English | Telugu

తండేల్
సినిమా పేరు:తండేల్
బ్యానర్:గీతా ఆర్ట్స్
Rating:2.50
విడుదలయిన తేది:Feb 7, 2025

తారాగణం: నాగచైతన్య, సాయిపల్లవి, కరుణాకరన్, ప్రకాష్ బెలవాడి, పృథ్వీ రాజ్, మహేష్ ఆచంట, దివ్య పిళ్లై తదితరులు 
సినిమాటోగ్రఫీ: షామ్‌దత్ 
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
ఎడిటర్: నవీన్ నూలి
కథ: కార్తీక్ తీడ
దర్శకత్వం: చందూ మొండేటి
సమర్పణ: అల్లు అరవింద్
నిర్మాత: బన్నీ వాసు
బ్యానర్: గీతా ఆర్ట్స్‌
విడుదల తేదీ: ఫిబ్రవరి 7, 2025

 

'ప్రేమమ్', 'సవ్యసాచి' తర్వాత అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya), డైరెక్టర్ చందూ మొండేటి కాంబినేషన్ లో రూపొందిన సినిమా 'తండేల్' (Thandel). 'లవ్ స్టోరీ' తర్వాత చైతన్య సరసన సాయి పల్లవి (Sai Pallavi) కథానాయికగా నటించిన సినిమా ఇది. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌ పై బన్నీ వాసు నిర్మించారు. పాకిస్థాన్ జైల్లో చిక్కుకున్న శ్రీకాకుళంకి చెందిన జాలర్ల నిజ జీవితంలోని సంఘటనల ఆధారంగా 'తండేల్' రూపొందింది. పైగా 'కార్తికేయ-2' వంటి పాన్ ఇండియా సక్సెస్ తర్వాత చందు డైరెక్ట్ చేసిన సినిమా కావడంతో 'తండేల్'పై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. మరి తాజాగా థియేటర్లలో అడుగుపెట్టిన ఈ చిత్రం ఎలా ఉంది? 'థాంక్యూ', 'కస్టడీ' పరాజయాల తర్వాత చైతన్యకి కమ్ బ్యాక్ ఫిల్మ్ అవుతుందా లేదా? అనేది రివ్యూలో తెలుసుకుందాం. (Thandel Movie Review)

 

కథ:

శ్రీకాకుళంకి చెందిన రాజు (నాగ చైతన్య), సత్య(సాయి పల్లవి) ప్రేమికులు. సముద్రంలో చేపల వేటకు వెళ్లడం రాజు వృత్తి. అయితే అది ప్రమాదకరమైన పని కావడంతో రాజుని వేటకు వెళ్ళొద్దని సత్య చెబుతుంది. అయినప్పటికీ రాజు గుజరాజ్ తీరానికి వెళ్తాడు. అక్కడ తన తోటి జాలర్లతో కలిసి సముద్రంలో వేటకు వెళ్ళిన రాజును పాకిస్థాన్ పోలీసులు బంధించి జైల్లో పెడతారు. అసలు వాళ్ళు సముద్రంలో సరిహద్దు ఎందుకు దాటారు? రాజు మరియు అతని బృందాన్ని పాకిస్థాన్ జైలు నుంచి విడిపించి, భారత్ కి రప్పించడానికి సత్య ఎలాంటి పోరాటం చేసింది? ఈ క్రమంలో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? రాజు, సత్య ప్రేమకథ ఏంటి? వారి ప్రేమ కథ విజయ తీరాలను చేరిందా లేదా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.


ఎనాలసిస్ :

అనుకోకుండా సముద్రంలో సరిహద్దు దాటి, పాకిస్థాన్ జైల్లో బందీలై, కొన్ని నెలల తర్వాత భారత్ కి తిరిగి వచ్చిన శ్రీకాకుళంకి చెందిన జాలర్ల కథ గురించి తెలుగు రాష్ట్రాలలో చాలా మందికి తెలుసు. ఇలాంటి తెలిసిన కథను తీసుకున్నప్పుడు.. దానిని ఎంత అందంగా, ఎంత ఆసక్తికరంగా చెబితే ప్రేక్షకులు అంతలా కనెక్ట్ అవుతారు. కానీ ఆ విషయంలో దర్శకుడు కొంతవరకే సక్సెస్ అయ్యాడు. కార్తీక్ అందించిన కథను దర్శకుడు చందూ మొండేటి ఆసక్తికరంగా మలచలేకపోయాడు. నేరేషన్ స్లోగా ఉంది. క్లయిమాక్స్ ఏంటో ప్రేక్షకులకు తెలిసినప్పుడు.. స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేయాలి లేదా ఎమోషన్స్ తో కట్టిపడేయాలి. కానీ ఆ రెండూ జరగలేదు. ఈ కథకి రాజు-సత్య ప్రేమ కథనే ఆయువు పట్టు. వీరి ప్రేమ కథ బాగానే ఉంది కానీ, వావ్ అనుకునేలా లేదు. ఇంకా ఎఫెక్టివ్ రాసుకొని ఉంటే బాగుండేది. పాకిస్తాన్ ఎపిసోడ్ కూడా మెప్పించలేదు. ఆ సన్నివేశాలు సినిమాటిక్ గా అనిపించాయి. సెకండ్ హాఫ్ లో ప్రేమ కథను దేశభక్తి ఎపిసోడ్స్ డామినేట్ చేశాయి. కానీ అవి ఆర్టిఫిషియల్ గా ఉండటంతో సినిమాకి ప్లస్ కాలేదు. 

సాంకేతికంగా మాత్రం 'తండేల్' ఉన్నతంగా ఉంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకి ప్రధాన బలాలలో ఒకటిగా నిలిచింది. పాటలు వినసొంపుగా ఉన్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా బాగుంది. ఇక నేపథ్య సంగీతంతో చాలా సన్నివేశాలకు ప్రాణం పోశాడు దేవి. షామ్‌దత్ కెమెరా పనితనం బాగుంది. ప్రొడక్షన్ డిజైనర్ గా శ్రీ నాగేంద్ర సినిమాకి పూర్తి న్యాయం చేశాడు. నేరేషన్ స్లోగా ఉండటంతో ఎడిటర్ నవీన్ నూలి పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి. కానీ నిజంగా నిర్మాతలు చెప్పినట్లు రూ.80 కోట్ల ఖర్చు అయిందా అనే సందేహం కలగక మానదు.

 

నటీనటుల పనితీరు:
తండేల్ సినిమాకి నాగచైతన్య, సాయిపల్లవి నటన హైలైట్ గా నిలిచింది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగుంది. ఇద్దరూ పోటాపోటీగా నటించారు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో కట్టిపడేశారు. నటన పరంగా ఇది ఇద్దరి కెరీర్ లో గుర్తుంచుకునే సినిమా అవుతుంది. కరుణాకరన్, ప్రకాష్ బెలవాడి, పృథ్వీ రాజ్, మహేష్ ఆచంట తదితరులు పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

'తండేల్' ప్రయత్నం బాగుంది. కానీ ప్రయాణమే తడబడింది. తెలిసిన కథ కావడం, కథనం నెమ్మదిగా సాగడంతో ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. నాగచైతన్య, సాయిపల్లవి నటన, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం కోసం ఈ సినిమాని ఒకసారి చూడొచ్చు.