Read more!

English | Telugu

సినిమా పేరు:సెల్ఫీ రాజా
బ్యానర్:ఎకె ఎంటర్ టైన్మెంట్స్
Rating:1.00
విడుదలయిన తేది:Jul 15, 2016

2012లో వచ్చిన "సుడిగాడు" అనంతరం అల్లరి నరేష్ సుడి అస్సలు బాలేనట్లుంది. నటించిన ప్రతి సినిమా ఫ్లాపే అవుతుంది. అయినా కూడా డిఫరెంట్ సబ్జెక్ట్స్ ట్రై చేయకుండా తనను నిలబెట్టిన కామెడీ జోనర్ లోనే సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. అల్లరి నరేష్ నటించిన తాజా చిత్రం "సెల్ఫీ రాజా". జి.ఈశ్వర్ రెడ్డి దర్శకత్వంలో అనిల్ సుంకర నిర్మించిన ఈ చిత్రం నేడు (జూలై 15) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి "సెల్ఫీ రాజా" ప్రేక్షకులను ఏమేరకు అలరించాడు? ఈ సినిమాతో అయిన నరేష్ హిట్ కొట్టగలిగాడా? లేదా? అనేది మా రివ్యూ చదివి తెలుసుకోండి!

కథ:

రాజా అలియాస్ సెల్ఫీ రాజా (అల్లరి నరేష్) ఒక మ్యారేజ్ బ్యూరో రన్ చేస్తుంటాడు. సెల్ఫీలు తీసుకోవడం అతనికి హాబీ. అతడు తీసుకొన్న సెల్ఫీల కారణంగా చాలా ప్రోబ్లమ్స్ వస్తుంటాయి. ఇష్టపడి పెళ్లి చేసుకొన్న కమీషనర్ కూతురు (కామ్నా రావత్) శోభనం రాత్రే మనస్పర్ధాల కారణంగా వదిలేసి వెళ్లిపోతుంది. పెళ్ళాం వదిలేసి వెళ్ళిపోయిందన్న బాధతో చచ్చిపోవాలనుకొంటాడు. రకరకాల ప్రయత్నాల అనంతరం కాకి (రవిబాబు) అనే పెయిడ్ కిల్లర్ కి డబ్బులు ఇచ్చి మరీ తనను చంపమని చెబుతాడు.

కట్ చేస్తే.. మనస్పర్ధలు తొలగిపోయి భార్య చెంతకు చేరడంతో చావకూడదనుకొంటాడు. కానీ.. అప్పటికే సెల్ఫీ రాజాను మర్డర్ చేయడానికి బాంబే నుంచి భీమ్స్ (అల్లరి నరేష్) అనే మరో కిల్లర్ ని ఎంగేజ్ చేస్తాడు కాకి. అయితే.. కాకి రాజాను చంపడానికి ఫిక్స్ అవ్వడానికి కారణం వేరే ఉంటుంది. ఆ కారణం ఏంటీ? అసలు సెల్ఫీ రాజా, భీమ్స్ లు ఒకేలా ఎందుకున్నారు? వంటి ప్రశ్నలకు అర్ధాంకాని సమాధానాల సమాహారమే "సెల్ఫీ రాజా" చిత్రం..!!


ఎనాలసిస్ :

నటీనటుల పనితీరు:

ఇప్పటికే ఈ తరహాలో 10కి పైగా సినిమాల్లో నటించి ఉన్న అల్లరి నరేష్ "సెల్ఫీ రాజా" పాత్రలో అలవోకగా ఒదిగిపోయాడు. అయితే.. చేసి క్యారెక్టర్ ఎన్నిసార్లు చేస్తాం అన్నట్లుగా కాస్త నీరసంగా కనిపించాడు బాబు. హీరోయిన్లుగా నటించిన కామ్నా రావత్, సాక్షి చౌదరీలు కేవలం అందాల ప్రదర్శనకు తప్పితే ఎందుకూ ఉపయోగపడలేదు. నటించిన కొన్ని సన్నివేశాల్లోనూ.. యాక్ట్ చేయకపోతేనే బెటర్ అనేలా ఉన్నాయి. సప్తగిరి, కృష్ణ భగవాన్ లు నవ్వించాలని చేసిన ప్రయత్నాలు ప్రేక్షకుల సహనాన్ని పూర్తి స్థాయిలో పరీక్షిస్తాయి. కాస్తో కూస్తో సినిమాలో నవ్వించింది పోలీస్ క్యారెక్టర్ లో పృధ్వీ మాత్రమే.

సాంకేతికవర్గం పనితీరు:

సంగీత దర్శకుడు సాయికార్తీక్ తాను ఇంతకుముందు పనిచేసిన సినిమాల కోసం చేసిన ట్యూన్స్ అన్నిట్నీ మిక్సీలో వేసి "సెల్ఫీ రాజా" బాణీలు కట్టినట్లుగా అనిపిస్తుంది. ఇక బ్యాగ్రౌండ్ స్కోర్ గురించి మాట్లాడాల్సిందేమీ లేదు. శ్రీధర్ సీపాన రాసిన కథలో కంటెంట్ ఏమిటన్నది కనీసం ఆయనకైనా క్లారిటీ ఉందో లేదో. కథను మలుపులు తిప్పుదామని ప్రయత్నించి.. కథనాన్ని మలిచిన తీరు అస్సలు బాలేదు. ఇక డైమెండ్ రత్నం సమకూర్చిన సంభాషణల పరిస్థితి కూడా అంతే. ప్రాసల కోసం ప్రయత్నం తప్పితే అర్ధం అనేది బూతద్దం పెట్టి వెతికినా కనిపించదు.

దర్శకుడు ఈశ్వర్ రెడ్డి గురించి చెప్పుకోవడానికి ఏం లేదు. రచయిత శ్రీధర్ సీపాన పేపరు మీద పెట్టినడాన్ని తెరకెక్కించాడాయన. కాకపోతే.. "సిద్ధూ ఫ్రమ్ సీకాకుళం" లాంటి సెన్సిబుల్ కామెడీ ఎంటర్ టైనర్ ను తెరకెక్కించిన ఈశ్వర్ రెడ్డి లాంటి డైరెక్టర్ "సెల్ఫీ రాజా" సినిమాను డైరెక్ట్ చేశాడా? అని సగటు సినీ అభిమాని బాధపడే స్థాయిలో ఈ సినిమా ఉండడం గమనార్హం.

 


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

"ఈ సినిమాలో స్పూఫ్ లు లేవు, కొత్త కామెడీ ట్రై చేశాను" అంటూ అల్లరి నరేష్ "సెల్ఫీ రాజా" ప్రమోషన్ లో భాగంగా చెప్పిందంతా అబద్ధమే అని సినిమా మొదలైన మొదటి 15 నిమిషాల్లోనే అర్ధమైపోతుంది. ఆ మ్యారేజ్ బ్యూరో ఏంటో ? ఆ సెల్ఫీల గోల ఏంటో ? సినిమా మొత్తం చూసిన ఆడియన్ కు కూడా ఐడియా ఉండదు. ఇక మధ్యలో వచ్చే పృధ్వీ-నరేష్ ల గే కామెడీ ఆ కన్ఫ్యూజన్ ను రెట్టింపు చేస్తుంది. ఓవరాల్ గా గజిని మహ్మద్ స్థాయిలో వరుస సినిమాలతో దండయాత్రలు చేస్తున్న అల్లరి నరేష్ కు ఈ "సెల్ఫీ రాజా" కూడా చేదు అనుభవాన్నే మిగిల్చింది. బేసిక్ గా అద్భుతమైన నటుడైన అల్లరి నరేష్ ఇకనైనా ఇలాంటి రొట్టగొట్టుడు సినిమాలు చేయకుండా.. "గమ్యం, శంభో శివ శంభో" లాంటి కధాబలం ఉన్న సినిమాల్లో నటించాలని కోరుకుంటూ.. "సెల్ఫీ రాజా"కి కాస్త దూరంగా ఉందాం!