English | Telugu
బ్యానర్:లక్ష్మీప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ
Rating:2.25
విడుదలయిన తేది:Feb 18, 2022
సినిమా పేరు: సన్ ఆఫ్ ఇండియా
తారాగణం: మోహన్‌బాబు, ప్రగ్యా జైస్వాల్, పోసాని కృష్ణమురళి, శ్రీకాంత్, మీనా, నరేశ్, రాజా రవీంద్ర, పృథ్వీ, మంగ్లీ, వెన్నెల కిశోర్, అలీ, సునీల్, బండ్ల గణేశ్, తనికెళ్ల భరణి, రాజీవ్ కనకాల, రవిప్రకాశ్, సుప్రీత్, టి.ఎన్.ఆర్.
కథ: డైమండ్ రత్నబాబు
మాటలు: తోటపల్లి సాయినాథ్, డైమండ్ రత్నబాబు
మ్యూజిక్: ఇళయరాజా
సినిమాటోగ్రఫీ: సర్వేష్ మురారి
ఎడిటింగ్: గౌతంరాజు
ఆర్ట్: చిన్నా
బ్యానర్స్: లక్ష్మీప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ
నిర్మాత: మంచు విష్ణు
దర్శకత్వం: డైమండ్ రత్నబాబు
విడుదల తేదీ: 18 ఫిబ్రవరి 2022
మోహన్‌బాబు 'సన్ ఆఫ్ ఇండియా' అనే సినిమా చేస్తున్నారనీ, దానికి డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నారనీ ప్రకటన వచ్చినప్పుడు ఆయన అభిమానులతో పాటు సినీ ప్రియులు కూడా ఒకింత ఆశ్చర్యపోయారు. ఎందుకంటే రత్నబాబు దర్శకుడిగా పరిచయమైన తొలిచిత్రం 'బుర్రకథ' ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో ఫెయిలైంది. అయినప్పటికీ ఆయనకు మోహన్‌బాబు డైరెక్షన్ చాన్స్ ఇవ్వడంతో, 'సన్ ఆఫ్ ఇండియా' కథ ఆయనను బాగా ఇంప్రెస్ చేసి వుంటుందనే అభిప్రాయం కలిగింది. ఇప్పుడు మన ముందుకు వచ్చిన ఆ సినిమా ఎలా ఉందంటే...
కథ:- కేంద్రమంత్రి మహేంద్ర భూపతి (శ్రీకాంత్) కిడ్నాప్‌కు గురవడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం రేగుతుంది. దానిపై మీడియా రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తుంది. ఆ కేసును నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఆఫీసర్ ఐరావతి (ప్రగ్యా జైస్వాల్) టేకప్ చేస్తుంది. కిడ్నాపర్ ఎవరనేది అంతుచిక్కదు. ఆ తర్వాత డాక్టర్ ప్రతిభా లాస్య, దేవాదాయ చైర్మన్ (రాజా రవీంద్ర) కూడా కిడ్నాప్‌కు గురవడం కల్లోలాన్ని సృష్టిస్తుంది. అప్పుడు తానే ఆ కిడ్నాప్‌లు చేశానంటూ విరూపాక్ష (మోహన్‌బాబు) అనే మధ్యవయసు వ్యక్తి ఆన్‌లైన్ ద్వారా టీవీ చానళ్లకు తెలియజేస్తాడు. ఆయన ఎందుకు వారిని కిడ్నాప్ చేశాడు, ఆయన ఆశయం ఏమిటి, ఆసలు ఆయన కథేమిటి? అనేది మిగతా కథ.
ఎనాలసిస్ :
దేశంలోని జైళ్లలో 40 వేల మందికి పైగా నిరపరాధులు చేయని నేరానికి శిక్షలు అనుభవిస్తున్నారనీ, వాళ్లను కాపాడి బయటకు తీసుకురావాలనే సందేశంతో సన్ ఆఫ్ ఇండియాను మన ముందు ప్రెజెంట్ చేశాడు దర్శకుడు డైమండ్ రత్నబాబు. నిజానికి ఇది సమాజమంతా పట్టించుకోవాల్సిన పెద్ద సమస్య. అలా జైళ్లలో మగ్గిపోతున్న నిరపరాధుల కుటుంబాల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే గుండె బరువెక్కుతుంది. వాళ్ల కోసం, వాళ్లను బయటకు తీసుకురావడం కోసం కంకణం కట్టుకున్న విరూపాక్ష కథే 'సన్ ఆఫ్ ఇండియా'. నిజానికి ఈ సినిమాని ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై నేరుగా రిలీజ్ చేసే ఉద్దేశంతో గంటన్నర లోపు నిడివితో తీశారు. తీశాక చూసుకుంటే థియేటర్లలో రిలీజ్ చేయడమే కరెక్టని మోహన్‌బాబుకు అనిపించింది. అందుకే ఇప్పుడు థియేటర్లలోకి వచ్చింది.
ఒక ప్రయోజనాత్మక పాయింట్‌తో తెరకెక్కిన ఈ కథకు స్క్రీన్‌ప్లే స్వయంగా మోహన్‌బాబు సమకూర్చారు. ఏ సినిమాకైనా కీలకం స్క్రీన్‌ప్లే, సన్నివేశాల చిత్రీకరణ. ఈ సినిమాకి సంబంధించిన ఓ ప్రయోగం చేశారు. సినిమాలో విరూపాక్ష పాత్ర, టీవీ యాంకర్లుగా నటించిన అలీ, సునీల్, వెన్నెల కిశోర్, బండ్ల గణేశ్ పాత్రలు మాత్రమే మనకు కనిపిస్తుంటారు. మిగతా పాత్రధారులంతా వాళ్ల పాత్రల ముగింపులో మాత్రమే తమ ముఖాల్ని మనకు చూపిస్తారు. మిగతా సన్నివేశాల్లో వాళ్లు కనిపిస్తుంటారు కానీ ముఖాలు మాత్రం షాడోలో ఉంటాయి. వాయిస్‌లు మాత్రమే వినిపిస్తుంటాయి. ఈ ప్రయోగం సంగతి టైటిల్ కార్డ్స్‌లోనే తెలియజేశారు. అయినప్పటికీ ఈ ప్రయోగం ప్రయోజనమేంటో అర్థం కాదు. ఎవరో అనామకుల్ని ఆ సీన్లలో నటింపజేసి, క్లైమాక్స్‌లో మాత్రం అసలు యాక్టర్లను తీసుకొచ్చి నటింపజేశారని స్పష్టంగా తెలిసిపోతుంది. ఉదాహరణకు నరేశ్ వాయిస్‌తో బ్లర్ చేసిన ఫేస్‌తో కనిపించే జైలర్ ఆయన కాదని మనకు ఈజీగా తెలిసిపోతుంది. చివరలో మాత్రం నరేశ్‌ను తీసుకొచ్చి నటింపజేశారు. అంటే నిజానికి నరేశ్ చేసింది ఒకే సీన్ అన్నమాట. పదే పదే ఇలా బ్లర్ చేసిన ముఖాలతో పాత్రలు కనిపిస్తుంటే ప్రేక్షకుడు కథలో ఎలా ఇన్‌వాల్వ్ అవుతాడు? ఆ పాత్రలతో ఎలా కనెక్ట్ అవుతాడు? ఈ విషయాన్ని దర్శక నిర్మాతలతో పాటు మోహన్‌బాబు కూడా విస్మరించారని అనుకోవాలి.
మోహన్‌బాబు పాత్రను చిరంజీవి వాయిస్ ఓవర్‌తో పరిచయం చేయడం, రఘువీర గద్యంతో మోహన్‌బాబు ఎంట్రీ ఇవ్వడం బాగుంది. ప్రజాపతి (పోసాని కృష్ణమురళి) అనే ఎమ్మెల్యే వల్ల భార్యనీ, కూతుర్నీ విరూపాక్ష కోల్పోయే సీన్లు ప్రేక్షకుల సానుభూతిని నోచుకుంటాయి. మొదట తన కుటుంబాన్ని కోల్పోయిన విరూపాక్ష అందుకు ప్రతీకారం తీర్చుకోవడం సొంత వ్యవహారం. కానీ అతను అంతటితో ఊరుకోలేదు. జైల్లో ఉండగా తెలుసుకున్న విషయంతో చేయని నేరానికి శిక్షలు అనుభవిస్తున్న నిరపరాధుల్ని విడుదల చేయడానికి కంకణం కట్టుకోవడం వల్లే అతను 'సన్ ఆఫ్ ఇండియా' అయ్యాడని మనకు అర్థమవుతుంది. ఒకటిన్నర గంట నిడివి ఉన్న సినిమా కావడంతో సినిమా బోర్ అనిపించదు. అలా అని కథతో మనం పూర్తిగా మమేకం కూడా కాలేం. దానికి కారణం పాత్రధారుల ముఖాల్ని మనకు చూపించకపోవడమే.
టెక్నికల్‌గా గొప్పగా ఏమీ లేదు ఈ సినిమా. మేస్ట్రో ఇళయరాజా సంగీతం ఓకే. సర్వేష్ మురారి లాంటి టాలెంటెడ్ సినిమాటోగ్రాఫర్ కూడా సాధారణ పనితనం చూపించాడు. సీనియోర్ మోస్ట్ ఎడిటర్ గౌతంరాజు మాత్రం సమర్థవంతంగా తన పని నిర్వర్తించారు.
నటీనటుల పనితీరు:- విరూపాక్షగా మోహన్‌బాబు నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏముంది! ఈ సినిమాకు ఆయన చెప్పే డైలాగులే ప్రాణం. ఓవర్‌డోస్ అనిపించకుండా సీన్‌లోని మూడ్‌కు తగ్గట్లు తనదైన శైలిలో డైలాగ్స్ చెప్పి ఫ్యాన్స్‌ను అలరించారు మోహన్‌బాబు. వివిధ సన్నివేశాల్లో ఆయన హావభావాలు సూపర్బ్ అనిపిస్తాయి. క్లోజప్ షాట్స్ ఆయన నట విన్యాసాలకు దర్పణం పట్టాయి. ఆయన తర్వాత స్క్రీన్ స్పేస్ ఎక్కువ లభించింది ఎమ్మెల్యే ప్రజాపతిగా నటించిన పోసాని కృష్ణమురళికే. ఆ కాస్తకే ఆయన దున్నేశాడు. టీవీ న్యూస్ యాంకర్లుగా వెన్నెల కిశోర్, అలీ, సునీల్, బండ్ల గణేశ్ తమకు ఇచ్చిన డైలాగ్స్‌ను డైరెక్టర్ చెప్పినట్లు నలుగురూ నాలుగు రకాలుగా చెప్పారు.
ఎన్ఐఏ ఆఫీసర్ ఐరావతిగా ప్రగ్యా జైస్వాల్, ఆమె టీమ్ మెంబర్స్‌గా పృథ్వీ, మంగ్లీ సినిమా ఆరంభం నుంచి చివరిదాకా ఉన్నా, వాళ్ల ముఖాలు కనిపించేది చివరలోనే. క్లైమాక్స్‌లో మోహన్‌బాబు మాటలకు ప్రగ్యా ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ ఓవర్‌గా అనిపించాయి. విరూపాక్ష కథను బుర్రకథ రూపంలో చెప్పే వ్యక్తిగా రాజీవ్ కనకాల కనిపించారు. శ్రీకాంత్, మీనా లాంటి వాళ్లకు అవకాశం లభించలేదు. కేంద్రమంత్రిగా శ్రీకాంత్, మోహన్‌బాబు భార్యగా మీనా, దేవాదాయ శాఖ చైర్మన్‌గా రాజా రవీంద్ర, జైలర్‌గా నరేశ్, మంచి పొలిటీషియన్‌గా తనికెళ్ల భరణి, నిరపరాధులై ఉండీ జైలుశిక్ష అనుభవిస్తున్న వారిగా రవిప్రకాశ్, టి.ఎన్.ఆర్. ఒకటి లేదా రెండు సీన్లలో గెస్టులుగా నటించారు.
ప్లస్ పాయింట్స్
మోహన్‌బాబు నటన
డైలాగ్స్
గంటన్నర నిడివి
మైనస్ పాయింట్స్
యాక్టర్లు కనిపించకుండా డైలాగ్స్ వినిపించడం
బలమైన సన్నివేశాలు లోపించడం
స్క్రీన్‌ప్లేలో పస లేకపోవడం
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
మోహన్‌బాబు అభిమానులైతే ఆయన నటన, డైలాగ్స్ కోసం 'సన్ ఆఫ్ ఇండియా'ను ఓసారి చూడొచ్చు. గంటన్నర నిడివి మాత్రమే ఉండటం మాత్రం ప్లస్ పాయింట్. అందువల్ల బోర్ కొట్టదు. అలా అని బాగుందిరా అని కూడా అనుకోలేం. బలమైన పాయింట్‌తో, బలహీన సన్నివేశాలతో వచ్చిన ఈ సినిమా మోహన్‌బాబు చెప్పినట్లు ఒక ప్రయోగం!
- బుద్ధి యజ్ఞమూర్తి