Read more!

English | Telugu

సినిమా పేరు:శేఖ‌ర్
బ్యానర్:త్రిపుర క్రియేష‌న్స్‌
Rating:2.75
విడుదలయిన తేది:May 20, 2022

సినిమా పేరు: శేఖ‌ర్‌
తారాగ‌ణం: డా. రాజ‌శేఖ‌ర్‌, ఆత్మీయ రాజ‌న్‌, శివానీ రాజ‌శేఖ‌ర్‌, ముస్కాన్ కూబ్‌చందాని, కిశోర్‌, అభిన‌వ్ గోమ‌టం, స‌మీర్‌, భ‌ర‌ణి, ర‌వివ‌ర్మ‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, శ్ర‌వ‌ణ్ రాఘ‌వేంద్ర‌, ప్ర‌కాశ్‌రాజ్ (గెస్ట్ అప్పీరెన్స్‌), క‌విత (గెస్ట్ అప్పీరెన్స్‌)
క‌థ: షాహి క‌బీర్‌
డైలాగ్స్: ల‌క్ష్మీ భూపాల్‌
పాట‌లు: రామ‌జోగ‌య్య శాస్త్రి, చంద్ర‌బోస్‌, అనంత శ్రీ‌రామ్‌
మ్యూజిక్: అనూప్ రూబెన్స్‌
సినిమాటోగ్ర‌ఫీ: మ‌ల్లికార్జున్ నార‌గాని
ఎడిటింగ్: గ్యారీ బీహెచ్‌
ఆర్ట్: సంప‌త్‌
నిర్మాత‌లు: బీరం సుధాక‌ర్‌రెడ్డి, శివానీ రాజ‌శేఖ‌ర్‌, శివాత్మిక రాజ‌శేఖ‌ర్‌, బొగ్గ‌రం వెంక‌ట శ్రీ‌నివాస్‌
స్క్రీన్‌ప్లే-డైరెక్ష‌న్: జీవితా రాజ‌శేఖ‌ర్‌
బ్యాన‌ర్స్: పెగాస‌స్ సినీకార్ప్‌, టార‌స్ సినీకార్ప్‌, త్రిపుర క్రియేష‌న్స్‌
విడుద‌ల తేదీ: 20 మే 2022

మ‌ల‌యాళంలో 2018లో విడుద‌లై విజ‌యం సాధించిన 'జోసెఫ్' మూవీని రాజశేఖ‌ర్‌, జీవిత జంట తెలుగులో రీమేక్ చేస్తున్న‌ట్లు వార్త బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్పుడు ఎవ‌రూ పెద్ద‌గా ఆస‌క్తి క‌న‌ప‌రిచిన దాఖ‌లాలు లేవు. జీవిత స్వ‌యంగా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన 'శేఖ‌ర్' మూవీలో వారి కుమార్తె శివానీ కూడా న‌టించడం, ఇటీవ‌ల వ‌చ్చిన ట్రైల‌ర్ ఇంప్రెసివ్‌గా క‌నిపించ‌డం.. దీనిపై కొంత‌మంది దృష్టైనా ప‌డింది. పెద్ద‌గా అంచ‌నాలు లేకుండా మే 20న మ‌న ముందుకు వ‌చ్చిన 'శేఖ‌ర్' మూవీ ఎలా ఉందంటే...

క‌థ‌:- శేఖ‌ర్ (రాజ‌శేఖ‌ర్‌) వీఆర్ఎస్ తీసుకొని ఒక పోలీస్ కానిస్టేబుల్‌. క్రైమ్ ఇన్వెస్టిగేష‌న్‌లో స్పెష‌ల్ స్కిల్స్ అత‌ని సొంతం. అలాంటి అత‌ని వ్య‌క్తిగ‌త జీవితం బాధామ‌యం. ప్రేమించిన మ‌ర‌ద‌లి (ముస్కాన్‌)కి వేరొక‌రితో పెళ్ల‌వుతుంది. పెళ్లాడిన భార్య ఇందు (ఆత్మీయ రాజ‌న్‌) అత‌ని నుంచి విడిపోయి మ‌ల్లికార్జున్ (క‌న్న‌డ కిశోర్‌) అనే మ‌రో వ్య‌క్తిని పెళ్లాడుతుంది. త‌న ద‌గ్గ‌రే పెరిగిన కూతురు గీత (శివానీ) యాక్సిడెంట్‌లో మ‌ర‌ణిస్తుంది. ఒక నిర్లిప్త జీవితం గ‌డుపుతుండే అత‌ను త‌న మాజీ భార్య ఇందు యాక్సిడెంట్‌లో బ్రెయిన్‌డెడ్ అయ్యింద‌ని తెలిసి, షాక‌వుతాడు. ఆ యాక్సిడెంట్‌ను ఇన్వెస్టిగేట్ చేయ‌డం మొద‌లుపెట్టిన అత‌నికి మ‌రిన్ని షాకింగ్ విష‌యాలు తెలుస్తాయి. ఆ త‌ర్వాత అత‌ను ఏం చేశాడు? అత‌ని జీవితం ఏ తీరానికి చేరింది? అనేది మిగ‌తా క‌థ‌.


ఎనాలసిస్ :

పోలీస్ డిపార్ట్‌మెంట్ నుంచి మ‌ల్లికార్జున్ ఓ మెడ‌ల్ తీసుకోవ‌డంతో సినిమా మొద‌ల‌వుతుంది. ఆ త‌ర్వాత మ‌ల్లికార్జున్‌, శేఖ‌ర్ ముగ్గురు స్నేహితులు క‌లిసి ఓ కారులో ప్ర‌యాణిస్తుండ‌గా, ఆ కారు డ్రైవ‌ర్ ఆ మెడ‌ల్ ఎందుకిచ్చార‌ని అడుగుతాడు. అప్పుడు అది త‌న‌కు ఇచ్చింది కాద‌నీ, త‌న స్నేహితుడికి ఇచ్చింద‌నీ చెప్తాడు మ‌ల్లికార్జున్‌. అప్పుడు శేఖ‌ర్ క‌థ మొద‌ల‌వుతుంది. ఇదంతా ఒరిజిన‌ల్ 'జోసెఫ్' మూవీ త‌ర‌హాలోనే డైరెక్ట‌ర్ జీవిత చిత్రీక‌రించారు. చాలావ‌ర‌కు ఒరిజిన‌ల్‌తో డీవియేష‌న్ లేకుండా అవే స‌న్నివేశాలు, ఘ‌ట‌న‌ల‌ను త‌న ప‌ద్ధ‌తిలో తీశారు.

శేఖ‌ర్ రిటైర్ అయిన త‌ర్వాత కూడా క్రైమ్ ఇన్వెస్టిగేష‌న్‌లో పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు ఎలా ఉప‌యోగ‌ప‌డుతూ వ‌స్తాడు, ఒక వృద్ధ దంప‌తులు హ‌త్య‌కు గురైతే, క్రైమ్ సీన్ జ‌రిగి చోటుకు వెళ్లి, అక్క‌డ్నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేలోపే ఎలా హంత‌కుడ్ని ప‌ట్టేస్తాడ‌నేది ఆస‌క్తిక‌రంగా చూపించారు. ఆ త‌ర్వాత అత‌ని వ్య‌ధాభ‌రిత వ్య‌క్తిగ‌త జీవితంపై ఫోక‌స్ పెట్టారు. పెళ్లి కాక‌ముందు మ‌ర‌ద‌లితో శేఖ‌ర్ ప్రేమాయ‌ణంకు సంబంధించిన సీన్లు, ఆ త‌ర్వాత భార్య ఇందును అత‌ను నిర్ల‌క్ష్యం చేసే సీన్లు సోసోగా అనిపించాయి. ఇంట‌ర్వెల్ అయ్యేస‌రికి క‌థ‌లో చెప్పుకోద‌గ్గ విష‌యాలేమీ లేవు క‌దా అనిపిస్తుంది. ఇందుది యాక్సిడెంట్ కాదు, హ‌త్య అని ఇంట‌ర్వెల్‌లో శేఖ‌ర్ డిక్లేర్ చేశాక‌, సెకండాఫ్‌లో అత‌ను ఇన్వెస్టిగేష‌న్ చేసే తీరు, ఆ సంద‌ర్భంగా అత‌డికి ఎదుర‌య్యే ఘ‌ట‌న‌లు క్రమేపీ ఆస‌క్తిని పెంచుతాయి. ప్రి క్లైమాక్స్‌, క్లైమాక్స్ ఎమోష‌న‌ల్‌గా సాగి గుండెను తడిచేస్తాయి. ప్రేక్ష‌కుల క‌న్నులూ చెమ్మ‌గిల్లుతాయి.

కొన్ని హాస్పిట‌ల్స్ సిండికేట్‌గా ఏర్ప‌డి 'జీవ‌న్‌ దాన్' ప్రోగ్రామ్ కింద అవ‌య‌వ దానం పొందాల్సిన పేషెంట్ల‌కు బ‌దులు, ఫారిన‌ర్స్‌కు లేదా డ‌బ్బున్న‌వాళ్ల‌కు బ్రెయిన్‌డెడ్ అయిన‌వాళ్ల అవ‌య‌వాల‌ను ఎలా ట్రాన్స్‌ప్లాంట్ చేస్తుంటార‌నే స్కామ్‌ను ఈ సినిమా బ‌ట్ట‌బ‌య‌లు చేసింది. క్లైమాక్స్ చూశాక‌, ఒక పేషెంట్‌ను హాస్పిట‌ల్స్ బ్రెయిన్‌డెడ్ అని ప్ర‌క‌టించ‌డం వెనుక కూడా స్కామ్ ఉంటుంద‌ని తెలిసి షాక‌వుతాం. నిజంగానే ఇలాంటి స్కామ్స్ జ‌రుగుతుంటాయ‌నే భ‌యాన్ని ఈ సినిమా క‌లిగిస్తుంది. 

ఫ‌స్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్ స్క్రీన్‌ప్లే బెట‌ర్‌. దానివ‌ల్లే ఒక బ‌రువైన ఫీలింగ్‌తో మ‌నం థియేట‌ర్ నుంచి బ‌య‌ట‌కు వ‌స్తాం. స‌న్నివేశాలను మ‌రింత క్వాలిటీతో ప్రెజెంట్ చేస్తే, సినిమా ఇంకా ఆక‌ర్ష‌ణీయంగా, ఆస‌క్తిక‌రంగా వ‌చ్చి ఉండేద‌ని చెప్పొచ్చు. అంటే.. నిర్మాణ విలువ‌లు సాధార‌ణంగా ఉన్నాయ‌న్న‌మాట‌. ల‌క్ష్మీ భూపాల్ సంభాష‌ణ‌లు చాలావ‌ర‌కు సంద‌ర్భోచితంగా, సునిశితంగా ఉన్నాయి. అనూప్ రూబెన్స్ సంగీతం స‌మ‌కూర్చిన పాట‌లు కానీ, అత‌ని బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కానీ అల‌రించాయి. మ‌ల్లికార్జున్ నార‌గాని సినిమాటోగ్ర‌ఫీ, గ్యారీ బీహెచ్ ఎడిటింగ్ ఓకే.

న‌టీన‌టుల ప‌నితీరు:- టైటిల్‌కు త‌గ్గ‌ట్లే ఇది రాజ‌శేఖ‌ర్ సినిమా. క‌థంతా ఆయ‌న‌ పాత్ర చుట్టూనే న‌డుస్తుంది కాబ‌ట్టి, స‌హ‌జంగానే క‌థ‌ను త‌న భుజాల మీద మోశాడు. తెల్ల‌జుట్టు, తెల్ల‌టి గ‌డ్డంతో త‌న వ‌య‌సుకు త‌గ్గ పాత్ర‌లో ఆయ‌న బాగా రాణించాడు. యంగ్ లుక్‌లోనూ బాగానే ఉన్నాడు. ఆయ‌న హావ‌భావాలు ఎప్ప‌ట్లా ఉన్న‌త స్థాయిలో ఉన్నాయి. చివ‌ర‌లో మ‌న క‌ళ్ల‌నీ, గుండెనీ త‌డిచేస్తాడు కూడా. ఒరిజిన‌ల్‌లో న‌టించిన ఆత్మీయ రాజ‌న్‌.. ఈ మూవీలోనూ అదే పాత్ర‌లో క‌నిపించింది. ఆమెకు ఇదే తొలి తెలుగు సినిమా. త‌న న‌ట‌న‌తో ఆమె మెప్పించింది. శేఖ‌ర్ కూతురు గీత‌గా శివానీ క‌నిపించేది త‌క్కువ‌సేపే అయినా చ‌క్క‌గా ఆ పాత్ర‌లో ఒదిగిపోయింది. ఇందు రెండో భ‌ర్త‌గా క‌న్న‌డ కిశోర్‌, ఎప్పుడూ శేఖ‌ర్ వెన్నంటి ఉండే క్లోజ్ ఫ్రెండ్స్‌గా స‌మీర్‌, భ‌ర‌ణి, ర‌వివ‌ర్మ‌, ఎస్పీగా పోసాని కృష్ణ‌ముర‌ళి, శేఖ‌ర్ మ‌ర‌ద‌లిగా ముస్కాన్‌, ఆమె భ‌ర్త‌గా శ్ర‌వ‌ణ్ రాఘ‌వేంద్ర పాత్ర‌ల ప‌రిధిలో ఇమిడిపోయారు. ఎక్కువ‌గా కామెడీ రోల్స్‌లో క‌నిపించే అభిన‌వ్ గోమ‌టంకు మోహ‌న్‌గా మంచి నిడివి ఉన్న పాత్ర ల‌భించింది. అత‌ను చ‌క్క‌గా రాణించాడు. క్లైమాక్స్‌లో లాయ‌ర్ పాత్ర‌లో ప్ర‌కాశ్‌రాజ్ మెరుపులా మెరిశాడు.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

క్రైమ్ ఇన్వెస్టిగేష‌న్ స్టోరీకి ఫ్యామిలీ డ్రామాను మేళ‌వించి తీసిన 'శేఖ‌ర్' మూవీ క్రైమ్ డ్రామాల‌ను ఇష్ట‌ప‌డే ప్రేక్ష‌కుల‌కు న‌చ్చుతుంది. చాలాకాలంగా రాజ‌శేఖ‌ర్‌లోని న‌టుడిని చూడాల‌ని ఆశ‌ప‌డుతున్న ప్రేక్ష‌కులూ సంతృప్తి చెందుతారు. ఒక ఆహ్లాద‌క‌ర‌మైన సినిమాని చూడాల‌నుకొనేవారు మాత్రం ఈ సినిమా చూస్తే అసంతృప్తి చెందుతారు.

- బుద్ధి య‌జ్ఞ‌మూర్తి