English | Telugu
బ్యానర్:సితార ఎంటర్ టైన్మెంట్స్
Rating:2.50
విడుదలయిన తేది:Oct 29, 2021
సినిమా పేరు: వరుడు కావలెను
తారాగణం: నాగశౌర్య, రీతు వర్మ, నదియా, మురళీశర్మ, జయప్రకాశ్, వెన్నెల కిశోర్, ప్రవీణ్, సప్తగిరి, హిమజ, ఆనంద్, అర్జున్ కల్యాణ్
సంభాషణలు: గణేశ్ కుమార్ రావూరి
మ్యూజిక్: విశాల్ చంద్రశేఖర్
సినిమాటోగ్రఫీ: వంశీ పచ్చిపులుసు
ఎడిటింగ్: నవీన్ నూలి
ఆర్ట్: ఎ.ఎస్. ప్రకాశ్
సమర్పణ: పి.డి.వి. ప్రసాద్
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
కథ-దర్శకత్వం: లక్ష్మీ సౌజన్య
విడుదల తేదీ: 29 అక్టోబర్ 2021
కొవిడ్ కారణంగా విడుదల ఆలస్యమైన సినిమాల్లో 'వరుడు కావలెను' ఒకటి. నాగశౌర్యతో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సినిమా అనేసరికి సినీగోయర్స్‌లో క్యూరియాసిటీ ఏర్పడింది. పాటలు.. ముఖ్యంగా 'దిగు దిగు దిగు నాగ' పాట సూపర్ పాపులర్ కావడం, ట్రైలర్ ఇంట్రెస్టింగ్‌గా అనిపించడంతో రిలీజ్ టైమ్‌కు మూవీపై మంచి అంచనాలే ఉన్నాయి. లక్ష్మీ సౌజన్య డైరెక్టర్‌గా, ఫిల్మ్ క్రిటిక్ గణేశ్‌కుమార్ రావూరి డైలాగ్ రైటర్‌గా పరిచయమైన 'వరుడు కావలెను' ఎలా ఉందంటే...
కథ:-
భూమి (రీతు వర్మ) ఒక స్టార్టప్ కంపెనీ రన్ చేస్తూ, ఉద్యోగుల్లో చాలా స్ట్రిక్ట్ అనే ఇంప్రెషన్ కలిగిస్తుంది. ఆఫీసులో పని తప్ప వేరే విషయాల్ని వేటినీ ఎంటర్‌టైన్ చెయ్యదు. పారిస్‌లో ఆకాశ హర్మ్యాలు, నేల కనిపించని కార్ల బారులు చూసి చూసీ విసుగెత్తిన ఆర్కిటెక్ట్ ఆకాశ్ (నాగశౌర్య) మన నేలను చూడాలనీ, ఇక్కడి అమ్మాయిల్నీ చూడాలనీ ఆగమేఘాల మీద హైదరాబాద్‌కు వచ్చేస్తాడు. తన ఫ్రెండ్ వాళ్ల ఫాదర్ (జయప్రకాశ్)ని కలవడానికి వెళ్లినప్పుడు, అక్కడకు వచ్చిన భూమిని చూసి ఆశ్చర్యపోతాడు. భూమి కంపెనీకి ఫండింగ్ చేసేది జయప్రకాశ్. ఒకప్పుడు భూమి, ఆకాశ్ కాలేజీలో కలిసి చదువుకున్నారనే విషయం బయటపడుతుంది. భూమి వాళ్ల ప్రాజెక్టుకు తాను ప్లాన్ గీస్తానని ఆకాశ్ చెబుతాడు. దగ్గరగా మసలుతున్న క్రమంలో భూమికి మానసికంగా దగ్గరవుతాడు ఆకాశ్. ఇంకోవైపు భూమికి పెళ్లి చెయ్యాలని వాళ్లమ్మ ప్రభావతి (నదియా) చెయ్యని ప్రయత్నం ఉండదు. కానీ భూమి పడనివ్వదు. ఒక సందర్భంలో ఆకాశ్‌ను తప్పుగా అర్థంచేసుకున్న భూమి అతడిని దూరం పెడుతుంది. ఆ తర్వాత ఏమైంది? అసలు పారిస్ నుంచి ఆకాశ్ హైదరాబాద్‌కు ఎందుకొచ్చాడు? భూమి, ఆకాశ్ కలిశారా? ఈ విషయాలు మిగతా కథలో చూస్తాం.
ఎనాలసిస్ :
ఫస్టాఫ్ చూశాక కథ నడవక ఒకింత బోరింగ్‌కు గురయ్యే మనం, సెకండాఫ్‌లో అసలైన కథ రావడంతో పాటు, కాసింత ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ఉండటంతో రిలీఫ్ ఫీలవుతాం. అలా అని పూర్తిగా శాటిస్‌ఫై కాకుండానే హాలు నుంచి బయటకు వస్తాం. 'నిన్ను లవ్ చేస్తున్నాను' అనే మాట చెప్పుకోకుండా భూమి, ఆకాశ్ పరస్పరం దాగుడుమూతలాడటం నిజానికి ఆహ్లాదాన్ని కలిగించాలి. కానీ డైరెక్టర్ లక్ష్మీసౌజన్య రాసుకున్న సీన్లలో అలాంటి దానికి చాలా తక్కువ చోటు దొరికింది. ఎంతసేపూ భూమి ఆఫీస్.. ఆ ఆఫీసులో స్టాఫ్‌తోటీ, ఆకాశ్‌తోటీ భూమి చిరాకులూ పరాకులూ సీన్లతో నింపేయడంతో ఫస్టాఫ్‌లో కథ అస్సలు ముందుకు కదలని ఫీలింగ్ కలుగుతుంది. దానికి తోడు కూతురికి పెళ్లి చెయ్యాలని తప్ప ఇంకో ధ్యాస ఏమీలేని దానిగా ప్రభావతి క్యారెక్టర్ కనిపించడం, ఈ విషయంలో తల్లీకూతుళ్ల మధ్య ఎప్పుడూ మాటల గొడవ జరగడం చికాకును మరింతగా పెంచింది.
సెకండాఫ్‌లో 'ల్యాగ్' అంటే ఏమాత్రం ఇష్టపడని క్యారెక్టర్‌లో సప్తగిరి కనిపించినంతసేపూ పెదాలపై నవ్వులు పూయించాడు. ఫస్టాఫ్ నెరేషన్‌లో ఆ ల్యాగ్ ఎక్కువైందని మాత్రం డైరెక్టర్ గుర్తించలేకపోయింది. 133 నిమిషాల నిడివితో ఉన్నప్పటికీ, ఎప్పుడూ భారంగా కనిపించే భూమి, ప్రభావతి క్యారెక్టర్ల లెక్కనే సినిమా కూడా భారంగా నడిచినట్లనిపిస్తుంది.
భూమి, ఆకాశ్ కాలేజీలో చదువుకునేటప్పటి ఫ్లాష్‌బ్యాక్ సీన్లు ఓకే అనిపిస్తాయి. ఆ టైమ్‌లో వచ్చే 'దిగు దిగు దిగు నాగ' పాట కూడా ఆకట్టుకుంటుంది. ఆకాశ్‌ను తనెంతగా ప్రేమించిందో చెప్పిన భూమి, అతడికి మాట్లాడే చాన్సివ్వకపోవడం, ఆకాశ్ తన ప్రేమను వ్యక్తం చేయడానికి 'ఐదు నిమిషాల టైమివ్వు' అని ఆమెను బతిమలాడటం.. ఇంప్రెసివ్‌గా లేవు. 'ఐ లవ్యూ అని చెప్పడానికి ఒక్క సెకను చాలుకదరా.. దానికి ఐదు నిమిషాల ల్యాగ్ ఎందుకురా?' అని థియేటర్లో ఒక ప్రేక్షకుడు అరవడం.. స్క్రీన్‌ప్లే విషయంలో తప్పు జరిగిందనడానికి నిదర్శనం. అంటే భూమి, ఆకాశ్ క్యారెక్టరైజేషన్స్‌ను ఇంకా బాగా తీర్చిదిద్దాలన్న మాట.
ఫస్టాఫ్ సీన్లలో డైలాగ్స్ పెద్దగా పండలేదు కానీ, సెకండాఫ్‌లో రక్తికట్టాయి. ప్రధానంగా సప్తగిరికి రాసిన డైలాగ్స్ నవ్వించాయి. అక్కడక్కడా పంచ్‌లు పేలాయి. మరిన్ని అవకాశాలు లభిస్తే డైలాగ్ రైటర్‌గా గణేశ్ రావూరి మరింతగా రాణిస్తాడని చెప్పవచ్చు. విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ బాగానే ఉంది. కథానుసారం సాగింది. తమన్ మ్యూజిక్ ఇచ్చిన 'దిగు దిగు దిగు నాగ పాట' గురించి చెప్పేదేముంది! వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రఫీ ఇంప్రెసివ్‌గా అనిపించింది. అతను వాడిన కలర్స్‌తో సినిమా రిచ్ లుక్‌తో కనిపించింది. నవీన్ నూలి ఎడిటర్‌గా ఇంకా సమర్థతతో వ్యవహరించాల్సింది. ఎప్పట్లా ఎ.ఎస్. ప్రకాశ్ ఆర్ట్ వర్క్ బాగుంది.
నటీనటుల పనితీరు:- ఈ సినిమాలో ప్రధానమైనవి మూడు పాత్రలు.. భూమి, ఆకాశ్, ప్రభావతి. అందరికంటే ఎక్కువగా స్క్రీన్ స్పేస్ లభించింది భూమి పాత్రకే. ఆ పాత్రలో రీతు వర్మ ఇమిడిపోయింది. స్ట్రిక్ట్ బాస్‌గా, కాలేజీలో ఆకాశ్‌ను ప్రేమించే అమ్మాయిగా వేరియేషన్స్ ఉన్న ఆ క్యారెక్టర్‌కు పూర్తి న్యాయం చేసింది. మునుపటి సినిమాలతో పోలిస్తే.. ఈ సినిమాలో అందంగా ఉంది. ఆకాశ్‌గా నాగశౌర్య ఆకట్టుకున్నాడు. హ్యాండ్సమ్ లుక్‌తోటీ, పర్ఫార్మెన్స్ తోటీ మెప్పించాడు.
వయసు పెరుగుతున్నా పెళ్లంటే గిట్టని కూతుర్ని ఎలా పెళ్లికి ఒప్పించాలా అని మధనపడే ప్రభావతి క్యారెక్టర్‌లో నదియా కొత్తగా అనిపించారు. ఇప్పటిదాకా ఆమెకు ఈ తరహా క్యారెక్టర్ పడలేదు. ఆ పాత్రను చక్కగా చేశారు. మురళీశర్మ, జయప్రకాశ్, ప్రవీణ్ పాత్రల పరిధి మేరకు నటించారు. భూమి ఆఫీసులో పనిచేసే టిక్‌టాక్ సరళగా హిమజ హుషారుగా నటించేసింది. ఒక పావుగంట సేపు సప్తగిరి నవ్వులు పంచాడు. వెన్నెల కిశోర్ స్థాయికి తగ్గ క్యారెక్టర్ పడలేదు.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
వినోదం తక్కువ, విసుగు ఎక్కువగా అనిపించే 'వరుడు కావలెను'లో అక్కడక్కడా మెరుపులైతే ఉన్నాయ్. టైటిల్ చూసి, ఫీల్‌గుడ్ ఫిల్మ్ అనుకొని వెళ్లేవారు ఆ ఫీల్ కగలక డిజప్పాయింట్‌మెంట్‌కు గురవుతారు.
- బుద్ధి యజ్ఞమూర్తి