Read more!

English | Telugu

సినిమా పేరు:సర్కారు వారి పాట
బ్యానర్:మైత్రీ మూవీ మేకర్స్‌, 14రీల్స్‌
Rating:2.50
విడుదలయిన తేది:May 12, 2022

సినిమా పేరు: సర్కారు వారి పాట
తారాగ‌ణం: మహేష్‌బాబు, కీర్తి సురేష్‌, సముద్రఖని, వెన్నెల కిషోర్‌, తనికెళ్ళ భరణి, నదియా, సుబ్బరాజు, పోసాని కృష్ణ మురళి, బ్రహ్మాజీ తదితరులు
సంగీతం: ఎస్.తమన్
సినిమాటోగ్ర‌ఫీ: ఆర్‌.మది
ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్
నిర్మాత: నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌, రామ్‌ ఆచంట, గోపీ ఆచంట
ద‌ర్శ‌క‌త్వం: పరశురామ్
బ్యాన‌ర్: జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, మైత్రీ మూవీ మేకర్స్‌, 14రీల్స్‌
విడుద‌ల తేదీ: మే 12, 2022

2020 జనవరిలో 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు రెండేళ్ల తర్వాత 'సర్కారు వారి పాట' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 'గీతగోవిందం' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పరశురామ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. ఇటీవల విడుదలైన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా మహేష్ కామెడీ టైమింగ్ కి, డైలాగ్స్ కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఈ సినిమాతో మహేష్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ పడటం ఖాయమని భావించారంతా. మరి ఆ అంచనాలను 'సర్కారు వారి పాట' అందుకుందో లేదో చూద్దాం.

కథ:- బ్యాంకులో లోన్ తీసుకున్న మహేష్(మహేష్ బాబు) తల్లిదండ్రులు.. ఆ అప్పు తిరిగి కట్టలేక, బ్యాంక్ వేలంతో పరువు పరువు పోగొట్టుకోలేక ఆత్మహత్య చేసుకొని చనిపోతారు. దాంతో అనాథగా మారిన మహేష్ ఓ అనాథాశ్రమంలో పెరిగి.. ఏకంగా అమెరికాలో సెటిల్ అయ్యి అప్పులిచ్చే స్థాయికి ఎదుగుతాడు. రికవరీ కోసం ఎంత దూరమైనా వెళ్తాడు, ఏదైనా చేస్తాడు. వంద డాలర్ల అప్పు రికవరీ చేయడం కోసం అవసరమైతే వెయ్యి డాలర్లు కూడా ఖర్చు చేసే రకం మహేష్. అలాంటోడిని మహానటి కళావతి(కీర్తి సురేష్) మాయ చేసి కాలేజ్ ఫీజు పేరిట పది వేల డాలర్లు డబ్బులు అప్పు తీసుకుంటుంది. మహేష్ ని మోసం చేసి డబ్బులు తీసుకున్నదే కాకుండా, నేను అప్పు తీర్చను ఏం చేసుకుంటావో చేసుకుపో అంటూ బెదిరిస్తుంది. దీంతో ఆ మనీ రికవరీ చేయడం కోసం ఏకంగా అమెరికా నుంచి ఇండియాలో ఉన్న కళావతి ఫాదర్ రాజేంద్రనాథ్(సముద్రఖని) దగ్గరికి వస్తాడు మహేష్. ఇండియా వచ్చాక నాకు కావాల్సింది పది వేల డాలర్లు కాదు.. పదివేల కోట్ల రూపాయలని ట్విస్ట్ ఇస్తాడు. అసలు ఆ పదివేల కోట్ల సంగతి ఏంటి? మహేష్ గతానికి రాజేంద్రనాథ్ కి ఏమైనా సంబంధం ఉందా? అనేది మిగతా కథ.


ఎనాలసిస్ :

'గీత గోవిందం'తో బ్లాక్ బస్టర్ అందుకున్న పరశురామ్.. 'సర్కారు వారి పాట'తో ఏకంగా సూపర్ స్టార్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు. కానీ ఆ గోల్డెన్ ఛాన్స్ ని ఉపయోగించుకోలేకపోయాడు. నార్మల్ స్టోరీని రొటీన్ కమర్షియల్ ఫార్మాట్ లో తీసి డిజప్పాయింట్ చేశాడు. ఫైట్ తో హీరో ఇంట్రడక్షన్.. ఫైట్ అవ్వగానే ఇంట్రో సాంగ్.. ఇలా ఓల్డ్  ఫార్మాట్ తో సినిమా స్టార్ట్ అవుతుంది. మహేష్- కీర్తి లవ్ ట్రాక్ అంతగా ఆకట్టుకోలేకపోయింది. హీరో-హీరోయిన్ ట్రాక్ దూకుడు రేంజ్ లో ఉంటుందని చెప్పారు గానీ.. ఆ దరిదాపుల్లో కూడా లేదు. వేల కోట్ల ఆస్తి ఉన్న అమ్మాయి.. కేవలం వేల డాలర్ల కోసం వేషాలు వేయడం సిల్లీగా అనిపించింది. ఇక ఆ మహానటి చెప్పే మాటలు నమ్మి మహేష్ మోసపోవడం మరింత సిల్లీగా అనిపించింది. ఇలా అక్కడక్కడా నవ్వులతో ఓ మాదిరిగా సాగిపోయిన ఫస్టాఫ్ ఒక చిన్న బ్యాంగ్ తో ఎండ్ అవుతుంది. సెకండ్ ఆఫ్ లోనే అసలు కథ మొదలవుతుంది. కానీ ఆ కథ మహేష్ ది కాకపోవడంతో సినిమాకి మనం అంతగా కనెక్ట్ కాలేం. అయితే లాస్ట్ లో కొసమెరుపు అన్నట్లు ఆ కథకి మహేష్ కి లింక్ ఉన్నట్లు చూపించారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

బ్యాంక్ లోన్స్ తీసుకొని అవి కట్టలేక మధ్య తరగతి వాళ్ళు అవస్థలు పడుతుంటే.. బడా వ్యాపారవేత్తలు మాత్రం వేల కోట్లు ఎగ్గొట్టి దర్జాగా తిరుగుతుంటారు. ఈ పాయింట్ ఇప్పటికే చాలా సినిమాల్లో చూశాం.. ఇక ఇలాంటి సీన్స్ అయితే కోకొల్లలు ఉన్నాయి. అదే పాయింట్ ని తీసుకొని కథగా రాసుకున్నాడు పరశురామ్. ఆ కథలోకి లోతుగా వెళ్లకుండా ఎక్కువగా హీరో క్యారెక్టర్ మీదనే ఫోకస్ చేయడంతో కథ గాడి తప్పింది. ఇలాంటి పాయింట్ తో స్టార్ హీరోతో సినిమా చేయడమే రిస్క్ అంటే.. హీరో-హీరోయిన్ ట్రాక్, వీక్ స్క్రీన్ ప్లే తో మొత్తం సినిమానే రిస్క్ లో పెట్టాడు. పరశురామ్ మార్క్ కామెడీ కూడా ఇందులో వర్కౌట్ అవ్వలేదు. డైలాగ్స్ లో మాత్రం తన మార్క్ చూపించాడు.

కొన్ని సీన్స్, డైలాగ్స్ తప్ప సినిమాలో పెద్దగా ఆకట్టుకునే అంశాలు లేవు. కొన్ని సన్నివేశాలు మరీ సిల్లీగా ఉన్నాయి. 10 వేల కోట్లు అప్పు ఉన్నావు అనగానే.. కనీసం ఎవరు నువ్వు? ప్రూఫ్స్ ఏవి? అని అడగకుండా ఢిల్లీ స్థాయిలో పలుకుబడి ఉన్న ఎంపీ సహా అందరూ నమ్మడం ఏంటో అర్థంకాలేదు. ఇక కాలేజ్ ఫీజు పేరుతో మొదట 10 వేల డాలర్లు తీసుకున్న కళావతి.. ఆ తరువాత ఫైన్ అంటూ మరో 25 వేల డాలర్లు తీసుకుంటుంది. అయితే రికవరీ విషయంలో ఎంతో పర్ ఫెక్ట్ గా ఉండే మహేష్.. 10 వేల డాలర్లు మాత్రమే అడగతుంటాడు. '10 వేల డాలర్లు.. 10 వేల కోట్లు' ప్రాస కోసం లాజిక్ ని పక్కన పెట్టారేమో అనిపించింది. రాజేంద్రనాథ్ పాత్రని డిజైన్ చేయడంలో కూడా డైరెక్టర్ తడబాటు కనిపించింది. అతని ఆహార్యానికి, చేష్టలకి, ఆస్తికి ఏ మాత్రం పొంతన కుదరదు. అంత పలుకుబడి, అన్ని వేల కోట్ల ఆస్తి ఉన్న వ్యక్తిని ఓ సాధారణ వ్యక్తి ఢీ కొట్టడం అంత ఈజీనా అన్నట్లు చూపించారు.

కళావతి, మ మ మహేశా సాంగ్స్ తో అదరగొట్టిన తమన్.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం జస్ట్ ఓకే అనిపించుకున్నాడు. ఈ మధ్య కాలంలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కింగ్ గా పేరు తెచ్చుకున్న తమన్ ఈ సినిమాకి ఆ రేంజ్ ఔట్ పుట్ ఇవ్వలేదనే చెప్పాలి. మదీ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్ కత్తెరకి చాలా పని చెప్పాల్సింది. నిడివి బాగా ఇబ్బంది పెడుతుంది.

నటీనటుల పనితీరు:
మహేష్ బాబు కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 'దూకుడు', 'ఖలేజా', 'సరిలేరు నీకెవ్వరు' వంటి సినిమాలతో ఆకట్టుకున్న మహేష్.. మరోసారి అదరగొట్టాడు. మహేష్ తన కామెడీ టైమింగ్, బాడీ ల్యాంగ్వేజ్, యాక్టింగ్, ఫైట్స్ తో ఆకట్టుకున్నాడు. సినిమాని చాలా వరకు తన యాక్టింగ్ తో లాక్కొచ్చాడు. లుక్ పరంగా కూడా మహేష్ మరింత యంగ్ గా కనిపించాడు. చాలా యంగ్ గా, స్టైలిష్ గా ఉన్నాడు. ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్ కొత్తగా కనిపించింది. కళావతిగా అందంతో మాయ చేయడంతో పాటు అభినయంతోనూ ఆకట్టుకుంది. రాజేంద్రనాథ్ పాత్రలో సముద్రఖని ఒదిగిపోయాడు. అయితే అక్కడక్కడా 'అల వైకుంఠపురములో' పాత్ర ఛాయలు కనిపించాయి. వెన్నెల కిషోర్ ఉన్నంతలో నవ్వించే ప్రయత్నం చేశాడు. మహేష్ మాష్టారు పాత్రలో తనికెళ్ళ భరణి ఆకట్టుకున్నాడు. నదియా, పోసాని కృష్ణ మురళి, బ్రహ్మాజీ, అజయ్ వంటి వారు రెండు మూడు సన్నివేశాలకు పరిమితమయ్యారు.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

'సర్కారు వారి పాట' ట్రైలర్ విడుదల అయినప్పుడే ఇది పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ అని.. అయితే 'దూకుడు' లేదా 'ఆగడు' అవుతుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. అయితే ఇది 'దూకుడు'లా బ్లాక్ బస్టర్ కాదు.. 'ఆగడు'లా డిజాస్టర్ కాదు. మ మ మహేష్ కోసం ఒక్కసారి చూడొచ్చు. ఫ్యాన్స్ ని మెప్పించే అంశాలు సినిమాలో బాగానే ఉన్నాయి.. కానీ సాధారణ ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకునే అవకాశాలు తక్కువగా ఉన్నాయి.

-గంగసాని