English | Telugu

సినిమా పేరు:తోడేలు
బ్యానర్:మాడాక్ ఫిల్మ్స్, జియో స్టూడియోస్‌
Rating:2.50
విడుదలయిన తేది:Nov 25, 2022

సినిమా పేరు: తోడేలు
తారాగణం: వరుణ్ ధావన్, కృతి సనన్, దీపక్ డోబ్రియాల్, అభిషేక్ బెనర్జీ, పాలిన్ కబక్
సంగీతం: సచిన్-జిగర్
సినిమాటోగ్రఫీ: జిష్ణు భట్టాచార్జీ
ఎడిటర్: సంయుక్త కాజా
దర్శకత్వం: అమర్ కౌశిక్
నిర్మాత: దినేష్ విజన్
బ్యానర్: మాడాక్ ఫిల్మ్స్, జియో స్టూడియోస్‌
విడుదల తేదీ: నవంబర్ 25, 2022

భాషతో సంబంధం లేకుండా కంటెంట్ బాగుంటే ఏ భాషా చిత్రాన్ని అయినా ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. అందుకే మేకర్స్ తమ చిత్రాన్ని వివిధ భాషల్లో డబ్ చేసి పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. హిందీ చిత్రం 'భేదియా' కూడా అదే బాటలో పయనించి ట్రైలర్ తోనే అందరి దృష్టిని ఆకర్షించింది. పైగా ఇటీవల కన్నడ చిత్రం 'కాంతార'ను తెలుగులో విడుదల చేసి కలెక్షన్లు కొల్లగొట్టిన గీతా ఆర్ట్స్.. కొద్దిరోజులకే హిందీ చిత్రం 'భేదియా'ను 'తోడేలు' పేరుతో తెలుగులోకి తీసుకొస్తుండటం ప్రేక్షకుల దృష్టిని మరింత ఆకర్షించింది. మరి ఈ 'తోడేలు' చిత్రం ఆ అంచనాలను అందుకొని వసూళ్ళ వర్షం కురిపించేలా ఉందో లేదో తెలుసుకుందాం. 

కథ:-

భాస్కర్(వరుణ్ ధావన్) ఒక చిన్న కాంట్రాక్టర్. ఒకసారి ప్రాజెక్ట్ పని మీద అరుణాచల్ ప్రదేశ్ లోని అటవీ ప్రాంతానికి వెళ్తాడు. ఆ ప్రాంతాన్ని బాహ్య ప్రపంచానికి కలుపుతూ రోడ్డు వేయడం కోసం అక్కడికి వెళ్ళిన అతను.. తన స్వలాభం కోసం వ్యాపార కోణంలో ఆలోచించి పచ్చని చెట్లను నరికించి అడవి గుండా రోడ్డు వేయాలి అనుకుంటాడు. దానికోసం కొందరికి డబ్బాశ చూపుతాడు, అక్కడి ప్రజలకు మాయమాటలు చెప్తాడు. అయితే ప్రకృతికి హాని కలగకుండా అక్కడేదో శక్తి కాపాడుతుంటుంది. దానిని కొందరు వైరస్ అంటారు. ఇదిలా ఉంటే ఒకసారి భాస్కర్ పై తోడేలు దాడి చేసి గాయపరుస్తుంది. అప్పటి నుంచి అతని ప్రవర్తనలో మార్పులొస్తాయి. క్రమక్రమంగా తోడేలులా మారిపోయి తనకే తెలియకుండా అడవిని నాశనం చేయాలనుకున్న వారి ప్రాణాలు తీస్తుంటాడు. భాస్కర్ ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడు? అతను తిరిగి మామూలు మనిషి అయ్యాడా? అడవిలో రోడ్డు వేయాలనుకున్న అతని ఆశ నెరవేరిందా? అడవిని రక్షిస్తున్న అదృశ్య శక్తి ఏంటి? అక్కడి వారిని భయపెడుతున్న ఆ వైరస్ ఏంటి? తెలియాలంటే సినిమా చూడాలి.


ఎనాలసిస్ :

"అభివృద్ధి పేరిట ప్రకృతిని నాశనం చేయకూడదు. ప్రకృతికి హాని చేయాలని చూస్తే, మనమే అంతం అవుతాం" అనే అంశాన్ని దర్శకుడు ఈ సినిమా ద్వారా చెప్పాలి అనుకున్నాడు. అతను చెప్పాలనుకున్న పాయింట్ బాగుంది, దానికి తోడేలు కాన్సెప్ట్ ని జోడించడం కూడా బాగుంది. కానీ దానిని ఆసక్తికరంగా మలచి ఎఫెక్టివ్ గా చెప్పడంలో దర్శకుడు కొంతవరకే సక్సెస్ అయ్యాడు.

3D లో రూపొందిన ఈ చిత్రంలోని కొన్ని కొన్ని సన్నివేశాలు అబ్బురపరుస్తాయి. విజువల్ గా మూవీ ఆకట్టుకునేలా ఉంది. కామెడీ కూడా బాగానే వర్కౌట్ అయింది. కానీ కథనమే ఆసక్తికరంగా సాగలేదు. హాలీవుడ్ సినిమాల తరహాలో మనిషి తోడేలులా మారి అడవిని రక్షించడమనే పాయింట్ బాగున్నా.. దానికి తగ్గ కథనం, సన్నివేశాలు తోడవ్వలేదు. కథనంలో ఆసక్తికర మలుపులు లేవు. సన్నివేశాలన్నీ ఊహకు అందేలా సాగుతాయి. కొన్ని చోట్ల అవే అవే సన్నివేశాలు రిపీట్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. ఫస్టాఫ్ పర్లేదు. ముఖ్యంగా ఇంటర్వెల్ కి ముందు వచ్చే సన్నివేశాలు మెప్పిస్తాయి. సెకండాఫ్ ప్రారంభంలో వచ్చే ఒకట్రెండు సన్నివేశాలు ఆకట్టుకున్నా ఆ తర్వాత గాడి తప్పింది. సెకండాఫ్ లో వచ్చే కీలక ట్విస్ట్ కాస్త ముందుగానే ప్రేక్షకులకు అర్థమవుతుంది. దాంతో అది అంత కిక్ ఇవ్వదు. పతాక సన్నివేశాలు బాగానే ఉన్నాయి. 

సచిన్-జిగర్ స్వరపరిచిన పాటలు పర్లేదు అనేలా ఉన్నాయి. నేపథ్య సంగీతం మాత్రం ఆకట్టుకుంది. సన్నివేశాలను బాగానే ఎలివేట్ చేసింది. ముఖ్యంగా హీరో తోడేలులా మారే సన్నివేశాల్లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మెప్పించింది. సినిమాటోగ్రఫీ, వీఎఫ్ఎక్స్ సినిమాకి ప్రధాన బలంగా నిలిచాయి. జిష్ణు భట్టాచార్జీ కెమెరా పనితనం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అడవి వాతావరణాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించాడు. సంయుక్త కాజా కూర్పు బాగానే ఉంది కానీ కత్తెరకు ఇంకాస్త పని చెప్పి ఉండాల్సింది. కనీసం ఇంకో పది నిముషాలు ట్రిమ్ చేయొచ్చు.

నటీనటుల పనితీరు:-

భాస్కర్ పాత్రలో వరుణ్ ధావన్ ఒదిగిపోయాడు. సగం మనిషిగా, సగం తోడేలుగా అతని ప్రవర్తన ఆకట్టుకుంది. మనిషిగా బాధని, తోడేలుగా రౌద్రాన్ని చక్కగా పలికించాడు. ఇక వెటర్నరీ డాక్టర్ అయ్యుండి తోడేలు దాడిలో గాయపడిన భాస్కర్ కి వైద్యం చేసే అనిక పాత్రలో కృతి సనన్ బాగానే రాణించింది. అయితే ఆ పాత్ర గెటప్ ఆమెకి అంతగా సెట్ అవ్వలేదు. సినిమాలో కంటే సినిమా అంతా అయిపోయాక చివరిలో వచ్చే పాటలోనే ఆమె అందంగా, ఆకట్టుకునేలా ఉంది. అభిషేక్ బెనర్జీ తనదైన కామెడీ టైమింగ్ తో బాగా నవ్వించాడు. సినిమాకి బిగ్ రిలీఫ్ అతని కామెడీ అని చెప్పొచ్చు. దీపక్ డోబ్రియాల్, పాలిన్ కబక్ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

ట్రైలర్ చూసి భారీ అంచనాలతో సినిమాకి వెళ్తే నిరాశ చెందక తప్పదు. ఆకట్టుకునే విజువల్స్, అక్కడక్కడా నవ్వులతో ఒకసారి చూడగలిగేలా ఉంది. పెద్దగా అంచనాలు పెట్టుకోకుండా వెళ్లొచ్చు.

-గంగసాని