English | Telugu

సినిమా పేరు:శివం భజే
బ్యానర్:గంగా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్
Rating:2.50
విడుదలయిన తేది:Aug 1, 2024

సినిమా పేరు: శివం భజే
తారాగణం: అశ్విన్ బాబు, దిగంగనా సూర్యవంశీ, హైపర్ ఆది, బ్రహ్మాజీ, అర్బాజ్ ఖాన్, మురళీ శర్మ, తులసి, దేవి ప్రసాద్, షకలక శంకర్ తదితరులు
సంగీతం: వికాస్ బడిస
సినిమాటోగ్రఫీ: దాశరథి శివేంద్ర
ఎడిటర్: చోటా కె. ప్రసాద్
రచన, దర్శకత్వం: అప్సర్‌
నిర్మాత: మహేశ్వర్ రెడ్డి మూలి
బ్యానర్: గంగా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్
విడుదల తేదీ: ఆగష్టు 1, 2024

గతేడాది 'హిడింబ'తో అలరించిన అశ్విన్ బాబు.. ఇప్పుడు 'శివం భజే' అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. డివోషనల్ టచ్ తో రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ప్రచారం చిత్రాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? అశ్విన్ బాబుకి మంచి విజయాన్ని అందించేలా ఉందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం. (Shivam Bhaje Movie Review)

కథ:
చందు(అశ్విన్ బాబు) లోన్ రికవరీ ఏజెంట్ గా పని చేస్తుంటాడు. చిన్న వయసులోనే తండ్రి దూరమయ్యాడన్న కోపంతో దేవుడిని నమ్మడం మానేస్తాడు. తల్లి, చెల్లితో కలిసి నివసిస్తుంటాడు. అతనిది చాలా సాధారణ జీవితం. ఫార్మా కంపెనీలో పనిచేసే శైలజ(దిగంగనా సూర్యవంశీ)తో తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. ఆమె కూడా చందు ప్రేమని అంగీకరిస్తుంది. ఇలా సాఫీగా సాగిపోతున్న చందు జీవితం ఒక్క సంఘటనతో ఊహించని మలుపు తిరుగుతుంది. ఒక గొడవలో జరిగిన ప్రమాదంలో చందు కళ్ళు పోతాయి. దీంతో అతనికి వైద్యులు వేరొకరి కళ్ళని అమరుస్తారు. చందుకి చూపు అయితే వస్తుంది కానీ.. అప్పటినుంచి అతని ప్రవర్తనలో మార్పు వస్తుంది. వింత వింత కలలు వస్తుంటాయి. తెలియని మనుషులు, తెలియని సంఘటనలు పదే పదే కళ్ళముందు కదలాడుతుంటాయి. అసలు ఆ కళ్ళు ఎవరివి? ఆ కళ్ళు పెట్టాక చందు జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? చైనా-పాకిస్థాన్ కలిసి ఇండియాపై చేసిన కుట్ర ఏంటి? ఆ కుట్రను ఒక సాధారణ లోన్ రికవరీ ఏజెంట్ అయిన చందు ఎలా భగ్నం చేశాడు? అసలు ఈ కథకి శివుడికి సంబంధమేంటి? ఈ కథలో డోగ్రా అనే పోలీస్ డాగ్ పాత్ర ఏంటి? వంటి విషయాలు సినిమా చూసి తెలుసుకోవాలి.


ఎనాలసిస్ :

హీరో ఎవరు అనే దానితో సంబంధం లేకుండా కంటెంట్ బాగుంటే డివోషనల్ టచ్ ఉన్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తున్నాయి. 'శివం భజే'లో డివోషనల్ టచ్ ఉండటం, ప్రచార చిత్రాలు ఆకట్టుకోవడంతో.. ఈ సినిమా కూడా అలాంటి మ్యాజిక్ చేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అందుకు తగ్గట్టే దర్శకుడు అప్సర్‌ కొత్త పాయింట్ ని ఎంచుకున్నాడు. చైనా-పాకిస్థాన్ కలిసి ఇండియాపై కుట్ర చేయడం.. సాక్షాత్తు శివుడే ఒక మనిషి ద్వారా ఆ కుట్రని భగ్నం చేయడం అనే ఆలోచన బాగుంది. అలాగే ఇందులో అతికొద్దిమందికి మాత్రమే తెలిసిన జీనో ట్రాన్స్ప్లాంటేషన్ అనే పాయింట్ ని టచ్ చేయడం బాగుంది. అయితే దర్శకుడి ఆలోచనలు  గొప్పగా ఉన్నాయి కానీ.. ఆ ఆలోచనలను అంతే గొప్పగా స్క్రీన్ మీదకు తీసుకురావడంతో మాత్రం పూర్తిస్థాయిలో సక్సెస్ కాలేకపోయాడు. 

చైనా-పాకిస్థాన్ కుట్ర, హీరో పరిచయం, ఒక కెమికల్ ఇంజనీర్ హత్య వంటి సన్నివేశాలతో సినిమా ప్రారంభమైంది. అక్కడి నుంచి అసలు కథలోకి వెళ్ళడానికి దర్శకుడు కాస్త టైం తీసుకున్నాడు. హీరో-హీరోయిన్ మధ్య ప్రేమ సన్నివేశాలు తేలిపోయాయి. ఆ సన్నివేశాలను మరింత అందంగా రాసుకొని ఉండాల్సింది. కామెడీ సీన్స్ ని కూడా ఇంకా బాగా రాసుకోవచ్చు. ఇక అనుకోకుండా జరిగిన ప్రమాదంలో హీరో కళ్ళు పోవడం, వేరొకరి కళ్ళు అమర్చడం.. అక్కడి నుంచి సినిమా ఆసక్తికరంగా మారుతుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ సర్ప్రైజ్ ఇస్తుంది. అసలేం జరిగింది? నెక్స్ట్ జరగబోతుంది? అనే ఉత్కంఠను కలిగిస్తూ ఇంటర్వెల్ బ్లాక్ ను డిజైన్ చేశారు. సెకండాఫ్ లో కూడా కొంతవరకు ఆ టెంపో కొనసాగింది. ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండాఫ్ మెరుగ్గా ఉంది. ప్రీ క్లైమాక్స్ మాత్రం తేలిపోయింది. విలన్ ని రివీల్ చేసే సన్నివేశాలు మరింత ఎఫెక్టివ్ గా రాసుకొని ఉండాల్సింది. అలాగే కొన్ని హత్యలు జరగడం, వాటి చుట్టూ జరిగే ఇన్వెస్టిగేషన్ ని మరింత గ్రిప్పింగ్ గా థ్రిల్ ఇచ్చేలా మలచాల్సింది. క్లైమాక్స్ డిజైన్ చేసిన తీరు మాత్రం మెప్పించింది.

నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు:
చందు పాత్రలో అశ్విన్ బాబు చక్కగా ఒదిగిపోయాడు. యాక్షన్ సన్నివేశాల్లో అదరగొట్టాడు. ముఖ్యంగా క్లైమాక్స్ లో రౌద్రరూపం చూపించాడు. ఉన్నంతలో దిగంగనా సూర్యవంశీ తన మార్క్ చూపించింది. హీరో స్నేహితుడి పాత్రలో హైపర్ ఆది, డాక్టర్ పాత్రలో బ్రహ్మాజీ అక్కడక్కడా నవ్వించారు. అర్బాజ్ ఖాన్, మురళీ శర్మ, తులసి, దేవి ప్రసాద్, షకలక శంకర్ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.

దాశరథి శివేంద్ర కెమెరా పనితనం ఆకట్టుకుంది. పాటలతో పరవాలేదు అనిపించుకున్న వికాస్ బడిస.. నేపథ్య సంగీతంతో సన్నివేశాలను బాగానే ఎలివేట్ చేశాడు. చోటా కె. ప్రసాద్ ఎడిటింగ్ నీట్ గా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

మైథలాజికల్ టచ్ తో కొత్త పాయింట్ తో యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన 'శివం భజే' అక్కడక్కడా మెప్పించింది. కథనాన్ని మరింత ఆసక్తికరంగా రాసుకొని ఉంటే.. అవుట్ పుట్ ఇంకా మెరుగ్గా ఉండేది.

-గంగసాని