Read more!

English | Telugu

సినిమా పేరు:సూర్య వర్సెస్ సూర్య రివ్యూ
బ్యానర్:సురక్ష్ ఎంటర్‌టైనమెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటడ్
Rating:2.50
విడుదలయిన తేది:Mar 5, 2015

లైన్ మాత్ర‌మే బాగుంటే స‌రిపోదు.. దాన్ని అందంగా చ‌ప్ప‌గ‌లిగే ఆర్టు కావాలి. లేదంటే అది ఆర్టు సినిమాకి ఎక్కువ‌.. అస‌లు సినిమాకి త‌క్కువ అన్న‌ట్టు త‌యార‌వుతుంది. కేవ‌లం చిన్న పాయింట్ ప‌ట్టుకొని సినిమా అంతా లాగించేద్దామంటే కుద‌ర‌దు... అది కుక్క‌తోక ప‌ట్టుకొని గోదారి ఈదిన‌ట్టే. లైన్‌ని న‌మ్ముకొన్న సినిమాలు న‌ట్టేట మున‌గ‌డం ఖాయ‌మ‌ని చెప్ప‌డానికి మ‌రో సినిమా వ‌చ్చింది. అదే సూర్య వ‌ర్సెస్ సూర్య‌. వ‌రుస‌గా రెండు విజ‌యాల‌తో భీకర‌మైన ఫామ్‌లోకి వ‌చ్చిన‌ట్టు క‌నిపించిన నిఖిల్ ఈ సినిమాతో మ‌రో మెట్టు పైకి ఎక్కాల్సింది పోయి... చ‌ప్పున కింద‌కు దిగాడు. త‌ప్పు త‌న‌ది కాదు.. తాను న‌మ్ముకొన్న పాయింట్‌ది. అస‌లింత‌కీ సూర్య క‌థేంటంటే...

అన‌గ‌న‌న‌గా ఓ కుర్రాడు.. పేరు సూర్య‌. త‌న‌కు ఓ వెరైటీ జ‌బ్బు. సూర్యుడంటే ప‌డ‌దు. సూర్యుడ్ని చూడ‌లేడు. చూస్తే.. అదే త‌న‌కు ఆఖ‌రి క్ష‌ణం. త‌న జీవిత‌మంతా రాత్రే.  సూర్యుడు వెళ్లాక లేస్తాడు.. వ‌చ్చేముందు ప‌డుకుంటాడు. అలాంటి సూర్య ప్రేమ‌లో ప‌డ‌తాడు. ఆ అమ్మాయి ఓ టీవీ ఛాన‌ల్ లో ప‌నిచేస్తుంది. త‌న‌దీ నైట్ షిఫ్టే. అయితే.. నైట్ డ్యూటీ అంటే ఇష్టం ఉండ‌దు. ప‌గ‌లు హ్యాపీగా ప‌నిచేసుకోవాల‌ని ఉంటుంది. త‌న‌కున్న జ‌బ్బు సంగ‌తి దాచి.. ఆ ఆమ్మాయిని ప్రేమిస్తాడు. త‌నూ ప్రేమ‌లో ప‌డుతుంది. కానీ... ఓ రోజు స‌డ‌న్‌గా సూర్య‌కి జ‌బ్బు ఉంద‌ని తెలుస్తుంది. అప్పుడు త‌న రియాక్ష‌న్ ఏంటి?  ఎలా స్పందించింది?  అర్థ‌రాత్రి ఉద‌యించే సూర్యుడి ప్రేమ‌క‌థ ఏ మ‌లుపు తిరిగింది...? అనేదే ఈ సినిమా.


ఎనాలసిస్ :

స్వామి రారా, కార్తికేయ లాంటి కాన్సెప్ట్ క‌థ‌ల్ని ఎంచుకొని విజ‌యం సాధించాడు నిఖిల్‌. ఈసారీ అదే దారిలో వెళ్లాడు. లైన్ వింటే.. - అరె కొత్త‌గా ఉందే అనిపిస్తుంది. నిజంగా లైన్ చాలా కొత్త‌ది. ఆ మాట‌కొస్తే.. లైన్ మాత్ర‌మే కొత్త‌ది. హీరో డిజార్డ‌ర్‌తో పుట్టించి.. అత‌నితో డ్రామా న‌డింపించే క‌థ‌లు థ్రిల్ల‌ర్లుగా అల‌రించాయి. గ‌జిని అందుకు ఓ మంచి ఉదాహ‌ర‌ణ. డిజార్డ‌ర్ క‌థంటే థ్రిల్ల‌రే అనుకొంటారు. కానీ ద‌ర్శ‌కుడు అందులోంచి ఓ ల‌వ్‌స్టోరీ అల్లుకొన్నాడు. ఒక విధంగా అదీ కొత్త ఆలోచ‌నే. కానీ ఈ పాయింట్‌తో ప్రేమ‌క‌థ‌ని న‌డిపించే ద‌మ్ము... ద‌ర్శ‌కుడికి స‌రిపోలేదు. హీరోకి సూర్యుడంటే ప‌డ‌దు.. వాడు ప‌గ‌లు బ‌య‌ట‌కు రాడు.. హీరోకి సూర్యుడంటే ప‌డ‌దు వాడు ప‌గ‌లు బయ‌ట‌కు రాడు.. - ఇలా అస్త‌మానూ ఇదే పాయింట్ చెబితే ఎలా..?? ప్రేక్షకుల‌కు బోర్ కొట్ట‌దూ.? సినిమా ప‌ది నిమిషాలు గ‌డిచిందో లేదో.. పాయింట్ పాత‌బ‌డిపోయి. క‌థలో లాగ్ మొద‌లైపోయింది. ఫ‌స్టాఫ్ ఎడ్ల‌బండి కంటే స్లో.. సెకండాఫ్ ఎడ్ల‌బండి ప్ర‌యాణాన్ని స్లో మోష‌న్‌లో చూపించిన‌ట్టే. ఫ‌స్టాఫ్ చూసి `ఇది ప‌ర‌మ‌ క్లాస్ సినిమాలా ఉంది..` అని సంతృప్తిప‌డ్డ‌వాడు కూడా సెకండాఫ్ చూసి `వోర్నాయ‌నో..` అంటూ ప‌రుగులు పెట్ట‌డం ఖాయం.

ఈ లైన్‌ని థ్రిల్ల‌ర్ అంశాలు మేళ‌వించి చూపితే బాగుండేది. లేదా.. పూర్తి స్థాయి ప్రేమ‌క‌థ‌గా మార్చినా బాగుండేది. రెంటికీ చెడ్డ రేవ‌డిలా త‌యారు చేశాడు ద‌ర్శ‌కుడు. సూర్య సూర్యుడి కిర‌ణాల నుంచి తృటి తప్పించుకొని బ‌య‌ట‌ప‌డిన‌ట్టు ఒక్క సీన్‌లో.. ఒక్క‌టంటే ఒక్క సీన్‌లో చూపించినా బాగుండేది. అస‌లు పాయింట్‌ని గాలికొదిలేసి ఏవేవో గార‌డీలు చేశాడు ద‌ర్శ‌కుడు.  ఈసినిమాలో ఒక డైలాగ్ఉంది. ''ఫ‌స్టాఫ్ మీఠా పాన్‌లెక్క తీయ‌గా ఉంది..  సెకండాఫ్ సాదా పాన్‌లా చ‌ప్పగా ఉంది..'' అని ఓ పాత్ర చేత చెప్పించారు. సేమ్ టూ సేమ్ అదే జ‌రిగింది. కాక‌పోతే ఫ‌స్టాఫ్ కూడా సాదా పానే. ల‌వ్ స్టోరీ ఉంది గానీ అందులో ల‌వ్ లేదు. హీరోహీరోయిన్‌ల‌మ‌ధ్య కెమిస్ట్రీ కుద‌ర్లేదు. తాను ప్రేమించిన అబ్బాయిని ఓ అరుదైన వ్యాధి ఉంద‌ని హీరోయిన్‌ని తెలిసే సీన్ ఎంత హార్ట్ ట‌చింగ్‌గా ఉండాలి??  ఆ సీన్‌ని చాలా సాదాసీదాగా తీశాడు ద‌ర్శ‌కుడు. అక్క‌డే ఈ సినిమా పూర్తిగా త‌న్నేసింది.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

నిఖిల్ య‌ధావిధిగా బాగానే చేశాడు. త‌న న‌ట‌న‌లో వంక పెట్టేందుకు ఏం లేదు. అలాగ‌ని నెత్తిమీద పెట్టుకోవాల్సిన విష‌యాలూ లేవు. ఈ పాత్ర కోసం నేను బ‌క్క‌చిక్కా.. అన్నాడు నిఖిల్. ఆ అవ‌స‌రం ఏమొచ్చిందో..??  త్రిధ అక్క‌డ‌క్క‌డ అందంగా క‌నిపించింది. ఆమె ఫేస్‌లో డిఫాక్ట్స్ ఎక్కువే ఉన్నాయి.  భ‌ర‌ణి పాత్ర‌, ఆయ‌న చేత ప‌లికించిన సంభాష‌ణ‌లూ అంత‌గా ఆక‌ట్టుకోవు. స‌త్య కాస్త న‌వ్వించాడు. మ‌ధుబాల త‌మిళ న‌టిలా ఓవ‌రాక్ష‌న్ చేసింది. ఆమె హావ‌భావాలు అస్స‌లు కుద‌ర్లేదు. షాయాజీ షిండే, తాగుబోతు ర‌మేష్ ఈ సినిమాలో ఉన్నారు. కానీ.. రిజిస్ట‌ర్ అయ్యేంత పాత్ర‌లు కావు.

ఓ మంచి పాయింట్ త‌ట్ట‌డం గ‌గ‌నం అయిపోతోంది. అలాంట‌ప్పుడు పుట్టిన మంచి పాయింట్స్‌ని పాడు చేయ‌కూడ‌దు. ద‌ర్శ‌కుడి అనుభ‌వ‌రాహిత్యం వ‌ల్ల‌... ఓ మంచి పాయింట్  మంచి సినిమాగా మార‌లేక‌పోయింది. బోర్ కొట్టించే క‌థనంతో ద‌ర్శ‌కుడు ప్రేక్ష‌కుల స‌హ‌నానికి ప‌రీక్ష పెట్టాడు. సంగీతం, ఛాయాగ్ర‌హ‌ణం, క్వాలిటీ బాగున్నా స‌న్నివేశాల్లో ఫీల్ లేక‌పోవ‌డంతో సాంకేతిక నిపుణుల ప్ర‌తిభంగా బూడిద‌లో పోసిన ప‌న్నీరే అయ్యింది.


పంచ్ లైన్ :  సూర్య వ‌ర్సెస్ సూర్య - ఓ గ్ర‌హ‌ణం ప‌ట్టిన సూర్యుడు