English | Telugu
బ్యానర్:అభిషేక్ పిక్చర్స్
Rating:2.00
విడుదలయిన తేది:Apr 7, 2023
సినిమా పేరు: రావణాసుర
తారాగణం: రవితేజ, సుమంత్, ఫరియా అబ్దుల్లా, శ్రీరామ్, మేఘా ఆకాశ్, జయరామ్, దక్ష నాగర్కర్, రావు రమేశ్, అను ఇమ్మాన్యుయేల్, సంపత్ రాజ్, హైపర్ ఆది, మురళీ శర్మ, విజయ్ కుమార్, నవ్యా స్వామి, జయప్రకాశ్, భరత్ రెడ్డి
కథ, మాటలు: శ్రీకాంత్ విస్సా
మ్యూజిక్: హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సెసిరోలియో
సినిమాటోగ్రఫీ: విజయ్ కార్తీక్ కణ్ణన్
ఎడిటింగ్: నవీన్ నూలి
ఆర్ట్: డి.ఆర్.కె. కిరణ్
స్క్రీన్‌ప్లే, డైరెక్షన్: సుధీర్ వర్మ
నిర్మాతలు: రవితేజ, అభిషేక్ నామా
బ్యానర్స్: ఆర్‌టి టీమ్ వర్క్స్, అభిషేక్ పిక్చర్స్
విడుదల తేదీ: 7 ఏప్రిల్ 2023
'రావణాసుర' అనే నెగటివ్ టైటిల్‌తో రవితేజ సినిమా చేస్తున్నాడనీ, దాన్ని సుధీర్ వర్మ డైరెక్ట్ చేస్తున్నాడనీ ప్రకటన వచ్చినప్పుడు, రవితేజ స్వయంగా దానికి నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నాడని తెలిసినప్పుడు చాలామందిలో కుతూహలం రేకెత్తింది. ట్రైలర్ రిలీజైనప్పుడు 2019లో వచ్చిన బెంగాలీ సైకలాజికల్ థ్రిల్లర్ 'విన్సీ డా' కథకూ, 'రావణాసుర' కథకూ పోలికలు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమైంది. అయితే సినిమాకి కథకుడిగా శ్రీకాంత్ విస్సా పేరుండేసరికి ఆ అభిప్రాయం (అనుమానం) నిజం కాకపోవచ్చని కూడా అనుకున్నారు. మరి ఇప్పుడు మనముందుకు వచ్చిన 'రావణాసుర' ఎలా ఉన్నాడు? విన్సీ డా కథకూ, ఈ కథకూ నిజంగా పోలికలున్నాయా? చూద్దాం...
కథ
డాక్టర్ రాధాకృష్ణ (జయప్రకాశ్)ను ఆయన స్నేహితుడు విజయ్ తల్వార్ (సంపత్ రాజ్) ఒక హోటల్లో అక్కడున్న వాళ్లందరి సమక్షంలో కత్తితో పొడిచి హత్య చేస్తాడు. అయితే ఆ హత్య తన తండ్రి చేయలేదనీ, దీని వెనుక పెద్ద కుట్ర ఉందనీ, తన తండ్రిని ఎలాగైనా ఈ కేసు నుంచి కాపాడమంటూ లాయర్ కనకమహాలక్ష్మి (ఫరియా అబ్దుల్లా) దగ్గరకు వస్తుంది విజయ్ తల్వార్ కూతురు హారిక (మేఘా ఆకాశ్). సాక్ష్యాలు బలంగా ఉన్న ఆ కేసును వాదించనని కనకమహాలక్ష్మి అంటే, వాదించాల్సిందేనని ఆమె దగ్గర జూనియర్ లాయర్‌గా పనిచేస్తున్న, కాలేజీలో ఆమెకు సీనియర్ అయిన రవీంద్ర (రవితేజ) పట్టుపడతాడు. ఏ తరహాలో అయితే రాధాకృష్ణ హత్యకు గురయ్యాడో, అదే తరహాలో మరికొంతమంది కూడా హత్యకు గురవుతారు. ఈ హత్యల వెనుక ఉన్నది రవీంద్ర అనే విషయం ఏసీపీ హనుమంతరావు (జయరామ్) కనిపెడతాడు. అతను రవీంద్రను దోషిగా నిరూపించాడా? రవీంద్రకూ, మేకప్ ఆర్టిస్ట్ సాకేత్ (సుమంత్)కూ మధ్య ఉన్న సంబంధమేంటి? అనే విషయాలు మిగతా కథలో తెలుస్తాయి.
ఎనాలసిస్ :
'పుష్ప' డైలాగ్ రైటర్‌గా శ్రీకాంత్ విస్సా ఎంతో పాపులర్ అయ్యాడు. అలాంటిది ఒక బెంగాలీ సినిమాలోని కీలకమైన అంశాన్ని తీసుకొని, కొద్దిపాటి మార్పులు, చేర్పులతో కథను అల్లి దాన్ని ఒరిజినల్ స్టోరీగా ప్రెజెంట్ చేయడం చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. 'విన్సీ డా' మూవీలో ఒక మేకప్ ఆర్టిస్ట్ ఒక మనిషిని పోలిన ముఖాన్ని మాస్క్ రూపంలో అచ్చు గుద్దినట్లు తయారుచేస్తుంటాడు. అతడి కళను ఉపయోగించుకొని ఒక క్రిమినల్ లాయర్ వేరే వాళ్ల ముఖం మాస్కులతో హత్యలు, దోపిడీలు చేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న మేకప్ ఆర్టిస్ట్ తెలివిగా ఆ లాయర్‌ను అంతం చేయడం చూస్తాం. ఈ సినిమాలో మేకప్ ఆర్టిస్ట్ రోల్‌ను సుమంత్ చేస్తే, క్రిమినల్ లాయర్ రోల్‌ను రవితేజ చేశాడు. కాకపోతే 'విన్సీ డా' మూవీలో క్రిమినల్ లాయర్ నిజంగానే క్రిమినల్ అయితే, ఇందులో రవితేజ చేసిన రవీంద్ర క్యారెక్టర్ చేసే హత్యలకు ఒక మోటివ్ ఉంటుంది. టైటిల్ 'రావణాసుర' అయినా, అతడు నిజానికి రావణాసురుడు కాదనీ, దుర్మార్గుల్ని అంతం చేయడానికే అతను అలా మారాడనీ తెలుసుకుంటాం. 'విన్సీ డా'కూ, 'రావణాసుర'కూ తేడా ఇదే.
ఒరిజినల్‌లో లేని పలు క్యారెక్టర్లను కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం ఈ స్టోరీలో క్రియేట్ చేశాడు శ్రీకాంత్ విస్సా. సింకాక్స్ అనే ఒక మెడికల్ డ్రగ్ కుంభకోణాన్ని చొప్పించాడు. అయితే ఈ క్రమంలో ఒరిజినల్‌లోని ఫీల్ మిస్సయ్యాడు. డైరెక్టర్ సుధీర్ వర్మ టేకింగ్ కూడా దానికి అనుగుణంగానే ఉంది. రవీంద్ర చేసే కొన్ని పనులు జుగుప్స కలిగిస్తాయి. అయితే అతడు ఆ పనులు చేయడంలో తప్పులేదన్నట్లుగా చివరలో ఆడియెన్స్‌ను కన్విన్స్ చేయడానికి ప్రయత్నించారు. కనక మహాలక్ష్మి, రవీంద్ర మధ్య సన్నివేశాలు మాత్రం ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. శ్రీరామ్, సంపత్ రాజ్, జయప్రకాశ్, మురళీ శర్మ లాంటి నటులు చేసిన క్యారెక్టర్లు చూస్తే వాళ్లపై జాలి కలుగుతుంది. రవీంద్ర ప్రియురాలు కీర్తన క్యారెక్టర్‌లో అను ఇమ్మాన్యుయేల్ పాత్ర కూడా అంతే. మేఘా ఆకాశ్ ఆశ్చర్యపరిచే పాత్ర చేసింది.
హర్షవర్ధన్ రామేశ్వర్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఇంప్రెసివ్‌గా ఉంది. పాటలు పెద్దగా ఆకట్టుకొనే రీతిలో లేవు. భీమ్స్ సెసిరోలియో కూడా ఒక పాటకు మ్యూజిక్ కంపోజ్ చేశాడు. విజయ్ కార్తీక్ కణ్ణన్ సినిమాటోగ్రఫీ ఎఫెక్టివ్‌గా ఉంది. డైరెక్టర్ ఇచ్చిన సీన్లను ఆసక్తికరంగా అతికించడానికి, కత్తిరించడానికి ఎడిటర్ నవీన్ నూలి చాలా కష్టపడ్డాడు కానీ, అతని కష్టం ఫలించకపోయే అవకాశాలే ఎక్కువ.
నటీనటుల పనితీరు
టైటిల్ రోల్‌లో రవితేజ ఎప్పట్లా ఎంతో ఎనర్జిటిగ్గా చేసుకుపోయాడు. ఎలాంటి క్యారెక్టర్ అయినా.. ఒకే రకంగా కనిపించడంలో, ఒకే రకంగా పర్ఫార్మ్ చేయడంలో తను నిష్ణాతుడనని మరోసారి చూపించాడు. సాకేత్ క్యారెక్టర్‌లో సుశాంత్ మెప్పించాడు. లాయర్ కనక మహాలక్ష్మిగా ఫరియా అబ్దుల్లా బాగా ఆకట్టుకుంది. మేఘా ఆకాశ్‌ను కొత్త తరహా పాత్రల్లో చూడొచ్చని ఆమె చేసిన అభినయం తెలియజేసింది. హనుమంతరావుగా జయరామ్ మెప్పించాడు. సాకేత్ ప్రియురాలు జాను పాత్రలో దక్ష రాణించింది. డాక్టర్ శాంతి పాత్రకు నవ్య స్వామి సరిపోయింది. మినిస్టర్ ముదిరెడ్డిగా కనిపించేది కొద్దిసేపే అయినా రావు రమేశ్ ఎప్పట్లా ఆ పాత్రలో సునాయాసంగా ఇమిడిపోయాడు. కనక మహాలక్ష్మి భర్త శేఖర్‌గా శ్రీరామ్ కొత్తగా కనిపించాడు. హీరో స్థాయి నుంచి అతను ఇలాంటి క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోవడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. జూనియర్ లాయర్‌కు అసిస్టెంట్ బాబ్జీగా హైపర్ ఆది నవ్వించే ప్రయత్నం చేశాడు. రవీంద్ర తండ్రి రామచంద్ర బ్రహ్మగా హాస్పిటల్ బెడ్‌కు అతుక్కుపోయిన రోల్‌లో విజయ్ కుమార్ కనిపించారు.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
బెంగాలీ ఫిల్మ్ 'విన్సీ డా' కథతో చాలా పోలికలున్న 'రావణాసుర' సినిమా రవితేజ అభిమానులను మెప్పించవచ్చేమో కానీ, సగటు సినీప్రియుడిని అలరించడం కష్టం. రవితేజ నటన, కొన్ని థ్రిల్లింగ్ సీన్లు మినహా పెద్దగా చెప్పుకోడానికి ఏమీ లేని సినిమా ఇది.
- బుద్ధి యజ్ఞమూర్తి