Read more!

English | Telugu

సినిమా పేరు:ది ఘోస్ట్
బ్యానర్:శ్రీ వెంకటేశ్వర సినిమాస్, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్
Rating:2.50
విడుదలయిన తేది:Oct 5, 2022

సినిమా పేరు: ది ఘోస్ట్
తారాగణం: అక్కినేని నాగార్జున, సోనాల్ చౌహాన్, గుల్ పానాగ్, అనిఖా సురేంద్రన్, రవి వర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, మనీష్ చౌదరి 
సంగీతం: భరత్-సౌరభ్(పాటలు), మార్క్ కె. రాబిన్(నేపథ్య సంగీతం)
సినిమాటోగ్రఫీ: ముఖేష్.జి
ఎడిటింగ్: ధర్మేంద్ర కాకరాల
నిర్మాతలు: సునీల్ నారంగ్, పుస్కర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్
దర్శకత్వం: ప్రవీణ్ సత్తారు
బ్యానర్స్: శ్రీ వెంకటేశ్వర సినిమాస్, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్
విడుదల తేదీ: 5 అక్టోబర్ 2022

ఈ ఏడాది ప్రారంభంలో 'బంగార్రాజు' చిత్రంతో అలరించిన అక్కినేని నాగార్జున ఇప్పుడు 'ది ఘోస్ట్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గతేడాది 'వైల్డ్ డాగ్' అనే యాక్షన్ థ్రిల్లర్ తో వచ్చి ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయిన నాగార్జున.. మరోసారి అదే జోనర్ ఫిల్మ్ 'ది ఘోస్ట్'తో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఈ చిత్రానికి 'పిఎస్‌వి గరుడ వేగ' ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకుడు కావడంతో పాటు టీజర్, ట్రైలర్ ఆకట్టుకోవడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై బాగానే ఆసక్తి ఏర్పడింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? నాగార్జునకు ఆశించిన విజయాన్ని అందించేలా ఉందా? అనేది రివ్యూలో చూద్దాం.

కథ:
విక్రమ్(నాగార్జున) దుబాయ్ లో ఇంటర్ పోల్ అధికారిగా పని చేస్తుంటాడు. క్లిష్టమైన ఆపరేషన్స్ లో పాల్గొంటూ క్రిమినల్స్ పాలిట యముడిలా ఉండే విక్రమ్ ని తన చిన్ననాటి గతం వెంటాడుతూ ఉంటుంది. మరోవైపు అనుకోని ఓ ఘటన కారణంగా అతను తన ప్రేయసి ప్రియ(సోనాల్ చౌహాన్)కి, ఇంటర్ పోల్ కి దూరమవుతాడు. అలా రోజులు గడిచిపోతుండగా చాలా ఏళ్ళ తర్వాత తన అక్క అను(గుల్ పానాగ్) నుంచి విక్రమ్ కి ఫోన్ వస్తుంది. తన మేనకోడలు అదితి(అనిఖా సురేంద్రన్)కి ప్రాణహాని ఉందని తెలిసి ఊటీ బయలుదేరుతాడు విక్రమ్. అసలు అదితిని చంపాలనుకుంటుంది ఎవరు? వాళ్లెవరో కనిపెట్టి విక్రమ్ వాళ్ళనుంచి అదితిని రక్షించగలిగాడా? అదితిని రక్షించే క్రమంలో విక్రమ్ తెలుసుకున్న విషయాలు ఏంటి? అదితిని చంపడానికి వచ్చిన వారికి, విక్రమ్ కి సంబంధమేంటి? అండర్ వరల్డ్ విక్రమ్ ని ఘోస్ట్ అని ఎందుకు పిలుస్తుంది? అనేవి సినిమా చూసి తెలుసుకోవాలి.


ఎనాలసిస్ :

'ది ఘోస్ట్' కథ చాలా చిన్నది. ఒక మాజీ ఇంటర్ పోల్ అధికారి తన మేనకోడల్ని రక్షించుకోవడం కోసం సాగించిన పోరాటమే ఈ సినిమా కథ. అయితే యాక్షన్ థ్రిల్లర్ సినిమాలలో కథ చిన్నదైనా ఆసక్తికరమైన కథనం, ఆడియన్స్ ని థ్రిల్ కి గురిచేసే ట్విస్ట్ లు, అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలు ఉంటే చాలు విజయం వరిస్తుంది. 'ది ఘోస్ట్'లో యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకున్నప్పటికీ మిగతా అంశాలు నిరాశపరిచాయి.

'ది ఘోస్ట్' ప్రారంభమవడమే ఓ ఫైట్, ఓ సాంగ్ అన్నట్టుగా రెగ్యులర్ సినిమాలా మొదలవుతుంది. ఆ తర్వాత విక్రమ్ ఊటీకి రావడం, విక్రమ్-అదితి మధ్య సరదా సన్నివేశాలు, కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ తో ఫస్టాఫ్ బాగానే సాగుతుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ కి ముందు సినిమా వేగం పుంజుకుంటుంది. అయితే సెకండాఫ్ ఎక్కువగా యాక్షన్ సన్నివేశాలతోనే నిండిపోయింది. ఎమోషనల్ సీన్స్ కి స్కోప్ ఉన్నా దర్శకుడు ఎక్కువగా యాక్షన్ తోనే సెకండాఫ్ ని నడిపించాడు. ద్వితీయార్థంలో రక్తపాతం బాగా ఎక్కువైంది. 

ఈ సినిమాకి పెద్ద మైనస్ బలమైన విలన్ పాత్ర లేకపోవడం, ట్విస్ట్ లు లేకపోవడం అని చెప్పొచ్చు. అదితిని చంపాలనుకున్న విలన్ పాత్రని దర్శకుడు సరిగా డిజైన్ చేయలేదు. పైగా చంపాలనుకుంది ఎవరు అనే విషయాన్ని సాధారణ సన్నివేశాలతోనో, మాటల రూపంలోనో ఏమాత్రం ఆసక్తికరంగా లేకుండా రివీల్ చేశాడు. అలాగే విక్రమ్ కి అండర్ వరల్డ్ ఎందుకు భయపడుతుంది? అతన్ని 'ఘోస్ట్' అని ఎందుకు పిలుస్తారు? అని రివీల్ చేసే ఎపిసోడ్ కూడా అంత పవర్ ఫుల్ గా అనిపించలేదు. అప్పటిదాకా హైడ్ చేసి, అంత హైప్ ఇచ్చి.. చివరికి సింపుల్ గా తేల్చేసినట్టు అనిపించింది.

కథా కథనాలు పక్కన పెడితే కొన్ని సన్నివేశాలు, యాక్షన్ ఎపిసోడ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. పెద్ద పెద్ద గన్నులున్న మాఫియాని ఓ కత్తితో నరుకుతూ భయపెట్టడం అతిగా అనిపించినా.. విజువల్ గా మాత్రం చూడటానికి బాగానే ఉంది. ప్రవీణ్ సత్తారు స్టైలిష్ మేకింగ్ ఆకట్టుకునేలా ఉంది. సినిమాలో మార్క్ కె. రాబిన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ గా నిలిచింది. తన మ్యూజిక్ తో చాలా సన్నివేశాలను నిలబెట్టాడు. భరత్-సౌరభ్ స్వరపరిచిన పాటలు అంతగా ఆకట్టుకోలేదు. ముఖేష్ జి సినిమాటోగ్రఫీ బాగా ఆకట్టుకుంది. ప్రవీణ్ సత్తారు స్టైలిష్ మేకింగ్ కి ఆయన కెమెరా పనితనం రిచ్ లుక్ తీసుకొచ్చింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్రతి ఫ్రేమ్ లోనూ భారీతనం కనిపించింది.

నటీనటుల పనితీరు:
విక్రమ్(ఘోస్ట్) పాత్రలో నాగార్జున చక్కగా ఒదిగిపోయాడు. తన స్క్రీన్ ప్రజెన్స్, యాక్షన్ తో మెప్పించాడు. విక్రమ్ పాత్రకి ఆయన పూర్తి న్యాయం చేశాడు. ఈ సినిమాలో సోనాల్ చౌహాన్ కి ప్రాధాన్యమున్న పాత్రే లభించింది. మొదటి పాటలో తన అందచందాలతో మెప్పించిన సోనాల్.. అదే స్థాయిలో తనదైన యాక్షన్ తోనూ అదరగొట్టింది. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ లో ఆమె పోరాట విన్యాసాలు అలరిస్తాయి. విక్రమ్ కి అక్కగా అను పాత్రలో గుల్ పానాగ్ ఆ పాత్రకి తగ్గట్లు హుందాగా కనిపించింది. ఇక సినిమాకి కీలకమైన అదితి పాత్రలో అనిఖా సురేంద్రన్ మెప్పించింది. పొగరు, ప్రేమ, బాధ ఇలా సన్నివేశాలకు తగ్గట్లు హావభావాలు చక్కగా పలికించింది. రవి వర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, మనీష్ చౌదరి పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

టీజర్, ట్రైలర్ చూసి అంచనాలు పెట్టుకొని 'ది ఘోస్ట్' సినిమాలకి వెళ్తే నిరాశ చెందక తప్పదు. ఈ యాక్షన్ థ్రిల్లర్ అక్కడక్కడా మాత్రమే ప్రేక్షకులను అలరిస్తుంది. అయితే యాక్షన్ ప్రియులను అలరించే అంశాలు మాత్రం ఇందులో పుష్కలంగా ఉన్నాయి.

-గంగసాని