English | Telugu
బ్యానర్:జీ స్టూడియోస్, బే వ్యూ ప్రాజెక్ట్స్
Rating:3.00
విడుదలయిన తేది:Feb 24, 2022
సినిమా పేరు: వలిమై
తారాగణం: అజిత్ కుమార్, కార్తికేయ గుమ్మకొండ, హుమా ఖురేషి
సంగీతం: యువన్ శంకర్ రాజా
నేపథ్య సంగీతం: ఘిబ్రాన్
సినిమాటోగ్రఫీ: నిరవ్ షా
స్టంట్ కొరియోగ్రాఫర్ దిలీప్ సుబ్బరామన్
బ్యానర్స్: జీ స్టూడియోస్, బే వ్యూ ప్రాజెక్ట్స్
నిర్మాత: బోనీ కపూర్
రచన, దర్శకత్వం: హెచ్.వినోద్
విడుదల తేదీ: ఫిబ్రవరి 24, 2022
కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'వలిమై'. టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ గుమ్మకొండ విలన్ గా నటించడంతో ఈ మూవీపై మరింత ఆసక్తి నెలకొంది. తమిళ్ పేరుతోనే తెలుగులో డబ్ అయ్యి తమిళ్ తో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా నేడే పలకరించింది ఈ సినిమా. మరి వెండితెరపై అజిత్, కార్తికేయల పోరు ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం.
కథ:- డ్రగ్స్, చైన్ స్నాచింగ్, హత్యలతో వైజాగ్ సిటీ బెంబేలెత్తి పోతుంటుంది. దీని వెనక ఒక పెద్ద నెట్ వర్క్ ఉంటుంది. ఓ అజ్ఞాత వ్యక్తి నరేన్(కార్తికేయ) వందల మందిని తన గుప్పిట్లో పెట్టుకొని బైక్ గ్యాంగ్ పేరిట నేరాలకు పాల్పడుతుంటాడు. అసలు ఆ నేరాలు ఎవరు చేస్తున్నారు? ఎలా జరుగుతున్నాయి? అని తెలుసుకోవడంలో పోలీస్ డిపార్ట్మెంట్ పూర్తిగా విఫలమవుతుంది. ఈ నేరాలకు అడ్డుకట్ట వేసే సరైన పోలీస్ రావాలని కోరుకుంటూ ఉండటం తప్ప పోలీస్ చీఫ్ కూడా ఏం చేయలేకపోతాడు. అదే సమయంలో విజయవాడలో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్న అర్జున్(అజిత్) వైజాగ్ కి ట్రాన్స్ ఫర్ అవుతాడు. అక్కడ ఒక యువకుడి ఆత్మహత్య కేసుని ఛేదించే క్రమంలో.. దీనికి, బైక్ గ్యాంగ్ కి సంబంధం ఉందని కనిపెట్టడంతో.. ఈ కేసుని అర్జున్ కి అప్పగిస్తాడు పోలీస్ చీఫ్. అక్కడి నుంచి అర్జున్, నరేన్ ల మధ్య ఆట మొదలవుతుంది. అసలు నరేన్ ఇదంతా ఎందుకు చేస్తున్నాడు? అతను ఆడే ఆటలో వందలమంది యువకులతో పాటు అర్జున్ కుటుంబం ఎలా చిక్కుతుంది? అతని నుంచి సిటీని, తన కుటుంబాన్ని అర్జున్ ఎలా కాపాడాడు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
ఎనాలసిస్ :
వలిమై సినిమా కథలో కొత్తదనం లేకపోయినా డైరెక్టర్ హెచ్.వినోద్ ఆ కథని నడిపించిన విధానం ఆకట్టుకుంది. ఒక యువకుడి ఆత్మహత్య వెనక బైక్ గ్యాంగ్ ఉందని కనిపెట్టి, ఆ గ్యాంగ్ లీడర్ ని పట్టుకోవడం కోసం అర్జున్ పయత్నించడం వంటి వాటితో ఫస్టాఫ్ ఆసక్తికరంగా సాగింది. సోఫియా(హుమా ఖురేషి) సాయంతో ఆ గ్యాంగ్ ని అర్జున్ పట్టుకునే విధానం బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా రేసీగా రన్ అయింది. ఇంటర్వెల్ కి ముందు వచ్చే బైక్ సీక్వెన్స్ అయితే మరో స్థాయిలో ఉంది. ఇంటర్వెల్ కి ముందు విలన్ ని అర్జున్ పట్టుకోవడం, ఆ తర్వాత ఒక చిన్న ట్విస్ట్ తో ఫస్టాఫ్ ముగుస్తుంది.
ఫస్టాఫ్ తో పోల్చుకుంటే సెకండాఫ్ లో కాస్త వేగం తగ్గింది. ఉద్యోగం లేక ఇంట్లో వాళ్ళతోనూ, బయట వాళ్ళతోనూ అవమానపడే నిరుద్యోగ యువకులే విలన్ టార్గెట్. వారిని డ్రగ్స్ మత్తులో దింపి, డబ్బు ఆశ చూపి.. కుటుంబం, సమాజం మీద ద్వేషం కలిగేలా చేసి నేరాలు చేసేలా ప్రేరేపిస్తాడు. ఆ ట్రాప్ లో అర్జున్ సోదరుడు కూడా చిక్కుకుంటాడు. దీంతో అప్పటివరకు పోలీస్, క్రిమినల్ మధ్య జరిగిన హోరాహోరీ పోరులోకి మదర్ సెంటిమెంట్ వచ్చి చేరుతుంది. ఒక కొడుకు పోలీస్ అయితే, మరో కొడుకు క్రిమినల్ అయ్యాడని అర్జున్ తల్లి బాధపడుతూ ఉంటుంది. అప్పటి వరకు ఓ రేంజ్ యాక్షన్ సీక్వెన్స్ లు చూసిన ఆడియన్స్ కి ఈ సెంటిమెంట్ అంతగా కనెక్ట్ కాకపోవచ్చు. యాక్షన్ డోస్ తగ్గించి ఉంటే ఆ మదర్ సెంటిమెంట్ మరింత కనెక్ట్ అయ్యుండేదేమో.
నిరుద్యోగ యువకులే విలన్ టార్గెట్ కాబట్టి, జాబ్ లేక బంధువుల చేత అవమానాలు పడుతున్న అర్జున్ తమ్ముడు కూడా ఆ బైక్ గ్యాంగ్ ట్రాప్ లో పడతాడు అని ఆడియన్స్ ముందే ఊహిస్తారు. అందుకు తగ్గట్లే అర్జున్ తమ్ముడు కుటుంబం మీద ద్వేషం పెంచుకొని ఆ గ్యాంగ్ కి దగ్గరవుతాడు. అయితే అతను తనకు వరసకు మరదలయ్యే ఒకమ్మాయి(వైష్ణవి చైతన్య)ని ప్రేమిస్తాడు. ఆమె కూడా అతన్ని ప్రేమిస్తుంది. కానీ అతను క్రిమినల్స్ తో చేరి అరెస్ట్ అయ్యాక.. అసలు ఆమె క్యారెక్టర్ యే కనిపించకుండా పోయింది.
ఈ సినిమాకి మేజర్ హైలైట్ యాక్షన్ ఎపిసోడ్స్ అని చెప్పొచ్చు. ఫస్టాఫ్ లో వచ్చే బైక్ సీక్వెన్స్ తో పాటు సెకండాఫ్ లో వచ్చే బస్ సీక్వెన్స్ ఆకట్టుకున్నాయి. తమ గ్యాంగ్ లీడర్ ని తీసుకెళ్తున్న బస్ పై బైక్ గ్యాంగ్ ఎటాక్ చేసి విలన్ ని తీసుకెళ్లే సీన్ సినిమాకే హైలైట్ గా నిలిచింది. స్టంట్ కొరియోగ్రాఫర్ దిలీప్ సుబ్బరామన్ ఈ సినిమాకి మెయిన్ పిల్లర్ లా నిలబడ్డాడు అని చెప్పొచ్చు. నిరవ్ షా సినిమాటోగ్రఫీ కూడా సినిమాకి చాలా ప్లస్ అయింది. వీరిద్దరూ కలిసి సినిమాకి హాలీవుడ్ లుక్ తీసుకొచ్చారు. యువన్ శంకర్ రాజా స్వరపరిచిన సాంగ్స్ లో ఒక సాంగ్ పర్లేదు. ఘిబ్రాన్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంది. యాక్షన్ కోరుకునే ప్రేక్షకులను ఈ సినిమా యాక్షన్ సీక్వెన్స్ లు అలరిస్తాయి. కానీ సాధారణ ప్రేక్షకులను ఆ సీక్వెన్స్ ల నిడివి ఇబ్బంది పెడుతుంది. ఎడిటర్ విజయ్ తన కత్తెరకి మరింత పని చెప్తే బాగుండేది.
ప్లస్ పాయింట్స్:
అజిత్
యాక్షన్ సీక్వెన్స్ లు
సినిమాటోగ్రఫీ
నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్స్:
సెకండాఫ్
హృదయానికి హత్తుకోని సెంటిమెంట్ సీన్స్
నటీనటుల పనితీరు:- అజిత్ ఎప్పటిలాగానే తనదైన స్క్రీన్ ప్రజెన్స్ తో ఆకట్టుకున్నాడు. యాక్షన్ సీన్స్ లో అదరగొట్టిన అజిత్ సెంటిమెంట్ సీన్స్ లోను మెప్పించాడు. విలన్ గా కార్తికేయ రాణించాడు. ఆహార్యం, హావభావాలతో ఆకట్టుకున్నాడు. అయితే కొన్ని సన్నివేశాల్లో డబ్బింగ్ తేలిపోయింది. డబ్బింగ్ మీద మరింత దృష్టి పెడితే బాగుండేది. హుమా ఖురేషి పాత్ర ఫస్టాఫ్ లో బాగున్నా ఆ తరువాత తేలిపోయింది. ఉన్నంతలో మెప్పించింది. వైష్ణవి చైతన్య, సునైనా వంటి తెలుగు యాక్టర్స్ ఒకట్రెండు సీన్స్ లో మెరిశారు.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
యాక్షన్ ప్రియులను ఆకట్టుకునే క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ 'వలిమై'. అయితే మదర్ సెంటిమెంట్ ఉన్నప్పటికీ ఫ్యామిలీ ఆడియెన్స్ కి వలిమై దూరమే.
-గంగసాని