English | Telugu
బ్యానర్:ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్
Rating:2.00
విడుదలయిన తేది:Aug 6, 2021
నటీనటులు: కిరణ్ అబ్బవరం, ప్రియాంకా జవాల్కర్, సాయికుమార్, తులసి తదితరులు
కథ - కథనం - మాటలు : కిరణ్ అబ్బవరం
సినిమాటోగ్రఫీ: విశ్వాస్ డేనియల్
సంగీతం: చైతన్ భరద్వాజ్
కూర్పు - దర్శకత్వం: శ్రీధర్ గాదె
బ్యానర్: ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్
నిర్మాతలు: ప్రమోద్ - రాజు
విడుదల తేదీ: 06 ఆగస్టు 2021
'రాజావారు రాణీగారు' సినిమాతో హీరోగా తొలి సినిమాతో కిరణ్ అబ్బవరం చక్కటి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. అతను హీరోగా నటించిన రెండో సినిమా 'ఎస్ఆర్ కళ్యాణమండపం'. కరోనా కాలంలో ఈ సినిమాలో పాటలు 'చూశారా కళ్లారా', 'చుక్కల చున్నీ' బాగా వినిపించాయి. టీజర్, ట్రైలర్లు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. మరి, సినిమా ఎలా ఉంది? రెండో సినిమాతో కిరణ్ అబ్బవరం రెండో విజయం అందుకున్నాడా? లేదా?
కథ:
కల్యాణ్ (కిరణ్ అబ్బవరం) బీటెక్ స్టూడెంట్. సింధు (ప్రియాంక జవల్కర్) అంటే అతడికి పిచ్చి. కుక్కలా తన వెంట పడొద్దని సింధు చెబుతున్నా వినిపించుకోడు. కుక్కను చూసినట్టు చూసుకోమని చెబుతాడు. అన్నట్టు ఇద్దరిదీ ఒకే ఊరు. ఊళ్లో ఎస్ఆర్ కళ్యాణమండపం ఉంటుంది. కల్యాణ్ తాతయ్య అందులో ఎన్నో వేల పెళ్లిళ్లు చేయించారని మంచి పేరు ఉంది. ఆయన మరణం తర్వాత కల్యాణ్ తండ్రి ధర్మ (సాయికుమార్) తాగుడుకు బానిసై కళ్యాణమండపాన్ని సరిగా పట్టించుకోడు. తల్లి కోరిక మేరకు కళ్యాణమండపానికి పూర్వవైభవం తీసుకొచ్చే బాధ్యతను భుజాన వేసుకుంటాడు కల్యాణ్. ఆ క్రమంలో సింధు తండ్రితో గొడవ పడతాడు. ఆ గొడవకు కారణం ఏమిటి? కల్యాణ్ పదేళ్లుగా కన్నతండ్రితో ఎందుకు మాట్లాడటం లేదు? సింధును వేరే అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలని ఆమె తండ్రి నిర్ణయిస్తే కల్యాణ్ ఏం చేశాడు? అతడి తండ్రి ఏం చేశాడు? చివరకు, తండ్రీకొడుకులు మాట్లాడుకున్నారా? లేదా? అనేది మిగతా సినిమా.
ఎనాలసిస్ :
నేల విడిచి సాము చేయడకూడనేది ఓ సామెత. సినిమాలకు వస్తే కథను విడిచి సాము చేయకూడదు. సినిమాకు ఆయువుపట్టు లాంటి ఎమోషన్ ను చివరి వరకూ దాచిపెట్టి హీరోయిజం బిల్డప్ షాట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తే... 'ఎస్ఆర్ కళ్యాణమండపం'లా ఉంటుంది. కిరణ్ అబ్బవరం హీరోగా తన రెండో సినిమాకు తానే కథ రాసుకున్నాడు. మాస్ ఇమేజ్ కోసం విపరీతంగా ఆరాటపడ్డాడు. సినిమా ప్రారంభం నుండి ముగింపు ముందు పావుగంట వరకూ అది కనిపించింది. హీరోకి అంత బిల్డప్ అవసరం లేదేమో అనిపిస్తుంది. ఆ సన్నివేశాలు ఇరిటేట్ చేస్తాయి. హీరోయిజం కంటే ఎమోషన్ మీద దృష్టి పెట్టి ఉంటే బావుండేది. కథా రచయితగా, కథకుడిగా కిరణ్ అబ్బవరం ఫెయిల్ కూడా అయ్యాడు. హీరోను అమ్మాయి ఛీ కొట్టడం, తర్వాత ప్రేమలో పడటం, ఇద్దరి ప్రేమకు హీరోయిన్ తండ్రి అడ్డుపడటం వంటివి చాలా తెలుగు సినిమాల్లో ప్రేక్షకులు చూశారు. 'ఇడియట్'కు ముందు, ఆ తర్వాత వచ్చాయి. అయితే, 'ఇడియట్'లో హీరో క్యారెక్టరైజేషన్ టిపికల్ గా ఉంటుంది. ఆ టైపులో ట్రై చేశారు. కానీ, వర్కవుట్ కాలేదు. హీరో తండ్రిని తాగుబోతుగా చూపించడం, హీరో కూడా ఫస్టాఫ్ లో మందు కొడుతూ ఉండటం సినిమాలో కోర్ ఎమోషన్ పాయింట్‌కు కనెక్ట్ కాలేదు. అయితే... పతాక సన్నివేశాలకు వచ్చేసరికి సాయికుమార్ తన అనుభవంతో సినిమాను కొంతలో కొంత నిలబెట్టారు. తండ్రి పాత్రకు ఆయన న్యాయం చేశారు.
సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే... సంగీత దర్శకుడు చైతన్ భరద్వాజ్ గురించి చెప్పుకోవాలి. ఆల్రెడీ రెండు పాటలు హిట్. సినిమాలో మిగతా పాటలు కూడా బావున్నాయి. కొన్ని సన్నివేశాల్లో నేపథ్య సంగీతం కొత్తగా ఉంది. బావుందని అనిపిస్తుంది. కెమెరా వర్క్ పర్వాలేదు. నిర్మాణ విలువలు కూడా బావున్నాయి. కానీ, కథనంలో చాలా లోపాలు ఉన్నాయి. ట్విస్టులను ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు.
నటీనటుల పనితీరు:
కిరణ్ అబ్బవరం మొదటి సినిమాలో సెటిల్డ్ గా చేశాడు. రెండో సినిమాలో మాస్ క్యారెక్టర్ ట్రై చేశాడు. నటుడిగా కొంత పరిణితి చూపించాడు. ఇంకా మెరుగవ్వాల్సిన అవసరం ఉంది. హీరోయిన్ ప్రియాంక జవల్కర్ పర్వాలేదు. లుక్స్ పరంగా కంటిన్యూటీ మైంటైన్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. కొన్ని సన్నివేశాల్లో బాలేదు. సాయికుమార్ వందకు రెండొందల శాతం న్యాయం చేశారు. ముఖ్యంగా పతాక సన్నివేశాల్లో ఆయన నటన అద్భుతం. భర్తను తులసి తిట్టే సీన్లు ఓవర్ ద బోర్డ్ వెళ్లాయి. ఎమోషనల్ సీన్లు బాగా చేశారు. తనికెళ్ల భరణి, గంగవ్వ పాత్రల పరిధి తక్కువ. హీరో స్నేహితులకు మంచి స్క్రీన్ స్పేస్ దొరికింది. రొటీన్ సీన్స్ కావడం వల్ల ఎవరికీ టాలెంట్ చూపించే స్కోప్ దక్కలేదు. శ్రీకాంత్ అయ్యంగార్ ఎప్పటిలా తనదైన శైలిలో నటించారు. రోజు రోజుకూ ఆయన నటన రొటీన్ అవుతున్న ఫీలింగ్ కలుగుతోంది.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
రెగ్యులర్, రొటీన్ రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమా 'ఎస్ఆర్ కళ్యాణమండపం'. గ్రామీణ నేపథ్యంలో తండ్రీకుమారుల అనుబంధం ప్రధాన అంశంగా తెరకెక్కించారు. అయితే... అటు అనుబంధం మీద కాన్సంట్రేట్ చేసినా, ఇటు కథానాయికతో కళ్యాణం మీద దృష్టి పెట్టినా బ్లాక్ బస్టర్ అయ్యేది. అటు ఓ అడుగు, ఇటు ఓ అడుగు వేయడంతో ఎటూ కాకుండా కిచిడి అయినట్టు అయ్యింది. పతాక సన్నివేశాల్లో సాయికుమార్ నటన, పాటలు బావున్నాయి. అంతే!