English | Telugu
బ్యానర్:JB ఎంటర్టైన్మెంట్స్, జీ స్టూడియోస్
Rating:3.00
విడుదలయిన తేది:Oct 1, 2021
సినిమా పేరు: రిపబ్లిక్
తారాగణం: సాయి తేజ్, రమ్యకృష్ణ, ఐశ్వర్యా రాజేష్, జగపతి బాబు, శ్రీకాంత్ అయ్యంగార్, సుబ్బరాజు తదితరులు
స్క్రీన్ ప్లే: దేవ్ కట్టా, కిరణ్ జయ్ కుమార్
కూర్పు: ప్రవీణ్ కెఎల్
ఛాయాగ్రహణం: ఎం. సుకుమార్
సంగీతం: మణిశర్మ
నిర్మాతలు: జె. భగవాన్, జె. పుల్లారావు
కథ, దర్శకత్వం: దేవ్ కట్టా
విడుదల తేదీ: 1 అక్టోబర్ 2021
'రిపబ్లిక్' సినిమాలో హీరోగా నటించిన సాయి తేజ్ రోడ్డు ప్రమాదానికి గురై, గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉండటంతో... ప్రచార కార్యక్రమాల్లో హీరో లేని లోటు పూడ్చటానికి మేనల్లుడి కోసం పవన్ కల్యాణ్ ప్రీ-రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేశారు. అక్కడ పవన్ సినిమా గురించి మాట్లాడిన మాటల కంటే ఏపీ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రాజకీయ కాక లేపాయి. అదంతా పక్కన పెడితే... ఎవరికీ అపరిమిత అధికారాలు ఇవ్వకూడదని ఆ రోజు పవన్ వ్యాఖ్యానించారు. ఆ అంశం మీద తీసిన చిత్రమే 'రిపబ్లిక్'.
ప్రచార చిత్రాలు చూస్తే 'రిపబ్లిక్' ఎటువంటి చిత్రమనే అంచనాకు రావచ్చు. సినిమా ప్రారంభంలో 'ఈ కాలంలో మన జీవితాల నుండి రాజకీయాలను వేరు చేయలేము' అని తెరపై కనిపిస్తుంది. అంతలా సమాజం మీద రాజకీయ ప్రభావం ఏ విధంగా ఉంటుందనేది చర్చించిన చిత్రమిది. ప్రజాస్వామ్య వ్యవస్థ సక్రమంగా నడవాలంటే ప్రభుత్వ ఉద్యోగులు, చట్టసభలు, న్యాయవ్యవస్థ సమన్వయంతో పని చేయాలని... మూడు గుర్రాల్లో ఏది గాడి తప్పినా, మిగతా రెండూ కళ్లెం వేయాలనే కథాంశంతో దేవ్ కట్టా సినిమా తీశారు. ఈ అంశాన్ని కథగా ఎలా మార్చారు? సినిమాగా ఎలా తీశారు? సినిమా ఎలా ఉంది?
కథ:- పంజా అభిరామ్(సాయి తేజ్) మెరిట్ స్టూడెంట్. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాలని అనుకుంటాడు. ఆ సమయంలో ఓటు వేయడానికి వెళ్లినప్పుడు తన ఓటు ఎవరో వేశారని తెలుస్తుంది. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో సివిల్ సర్వెంట్ అవ్వాలని అనుకుంటాడు. ఆల్రెడీ సివిల్స్ ఎగ్జామ్ రాసి ఇంటర్వ్యూకి ఎంపికై ఉండటంతో ఇంటర్వ్యూకి వెళతాడు. ఐఏఎస్ అవుతాడు. పశ్చిమ గోదావరి జిల్లాగా అతడికి పోస్టింగ్ వస్తుంది. అప్పుడు తెల్లేరు (కొల్లేరు పేరును ఆ విధంగా మార్చారు) కాలుష్యాన్ని అరికట్టడానికి అభిరామ్ ఏం చేశాడు? అప్పుడే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన విశాఖ వాణి (రమ్యకృష్ణ)కి చెందిన ప్రాంతీయ పార్టీ అభిరామ్ చర్యల పట్ల ఏ విధంగా స్పందించింది. మధ్యలో మైరా (ఐశ్వర్యా రాజేష్), అభిరామ్ తండ్రి - డిప్యూటీ కలెక్టర్ అయిన దశరథ్ (జగపతిబాబు) పాత్రలు ఏమిటి? విశాఖ వాణి, అభిరామ్ మధ్య వివాదం ఏమిటి? అనేది మిగతా సినిమా.
ఎనాలసిస్ :
దేవ్ కట్టా చెప్పాలనుకున్న కథలో విషయం ఉంది. కథనం ఆసక్తికరంగా ఉంది. అతనికి హీరో, ఇతర నటీనటులు, నిర్మాతల నుండి పూర్తి సహకారం లభించిందని సినిమా చూస్తుంటే తెలుస్తుంటుంది. దేవ్ కట్టా నిజాయతీగా తీసిన చిత్రమిది. రాజకీయ, న్యాయ, ప్రభుత్వ వ్యవస్థలు ఏ విధంగా ఉండాలో చెప్పే చిత్రమిది. రాజకీయ నాయకులు, ముఖ్యంగా అధికారంలో ఉన్న ప్రభుత్వం చేతిలో ప్రభుత్వ, న్యాయ అధికారులు ఏ విధమైన ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నారనేది కూడా చెప్పారు. కొల్లేరు, కొల్లేరును ఆక్రమించుకుని కొందరు చేపట్టిన చేపల పెంపకం... దాని మూలంగా ఏర్పడిన కాలుష్యం వల్ల ప్రజలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంత ఇబ్బంది పడ్డారనే నేపథ్యాన్ని ఎంచుకోవడం కూడా బావుంది. అయితే... సినిమా నిదానంగా నడవడం కొంత ఇబ్బంది పెట్టే అంశం. మరొకటి... అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వంలో అవినీతి, అవకతవకలు జరిగాయని ముఖ్యమంత్రి రివర్స్ టెండర్లు పిలవడం, తర్వాత కొన్ని సన్నివేశాలు... జెండా రంగులు సైతం అధికార ప్రభుత్వాన్ని గుర్తుచేసే విధంగా ఉండటం కొందరికి పంటికింద రాయిలా తగిలే అంశమే.
కథ, కథాంశంలో విషయం ఉన్నప్పటికీ... పాత్రలను ఎస్టాబ్లిష్ చేయడానికి దేవ్ కట్టా సమయం తీసుకున్నారు. ప్రథమార్థంలో... హీరో హీరోయిన్ మధ్య పరిచయ సన్నివేశాలు, తర్వాత 'జోర్ సే' పాట నిడివి పెంచిన భావన కలిగించాయి. అసలు కథలోకి వెళ్లిన తర్వాత సినిమా కొంత వేగం అందుకుంది. అయినా... నిదానంగా నడిచిందని చెప్పాలి. ద్వితీయార్థంలో సైడ్ ట్రాక్స్ లేకుండా మెయిన్ ట్రాక్ మీద కథ వెళ్లింది. డ్రామా పండింది. పతాక సన్నివేశాలు కొందరినైనా కంటతడి పెట్టిస్తాయి.
మణిశర్మ అందించిన పాటల్లో స్వేచ్ఛ గురించి వివరించిన తొలి గీతం, పతాక సన్నివేశాల తర్వాత వచ్చే విషాద గీతం కథకు తగ్గట్టు ఉన్నాయి. మామూలుగా వినడం కంటే సినిమా చూసినప్పుడు వాటి ప్రభావం ఎక్కువ ఉంటుంది. 'జోర్ సే' పాటను కథలో ఇరికించినట్టు ఉంది. నేపథ్య సంగీతం పర్వాలేదు. ఛాయాగ్రహణం, నిర్మాణ విలువలు బావున్నాయి.
నటీనటుల పనితీరు:- సాయితేజ్ పాత్రను బాగా అర్థం చేసుకున్నాడు. దాని పరిధి దాటకుండా తన వంతు బాధ్యతగా చక్కటి నటన కనబరిచాడు. హీరో ఇమేజ్ కనపడకుండా పాత్ర మాత్రమే కనిపించేలా నటించాడు. నిడివి పరంగా ఐశ్వర్యా రాజేష్, రమ్యకృష్ణ, జగపతిబాబు పాత్రల పరిధి తక్కువే. కానీ, ఆ ముగ్గురూ ప్రేక్షకులపై చూపించే ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఓ విషాదం (ట్విస్ట్ రివీల్ చేయకూడదు కాబట్టి అదేమిటో చెప్పడం లేదు) తర్వాత ఐశ్వర్యా రాజేష్ నటన సహజంగా ఉంటుంది. ప్రచార చిత్రాల్లో కట్ట మీద చూపించిన సన్నివేశంలో రమ్యకృష్ణ నటనలో రాజసం ఉట్టి పడుతుంది. ఆమె కనిపించిన ప్రతిసారి సినిమాలో ఒక హై వస్తుంది. జగపతిబాబు కూడా పాత్రలో జీవించారు. కొన్ని సన్నివేశాల్లో ఆయన నటన కన్నీళ్లు పెట్టిస్తుంది. సివిఎల్ నరసింహారావు న్యాయమూర్తిగా కనిపించేది ఒక్క సన్నివేశంలో మాత్రమే అయినప్పటికీ... అది సినిమాకి హైలైట్ అవుతుంది. నటుడు ఉత్తేజ్ తనయ చేతన, శ్రీకాంత్ అయ్యంగార్, మనోజ్ నందం, పోసాని కృష్ణమురళి తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన సామజిక చిత్రమిది. ప్రజల్లో చైతన్యం కలిగించే ప్రయత్నమిది. ప్రజలు, రాజకీయ నాయకులకు ఓ మేలుకొలుపు కూడా! నెమ్మదిగా సాగిన ఫస్టాఫ్, కొన్ని సన్నివేశాలను వదిలేస్తే... సగటు కమర్షియల్ సినిమాలకు భిన్నమైన సినిమా చూసిన అనుభూతిని 'రిపబ్లిక్' ఇస్తుంది. బరువైన గుండెతో థియేటర్ నుండి ప్రేక్షకులు బయటకు రావడం గ్యారెంటీ.