Read more!

English | Telugu

సినిమా పేరు:రజాకార్
బ్యానర్:సమర్‌వీర్ క్రియేషన్స్
Rating:2.50
విడుదలయిన తేది:Mar 15, 2024

సినిమా పేరు: రజాకార్
తారాగణం: బాబీ సింహా, మకరంద్ దేశ్‌పాండే, తేజ్ సప్రూ, రాజ్ అర్జున్, వేదిక, ప్రేమ, ఇంద్రజ, అనసూయ భరధ్వాజ్, అనిష్క త్రిపాఠి,  తలైవాసల్ విజయ్ తదితరులు
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
డీఓపీ: కుశేందర్ రమేష్ రెడ్డి
ఎడిటర్: తమ్మిరాజు
దర్శకత్వం: యాట సత్యనారాయణ
నిర్మాత: గూడూరు నారాయణ రెడ్డి
బ్యానర్: సమర్‌వీర్ క్రియేషన్స్
విడుదల తేదీ: మార్చి 15, 2024 

వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందే సినిమాలు ఎప్పుడూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంటాయి. అలా వచ్చిన తాజా చిత్రమే 'రజాకార్'. హైదరాబాద్ సంస్థానం భారత్ లో విలీనం కావడానికి ముందు ఏడవ నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హయంలో.. రజాకార్లు అనే ప్రైవేట్ సైన్యం చేతిలో ప్రజలు ఎలాంటి చిత్రహింసలకు గురయ్యారు? ప్రజల తిరుగుబాటు, భారత ప్రభుత్వం చేపట్టిన 'ఆపరేషన్ పోలో' కారణంగా హైదరాబాద్ రాజ్యానికి విముక్తి ఎలా లభించింది? వంటి సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. సీరియల్ డైరెక్టర్ యాట సత్యనారాయణ దర్శకత్వంలో బీజేపీ నేత గూడూరు నారాయణ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. మరి ఈ సినిమా ఎలా ఉంది? ఇందులో చూపించిన వాస్తవాలు ఎంత? అనేది రివ్యూలో తెలుసుకుందాం.

కథ:
1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చింది. కానీ మీర్ ఉస్మాన్ అలీఖాన్ పాలనలో ఉన్న హైదరాబాద్ సంస్థానానికి మాత్రం స్వాతంత్య్రం రాలేదు. అతను హైదరాబాద్ ని స్వతంత్ర రాజ్యం 'తుర్కిస్తాన్'గా మార్చాలని ప్రయత్నిస్తాడు. దానికోసం ఖాసిం రజ్వీ నేతృత్వంలో నడిచే రజాకార్లు అనే ప్రైవేట్ సైన్యాన్ని రంగంలోకి దింపుతాడు. వారు ప్రజలను చిత్ర హింసలకు గురి చేయడం, మాన ప్రాణాలు తీయడం, బలవంతపు మత మార్పిడులు చేయడం, మాతృభాషలను అణచివేయడం ఇలా ఎన్నో దారుణాల‌కు ఒడిగ‌డ‌తారు. ఈ క్రమంలో కొందరు ప్రజలు వారి ప్రాణాలకు తెగించి నిజాంకి, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడతారు. మరోవైపు అప్పటి భారత ఉప ప్రధాని, హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్ సంస్థానాన్ని భారత్ లో కలిపే దిశగా ప్రయత్నాలు మొదలుపెడతారు. దీనికోసం 'ఆపరేషన్ పోలో' అనే పోలీస్ చర్యను చేపడతారు. అయితే భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వస్తే, హైదరాబాద్ విమోచనానికి 1948 సెప్టెంబర్ 17 వరకు ఎందుకు సమయం పట్టింది? నిజాం రాజుకి భారత ప్రభుత్వం ఏడాది గడువు ఎందుకు ఇచ్చింది? వంటి అంశాలను చూపిస్తూ ఈ చిత్రం నడిచింది.


ఎనాలసిస్ :

కథకి తగ్గ కథనం, ఆ కథనానికి తగ్గ సన్నివేశాలు తోడైతే.. సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుంది. అయితే కథనం మీద దృష్టి పెట్టకుండా, కేవలం బలమైన సన్నివేశాలు రాసుకోవడం మీదనే దృష్టి పెడితే.. ప్రేక్షకులకు కొన్ని సన్నివేశాలు చూసిన భావనే కలుగుతుంది కానీ, సినిమా చూశామనే భావన కలగదు. 'రజాకార్' సినిమా విషయంలో అదే జరిగింది.

నిజాం పాలనలోని  హైదరాబాద్ సంస్థానంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? నిజాంకి వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రజలను రజాకార్లు ఎలా అంతమొందిస్తున్నారు? వంటి సంఘటనలను ప్రభుత్వ అధికారుల ద్వారా సర్దార్ పటేల్ తెలుసుకుంటున్నట్టుగా సినిమా నడుస్తుంది. ఈ క్రమంలో కొందరు వీరుల పోరాటాలను చూపిస్తారు. అందుకే సినిమా చూస్తున్న ఫీలింగ్ కంటే.. కొన్ని సన్నివేశాలో లేదా కొన్ని ఎపిసోడ్ లో చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. మొదట వెబ్ సిరీస్ గా ప్లాన్ చేసి, తర్వాత సినిమాగా రిలీజ్ చేశారా అనిపిస్తుంది.

రజాకార్లు అప్పటి అమాయక ప్రజలను ఎలా హింసించారు అనేది కళ్ళకు కట్టినట్లు చూపించారు. కొన్ని సన్నివేశాలు చూసి, ఇప్పటి తరం వారు.. అంతలా హింసించరా అని షాక్ అవ్వడం ఖాయం. సున్నిత మనస్కులైతే అసలు ఆ సన్నివేశాలను చూడలేరు కూడా. అయితే ఈ సినిమా రజాకార్ల చీఫ్ ఖాసిం రజ్వీ కోణంలోనే ఎక్కువగా సాగుతుంది. మత విద్వేషాలు రెచ్చగొట్టడమే కాకుండా, తుర్కిస్తాన్ ను ఏర్పాటు చేసే దిశగా నిజాం రాజుని రెచ్చగొట్టింది అతనే అన్నట్టుగా చూపించారు. ఈ సినిమాలో ఖాసిం రజ్వీ విలన్ అయితే, సర్దార్ వల్లభాయ్ పటేల్ హీరో. రజ్వీ తన రజాకార్ల సైన్యంతో ప్రజలను హింసిస్తుంటే, పటేల్ హైదరాబాద్ విమోచన కోసం ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో తెలంగాణ పోరాట వీరుల కథలు అక్కడక్కడా వస్తుంటాయి. అందుకే ప్రేక్షకులు పూర్తిగా సినిమాకి ఎమోషనల్ గా కనెక్ట్ కాలేరు. 

చాకలి ఐలమ్మ పాత్ర పరిచయం గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటుంది. కానీ ఆమె పాత్ర సడెన్ గా ఎండ్ అయిపోతుంది. రాజిరెడ్డి పాత్ర కూడా అంతే. సడెన్ గా మాయమవుతుంది. ఇలా ఈ సినిమాలోని చాలా కీలక పాత్రలకు సరైన ముగింపు ఉండదు. ప్రేక్షకులు ఫలానా పాత్రకి కనెక్ట్ అవుతున్న సమయంలో సడెన్ గా ఆ పాత్ర ఎండ్ అయిపోతుంది. సన్నివేశం సడెన్ గా ఎండ్ అయ్యి, మరో సన్నివేశం ఓపెన్ అవ్వడంతో అక్కడక్కడా ఎడిటింగ్ గందరగోళంగా అనిపిస్తుంది.

ఇక ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు చూస్తే.. ఒక పార్టీకి లబ్ది చేకూర్చేలా రాసుకున్నారనే అనుమానం కలగకమానదు. ఏడవ నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో కమ్యూనిస్టులది కీలక పాత్ర. వారు చేసిన తెలంగాణ సాయుధ పోరాటం గురించి చరిత్ర చెబుతుంది. అలాంటి కమ్యూనిస్టుల పోరాటం గురించి చాలా తక్కువగా ప్రస్తావించారు. పైగా విమోచన సమయంలో కమ్యూనిస్టులు సైలెంట్ అయ్యారంటూ చెప్పించిన సెటైరికల్ డైలాగ్ కావాలని చెప్పించినట్లుగా ఉంది. అలాగే భారత తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూని ఉద్దేశపూర్వకంగా తక్కువ చేసి చూపించారనే అభిప్రాయం కలుగుతుంది.

సినిమాలో మతాల ప్రస్తావన ఎక్కువగా ఉంది. నిజాంకి, రజాకార్లకు వ్యతిరేకంగా సామాన్యులు పోరాడారనే విషయం కంటే కూడా.. మత మార్పిడులు, హిందూ-ముస్లిం మధ్య గొడవలే ఎక్కువగా హైలైట్ అయ్యాయి. నిజానికి నిజాంని వ్యతిరేకించిన వారిలో ముస్లింలు కూడా ఉన్నారు. పలువురు ముస్లింలు సైతం ప్రాణాలు కోల్పోయారు. కానీ అలాంటి విషయాలను ఒకట్రెండు సన్నివేశాలకు పరిమితం చేయడంతో అంతగా రిజిస్టర్ కాలేదు.

యాట సత్యనారాయణలో మంచి దర్శకత్వ ప్రతిభ ఉంది. అది సన్నివేశాల చిత్రీకరణలో స్పష్టంగా కనిపిస్తుంది. ఐలమ్మ ఇంట్రో, ఇంటర్వెల్ సన్నివేశం, రాజిరెడ్డి పోరాటం వంటి సన్నివేశాలు కట్టిపడేశాయి. అయితే సన్నివేశాలను అద్భుతంగా రాసుకొని, వాటిని అంతే అద్భుతంగా తెరకెక్కిస్తే సరిపోదు. ఆ సన్నివేశాలను కలుపుతూ కథని నడిపించే సరైన కథనం ఉండాలి. అప్పుడే కథ అయినా, అందులోని సన్నివేశాలైనా ప్రేక్షకులకు ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాయి. ఈ విషయాన్ని ఆయన గుర్తించినట్లయితే.. రజాకార్లు చిత్రం మరోస్థాయిలో ఉండేది.

భీమ్స్ సిసిరోలియో సంగీతం ఆకట్టుకుంది. పాటలు పరవాలేదు. నేపథ్య సంగీతం విషయంలో సత్తా చాటాడు. తన సంగీతంతో చాలా సన్నివేశాలను మరోస్థాయికి తీసుకెళ్లాడు. నిజాం కాలం నాటి పరిస్థితులను క్రియేట్ చేయడంలో ఆర్ట్ డిపార్ట్మెంట్ సక్సెస్ అయింది. కుశేందర్ రమేష్ రెడ్డి కెమెరా పనితనం బాగుంది. తనదైన ఫ్రేమింగ్, లైటింగ్ తో అప్పటి పరిస్థితులను చక్కగా చూపించాడు. బడ్జెట్ పరిమితుల కారణంగా వీఎఫ్ఎక్స్ సన్నివేశాలు తేలిపోయాయి.

నటీనటుల పనితీరు:
సర్దార్ వల్లభాయ్ పటేల్ పాత్రలో తేజ్ సప్రూ చక్కగా రాణించాడు. ఆయన ఆహార్యం, హావభావాలు నిజంగా పటేల్ నే చూస్తున్నామా అనే భావన కలిగిస్తాయి. నిజాం ఏడవ రాజు మీర్ ఉస్మాన్ అలీఖాన్ పాత్రలో మకరంద్ దేశ్‌పాండే సునాయాసంగా ఒదిగిపోయాడు. ఇక రజాకార్ల చీఫ్ ఖాసిం రజ్వీ పాత్రలో రాజ్ అర్జున్ జీవించాడు అని చెప్పవచ్చు. చాకలి ఐలమ్మగా ఇంద్రజ, రాజిరెడ్డిగా బాబీ సింహా, శాంతవ్వగా వేదిక, పోచమ్మగా అనసూయ భరధ్వాజ్ తమదైన నటనతో ఆకట్టుకున్నారు. ప్రేమ కూడా తమ మార్క్ చూపించింది. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్ లో ఆమె రౌద్ర రూపం హైలైట్ గా నిలిచింది. తలైవాసల్ విజయ్, అనిష్క త్రిపాఠి తదితరులు పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

కొన్ని సన్నివేశాలు కంటతడి పెట్టించేలా ఉన్నాయి. మరికొన్ని సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. కానీ ఈ 'రజాకార్' చూస్తుంటే.. సినిమా చూస్తున్న భావన కలగదు. కొన్ని సన్నివేశాలనో లేక కొన్ని ఎపిసోడ్ లనో చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. దర్శకుడు ఎంచుకున్న కథాంశానికి తగ్గట్టుగా సరైన కథనం తోడయినట్లైతే ఈ సినిమా మరో స్థాయిలో ఉండేది. హింసాత్మక సన్నివేశాల దృష్ట్యా సున్నిత మనస్కులు ఈ సినిమా చూడకపోవడమే బెటర్.

- గంగసాని