Read more!

English | Telugu

సినిమా పేరు:సుల్తాన్
బ్యానర్:యష్ రాజ్ ఫిల్మ్స్
Rating:2.50
విడుదలయిన తేది:Jul 6, 2016

బాలీవుడ్ బాక్సాఫీస్ వీరుడు సల్మాన్ ఖాన్ టైటిల్ పాత్ర పోషించిన తాజా చిత్రం "సుల్తాన్". సల్మాన్ ఈ సినిమాలో హర్యానాకు చెందిన ఓ మల్లయోధుడిగా నటించగా.. అతడికి జోడీగా అనుష్క శర్మ నటించింది. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఆదిత్య చోప్రా నిర్మించడంతోపాటు స్క్రీన్ ప్లే కూడా సమకూర్చడం విశేషం. సల్మాన్ కు విపరీతంగా అచ్చోచ్చిన "ఈద్" సందర్భంగా నేడు (జూలై 6) విడుదలైన "సుల్తాన్" ప్రేక్షకులను ఏమేరకు అలరించిందో చూద్దాం..!!

కథ:
సుల్తాన్ అలీ ఖాన్ (సల్మాన్ ఖాన్) హర్యానాలోని ఓ మారుమూల గ్రామంలో కేబుల్ టీవి బిజినెస్ చేసుకొంటూ సాధారణ జీవితం గడిపే మధ్యవయస్కుడు. జీవితంలో ఒక గమ్యం అంటూ ఉండదు. తొలిచూపులోనే ఆర్ఫా (అనుష్క శర్మ)ను ఇష్టపడతాడు. అయితే.. పెళ్లాడితే మల్లయోఢుడినే పెళ్లాడాలని ఫిక్స్ అయి ఉన్న ఆర్ఫా కోసం తాను కూడా మల్లయుద్ధం నేర్చుకోవడానికి సిద్ధపడతాడు. కానీ మల్లాయుద్ధంపై ఇష్టం కంటే.. అర్ఫా మీద ప్రేమ ఎక్కువగా ఉన్న సుల్తాన్ ను చీదరించుకోంటుంది ఆర్ఫా.
అర్ఫా చేసిన అవమానానికి ధీటుగా సమాధానం చెప్పాలనుకొన్న సుల్తాన్ కష్టపడి మల్లాయుద్ధంలో స్టేట్ లెవల్ లో మాత్రమే కాకుండా.. నేషనల్ లెవల్ విన్నర్ గా నిలుస్తాడు. అయితే.. ఆటలో గెలవాలన్న తపనతో జీవితంలో భర్తగానే కాక తండ్రిగానూ ఓడిపోతాడు. దాంతో మల్లాయుద్ధాన్ని ఒదిలేస్తాడు.
కొన్నాళ్ళ విరామం అనంతరం ఆకాష్ (అమిత్ సాద్) సుల్తాన్ ను వెతుక్కుంటూ వస్తాడు. మల్లాయుద్ధం లేటెస్ట్ వెర్షన్ అయిన సరికొత్త ఫైటింగ్ పోటీల్లో పాల్గొనమని అడుగుతాడు. మొదట్లో అంగీకరించని సుల్తాన్ ఆ తర్వాత పోటీల్లో పాల్గొనేందుకు డిల్లీ వెళ్తాడు.
మరి సుల్తాన్ ఈ సరికొత్త ఫైటింగ్ పోటీల్లో గెలవగలిగాడా ? అందుకోసం సుల్తాన్ ఎదుర్కొన్నా సమస్యలేమీటీ?
తనకు దూరమైన భార్యను తిరిగి పొందగలిగాడా? వంటి ప్రశ్నలకు సమాధానాల సమాహారమే "సుల్తాన్".


ఎనాలసిస్ :

నటీనటుల పనితీరు:

"సుల్తాన్" పాత్రలో మల్లయోద్ధుడి బాడీ లాంగ్వేజ్ మరియు హర్యానా వాచకంతో సల్మాన్ ఖాన్ ఆడియన్స్ ను క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ చేసేశాడు. తనకంటూ గౌరవాన్ని సంపాదించుకోవాలనుకొనే యోధుడిగా, కన్న కొడుకుని కాపాడులేక చతికిలపడిన తండ్రిగా సల్మాన్ నటన ప్రశంసార్హం. ముఖ్యంగా.. తనమీదున్న తనకే ఉన్న కోపాన్ని ఎవరి మీద చూపించాలో తెలియక, వేసుకొనే చొక్కాపై చిరాకుపడే సీన్ లో సల్మాన్ నటనను మెచ్చుకోకుండా ఉండలేం. అర్ఫా అనే ధీరవనితగా అనుష్క శర్మ సన్నివేశానికి తగ్గట్టుగా ప్రదర్శించిన అభినయం బాగుంది. కాకపోతే.. ఇప్పటివరకూ ఆమెను ఫుల్ జోష్ క్యారెక్టర్లలో చూసి ఒక్కసారిగా సెటిల్డ్ గా చూడాలంటే మాత్రం కాస్త ఇబ్బందిపడాల్సిందే. ట్రైనర్ గా రణదీప్ హుడా, బిజినెస్ మ్యాన్ గా అమిత్ సాద్ లు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతికవర్గం పనితీరు:

టైటిల్ కార్డ్ నుంచి ఎండింగ్ వరకూ థియేటర్ లో కూర్చున్న ప్రేక్షకుడ్ని సినిమాలో లీనమయ్యేలా చేసింది విశాల్-శేఖర్ ల సంగీతం. పాటలు పర్వాలేదనిపించుకొనేలా ఉన్నా.. నేపధ్య సంగీతం మాత్రం అదరగొట్టారు. "సుల్తాన్" థీమ్ మ్యూజిక్ అయితే రోమాలు నిక్కబొడుచుకొనే స్థాయిలో ఉందనడంతో ఎటువంటి అతిశయోక్తిలేదు. ఆర్ధర్ ఫోటోగ్రఫీ రెగ్యులర్ గా ఉంది. యాక్షన్ సీన్స్ లో గింబల్ సహాయంతో చిత్రీకరించిన క్లోజ్ షాట్స్ మినహా చెప్పుకోదగ్గ స్థాయిలో ఒక్క కెమెరా షాట్ కూడా లేకపోవడం గమనార్హం. ఈ చిత్రానికి నిర్మాత అయిన ఆదిత్య స్వయంగా సమకూర్చిన స్క్రీన్ ప్లే ఈ సినిమాకి మైనస్ గా మారింది. కథలో ఎక్కడా ఉత్సాహం ఉండదు. ఫస్టాఫ్ మొత్తం సాదాసీదాగా సాగిపోగా.. సెకండాఫ్ లో కేవలం ఫైటింగ్ సీన్స్ మినహా ఆకట్టుకొనే అంశాలు ఏమీ లేకపోవడం "సుల్తాన్"ను బ్లాక్ బస్టర్ హిట్ అవ్వకుండా ఆపింది. నిర్మాణ విలువలు మాత్రం అదిరిపోయాయి.

అలీ అబ్బాస్ జాఫర్ రాసుకొన్న కథ హాలీవుడ్ బాక్సింగ్ సిరీస్ సినిమాలైన "రాకీ" సిరీస్ ను తలపిస్తాయి. సెకండాఫ్ మొత్తం మనకి "రాకీ 3,4" భాగాలను చూస్తున్న అనుభూతి కలుగుతుంది. అయితే.. సల్మాన్ అభిమానులకు కావాల్సిన కమర్షియల్ అంశాలను మాత్రం దట్టంగా జోడించాడు దర్శకుడు. అందువల్ల కథనంలో వేగం తగ్గినప్పటికీ.. సల్మాన్ ఫ్యాక్టర్ ఆ లోటును కనపడనివ్వదు.

 


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

"సుల్తాన్" అనేది ఒక వ్యక్తి జీవితగాధ. అయితే.. జీవితంలో అంటే కేవలం మల్లాయుద్ధమేనా అనేట్లుగా సాగుతుంది "సుల్తాన్" సెకండాఫ్. మానవీయ బంధాలను, మనోభావాలను సమపాళ్లలో మేళవించడంలో విఫలమయ్యాడు దర్శకుడు. ఆ కారణంగా యాక్షన్ లవర్స్ ను తప్పితే ఫ్యామిలీ ఆడియన్స్ ను "సుల్తాన్" పెద్దగా ఆకట్టుకోదు. సల్మాన్ మునుపటి చిత్రాలు "భజరంగీ భాయిజాన్, ప్రేమ్ రతన్ ధన్ పాయో" చిత్రాలు మాస్ తోపాటు క్లాస్ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకొన్నాయి. "సుల్తాన్"లో ఆ ఫ్యామిలీ ఫ్యాక్టర్ మిస్ అయ్యింది. ఆడియన్స్ అందరూ ఎంతో ఆశగా ఎదురుచూసిన క్లైమాక్స్ ఫైట్ కూడా చాలా పేలవంగా ముగియడంతో.. ప్రేక్షకులు కాస్త నిరాశచెందుతారు. అయితే.. మాస్ ఆడియన్స్ మరియు సల్మాన్ అభిమానులకు మాత్రం "సుల్తాన్" ఓ సూపర్ ఫీస్ట్. "సుల్తాన్" బంపర్ ఓపెనింగ్స్ సాధించడం ఖాయమే కానీ.. మునుపటి చిత్రాల స్థాయిలో భారీ వసూళ్లు రాబడుతుందో లేదో చూడాలి!