English | Telugu

సినిమా పేరు:యూఐ
బ్యానర్:లహరి ఫిలింస్‌, వీనస్‌ ఎంటర్‌టైనర్స్‌
Rating:2.25
విడుదలయిన తేది:Dec 20, 2024

నటీటులు: ఉపేంద్ర, రీష్మా నానయ్య, సన్నీ లియోన్‌, సాధుకోకిల, జిస్సు సేన్‌గుప్తా,
మురళీశర్మ, ఇంద్రజిత్‌ లంకేష్‌, రవిశంకర్‌ తదితరులు
సంగీతం: బి.అజనీష్‌ లోకనాథ్‌
సినిమాటోగ్రఫీ: హెచ్‌.సి.వేణుగోపాల్‌
ఎడిటింగ్‌: విజయ్‌రాజ్‌ బి.జి.
నిర్మాతలు: జి.మనోహరన్‌, శ్రీకాంత్‌ కె.పి.
బ్యానర్స్‌: లహరి ఫిలింస్‌, వీనస్‌ ఎంటర్‌టైనర్స్‌
రచన, దర్శకత్వం: ఉపేంద్ర
విడుదల తేదీ: 20.12.2024
సినిమా నిడివి: 132 నిమిషాలు

‘పురుషులందు పుణ్య పురుషులు వేరయా..’ అనే వ్యాకాన్ని రివర్స్‌ చేస్తే ‘సినిమాలందు ఉపేంద్ర సినిమాలు వేరయా’ అనుకునే పరిస్థితి మొదటి నుంచీ ఉంది. కన్నడలో రూపొందిన ‘ఓం’ చిత్రంతో ఉపేంద్రను తెలుగు ప్రేక్షకులు డైరెక్టర్‌గా గుర్తించారు. కన్నడలో శివరాజ్‌కుమార్‌తో రూపొందించి హిట్‌ కొట్టిన ఉపేంద్ర తెలుగులో రాజశేఖర్‌ హీరోగా ‘ఓంకారం’ పేరుతో తెరకెక్కించారు. అప్పటివరకు వచ్చిన సినిమాల తీరు వేరు, ఉపేంద్ర చేసిన ఈ సినిమా వేరు అన్నట్టుగా ఫీల్‌ అయ్యారు తెలుగు ప్రేక్షకులు. ఆ సినిమాతో ఉపేంద్రకు ప్రత్యేక అభిమానగణం మొదలైంది. ఆ తర్వాత అతని డైరెక్షన్‌లోనే కన్నడలో రూపొందిన ‘ఎ’, ‘ఉపేంద’ వంటి సినిమాలు చూసి జనం పిచ్చెక్కిపోయారు. సినిమాలు ఇలా కూడా తీస్తారా అని ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత కూడా ఆ తరహాలోనే కొన్ని సినిమాలు చేశాడు ఉపేంద్ర. ఆ తరహా సినిమాలు ఉపేంద్ర తప్ప మరొకరు నిస్సందేహంగా చెయ్యలేరు అనేంతగా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. అతను చేసే సినిమాలు టైటిల్‌ దగ్గర నుంచి కాన్సెప్ట్‌ వరకు అన్నీ డిఫరెంటే. అయితే ఈమధ్యకాలంలో అతని నుంచి అలాంటి సినిమాలు రాలేదు. తాజాగా ‘యుఐ ది మూవీ’ అనే పేరుతో ఓ సినిమా వచ్చింది. ఉపేంద్రలోని మ్యాడ్‌నెస్‌ని మరోసారి చూపించబోతున్నాడని ట్రైలర్‌ చూస్తేనే అందరికీ అర్థమైంది. అసలు ఈ సినిమా ఏ కాన్సెప్ట్‌లో తెరకెక్కించాడు, సినిమా ద్వారా ఏం చెప్పదలుచుకున్నాడు అనేది సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ

‘మీరు తెలివిగల వాళ్ళయితే వెంటనే థియేటర్‌ నుంచి బయటికి వెళ్లిపోండి’... సినిమా మొదలవగానే కనిపించే కార్డ్‌ ఇదే. ఆ తర్వాత ‘మూర్ఖులైతేనే ఈ సినిమాను పూర్తిగా చూడండి’, మూడో కార్డ్‌ ‘తెలివైన వాడు మూర్ఖుడుగా కనిపిస్తాడు, మూర్ఖులు తెలివైనవారిగా నటిస్తారు’... అంటూ ఈ సినిమా ద్వారా ఏం చెప్పదలుచుకున్నాడు అనేది ముందుగానే రివీల్‌ చేశాడు. అయినా ఉపేంద్ర గతంలో చేసిన సినిమాలు ఎంత పిచ్చిగా ఉన్నా ఆడియన్స్‌ని ఆకట్టుకున్నాయి. ఆ కారణంగానే థియేటర్‌ నుంచి బయటికి వెళ్ళకుండా తాము కూడా తెలివి తక్కువ వాళ్ళమే అని ప్రూవ్‌ చేసుకునే ప్రయత్నం చేశారు ప్రేక్షకులు. సాదారణంగా ఉపేంద్ర సినిమాలు ఒక పట్టాన అర్థం కావు అంటారు. దానికి పరాకాష్టగా ‘యుఐ’ చిత్రాన్ని చెప్పొచ్చు. సినిమా చూసిన తర్వాత ఎవరి పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో వాళ్ళు అర్థం చేసుకోండి అనే విధంగానే అతని సినిమా ఉంటుంది. 

అయితే ఈ సినిమాను మాత్రం ఉపేంద్ర పాయింట్‌ ఆఫ్‌ వ్యూ నుంచి చూస్తేనే అర్థమవుతుంది అని సినిమా చూస్తే తెలుస్తుంది. రాజ్యాలు ఏలుతున్న దొంగల్ని ఒక దారిలో పెట్టేందుకు సత్య (ఉపేంద్ర) వస్తాడు. అలాగే నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న కల్కి(ఉపేంద్ర) కూడా వస్తాడు. అధికారాన్ని చేజిక్కించుకొని రాక్షసంగా మారతాడు.  అసలు వీరిద్దరూ ఎవరు? ఎవరి మీద ఎవరు ఆధిపత్యాన్ని తీసుకున్నారు? చివరికి మంచి గెలిచిందా? చెడు గెలిచిందా? అనేదే కథ. అయితే ఇదమిద్దంగా ఇదీ కథ అని చెప్పలేని విధంగా ఈ సినిమా ఉంటుంది. 


ఎనాలసిస్ :

సినిమా మొదటి 15 నిమిషాలు, చివరి 15 నిమిషాలు తప్ప మిగతా సినిమా అంతా అస్తవ్యస్తంగా, గందరగోళంగా ఉంటుంది. ఏ క్యారెక్టర్‌ ఎందుకొస్తుందో అర్థం కాదు. ఇక హీరోయిన్‌ అనే క్యారెక్టర్‌ ఉండాలి కాబట్టి ఉంటుందే తప్ప ప్రాధాన్యం అనేది ఉండదు. ఇక పాటల విషయానికి వస్తే ఏదీ అర్థమయ్యేలా ఉండదు. సినిమాలో పొలిటికల్‌ సెటైర్స్‌ ఉన్నాయి. పరోక్షంగా కొన్ని పార్టీలను విమర్శించాడు. గతంలో అతని డైరెక్షన్‌లోనే వచ్చిన సూపర్‌ చిత్రంలో 50 సంవత్సరాల క్రితం ఇండియా ఇలా ఉంటుంది అని అమెరికా తరహాలో చూపించాడు. ఈ సినిమా విషయానికి వస్తే.. దానికి పూర్తి భిన్నంగా ఇండియా నాశనం అయిపోయింది అన్నట్టు చూపించాడు. ముందు నిన్ను నువ్వు తెలుసుకో, ఆ తర్వాత చుట్టూ ఉన్న సమాజంలోని అవకతవకలను ప్రశ్నించు. అలాగే ప్రకృతిని సంరక్షించు, అది నిన్ను కాపాడుతుంది.. ఈ మూడు అంశాలను ప్రధానంగా తీసుకొని ఈ సినిమా చేశాడు. నటన పరంగా ఉపేంద్రకు మంచి మార్కులే పడతాయి. మిగతా నటీనటుల పెర్‌ఫార్మెన్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక టెక్నికల్‌గా సినిమా చాలా రిచ్‌గా ఉందని చెప్పొచ్చు. 


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

ఈ సినిమా చూడాలంటే మనకు రెండు, మూడు బుర్రలు ఉండాలన్నది అర్థమవుతుంది. ఉపేంద్ర సినిమాలను చూసేందుకు ఇష్టపడే వారు నిరభ్యంతరంగా థియేటర్స్‌కి వెళ్లొచ్చు. కానీ, అందులో ఎంతమందికి ఈ సినిమా అర్థమవుతుంది అనేది మిలియన్‌ డాలర్‌ క్వశ్చన్‌.