English | Telugu
బ్యానర్:సాయి సెల్యూలాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్
Rating:2.00
విడుదలయిన తేది:Dec 23, 2016
కమెడియన్లు హీరోలైపోవడంలో ఏమాత్రం పొరపాటు లేదు. ఏం.. వాళ్లకు మాత్రం 'హీరో' అనిపించుకోవాలని ఉండదా?? కాకపోతే ఓ కమెడియన్ హీరో అయితే వాళ్లపై ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువగా ఉంటాయి. సిక్స్‌ప్యాక్‌లు చూపిస్తారనో, బీభత్సమైన ఫైట్లు చేసేస్తారనో కాదు.. కమెడియన్‌గా ఉన్నప్పుడు ఎంతలా నవ్వించారో... ఇప్పుడు అంతకంటే ఎక్కువగా నవ్విస్తారని. దాదాపుగా హీరోలుగా మారిన కమెడియన్లు ఫెయిల్ అయ్యేది ఈ విషయంలోనే. ఇప్పుడు సప్తగిరి కూడా హీరో అయ్యాడు. సప్తగిరి ఎక్స్‌ప్రెస్ అంటూ ఏకంగా తన పేరుతోనే ఓ సినిమా చేశాడు. మరి ఈ సినిమా ఎలా ఉంది? పేరులో ఉన్న స్పీడు సినిమాలో ఉందా? లేదా?
* కథ
సప్తగిరి (సప్తగిరి) ఓ అల్లరి కుర్రాడు. నాన్న (శివ ప్రసాద్) ఓ కానిస్టేబుల్. తన కొడుకుని తన కంటే పెద్ద ఆఫీసర్‌గా చేసి, సెల్యూట్ కొట్టాలని కలలు కంటుంటాడు. సప్తగిరి మాత్రం సినిమాలు, షార్ట్ ఫిల్మ్స్, నాటకాలు అంటూ కాలయాపన చేస్తుంటాడు. ఓ ఎన్‌కౌంటర్ కాని ఎన్‌కౌంటర్‌లో సప్తగిరి నాన్నని దారుణంగా చంపేస్తారు. ఆ పోస్టు.. సప్తగిరికి వస్తుంది. తండ్రి ఆశయం కోసం తనకు ఇష్టం లేకపోయినా కానిస్టేబుల్‌గా మారాల్సివస్తుంది. తన తండ్రి మరణం వెనుక డిపార్ట్‌మెంట్‌లోని కొంతమంది (పోసాని, అజయ్‌ఘోష్) కుట్ర ఉందని తెలుసుకొని.. ప్రతీకారం తీర్చుకోవాలనుకొంటాడు. ఆ ప్రయాణంలో సప్తగిరి ఏం చేశాడన్నదే కథ.
ఎనాలసిస్ :
తిరుడా పోలీస్ అనే తమిళ సినిమాకి ఇది రీమేక్. ఈ మాత్రం కథని రీమేక్ పేరిట లక్షలు పోయడం ఎందుకో అర్థం కాదు. చాలా సాదా సీదా పగ ప్రతీకారం కాన్సెప్ట్ సినిమా ఇది. కాకపోతే ఇక్కడ హీరో.. హీరో కాదు. ఓ కమెడియన్. అందుకే ఫైట్లూ, గీట్లూ పెట్టకుండా రివైంజ్ ఎపిసోడ్లనీ కామెడీగా లాగించేశారు. అదొక్కటే ఊరటనిచ్చే విషయం. సప్తగిరి హీరో అయ్యాడు కదా అని తన కోసం కొత్త కొత్త సీన్లు, హీరోయిజం ఎలివేట్ అయ్యేలా ఎపిసోడ్లేం రాసుకోలేదు. అదొక్కటే ఊరటనిచ్చే విషయం. బయట సినిమాల్లో సప్తగిరి ఎలా నవ్వించాడో, ఇక్కడా అలానే నవ్వించే ప్రయత్నం చేశాడు. పాటలు, ఫైటులు చేసినా అవీ కామెడీగానే సాగాయి. సప్తగిరి నటనపై పిచ్చి చూపించే సీన్లు, కాలేజీలో గోల్డు మెడల్ కోసం వేసిన వేషాలు నవ్విస్తాయి. తన నటనా ప్రతిభ చూపించడానికి తల్లిదండ్రుల్ని కూర్చోబెట్టి వేసిన ఏక పాత్రాభినయం ఈ సినిమాకి హైలెట్ అయ్యింది. తండ్రి మరణం.. దాన్నుంచి పుట్టుకొచ్చిన ఎమోషన్ ఈ సినిమాని ఫ్యామిలీ ప్రేక్షకులకూ దగ్గర చేస్తుంది. సప్తగిరి పోలీస్ అయ్యాక.. కథ మరింత రక్తి కట్టాల్సింది. అయితే.. రివైంజ్ డ్రామాలో కొత్తగా ఏం లేకపోవడంతో, అవి సిల్లీ ట్రిక్కులతో లాగించేయడంతో సెకండాఫ్ ట్రాక్ తప్పింది. కాల్ మనీ, చైన్ స్నాచింగ్ లాంటివి పైపైనే చూపించి వదిలేశారు. బలమైన విలన్ లేకపోడం (అసలు విలన్ ఉన్నాడా) ఈ సినిమాకి ప్రధాన లోపం. పైగా తరవాత ఏం జరగబోతోంది? అనే విషయం చాలా ఈజీగా అర్థమైపోతుంటుంది. క్లైమాక్స్‌లో కండలు తిరిగిన రౌడీని సప్తగిరి ఒంటిచేత్తో చితగ్గొట్టేయకుండా.. చిన్న ట్రిక్కుతో పని కానిచ్చేయడం ఆకట్టుకొంటుంది.
* నటీనటుల ప్రతిభ
సప్తగిరి వన్ మ్యాన్ షో.. సప్తగిరి ఎక్స్‌ప్రెస్. సినిమాకి కర్త కర్మ క్రియ అన్నీ తానే. నవ్వించాడు..ఎమోషన్ పండించాడు. ఆ మాటకొస్తే.. కామెడీ సీన్లలో కంటే ఎమోషన్ సీన్లలోనే సప్తగిరి నటన బాగుంది. షకలక శంకర్ సపోర్టింగ్ రోల్‌ని రక్తి కట్టించాడు. పోసానిది అలవాటైన పాత్రే. అజయ్ ఘోష్‌ని ఇంకా ఈ టైపు పాత్రల్లో ఎన్నిసార్లు చూడాలో..?? శివ ప్రసాద్ తండ్రి పాత్రలో ఇమిడిపోయాడు. సప్తగిరి - శివ ప్రసాద్‌ల కాంబోలో వచ్చిన ఎమోషన్ సీన్స్ ఆకట్టుకొంటాయి. హీరోయిన్ పేరుకు మాత్రమే. చెప్పుకోవడానికి ఏం లేదు.
* సాంకేతిక వర్గం
సప్తగిరి సినిమానే కదా, చుట్టేద్దాం అని చూడకుండా క్వాలిటీ మేకింగ్ కోసం కష్టపడింది చిత్రబృందం. కెమెరా పనితనం ఆకట్టుకొంటుంది. సప్తగిరిని పెట్టుకొని ఫారెన్‌లో సాంగులు కూడా తీశారు. పాటల్లో బీట్ ఉంది. ఇంట్రడక్షన్ పాట తెలుగా, ఇంగ్లీషా అనేది అర్థం చేసుకోవడానికి కాస్త టైమ్ పడుతుంది. దర్శకుడికి ఇదే తొలి సినిమా. సప్తగిరి ఇమేజ్‌కి తగ్గట్టే మానేజ్ చేశాడు. మరీ హీరోయిజం కోసం ఓవరాక్షన్‌కి పోకుండా.. ఎంతలో చేయాలో అంతలో చేసి చూపించాడు.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
* చివరగా: ఈమధ్య సునీల్ హీరోగా వచ్చిన చాలా సినిమాలకంటే... సప్తగిరి ఎక్స్‌ప్రెస్ చాలా చాలా బెటర్!