Read more!

English | Telugu

సినిమా పేరు:రామారావు ఆన్ డ్యూటీ
బ్యానర్:శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్
Rating:2.25
విడుదలయిన తేది:Jul 29, 2022

సినిమా పేరు: రామారావు ఆన్ డ్యూటీ
తారాగ‌ణం: రవితేజ, దివ్యాంశ కౌశిక్, రజిష విజయన్, నాజర్, తనికెళ్ళ భరణి, రాహుల్ రామకృష్ణ, జాన్ విజయ్, నరేష్, పవిత్రా లోకేష్ తదితరులు
మ్యూజిక్: సామ్ సీఎస్
సినిమాటోగ్ర‌ఫీ: సత్యన్ సూర్యన్
ఎడిటింగ్: ప్రవీణ్ కె.ఎల్
నిర్మాత‌: సుధాకర్ చెరుకూరి
రచన, ద‌ర్శ‌క‌త్వం: శరత్ మండవ
బ్యాన‌ర్: శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్, ఆర్టీ టీమ్ వర్క్స్
విడుద‌ల తేదీ: 29 జూలై 2022

కొన్ని వారాలుగా టాలీవుడ్ నుంచి వస్తున్న సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్యూర్స్ గా మిగిలిపోతున్నాయి. ఇలాంటి సమయంలో మాస్ మహారాజ రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శరత్ మండవ డైరెక్ట్ చేసిన ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ ఆకట్టుకోవడంతో దీనిపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలను అందుకొని ఈ సినిమా సక్సెస్ ట్రాక్ ఎక్కేలా ఉందో లేక టాలీవుడ్ ఖాతాలో మరో ప్లాప్ లా మిగిలేలా ఉందో రివ్యూలో చూద్దాం.

కథ:

రామారావు(రవితేజ) నిజాయితీ పరుడైన డిప్యూటీ కలెక్టర్. ప్రజలకు న్యాయం చేయడం కోసం ఎంత దూరమైనా వెళ్తాడు, ఏదైనా చేస్తాడు. ఒక ప్రాజెక్ట్ భూసేకరణ విషయమై నష్ట పరిహారం విషయంలో రైతులకు న్యాయం చేయడం కోసం ఏకంగా అధికార పార్టీ నేతలనే ఎదిరిస్తాడు. దీంతో డిప్యూటీ కలెక్టర్ కాస్తా ఎమ్మార్వోగా అతని సొంత జిల్లా చిత్తూర్ కి ట్రాన్స్ఫర్ అవుతాడు. అక్కడ కూడా సిన్సియర్ గా వర్క్ చేస్తూ, ఎమ్మార్వోగా మంచి పేరు తెచ్చుకుంటున్న టైంలో.. తన మాజీ ప్రేయసి కష్టాల్లో ఉందని తెలుసుకుంటాడు. ఆమె భర్త చాలా రోజులుగా కనిపించకుండా పోయాడని తెలుసుకొని, పోలీసుల సహకారం లేకపోవడంతో అతన్ని వెతికి పట్టుకునే బాధ్యతను భుజానికెత్తుకుంటాడు రామారావు. ఈ క్రమంలో అతనితో పాటు మరో 20 మంది కూడా కనిపించకుండా పోయారని తెలుస్తుంది. మిస్ అయినవాళ్లు ఎవరు? వాళ్ళు ఏమైయ్యారు? దీని వెనుక ఎవరున్నారు? వాళ్ళ మిస్సింగ్ కి, ఎర్ర చందం స్మగ్లింగ్ కి సంబంధం ఏంటి? ఫైనల్ గా రామారావు క్రిమినల్స్ ని పట్టుకోగలిగాడా? అనేది మిగతా కథ.


ఎనాలసిస్ :

డైరెక్టర్ శరత్ మండవ మూవీ ప్రమోషన్స్ టైంలో చెప్పినట్లుగా ఇది యూనిక్ సినిమా అయితే ఏం కాదు. ఒక రెవిన్యూ ఆఫీసర్ క్రిమికల్ కేసు డీల్ చేస్తే ఎలా ఉంటుందనేది కాస్త కొత్త పాయింట్. మిగదంతా పరమ రొటీన్. రవితేజ సినిమా అంటే మనకి ఎనర్జిటిక్ పర్ఫామెన్స్, ఎంటరైన్మెంట్ గుర్తుకొస్తాయి. కానీ ఈ సినిమాలో ఎంటరైన్మెంట్ అనేదే ఉండదు. సరే ఇది సీరియస్ మూవీ.. కామెడీ ఆశించకూడదు అనుకుందాం. కానీ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో ఆడియన్స్ కి బోర్ కొట్టకుండా చేయాల్సింది పోయి.. వీక్ స్క్రీన్ ప్లే, వీక్ సీన్స్ తో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టారు.

ఒక్కోసారి అసలు సినిమా ఎక్కడ స్టార్ట్ అయింది, ఎటు వెళ్తుంది అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా సోసోగా సాగింది. రామారావు, సీఐ మురళి(వేణు తొట్టెంపూడి) మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకునేలా లేవు. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే రవితేజ లవ్ ట్రాక్ అసలు కన్విన్సింగ్ గా లేదు. ఏదో తెచ్చి పెట్టినట్లుగా ఉంది. రామారావు ఇన్వెస్టిగేషన్ చేసే సన్నివేశాలు కూడా ఆసక్తికరంగా సాగలేదు. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగానే ఉంది కానీ.. అలాంటి ఒకటి అర ట్విస్ట్ లతో రెండున్నర గంటల సినిమా బోర్ కొట్టకుండా నడవదు కదా. రామారావుకి బలమైన ప్రత్యర్థి లేకపోవడం సినిమాకి పెద్ద మైనస్ అయింది. హీరోకి, మెయిన్ విలన్ కి మధ్య పెద్దగా సన్నివేశాలే లేవు. పైగా సినిమా చివరిలో సెకండ్ పార్ట్ కి లీడ్ ఇచ్చారు. ఎప్పుడు తీస్తారో తెలియని సెకండ్ పార్ట్ కోసం కంటెంట్ దాచుకునే కంటే.. ముందు మొదటి పార్ట్ స్క్రిప్ట్ మీద శ్రద్ధ పెడితే బాగుండేది. ఫస్ట్ పార్ట్ హిట్ అయితేనే కదా.. సెకండ్ పార్ట్ తీసేది, చూసేది. శరత్ మండవ తాను అనుకున్న పాయింట్ కొత్తగా ఉంటే చాలు అనుకున్నాడు కానీ.. దానికి గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, పవర్ ఫుల్ సన్నివేశాలు తోడైతేనే ఆడియన్స్ ని మెప్పించగలమని తెలుసుకోలేకపోయాడు. 

సినిమాలో వావ్ అనిపించే సన్నివేశాలు పెద్దగా లేవు. దానికి తోడు కొన్ని కొన్ని సీన్లలో డైలాగ్స్ అయితే మరీ 'లో స్టాండర్డ్'లో ఉన్నాయి. ఇది పేరుకి కమర్షియల్ సినిమానే అయినప్పటికీ అన్వేషి జైన్ స్పెషల్ సాంగ్, ఒకట్రెండు ఫైట్స్ తప్ప మాస్ ని మెప్పించే అంశాలు కూడా పెద్దగా లేవు. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. సామ్ సీఎస్ మ్యూజిక్ జస్ట్ ఓకే అనేలా ఉంది. సాంగ్స్ హమ్ చేసుకునేలా లేవు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అక్కడక్కడా పర్లేదు.  కథనంలో ఉన్న తడబాటు ప్రవీణ్ కె.ఎల్ కూర్పు లోనూ కనిపించింది. రెండున్నర గంటల నిడివి ఉన్న ఈ సినిమాని చాలా ట్రిమ్ చేయొచ్చు.

 

నటీనటుల పనితీరు:

రవితేజ ఎప్పటిలాగే తన యాక్టింగ్ తో అదరగొట్టాడు. రామారావు పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. కానీ కథనం, క్యారెక్టరైజేషన్ లో బలం లేకపోవడంతో రవితేజ కూడా ఫలితాన్ని మార్చలేకపోయాడు. ఇక ఈ సినిమాతో వేణు తొట్టెంపూడి రీఎంట్రీ ఇచ్చాడు. కానీ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. ఆ పాత్ర అంత బలంగా లేదు. పైగా ఆయనకు ఆ పాత్ర అంతగా సెట్ కాలేదు. 'ఏందిరా సామి' అంటూ ఆయన మెప్పించే ప్రయత్నం చేశాడు కానీ.. ఎందుకనో ఆయన సొంతంగా చెప్పుకున్న డబ్బింగే ఆయనకు సెట్ కాలేదు అనిపించింది. ఇక హీరోయిన్లు దివ్యాంశ కౌశిక్, రజిష విజయన్.. రెండు పాటలకి, నాలుగు సీన్లకి అన్నట్లుగా ఉన్నారు. గ్లామర్ కి, పర్ఫామెన్స్ కి రెండింటికీ పెద్దగా స్కోప్ లేదు. నాజర్, తనికెళ్ళ భరణి, రాహుల్ రామకృష్ణ, జాన్ విజయ్, నరేష్, పవిత్రా లోకేష్ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

రాసుకున్న పాయింట్ కొత్తగా ఉంది అనుకుంటే సరిపోదు. దానికి తగ్గ కథనం, సన్నివేశాలు తోడవ్వాలి. అప్పుడే సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. లేదంటే 'రామారావు ఆన్ డ్యూటీ' అవుతుంది. అంచనాలను అందుకోవడంలో విఫలమైన ఈ చిత్రం రవితేజ ఫ్యాన్స్ ని మెప్పించడం కూడా అనుమానమే.

-గంగసాని