Read more!

English | Telugu

సినిమా పేరు:సలార్
బ్యానర్:హోంబలే ఫిలింస్‌
Rating:2.75
విడుదలయిన తేది:Dec 22, 2023

సినిమా : సలార్
నటీనటులు: ప్రభాస్‌, శృతిహాసన్‌, పృథ్విరాజ్‌ సుకుమారన్‌, జగపతిబాబు, బాబి సింహా, టిన్ను ఆనంద్‌, ఈశ్వరీరావు, శ్రీయారెడ్డి, ఝాన్సీ, బ్రహ్మాజీ, షఫీ, పృథ్వి, జాన్‌ విజయ్‌ తదితరులు
సినిమాటోగ్రఫీ: భువన్‌ గౌడ
సంగీతం: రవి బస్రూర్‌
ఎడిటింగ్‌: ఉజ్వల్‌ కులకర్ణి
నిర్మాత: విజయ్‌ కిరగందూర్‌
బ్యానర్‌: హోంబలే ఫిలింస్‌
రచన, దర్శకత్వం: ప్రశాంత్‌ నీల్‌
విడుదల తేదీ: 22 డిసెంబర్‌, 2023
సినిమా నిడివి: 175.16 నిమిషాలు

బాహుబలి సిరీస్‌తో పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్‌, కెజిఎఫ్‌ సిరీస్‌తో మోస్ట్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న ప్రశాంత్‌ నీల్‌.. వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా వస్తోందంటే దానికి ఎలాంటి హైప్‌ ఉంటుంది, ఆడియన్స్‌లో ఎలాంటి క్రేజ్‌ ఏర్పడుతుంది.. అనేది ‘సలార్‌’ ప్రూవ్‌ చేసింది. ఈ సినిమా ఎనౌన్స్‌ చేసినప్పటి నుంచి సినిమా ఎప్పుడు రిలీజ్‌ అవుతుందా అని ఆడియన్స్‌, అభిమానులు ఎదురుచూశారు అంటే సినిమాపై ఎంతటి భారీ అంచనాలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. బాహుబలితో ప్రభాస్‌ని హీరోగా ఎక్కడో నిలబెట్టాడు రాజమౌళి. కెజిఎఫ్‌తో యశ్‌కి హీరోగా భారీ ఇమేజ్‌ తెచ్చిపెట్టాడు ప్రశాంత్‌ నీల్‌. ఇప్పుడు ప్రభాస్‌ ఇమేజ్‌కి తగ్గట్టు ‘సలార్‌’ని రూపొందించడంలో ప్రశాంత్‌ నీల్‌ ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాడు? ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉన్న ప్రభాస్‌ హీరోయిజాన్ని ఎలా ఎలివేట్‌ చేశాడు? ప్రభాస్‌ని అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో.. ఆ రేంజ్‌లో అతన్ని ప్రెజెంట్‌ చేశాడా? రెండు భాగాలుగా రూపొందుతున్న ‘సలార్‌’ మొదటి భాగంలో ఏం చెప్పాడు? అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం.

కథ :-

ట్రైలర్‌లో చూపించినట్టుగానే దేవా(ప్రభాస్‌), వరదరాజమన్నార్‌(పృథ్విరాజ్‌ సుకుమారన్‌) మంచి స్నేహితులు. దేవా కోసం తన అధికారాన్నే వదులుకోవడానికి సిద్ధ పడతాడు వరద, అలాగే వరద కోసం ఏం చెయ్యడానికైనా సిద్ధపడతాడు దేవా. వారి చిన్నప్పటి ఎపిసోడ్‌తో కథ మొదలవుతుంది. కొన్ని కారణాల వల్ల ఇద్దరూ విడిపోవాల్సి వస్తుంది. అయితే ఎప్పుడు ఏ అవసరం వచ్చినా  తాను వస్తానని వరదకు చెప్తాడు దేవా. కట్‌ చేస్తే.. దేవా, అతని తల్లి ఎవరికీ తెలీని ఓ ప్రాంతంలో రహస్యంగా జీవిస్తుంటారు. ఆద్య(శృతి హాసన్‌).. కృష్ణకాంత్‌ అనే వ్యక్తి కుమార్తె. వారు విదేశాల్లో ఉంటారు. మరో పక్క కృష్ణకాంత్‌పై పగతో రగిలిపోతుంటుంది రాధారమ(శ్రీయారెడ్డి). అతను ఎప్పుడు ఇండియా వస్తాడా, ఎప్పుడు అతన్ని అంతమొందించాలా అని చూస్తుంటుంది. అదే టైమ్‌లో కృష్ణకాంత్‌కి తెలీకుండా ఆద్య ఇండియా బయల్దేరుతుంది. ఈ విషయం తెలుసుకున్న రాధారమ ఆమెను పట్టుకోమని అనుచరుల్ని పురమాయిస్తుంది. కట్‌ చేస్తే.. రాధారమ అనుచరుల నుంచి ఆద్యను తప్పించి దేవా ఉంటున్న ప్లేస్‌కి తీసుకొచ్చి ఆమెను కాపాడే బాధ్యతను దేవాకి అప్పగిస్తాడు కృష్ణకాంత్‌ మనిషి. ఆ తర్వాత వరదరాజమన్నార్‌కు ఓ సమస్య వస్తుంది. ఆ సమయంలో దేవా అవసరమవుతాడు. అతన్ని స్వయంగా వెళ్లి తీసుకొస్తాడు. అక్కడి నుంచి కథ రకరకాల మలుపులు తిరుగుతూ వెళుతుంది. అసలు ఈ కథలో ఎలాంటి మలుపులు ఉన్నాయి. రెండు భాగాలుగా విడుదలవుతున్న ఈ సినిమాలోని మొదటి భాగాన్ని ఎలా డీల్‌ చేశాడు? వరదరాజమన్నార్‌కి వచ్చిన సమస్య ఏమిటి? రాధారమ పగకి కారణం ఏమిటి?.. ఇలాంటి ఎన్నో ప్రశ్నలు సినిమాలు మనకు కనిపిస్తాయి. అయితే రెండో భాగం కోసం ఎదురుచూసేలా ప్రశాంత్‌ నీల్‌ ప్రేక్షకుల్ని ఎలా సిద్ధం చేశాడు? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.


ఎనాలసిస్ :

ఈ సినిమాను ఒక కథగా చెప్పాలంటే ఎంతో కష్టంతో కూడుకున్న పని. చాలా పెద్ద స్పాన్‌ ఉన్న కథ. ఎన్నో పాత్రలు, మరెన్నో ఊహకందని ట్విస్టులు, అసహజంగా అనిపించే బ్యాక్‌డ్రాప్‌లతో సినిమా అంతా కలగాపులగంగా అనిపిస్తుంది. ఏ ఒక్క సీన్‌ కూడా నిలకడగా ఉన్నట్లు అనిపించదు. ఒక సీన్‌ని ఆడియన్స్‌ అర్థం చేసుకునేలోపే మరో సీన్‌ ఎంటర్‌ అవుతుంది. రెండు భాగాలుగా సినిమా అనుకోవడం వల్ల కొన్ని సీన్స్‌ను, పాత్రలను ప్రశ్నార్థకంగా వదిలిపెట్టాడా దర్శకుడు అని ఆలోచించే లోపే మరో ట్విస్ట్‌ తెరపై ప్రత్యక్షమవుతుంది. ఈ కథలో కాన్సార్‌ అనే ఓ కల్పిత ప్రదేశం గురించి చెబుతారు. ఈ ప్రాంతంలో మూడు తెగలు ఉంటాయి. కొన్ని పాత్రలను పరిచయం చేసే క్రమంలో ఏ పాత్ర ఏ తెగకు చెందింది, అక్కడ వారు దేనికి ప్రతినిధులు అని అర్థం చేసుకునే సరికి మన బుర్ర వేడెక్కుతుంది. అయితే అవేవి తలకెక్కించుకోకుండా కేవలం విజువల్స్‌, యాక్షన్‌ సీక్వెన్సులు, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌, ప్రభాస్‌ హీరోయిజం.. ఇవన్నీ చూస్తే చాలు అనే ఫీలింగ్‌ కలుగుతుంది. ఇంకా రెండో భాగం ఉంది కాబట్టి మొదటి భాగాన్ని ఒక ట్విస్ట్‌ ఇచ్చి ముగించాడు ప్రశాంత్‌ నీల్‌. 

నటీనటులు :-

బాహుబలి సినిమాలో ప్రభాస్‌ని రాజమౌళి ఎంత ఎలివేట్‌ చేశాడో ‘సలార్‌’లో ప్రశాంత్‌ నీల్‌ అంతకు పదిరెట్లు ఎలివేట్‌ చేశాడని చెప్పడంలో సందేహం లేదు. ముఖ్యంగా ఫస్ట్‌హాఫ్‌లో వచ్చే కొన్ని సీన్స్‌ ఫ్యాన్స్‌చేత విజిల్స్‌ వేయిస్తాయి, కేరింతలు కొట్టిస్తాయి. దానికి తగ్గట్టుగానే ప్రభాస్‌ కటౌట్‌ కూడా ఉండడంతో ప్రతి సీన్‌ ఓ రేంజ్‌లో ఉంటుంది. అతనికి సినిమాలో చాలా తక్కువ డైలాగ్స్‌ ఉంటాయి. ప్రభాస్‌ చెప్పిన డైలాగ్స్‌ ఎక్కడా అర నిమిషం నిడివి కూడా ఉండదంటే ఎంత తక్కువ డైలాగ్స్‌ పెట్టారో అర్థం చేసుకోవచ్చు. ఇక హీరోయిన్‌ అనే పేరుకి మాత్రమే ఉన్న శృతిహాసన్‌ ఒక కీలకమైన పాత్రలా అనిపిస్తుంది తప్ప హీరోయిన్‌గా కనిపించదు. అయితే సెకండాఫ్‌లో ఆమె క్యారెక్టర్‌ పెరుగుతుందేమో తెలీదు. ఇక పృథ్విరాజ్‌ సుకుమారన్‌ చాలా ఆలస్యంగా తెరపై కనిపిస్తాడు. వరదగా అతని పెర్‌ఫార్మెన్స్‌ కూడా బాగుంది. ఇక జగపతిబాబు రాజమన్నార్‌గా హుందాగా అనిపించాడు. దేవా తల్లిగా నటించిన ఈశ్వరిరావు తన క్యారెక్టర్‌కి పూర్తి న్యాయం చేసింది. ఇక మిగిలిన క్యారెక్టర్స్‌కి సంబంధించి పూర్తి ఎలివేషన్‌ మొదటి భాగంలో లేదు.

సాంకేతిక నిపుణులు :-

ఈ సినిమాకి కథ కంటే టెక్నికల్‌గానే ఎక్కువ ఎస్సెట్స్‌ ఉన్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా భువనగౌడ్‌ అందించిన సినిమాటోగ్రఫీ సినిమాకి చాలా ప్లస్‌ అయింది. ప్రతి సీన్‌ని ఎంతో అందంగా చూపించడంలో అతను సక్సెస్‌ అయ్యాడు. ఆ తర్వాత చెప్పుకోవల్సింది సంగీత దర్శకుడు రవి బస్రూర్‌ గురించి. సినిమాలోని పాటలు అంతంత మాత్రంగానే ఉన్నా, యాక్షన్‌ సీన్స్‌, కొన్ని ఎమోషనల్‌ సీన్స్‌ బాగా ఎలివేట్‌ అయ్యాయంటే దానికి హండ్రెడ్‌ పర్సెంట్‌ అతను అందించిన బ్యాక్‌గ్రౌండ్‌ కారణం. ముఖ్యంగా యాక్షన్‌ సీన్స్‌లో అతను చేసిన స్కోర్‌ హాలీవుడ్‌ మూవీస్‌ని తలపించేలా ఉంది. ఎంతో భారీతనంతో కూడిన సంగీతాన్ని అందించాడు రవి. ఇక ఎడిటర్‌ ఉజ్వల్‌ కులకర్ణి కష్టం సినిమాలో ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే కథలో ఎన్నో ట్విస్టులు, మరెన్నో జంప్స్‌.. వాటన్నింటినీ మేనేజ్‌ చేస్తూ ఎడిటింగ్‌ చేయడమంటే మామూలు విషయం కాదు. అయితే దాదాపు మూడు గంటల నిడివి ఉన్న సినిమాను కనీసం మరో 20 నిమిషాలు తగ్గించే అవకాశం ఉన్నా.. డైరెక్టర్‌ ఆదేశాల మేరకు ఆ పని చేసి ఉండకపోవచ్చు. ప్రొడక్షన్‌ వేల్యూస్‌ గురించి చెప్పాలంటే హోంబలే ఫిలింస్‌ ఎక్కడా రాజీ పడకుండా ప్రతి సీన్‌లో రిచ్‌నెస్‌ ఉండేలా చేశారు. భారీ బడ్జెట్‌ ప్రతి సీన్‌లోనూ తెరపై కనిపిస్తుంది. ఇక డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ గురించి చెప్పాలంటే.. కెజిఎఫ్‌ పోకడలు ఈ సినిమాలోనూ చాలా చోట్ల కనిపిస్తాయి. ముఖ్యంగా పాత్రల పరిచయం అనేది అతని సినిమాలో కనిపించే పెద్ద కన్‌ఫ్యూజన్‌. కెజిఎఫ్‌లో సైతం రకరకాల గ్యాంగ్‌ లీడర్ల పేర్లను ప్రస్తావించినపుడు ఒకరకమైన కన్‌ఫ్యూజన్‌ ఆడియన్స్‌కి కలుగుతుంది. ‘సలార్‌’లోనూ అదే కన్‌ఫ్యూజన్‌ కొనసాగింది. అసలు కొన్ని సీన్స్‌ ఎందుకు వస్తాయో అర్థంకాని పరిస్థితి ఉంటుంది. అయితే కథను తాను అనుకున్న విధంగా నడిపించిన తీరు, ప్రభాస్‌ని ఓ రేంజ్‌లో చూపించడంలో అతను చేసిన కృషి కనిపిస్తుంది. ప్రభాస్‌ని ఎలా అయితే అభిమానులు చూడాలనుకుంటున్నారో దాన్ని మించి ఈ సినిమాలో చూపించాడు. 


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

ఈమధ్యకాలంలో ప్రేక్షకులు, అభిమానులు కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూసిన సినిమా ‘సలార్‌’. హీరోని ఓ రేంజ్‌లో ఎలివేట్‌ చెయ్యడంలో సిద్ధహస్తుడైన ప్రశాంత్‌ నీల్‌పై అభిమాను అంతులేని ఆశలు పెంచుకున్నారు. అయితే దాన్ని మించిన రేంజ్‌లో ప్రభాస్‌ని చూపించి ఫ్యాన్స్‌ని టూ హండ్రెడ్‌ పర్సెంట్‌ శాటిస్‌ఫై చేశాడు ప్రశాంత్‌ నీల్‌. ఈ సినిమాను కథగా చూడడం కంటే, ప్రభాస్‌ హీరోయిజం, యాక్షన్‌ సీక్వెన్సులు, థ్రిల్‌ చేసే కొన్ని ఎపిసోడ్స్‌, కొన్ని విజువల్‌ ఎఫెక్ట్స్‌, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌.. కథ, కథనాలకు అతీతంగా ఉండే అంశాలను మాత్రం ఆడియన్స్‌ బాగా ఎంజాయ్‌ చేస్తారు. ఎందుకంటే కథ, కథనం, క్యారెక్టర్ల విషయంలో ఆడియన్స్‌ని విపరీతంగా కన్‌ఫ్యూజ్‌ చేసిన ప్రశాంత్‌ నీల్‌ మిగతా విషయాల్లో మాత్రం అందర్నీ శాటిస్‌ఫై చేశాడు. ఈ సినిమా కేవలం ఫ్యాన్స్‌ కోసమే తీసినట్టు అనిపిస్తుంది. ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఆకట్టుకునే అంశం సినిమాలో ఒక్కటి కూడా లేదంటే అతిశయోక్తి కాదు. 

- జి.హరా