English | Telugu
బ్యానర్:70ఎంఎం ఎంటర్టైన్మెంట్స్
Rating:2.75
విడుదలయిన తేది:Aug 27, 2021
సినిమా పేరు: శ్రీదేవి సోడా సెంటర్
తారాగణం: సుధీర్‌బాబు, ఆనంది, నరేశ్, పావెల్ నవగీతన్, రఘుబాబు, సత్యం రాజేశ్, అజయ్, హర్షవర్ధన్, రోహిణి, కల్యాణి రాజు, సప్తగిరి
కథ: నాగేంద్ర కాషా
పాటలు: సీతారామశాస్త్రి, కల్యాణ చక్రవర్తి, కాసర్ల శ్యామ్
సంగీతం: మణిశర్మ
సినిమాటోగ్రఫీ: షామ్‌దత్ సైనుద్దీన్
ఎడిటింగ్: ఎ. శ్రీకరప్రసాద్
ప్రొడక్షన్ డిజైనర్స్: రామకృష్ణ - మౌనిక
ఫైట్స్: డ్రాగన్ ప్రకాశ్, కె.ఎన్.ఆర్., రియల్ సతీశ్
నిర్మాతలు: విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి
రచన-దర్శకత్వం: కరుణకుమార్
బ్యానర్: 70ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్
విడుదల తేదీ: 27 ఆగస్ట్ 2021
కొన్ని రోజులుగా 'శ్రీదేవి సోడా సెంటర్' సినీ ప్రియుల్లో ఆసక్తిని రేకెత్తిస్తూ వచ్చింది. సుధీర్‌బాబు, ఆనంది హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ట్రైలర్ రిలీజయ్యాక దీనిపై ఇండస్ట్రీ వర్గాల్లోనే కాకుండా, ఆడియెన్స్‌లోనూ హైప్ క్రియేట్ అయ్యింది. 'పలాస 1978' లాంటి రగ్డ్ మూవీ తీసి, ఇండస్ట్రీలో అందరి దృష్టినీ ఆకర్షించి, అనేకమంది ప్రముఖుల ప్రశంసలు పొందిన కరుణకుమార్ రూపొందించిన రెండో సినిమా కావడంతో, 'శ్రీదేవి సోడా సెంటర్' ఎలా ఉంటుందో చూడాలనే క్యూరియాసిటీ వ్యక్తమైంది.
కథ
అమలాపురంలోని ఓ పల్లెలో లైటింగ్ సూరిబాబు (సుధీర్‌బాబు) అనే ఎలక్ట్రీషియన్ వీరభద్రేశ్వరస్వామి తీర్థం (జాతర)లో సోడాకొట్టు శ్రీదేవి (ఆనంది)ని చూసి ప్రేమలో పడతాడు. ఆమె కూడా మనసిస్తుంది. అయితే సూరిబాబుది తక్కువ కులమని శ్రీదేవి తండ్రి (నరేశ్) వారి ప్రేమను అంగీకరించడు. ఆ తీర్థంలోనే కాశి (పావెల్ నవగీతన్) మనుషులతో సూరిబాబుకు గొడవై, హత్యాయత్నం నేరంమీద జైలు పాలవుతాడు. మధ్యలో జైలు నుంచి తప్పించుకొని శ్రీదేవిని తీసుకొని కాకినాడకు వెళ్తాడు. కానీ పోలీసులకు చిక్కుతాడు. చివరకు జైలు నుంచి నిరపరాధిగా బయటకు వచ్చే రోజు అనుకోని పరిణామాలతో హత్యాయత్నం కేసు కాస్తా హత్య కేసుగా పరిణమించి మళ్లీ జైలుకెళతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? కులం, పరువు మధ్య సూరిబాబు, శ్రీదేవి ప్రేమకథ ఏ తీరానికి చేరింది? అనేది క్లైమాక్స్.
ఎనాలసిస్ :
కులాంతర వివాహాలు, పరువు హత్యలు సినిమాల్లో మనకు కొత్త కాదు. 'శ్రీదేవి సోడా సెంటర్'లో ప్రధాన కథ వీటిమీదే ఆధారపడినప్పటికీ, దర్శకుడు కరుణకుమార్ సన్నివేశాలను కల్పించిన విధానం ఆకట్టుకుంటుంది. ప్రధానంగా సూరిబాబు, శ్రీదేవి క్యారెక్టరైజేషన్స్ మీద కథను నడపడం వల్ల చాలావరకు ఎమోషన్ క్యారీ అయింది. సూరిబాబు పాత్ర కంటే శ్రీదేవి పాత్ర మరింత బలంగా ఉండటం వల్ల ఆ పాత్రలతో మనం సహానుభూతి చెందుతాం. గోదావరి జిల్లాల్లో పచ్చని పంటపొలాలు, కుటుంబాల మధ్య చిక్కని అనుబంధాలే కాదు, కులం కోసం, పరువు కోసం మనుషులు ఎంతటి దారుణానికైనా ఒడిగడతారని ఈ సినిమాలో దర్శకుడు చూపించాడు.
ఒక సీరియస్ లవ్ స్టోరీ తీస్తున్నప్పుడు సన్నివేశాలను కూడా సహజంగా అనిపించేట్లు తీయగలగాలి. యాక్షన్ ఎపిసోడ్లు కూడా అదే తరహాలో ఉండాలి. తన తొలి చిత్రం 'పలాస 1978'లో ఆ నిజాయితీని చూపించాడు కరుణకుమార్. 'శ్రీదేవి సోడా సెంటర్' విషయానికొస్తే, యాక్షన్ సీన్లు రెగ్యులర్ కమర్షియల్ సినిమాల ధోరణిలో చాలాసేపు సాగడం కరెక్టనిపించదు. జైలులో అజయ్‌కూ, సూరిబాబుకూ మధ్య సన్నివేశాలు, అతని గ్యాంగ్‌తో ఫైట్ ప్రధానకథకు ఎలాంటి సంబంధం లేనివి. శ్రీదేవిని సూరిబాబును ఎంత గాఢంగా, నిజాయితీగా ప్రేమిస్తున్నాడో చెప్పడానికి ఆ సన్నివేశాలు కల్పించినట్లు సర్దిచెప్పుకున్నా, ఆ సీన్లు లేకపోయినా సూరిబాబు లవ్ ఎమోషన్‌కు వచ్చే నష్టం ఏదీలేదు.
ఆరంభంలో హీరో మీద చిత్రీకరించిన బోట్ రేస్ సీన్లు చిత్రీకరణపరంగా చాలా బాగున్నాయి. వీరభద్రేశ్వరస్వామి తీర్థంలో సూరిబాబు, శ్రీదేవి ఒకరికొకరు పరిచయమయ్యే సన్నివేశాలు, ఆ తర్వాత కొనసాగింపుగా వచ్చే సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. ఫస్టాఫ్‌లో సూరిబాబు తండ్రికి కథలో తగినంత ప్రాధాన్యం కనిపించింది. కానీ సెకండాఫ్‌లో కోర్టు సీన్లలో తప్పితే కీలకమైన సందర్భాల్లో ఆ క్యారెక్టర్‌ను ఇగ్నోర్ చేశాననే విషయం డైరెక్టర్ గుర్తించలేదనిపిస్తుంది.
సూరిబాబును ప్రేమించిన శ్రీదేవి ఆ ప్రేమను కడదాకా నిలుపుకున్న వైనం బాగుంది. తండ్రిని సైతం ఎదిరించి తను సూరిబాబుకే సొంతం అని చెప్పే తీరు, ఆమె ధైర్యం చూసి మనం కూడా ఆమె ప్రేమలో పడకుండా ఉండలేం. చాలా చోట్ల కరుణకుమార్ రాసిన డైలాగ్స్ వహ్వా అనిపిస్తాయి. ట్రైలర్‌లో చూపించిన "మంచోడే.. కానీ మనోడు కాదుగా" అనే డైలాగ్‌తో పాటు అనేక డైలాగులు మెప్పించాయి. "పెద్దమనిషి అంటే ముద్ద పెట్టేవాడు అయ్యుండాలి, ముద్ద లాక్కునేవాడు కాదు" అని హీరో తండ్రి పాత్రధారి రఘుబాబు చెప్పిన డైలాగ్ విజిల్స్ వేయిస్తుంది.
కులం, పరువు గురించి క్లైమాక్స్‌లో నరేశ్‌తో సుధీర్‌బాబు చెప్పిన మాటలు సూపర్బ్ అని చెప్పాలి. ఎవరిది తక్కువ కులమో అతను చెప్పిన వైనం బాగుంది. సినిమా అంతా నిర్మాణ విలువలు ఎంత క్వాలిటీగా ఉన్నాయో కనిపిస్తుంటుంది. మిగతా సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ టైమ్‌లో కమర్షియాలిటీకి లొంగిపోయిన దర్శకుడు క్లైమాక్స్‌ను హానెస్ట్‌గా తీసి, భేష్ అనిపించుకున్నాడు. ఆఖరి సీన్లలో దర్శకుడిలోని భావుకత, పరువు కోసం కుటుంబాలు చేసే అరాచకాలపై ఆగ్రహం కనిపిస్తాయి. క్లైమాక్స్ ఆడియెన్స్‌కు షాకింగ్‌గా అనిపిస్తుంది.
సినిమాకు మణిశర్మ సంగీతం పెద్ద ప్లస్. పాటలతో పాటు, సన్నివేశాలకు ఇచ్చిన సంగీతంతో తనకు తనే సాటి అని ఆయన మరోసారి నిరూపించుకున్నారు. సినిమా రిచ్‌గా కనిపించిందంటే అందులో ప్రధాన పాత్ర వహించింది షామ్‌దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ. నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఎడిటర్ శ్రీకరప్రసాద్ తన కత్తెరకు మరికొంచెం పదును పెట్టి ఉండాల్సింది.
నటీనటుల అభినయం
లైటింగ్ సూరిబాబుగా సరికొత్తగా మనముందు ఆవిష్కృతమయ్యాడు సుదీర్‌బాబు. ఇప్పటిదాకా ఆయన చేసిన పాత్రలన్నీ ఒకవైపు ఉంటే, సూరిబాబు పాత్ర ఇంకోవైపు ఉంటుందనేది నిజం. నటునిగా తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి వచ్చిన అవకాశాన్ని ఆయన సద్వినియోగం చేసుకున్నాడు. ఎమోషనల్ సీన్స్‌ను బాగా పండించాడు. యాక్షన్ సీన్స్‌లో అదరగొట్టేశాడు. కానీ ఒక పల్లెటూరిలోని ఎలక్ట్రీషియన్‌కు ఎయిట్‌ప్యాక్ బాడీ ఉండటమే అసహజంగా అనిపించే విషయం. తన లుక్ విషయంలో ఆయన జాగ్రత్త వహించి ఉండాల్సింది. సోడాల శ్రీదేవి క్యారెక్టర్‌లో ఆనంది సునాయాసంగా ఇమిడిపోయింది. సూరిబాబు, కాశి ఏమిటి.. ఎవరైనా ఆమె ప్రేమలో పడాల్సిందే. ఆమె హావభావ ప్రదర్శన ఔట్‌స్టాండింగ్.
శ్రీదేవి తండ్రి పాత్రలో సీనియర్ నరేశ్ సూపర్బ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఎలాంటి పాత్రలోనైనా తాను ఇమిడిపోతానని ఆయన ప్రూవ్ చేసుకున్నారు. కాశి క్యారెక్టర్‌లో పావెల్ నవనీతన్ రాణించాడు. రఘుబాబు, సత్యం రాజేశ్, అజయ్, కల్యాణి రాజు, హర్షవర్ధన్, రోహిణి తమకు ఇచ్చిన పాత్రల పరిధి మేరకు నటించారు.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
కులాంతర ప్రేమ నేపథ్యంలో భావోద్వేగపూరితంగా రూపొందిన 'శ్రీదేవి సోడా సెంటర్' మధ్య మధ్యలో రెగ్యులర్ కమర్షియల్ ధోరణిలో సాగినట్లు అనిపించినా, ఓపెనింగ్, ఇంటర్వెల్, క్లైమాక్స్ సన్నివేశాలతో ఒక హానెస్ట్ లవ్ స్టోరీని చూసిన ఫీల్‌ను ఇస్తుంది. మొత్తంగా చూడదగ్గ చిత్రం.
- బుద్ధి యజ్ఞమూర్తి