చెప్పిన తీరు పదే పదే డబ్బింగ్ సినిమా అన్న విషయాన్ని గుర్తు చేశాయి.

నటీనటుల పనితీరు:

సుదీప్ ఎప్పటిలాగే తన నటనతో మెప్పించాడు. విక్రాంత్ రోణ పాత్రలో ఆయన ఒదిగిపోయిన తీరు ఆకట్టుకుంది. ఆయన స్క్రీన్ ప్రజెన్స్, యాక్షన్ అభిమానులకు కన్నుల పండగ అని చెప్పొచ్చు. నిరూప్ భండారి కూడా సుదీప్ కి ధీటుగా నటించాడు. ఎన్నో ఏళ్ల తర్వాత తల్లికి దగ్గరైన సంతోషాన్ని, ప్రేమించిన అమ్మాయి దూరమవుతుందన్న బాధని చక్కగా పలికించాడు. నీత అశోక్ కూడా తనదైన నటనతో ఆకట్టుకుంది. రవిశంకర్ గౌడ, మధుసూదన్ రావు, వాసుకి వైభవ్ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

వరల్డ్ వైడ్ కంటెంట్ ని ఇంట్లో కూర్చొని చూస్తున్న ఈ ఓటీటీ యుగంలో మిస్టరీ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకులను మెప్పించాలంటే.. ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే తో ఆడియన్స్ ని సీట్ ఎడ్జ్ లో కూర్చొని చూసేలా చేయగలగాలి. కానీ 'విక్రాంత్ రోణ' అలా చేయలేకపోయింది. అక్కడక్కడా థ్రిల్ చేస్తూ ఒక మాదిరి సినిమాలా మిగిలిపోయింది.

-గంగసాని