English | Telugu
బ్యానర్:శ్రీ కీర్తి ఫిల్మ్స్
Rating:2.50
విడుదలయిన తేది:Mar 11, 2016
కొత్తగా ఆలోచించడం వృథా అని భావిస్తున్నారిప్పుడు! పక్కా కమర్షియల్ పంథాకీ, కొత్తగా ఆలోచించడానికీ పొంతన కుదరదన్నది చాలా మంచి సినిమా రూపకర్తల దురాభిప్రాయం. అయితే తమిళంలోనో, మలయాళంలోనో కొత్తగా ఆలోచించిన సినిమా హిట్టయితే ఆ కథని రీమేక్ చేయడానికి ఏమాత్రం ఆలస్యం చేయడం లేదు. అలాంటి కథే.. తుంటరి. మాన్ కరాటే చిత్రానికి ఇది తెలుగు రూపం. తమిళంలో సినిమా హిట్టవ్వడానికి ప్రధాన కారణం.. కథాంశంలో ఉన్న వైవిద్యం. దాన్నే నమ్ముకొని తుంటరిని రూపొందించారు. మరి.. అక్కడి ఫలితం ఇక్కడా పునరావృతం అయ్యిందా? తుంటరి నారా రోహిత్ కెరీర్ కి ఎంత వరకూ హెల్ప్ అవుతుంది? తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
సాఫ్ట్ వేర్ ఇంజనీర్ బ్యాచ్ విహార యాత్ర కోసం అడవుల్లోకి వెళ్తారు. అక్కడ ఓ రుషి కనిపిస్తాడు. `మీలో ఒకరి కోరిక నెరవేరుస్తా.. ఏం కావాలో కోరుకోండి` అంటూ వరమిస్తాడు. రుషి మాటల్ని ఎవ్వరూ నమ్మరు. అపనమ్మకంతోనే రాబోయే దసరా రోజు న్యూస్ పేపర్ కావాలంటూ కోరుకొంటారు. ఆ రుషి రాబోయే దసరా దిన పత్రికను వాళ్ల చేతుల్లో పెడతాడు. అనూహ్యంగా అందులో ఏం రాసుందో... అదే జరుగుతుంటుంది. అందుకే.. దాన్ని క్యాష్ చేసుకొందామని మిత్రబృందం ప్రయత్నాలు ప్రారంభిస్తుంది. వైజాగ్ లో జరిగే బాక్సింగ్ పోటీల్లో రాజు అనే యువకుడు రూ.5 కోట్ల ప్రైజ్ మనీ గెలుస్తాడని ఆ పేపర్లో ఉంటుంది. అందుకే రాజుని వెదుక్కొంటూ వైజాగ్ వెళ్తారు ఈ మిత్రులంతా. రాజు (నారా రోహిత్) ఓ తుంటరి. ఆవారాగా తిరుగుతుంటాడు. సిరి (లతా హెగ్డే)ని ప్రేమిస్తాడు. తనకు అసలు బాక్సింగ్ అంటే ఏమిటో తెలీదు. అలాంటి రాజుకి బాక్సింగ్ నేర్పించి, రూ.5 కోట్లు గెలిచేలా చేసి, ఆ డబ్బుని మిత్రులంతా పంచుకోవాలన్నది ప్లాన్. మరి ఈ ప్లాన్ వర్కవుట్ అయ్యిందా? బాక్సింగ్‌లో చాంపియన్ అయిన కిల్లర్ రాజు (కబీర్‌ఖాన్)తో రాజు పోటీ పడ్డాడా, లేదా? ఈ విషయాలు తెలియాలంటే.. తుంటరి సినిమా చూడాల్సిందే.
ఎనాలసిస్ :
కథలో పాయింట్ కొత్తగా అనిపిస్తుంది. భవిష్యత్తు తెలుసుకొన్న ఓ మిత్రబృందం.. దాన్ని తమకు అనుకూలంగా మార్చుకొనేందుకు చేసిన ప్రయత్నం ఈ కథ. విధికీ, కష్టానికీ మధ్య జరిగిన పోరుగా ఈ కథని దర్శకుడు మార్చుకొన్న తీరు కూడా బాగుంది. దానికి తోడు విశ్రాంతి ముందొచ్చే ట్విస్టు కూడా ఆసక్తిని కలిగించేదే. క్రీడా నేపథ్యంలో సాగే చిత్రాలు తెలుగు నాట తక్కువే. అందులో కమర్షియల్ అంశాలు కూడా జోడిస్తే ఫలితానికి ఢోకా ఉండదు. తుంటరిలో అటు కొత్తదనం ఇటు కమర్షియాలిటీ మిక్స్ చేసే అవకాశం దక్కింది. దాన్ని మాన్ కరాటేలో బాగావాడుకొన్నారు. తెలుగులో నూటికి నూరు పాళ్ల న్యాయం జరక్కపోయినా... ఆ కథకు అన్యాయం మాత్రం జరగలేదు.
సినిమా ప్రారంభం ఉత్కంఠత కలిగిస్తుంది. ప్రేక్షకులు ఈజీగానే కథలోని ప్రయాణం మొదలెడతారు. రాజు చుట్టూ అల్లుకొన్న సన్నివేశాలు, రాజుకి బాక్సింగ్ నేర్పించడానికి చేసిన ప్రయత్నాలు సరదాగా ఉంటాయి. తొలి భాగం.. సినిమాని వీలైంత ఫన్నీగా నడిపించాడు కుమార్ నాగేంద్ర. ద్వితీయార్థం సినిమా సీరియస్ మూడ్‌లో సాగాలి. కానీ తుంటరిలో కనిపించే ప్రధాన లోపం అదే. ఒక్కరోజులో బాక్సింగ్ నేర్చుకొని ఓ ప్రొఫెషనల్ బాక్సర్‌ని ఓడించడం అన్న కాన్సెప్ట్ అంత నమ్మశక్యంగా సాగదు. పైగా సదరు సన్నివేశాలు అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాని మాటి మాటికీ గుర్తు చేస్తుంటాయి. పతాక సన్నివేశాల్లో దర్శకుడు వాడుకొన్న థీమ్... ఆ సినిమాకి దగ్గరగా ఉంటుంది. ఆ విషయంలోనూ దర్శకుడు ఏదైనా కొత్తగా ఆలోచిస్తే. ఫలితం ఇంకా బాగుండేది. లాజిక్‌ల గురించి ఆలోచించకుండా.. కాలక్షేపం దొరికితే చాలు అనుకొనే ప్రేక్షకుడికి తుంటరి నచ్చే అవకాశాలున్నాయి.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
నారా రోహిత్‌లో ఈజ్ రోజు రోజుకీ పెరుగుతోంది. సంతోషం. ఈజ్‌తో పాటు ఏజ్, బరువూ పెరుగుతున్నాయి. ఈ విషయాన్ని ఈ హీరో దృష్టిలో పెట్టుకోవాలి. ఆ భారీ పర్సనాలిటీతో స్టెప్పులు వేయడానికి చాలా ఇబ్బంది పడ్డాడు.. ప్రేక్షకుల్ని పెట్టాడు కూడా. కాస్త సన్నబడితే.. లుక్ మారిస్తే రాజు పాత్రకి ఇంకా బాగా సెట్టయ్యేవాడు. కామెడీ టైమింగ్ ఈ సినిమాలో బాగా మెరుగుపడింది. లతా హెగ్డేకి ఇదే తొలి సినిమా. అయితే ఎక్కడా కంగారు పడకుండా తన వంత పాత్రకు న్యాయం చేసింది. వెన్నెల కిషోర్ గ్యాంగ్ అందించిన కామెడీ అక్కడక్కడ బాగానే వర్కవుట్ అయ్యింది. కబీర్ ఖాన్‌కి మరో మంచి పాత్ర దక్కింది. తన బాడీని తొలిసారి పూర్తి స్థాయిలో ఉపయోగించుకొన్నారనిపించింది.
సంగీతం, ఛాయాగ్రహణం... ఈ రెండు విభాగాలకూ వంక పెట్టలేం. సినిమాకి క్లీన్ గా ప్రజెంట్ చేసింది కెమెరా. పాటల్లో కన్నా సంగీత దర్శకుడి ప్రతిభ ఆర్.ఆర్‌లో ఎక్కువగా వినిపించింది. సినిమాని వీలైనంత తొందరగా ముగించాలన్న తపన కుమార్ నాగేంద్రలో కనిపించింది. అందుకే.. రెండు గంటలకు పరిమితం చేశాడు. అదీ ఒకందుకు మంచిదే అయ్యింది. జోరుతో విమర్శలు ఎదుర్కొన్న కుమార్... ఈ సినిమాతో కాస్త తెరిపిన పడ్డట్టే అనిపించింది.
రీమేక్ కథల్ని తీర్చిదిద్దడం అనుకొన్నంత సులభం కాదు. ఒక్కోసారి పాయింట్‌ని సరిగా వాడుకోలేకపోతుంటారు దర్శకులు.కానీ.. కుమార్ నాగేంద్ర మాత్రం మాన్ కారాటేకి చెడ్డపేరు తీసుకురాలేదు. ఆ విషయంలో ఆయన్ని మెచ్చుకొని తీరాల్సిందే.