Read more!

English | Telugu

సినిమా పేరు:రక్తచరిత్ర -2
బ్యానర్:సినర్జీ ప్రొడక్షన్స్
Rating:2.75
విడుదలయిన తేది:Dec 3, 2010
ఇది "రక్తచరిత్ర"తొలి భాగానికి కొనసాగింపు.దాన్లో తన ప్రత్యర్థులను మట్టుబెట్టి ఎదురులేని నాయకుడిగా ఎదిగిన ప్రతాప్ రవి వల్ల దెబ్బతిన్న యమ్.యల్.ఎ.పెద్ద కొడుకు సూర్య(సూరియ)ఈ భాగంలో రవిని చంపటానికి సన్నాహాలు చేస్తాడు.ఆ దిశలో అతను విజయుడవుతాడు.ఇక కథలోకి వస్తే ప్రతాప్ రవి తాను పగవారనుకున్న అనేక మందిని చంపే ప్రక్రియలో భాగంగా,తాను చంపిన యమ్.యల్.ఎ.కుటుంబానికి తన అనుచరులు పంపిన్బ టి.వి.బాంబు ద్వారా ఆ కుటుంబంలో పెద్ద కొడుకు అతని భార్య తప్పఇంకెవరూ ప్రాణాలతో మిగలరు.అంత వరకూ ప్రతాప్ రవిని చంపాలని అనుకోని సూర్య కూడా ఈ సంఘటనతో ప్రతాప్ రవిని చంపటమే తన ఏకైక జీవిత లక్ష్యంగా జీవిస్తాడు.అతన్ని చంపటానికి చేసిన ఒక ప్రయత్నం విఫలం కావటంతో డి.సి.పి.మోహన్ ప్రసాద్‍ సలహాతో కోర్టుకి లొంగి జైలు పాలవుతాడు.అక్కడ కూడా అతన్ని చంపటానికి ప్రతాప్ రవి తన మనుషుల్ని పంపిస్తాడు.కానీ సూర్య తనను తాను వారి బారి నుండి కాపాడుకుంటాడు.జైల్లో ముద్దు కృష్ణ అనే ఖైదీతో పరిచయం అవుతుంది.జైల్లో ఉన్న సూర్యకి బయట రాజకీయ నాయకుల అండ దొరుకుతుంది.అదే సమయానికి ప్రతాప్ రవికి రాజకీయ అండ పోతుంది.మరి సూర్య తన పగను తీర్చుకున్నాడా..? ప్రతాప్ రవి ఏం చేశాడు...?చివరికి ఏం జరిగిందనేది మిగిలిన కథ.
ఎనాలసిస్ :
తొలి భాగం కంటే ఈ భాగంలో వర్మ స్క్రీన్‍ ప్లే ఇంకా బాగుంది.ఒరిజినల్ కథను అలాగే తీయటానికి గట్టి ప్రయత్నం చేశాడు.తనను తాను పరిటాల రవి,సూరి వర్గాల నుంచి కాపాడుకోటానికి ముందు భాగంలో రవిని హీరోని చేసి,రెండవ భాగంలో సూరిని హీరోని చేశాడు. అయితే రవి అన్యాయాన్ని ఎదుర్కునే క్రమంలో ఏలా ఫ్యాక్షనిస్టుగా మారాడో,సూరి కూడా అలా మారే అవకాశముందని డి.సి.పి.పాత్ర ద్వారా చెప్పిస్తాడు.అలాగే సూరి మీద నుండి కేమెరాని పరిటాల భార్య చేతిలో ఉన్న పసిబిడ్డపై జూమ్ చేసి తాను "రక్తచరిత్ర-3"సినిమాకి ఒక విధంగా పునాది వేసుకున్నాడు.ఈ విషయంలో వర్మని మెచ్చుకోవచ్చు.ప్రపంచంలో వీళ్ళు పుట్టుకతోనే మంచివాళ్ళనీ,వీళ్ళు పుట్టుకతోనే చెడ్డవాళ్ళనీ ఎవరూ పుట్టరు.పరిస్థితులే వాళ్ళనలా తయారుచేస్తాయని చివరలో చెప్పి ఈ చిత్రాన్నిముగిస్తాడు వర్మ.అయితే దీన్ని పరిటాల వర్గం ఎలా రిసీవ్ చేసుకుంటారో వేచి చూడాలి.ఈ సినిమాకి దర్శకత్వం వహించటంలో వర్మ,మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నాడు. నటన - ఇక నటన విషయంలో సూర్య ఈ చిత్రంలో అద్భుతంగా నటించాడు.అతని హావభావాలు జాతీయ అవార్డు సాధించే రేంజ్ లో ఉన్నాయంటే అతిశయోక్తి కాదు.ఈ మాట నేనటం లేదు.సాక్షాత్తూ అమితాబ్ బచ్చన్ ఫోన్ చేసి మరీ సూర్యతో చెప్పారు.అది అక్షర సత్యమనిపిస్తుంది.అతని నటన ఆకాశమే హద్దుగా సాగింది.భార్యతో మాట్లాడే సీన్లోనూ,తన వాళ్లంతా టి.వి.బాంబ్ బ్లాస్ట్ లో చనిపోయినప్పుడూ ఇలా సినిమా అంతా చాలా చక్కగా నటించాడు సూర్య.ఇక వివేక్ ఒబేరాయ్ నటనలో ఘర్షణ చక్కగా కనిపిస్తుంది. ప్రియమణి ఒకసారి జాతీయ అవార్డు సంపాదించిన నటి.ఆమె కూడా చాలా చక్కగా నటించింది.మిగిలిన వారమతా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. సంగీతం -ఇటువంటి చిత్రాలకు ఎలాంటి డ్రై మ్యూజిక్ కావాలో దాన్నే అందించాడు మణిశర్మ."కత్తులతో సావాసం నెత్తుటితో సమాప్తం" అన్న పాత వర్మ బాగానే పాడాడు.ఇక రీ-రికార్డింగ్ ఈ చిత్రానికి హైలైట్ అని చెప్పాలి.బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ - హాలీవుడ్ స్థాయిలో ఈ చిత్రంలోని కేమెరా వర్క్ ఉంది.చాలా చాలా బాగుంది.లైటింగ్ కానీ,కెమెరా యాంగిల్స్ కానీ మనల్ని కట్టిపడేస్తాయి. మాటలు - ఈ చిత్రంలోని మాటలు క్లుప్తంగా ఎఫెక్టీవ్ గా ఉన్నాయి. పాటలు - ఈ చిత్రంలోని పాటలు అర్థవంతంగా ఉన్నాయి. ఎడిటింగ్ - సుపర్బ్ గా ఉందీ చిత్రంలోని ఎడిటింగ్. ఆర్ట్ - చాలా బాగుంది. కొరియోగ్రఫీ - ఇందులో చిందులేసే పాటలేం లేవు. యాక్షన్ - చాలా సహజంగా చంపే మనిషిలోని కసి,కక్ష,పగ,ప్రతీకారం కనిపించేలా,సహజంగా ఈ చిత్రంలోని యాక్షన్ సీన్లున్నాయి.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
కత్తులు,నెత్తురు,పగలు,ప్రతీకారాలూ వంటివి మీ వంటికి పడకపోతే ఈ చిత్రం చూడక్కర్లేదు.అలా కాకుండా "అదేంలేదు నేనూ మనిషినే ..నాక్కూడా పగలుంటాయి...ప్రతీకారం తీర్చుకోవాలనుంటుంది....నేను అరిషడ్వార్గాలకు అతీతుడనేం కాదంటారా.....!అయితే ఈ చిత్రం చూడండి.కానీ సుకుమారమైన మనస్సు కలిగిన పసిపిల్లలూ,సున్నితమైన మనస్కులైన స్త్రీలు ఈ సినిమాను చూస్తే ఎంతవరకూ తట్టుకుంటారో మరి.ఎందుకంటే ఈ "రక్తచరిత్ర-2"పేరుకి తగ్గట్టే ఉంటుంది.