Read more!

English | Telugu

సినిమా పేరు:సరదాగా కాసేపు
బ్యానర్:శ్రీ కీర్తి కంబైన్స్
Rating:2.50
విడుదలయిన తేది:Sep 17, 2010
గజపతి (జీవా) కొడుకు శ్రీనివాస్ (అవసరాల శ్రీనివాస్) అమెరికా నుంచి ఇండియాకి వస్తాడు.గజపతి కారు డ్రైవర్ రంగబాబు(అల్లరి నరేష్).శ్రీనివాస్ కి హైదరాబాద్ లో ఉండే రిటైర్డ్ జైలర్ రాజారావు(ఆహుతి ప్రసాద్)కూతురు మణిమాల(మధురిమ)తో సమబంధం మాట్లాడతాడు గజపతి.అయితే హైదరాబాద్ లో శ్రీనివాస్ తాను డ్రైవర్ గా,రంగబాబుని శ్రీనివాస్ గా అక్కడ పరిచయం చేస్తానంటాడు. అలాగేనంటాడు గజపతి.ఈ విషయాన్నే రాజారావుకి ఫోన్ లో చెపుతాడు గజపతి.కానీ దారిలో వచ్చిన ఇబ్బందులకి శ్రీనివాస్ తాను తానుగానే, డ్రైవర్ డ్రైవర్ గానే ఉందామంటాడు.తీరా హైదరాబాద్ లో రాజారావు శ్రీనివాస్ ని డ్రైవర్ రంగబాబుగా,డ్రైవర్ రంగబాబుని శ్రీనివాస్ గా అనుకుంటారు. ఆ గందరగోళం తర్వాత ఏం జరిగింది...?శ్రీనివాస్ మణిమాలను చేసుకున్నాడా...?రంగబాబు పాత్ర ఏంటి...?చివరికి ఏంజరిగిందనేది మిగిలిన కథ.
ఎనాలసిస్ :
ఈ సినిమా చూస్తుంటే వంశీ చాలా రోజులకు తన రిథమ్ అందుకున్నాడనిపిస్తుంది. ఈ సినిమాలో మనకు దర్శకుడిగా పాత వంశీ కనిపిస్తాడు. అతని ఫ్రేమింగ్, షాట్ టేకింగ్ సీన్లలోనే కాకుండా ముఖ్యంగా పాటల్లో కూడా కొట్టొచ్చినట్టు కనపడుతుంది.మళ్ళీ సితార,అన్వేషణ,లేడీస్ టైలర్ కలర్, కామెడీ ఈ చిత్రంలో కనపడుతుంది.కానీ తొలి సగంలా ఈ చిత్రం సెకండ్ హాఫ్,ఈ చిత్రం క్లైమాక్స్ కూడా బాగుంటే ఈ సినిమా వందరోజుల సినిమా అయ్యుండేది.ఈ సినిమాలో హీరోయిన్ మధురిమను వంశీ చూపించిన తీరు చాలా బాగుంది. నటన - అల్లరి నరేష్ యధాప్రకారం తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు.అవసరాల శ్రీనివాస్ కూడా ఫరవాలేదు బాగానే నటించాడు. యమ్.యస్.నారాయణ,కృష్ణ భగవాన్,జయలలిత,జీవా,సన,కృష్ణేశ్వరరావు తదితరులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.ఇక ఈ సినిమాలో ముఖ్యంగా అందరికీ పనిష్మెంట్లిచ్చే జైలర్ పాత్రలో ఆహుతి ప్రసాద్ నటన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. హీరోయిన్ మధురిమ తన అందాలతో బాగానే ఆకట్టుకుంటుంది.ఈ అమ్మాయి కళ్ళల్లో ఏదో తెలియని ఆకర్షణ ఉంది.అది ఆ అమ్మాయికి బాగా ప్లస్ పాయింట్. సంగీతం - ఈ చిత్రానికి చక్రి సంగీతం అందించాడంటే నమ్మలేని విధంగా ఈ చిత్రంలోని పాటలున్నాయి.నిజానికి ఈ చిత్రం సంగీతంలో మనకు వంశీ వినపడతాడు.అతని అభిరుచి ఈ చిత్ర సంగీతంలో అణువణువునా కనబడుతుంది...వినపడుతుంది.అంతే కాకుండా వంశీ ఈ చిత్రంలో రెండు పాటలు కూడా పాడటం విశేషం. రీ-రికార్డింగ్‍ కూడా బాగుంది. సినిమాటోగ్రఫీ - బాగుంది. కెమెరా కూడా వంశీ చెప్పినట్టే విన్నట్టు మనకు ఈ చిత్రం చూస్తే తోస్తుంది. మాటలు - చాలా బాగున్నాయి ఈ చిత్రంలోని మాటలు. ఉదాహరణకు "అమ్మా నీవింట్లో దీపం పెట్టాల్సిన దానివమ్మా" అంటే "ఏం నాన్నా వాళ్ళింట్లో కరెంట్ లేదా"..."ఫ్లైటేంట్రా ఇంకా రాలేదు" అంటే "ట్రాఫిక్ జామయ్యిందేమో" వంటి మాటలు ఈ సినిమా నిండా ఉండి మనల్ని కడుపుబ్బ నవ్విస్తాయి.ఈ సినిమా ద్వారా మన తెలుగు సినీ పరిశ్రమకు ఒక మంచి మాటల రచయిత దొరికాడనే చెప్పాలి. ఎడిటింగ్ - నీట్ గా,క్రిస్ప్ గా ఉంది. ఆర్ట్ - చాలా బాగుంది. కొరియోగ్రఫీ - స్వర్ణ మాస్టర్ కొరియోగ్రఫీ చూడ ముచ్చటగా ఉంది.అన్ని పాటల్లోనూ కొరియోగ్రఫీ బాగుంది. యాక్షన్ - ఫరవాలేదు.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
మీరు హాయిగా ఓ రెండు గంటల పాటు ఏ అసభ్యతా,ఏ అశ్లీలతా లేకుండా,సరదాగా నవ్వుకోవాలనుకుంటే ఈ సినిమా సకుటుంబంగా సంతోషంగాచూడవచ్చు.