English | Telugu
బ్యానర్:రామదూత క్రియేషన్స్
Rating:2.00
విడుదలయిన తేది:Dec 23, 2016
సంచలనాలకి మారు పేరు రామ్‌గోపాల్ వర్మ. ఆయన నిజ జీవితాల నేపథ్యంలో సినిమా తీస్తున్నారంటే అందరి దృష్టీ అటువైపే ఉంటుంది. అది చాలదన్నట్టు ఇదే నా చివరి సినిమా అంటూ `వంగవీటి`కి శ్రీకారం చుట్టారు. వర్మలాంటి దర్శకుడు ఇదే నా చివరి సినిమా అనీ, ఇంతకుమించిన కథ నాకు భవిష్యత్తులోమరొకటి దొరకదని ప్రకటనలు గుప్పించాక ఇక ఆ సినిమాపై ప్రేక్షకులకు ఏ స్థాయిలో క్యూరియాసిటీ పెరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం. పైగా వర్మ ఎంచుకొన్న సబ్జెక్ట్ అలాంటిది ఇలాంటిది కాదు. రాష్ట్ర రాజకీయాల్ని ప్రభావితం చేసింది, దశాబ్దాలుగా ప్రజల నోళ్లల్లో నానుతున్నదైన... విజయవాడ రౌడీయిజం. ఆ తరహా అంశాలతో సినిమాలు తీయడంలో వర్మకి ఓ ప్రత్యేకమైన మార్క్ కూడా ఉంది. దాంతో `వంగవీటి`పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. మరి సున్నితమైన అంశాలతో ముడిపడ్డ విజయవాడ రౌడీయిజాన్ని వర్మ తెరపై ఎలా ఆవిష్కరించాడో తెలుసుకుందాం పదండి...
* కథ
విజయవాడ బస్‌స్టాండ్‌లో ఓ చిన్న రౌడీ వంగవీటి రాధ (శాండీ). ఊళ్లో ఎర్ర పార్టీ నాయకుడైన చలసాని వెంకటరత్నం అనుచరుడిగా గుర్తింపు తెచ్చుకుంటాడు. ఒకానొక దశలో ఆయన్ని మించిపోయే స్థాయిలో ప్రజల్లో పేరొస్తుంది. ఆ విషయాన్ని ఆ నోట ఈ నోట విన్న వెంకరత్నం... రాధ ఎదుగుదలను జీర్ణించుకోలేకపోతాడు. ఒకరోజు తన దగ్గరికి పిలిపించుకుని అవమానిస్తాడు. ఆ అవమానాన్ని భరించలేని రాధ... చలసాని వెంకటరత్నంని పథకం ప్రకారం అంతం చేస్తాడు. దాంతో విజయవాడ మొత్తం రాధ చేతుల్లోకి వస్తుంది. అన్ని యూనియన్లనీ శాసించే స్థాయికి ఎదుగుతాడు. అదే సమయంలో విద్యార్థి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనే అన్నదమ్ములు దేవినేని గాంధీ (కౌటిల్య), దేవినేని నెహ్రు (శ్రీతేజ్)లు రాధకి చేరువవుతారు. రాధతో కాలేజీలో స్వతంత్రంగా ఓ స్టూడెంట్ యూనియన్‌ని కూడా ఏర్పాటు చేయిస్తారు. ఎదురులేని రౌడీగా చలామణీ అవుతున్న రాధని అవతలి ప్రత్యర్థులు హత్య చేస్తారు. దాంతో రాధ స్థానంలోకి ఆయన తమ్ముడు రంగా (శాండీ) వస్తాడు. రౌడీయిజం గురించి తెలియకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో అన్నబాటలోకి అడుగుపెడతాడు. అయితే అప్పటి వరకు అన్న రాధకి అండగా ఉన్న దేవినేని సోదరులతో రంగాకి వైరం ఏర్పడుతుంది. దాంతో రంగా వర్గం నుంచి బయటికొచ్చి, కాలేజీలో సొంతంగా యూనియన్‌ని పార్టీని ఏర్పాటు చేసుకుంటారు. బలమైన వర్గంగా ఎదిగే ప్రయత్నం చేస్తారు. దేవినేని సోదరుల నుంచి రంగా ప్రాణానికి ముప్పు ఉందని భావించిన ఆయన అనుచరులు గాందీని కాలేజీలో చంపేస్తారు. అన్న మరణం తర్వాత దేవినేని నెహ్రూ ఆలోచనలో పడిపోయినా... మరో తమ్ముడు మురళి (వంశీ) మాత్రం పగతో రగలిపోతాడు. ఎలాగైన రంగా మీద పగ తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. అతనికి రాజకీయ శక్తులు కూడా అండగా నిలుస్తాయి. దాంతో రంగా అనుచరుల్ని ఒకొక్కరిని చంపుకుంటూ వెళతాడు. అదే సమయంలో రంగా రాజకీయ ప్రవేశం చేసి ఎమ్మెల్యేగా గెలుస్తాడు. దేవినేని నెహ్రూని కూడా అప్పుడే పుట్టుకొచ్చిన ఓ ప్రాంతీయ పార్టీ అక్కున చేర్చుకుంటుంది. నెహ్రూ కూడా ఎమ్మెల్యే అవుతాడు. ఆయన పార్టీ అధికారంలోకి ఉంటుంది. దాంతో రంగాని హత్య చేయాలని మురళి పథకం పన్నుతాడు. స్వయంగా ఇంటికి ఫోన్ చేసి బెదిరిస్తాడు. దాంతో మరింత ఆగ్రహంతో రగిలిపోయిన రంగా మురళిని హత్య చేయిస్తాడు. ఇద్దరు అన్నదమ్ముల్ని కోల్పోయిన నెహ్రూ రంగాపై పగ తీర్చుకున్నాడా? లేదా? రంగాని ఎవరెలా అంతం చేశారనే విషయాల్ని తెరపై చూడాల్సిందే.
ఎనాలసిస్ :
విజయవాడ రక్త చరిత్రని తిరగేస్తే అందులో రంగా హత్య గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుంటాయి. కుల సమీకరణల గురించి ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తుంటాయి. కాకలు తీరిన నాయకుల పేర్లు ప్రస్తావనకొస్తుంటాయి. కానీ ఏది ఎలా జరిగిందనేది మాత్రం ఎవరూ ఇతమిత్థంగా చెప్పలేరు. అలాంటి ఓ క్లిష్టమైన అంశాన్ని రామ్‌గోపాల్‌వర్మలాంటి దర్శకుడు టచ్ చేస్తున్నాడంటే జనంలో ఓ ఆశ. ప్రశ్నలుగా మిగిలిపోయిన అంశాలకి కనీసం పరోక్షంగానైనా జవాబులు కనిపిస్తాయనేదే ఆ ఆశ. వివాదాస్పదమైన అంశమే అయినా రామ్‌గోపాల్‌వర్మ చెప్పాలనుకొన్నది ధైర్యంగా చెబుతాడన్నది ఓ నమ్మకం. కానీ రామ్‌గోపాల్ వర్మ మాత్రం ఆ ప్రశ్నని ప్రశ్నగానే వదిలేశాడు. జవాబు కనకదుర్గమ్మ తప్ప మరెవ్వరికీ తెలియని విస్పష్టంగా చెప్పేశాడు. దాంతో వంగవీటి చిత్రం అందరికీ చూచాయగా, ముక్కలు ముక్కలుగా తెలిసిన బెజవాడ కథకి దృశ్య రూపకంతో కూడిన ఓ వేదికయ్యిందంతే. ఇందులో ఒక్క కొత్త విషయాన్నీ చెప్పింది లేదు. తన వాయిస్ ఓవర్‌తో ఈ కథని చెప్పాడు. ఆవాయిస్ ఓవర్‌కి తగ్గట్టుగానే పాత్రల్ని, సన్నివేశాల్ని తీర్చిదిద్దాడు. వర్మ మార్క్ సన్నివేశాల కోసమే ఈ సినిమాని చూడాలి తప్ప మరింత ఆశించి వెళితే నిరాశ తప్పదు. చలసాని నీడలో ఎదిగిన రాధా జీవితం మొదలుకొని ఓ పాఠంలా చెప్పకుంటూ వచ్చాడు వర్మ. రంగా హత్య తర్వాత పరిణామాలు అంతకుముందు జరిగిన సంఘటనలకంటే నాటకీయంగా ఉంటాయనేది విశ్లేషకుల మాట. కానీ వాటి జోలికి వెళ్లలేదు వర్మ. రంగా హత్యోదంతంతోనే కథని ముగించాడు. రాధా, రంగాల ఎదుగుదలని చూపించినంత ఎఫెక్టివ్‌గా మిగతా సన్నివేశాల్నిచూపించలేదు వర్మ. దాంతో తొలి సగభాగం కథ రక్తికట్టిస్తుంది మినహా మలిభాగం ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడుతుంది. మలి భాగంలో కీలకమైన కథ ఉన్నప్పటికీ వాటిపై పెద్దగా దృష్టిపెట్టలేదు. రంగా హత్యని పేలవంగా తెరకెక్కించాడు వర్మ. దీక్షలో కూర్చున్న రంగాని అయ్యప్ప మాల ధరించి హత్య చేస్తారు. అయితే ఆ సన్నివేశాల్లో మాత్ర వర్మ మార్క్ కనిపించదు. 70, 80లకాలం నాటి వాతావరణాన్ని, అప్పటి పరిస్థితుల్ని ప్రతిబింబించేలా సన్నివేశాల్ని తీసిన విదానం మాత్రం చాలా బాగుంది. అలాగే పాత్రలకి తగ్గట్టుగా నటీనటుల్ని ఎంపిక చేసుకొన్నవైనం కూడా ఆకట్టుకునేలా ఉంది.
* నటీనటులు
రాధా, రంగా పాత్రలు రెండింటినీ శాండీ చేశాడు. రెండు పాత్రల్లోనూ ఆయన ఒదిగిపోయిన విధానం చాలా బాగుంది. అయితే ఆ పాత్రల్ని ఒకరితోనే చేయించడం, పైగా గెటప్పుల్లో కూడా పెద్దగా తేడా లేకపోవడంతో ప్రేక్షకుడు ఒకింత గందరగోళానికి గురవుతాడు. నెహ్రూ, గాంధీ, మురళి పాత్రలకి తగ్గట్టుగా నటీనటుల్ని ఎంచుకొన్న విధానం కూడా వర్మ ప్రతిభకి అద్దం పడుతుంది. మురళి పాత్రలో హ్యాపీడేస్ ఫేమ్ వంశీ కృష్ణ చాలా బాగా నటించాడు. రత్నకుమారి పాత్రలో నైనా కూడా ఒదిగిపోయింది. అందంగా కనిపిస్తూనే, భావోద్వేగాల్నీ ప్రదర్శించింది. ఇక మిగిలిన పాత్రల గురించి చెప్పుకునేంత ఏమీ లేదు.
* సాంకేతికత
వర్మ సినిమాల స్థాయిలో నేపథ్య సంగీతం లేకపోయినా... బాణీలు మాత్రం బాగున్నాయి. పెళ్లి పాట, రత్నకుమారి పరిచయం నేపథ్యంలో వచ్చే పాటలు సినిమాకి కొత్త కలరింగుని తీసుకొచ్చాయి. భావోద్వేగాల్ని ఎలివేట్ చేయడానికి మోంటేజ్‌ల రూపంలో ఎక్కువ పాటల్ని వినిపించారు. అవన్నీ కూడా కథలో భాగంగానే, కథని ముందుకు నడిపించేలానే ఉంటాయి. వర్మలోని దర్శకుడు అడుగడుగునా కట్టడికి గురైనట్టు సన్నివేశాలు చెప్పకనే చెబుతాయి. కులాల్ని, పార్టీల్ని పెద్దగా ప్రస్తావించకుండా.... ఏ ఒక్క పాత్రనీ ఎక్కువ తక్కువలుచేయకుండా బ్యాలెన్స్‌డా తీశాడు. అక్కడే కథలోని గాఢత తగ్గిపోయినట్టు అనిపిస్తుంది. ద్వితీయార్థంలో వర్మ మార్క్ సన్నివేశాలు కూడా కనిపించవు. కెమెరా పనితనం బాగుంది. ఆయా పరిస్థితుల్ని, మూడ్‌ని ప్రతిబింబించేలా అత్యంత సహజంగా సన్నివేశాలు తెరకెక్కాయి.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
అందరికీ తెలిసిన కథని రామ్‌గోపాల్ వర్మ కూడా మరోసారి తెలుసుకొని ఆయన మాటల్లోనూ, ఆయన మార్క్ సన్నివేశాల్లోనూ చెప్పాడంతే.