English | Telugu
బ్యానర్:శ్రీ చిత్ర మూవీ మేకర్స్
Rating:2.00
విడుదలయిన తేది:Nov 12, 2021
సినిమా పేరు: రాజా విక్రమార్క
తారాగణం: కార్తికేయ గుమ్మకొండ, తాన్య రవిచంద్రన్, తనికెళ్ల భరణి, సాయి కుమార్, సుధాకర్ కోమాకుల, హర్షవర్ధన్
సంగీతం: ప్రశాంత్ ఆర్ విహారి
సినిమాటోగ్రఫీ: మౌళి
ఎడిటింగ్: ప్రభు
ప్రొడక్షన్: శ్రీ చిత్ర మూవీ మేకర్స్
దర్శకత్వం: శ్రీ సారిపల్లి
విడుదల తేదీ: నవంబర్ 12, 2021
'ప్రేమతో మీ కార్తీక్' సినిమాతో వెండితెరకు హీరోగా పరిచయమైన కార్తికేయ గుమ్మకొండ.. తన రెండో సినిమా 'ఆర్ఎక్స్ 100'తో సూపర్ సక్సెస్ అందుకొని మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఆ తర్వాత మాత్రం వరుస పరాజయాలను మూటగట్టుకున్నాడు. ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు విలన్ గానూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న కార్తికేయ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'రాజా విక్రమార్క'. వీవీ వినాయక్ శిష్యుడు శ్రీ సారిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాపై కార్తికేయ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. మరి ఈ సినిమాతోనైనా కార్తికేయ రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడో లేదో చూద్దాం.
కథ:- ఎన్ఐఏ ఏజెంట్ గా పనిచేసే విక్రమ్(కార్తికేయ) తన టీమ్ తో కలిసి అక్రమంగా ఆయుధాలు సప్లై చేసే ఓ నైజీరియన్ క్రిమినల్ ని పట్టుకుంటాడు. అసలు అతను ఆయుధాలు ఎవరికి సప్లై చేశాడు? వాళ్ళ టార్గెట్ ఏంటి? వంటి విషయాలు ఆ నైజీరియన్ నుంచి రాబట్టడానికి ఎన్ఐఏ టీమ్ హెడ్ మహేంద్ర(తనికెళ్ల భరణి) ఇంటరాగేట్ చేస్తుండగా.. అతను 'గురు నారాయణ్' అనే పేరు చెప్తాడు. ఆ పేరు విని మహేంద్ర షాక్ లో ఉండగా.. అదే టైంలో విక్రమ్ పొరపాటున గన్ తో ఆ నైజీరియన్ ని షూట్ చేసి చంపేస్తాడు. అసలు ఆ గురు నారాయణ్ ఎవరు? ఇంతకాలం అజ్ఞానంలో ఉన్న అతను మళ్లీ ఎందుకు యాక్టివ్ అయ్యాడు? అతని వల్ల హోం మినిస్టర్ చక్రవర్తి(సాయి కుమార్) ఫ్యామిలీకి ఉన్న థ్రెట్ ఏంటి? గురు నారాయణ్ బారి నుంచి హోం మినిస్టర్ ఫ్యామిలీ ని విక్రమ్ కాపాడాడా లేదా? అనేది మిగిలిన కథ.
ఎనాలసిస్ :
ఇది ఎన్‌ఐఏ ఏజెంట్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా అయినప్పటికీ సీరియస్ గా సాగే యాక్షన్ సినిమా కాదని, పారలల్ గా ఫన్ తో రన్ అవుతుందని సినిమా రిలీజ్ కి ముందే డైరెక్టర్ చెప్పేశాడు. కానీ సినిమా చూశాక అలా రెండు పడవల మీద కాలేసి డైరెక్టర్ తప్పు చేశాడేమో అనిపించింది. ఇటు ఆడియన్స్ ని హిలారియస్ గా నవ్వించిందీ లేదు, అటు యాక్షన్ తో ఆడియన్స్ ని థ్రిల్ చేసిందీ లేదు.
ఫస్ట్ హాఫ్ లో ఎన్ఐఏ ఏజెంట్ విక్రమ్.. ఇన్సూరెన్స్ ఏజెంట్ గా మారడం, హర్షవర్ధన్ సాయంతో హోం మినిస్టర్ ఇంట్లోకి ఎంటర్ అవ్వడం, హోం మినిస్టర్ కూతురు కాంతి(తాన్య రవిచంద్రన్)తో లవ్ లో పడటం వంటి ఎపిసోడ్స్ తో డైరెక్టర్ నవ్వించే ప్రయత్నం చేశాడు. కానీ ఒకట్రెండు సీన్స్ మినహా ఫన్ అంతగా జెనరేట్ అవ్వలేదు. విక్రమ్, కాంతిల లవ్ ట్రాక్ కూడా ఆకట్టుకోలేదు. అయితే ఫస్ట్ హాఫ్ చివరిలో సినిమాలో కాస్త వేగం పెరుగుతుంది. ఆసక్తికరమైన ఇంటర్వెల్ బ్లాక్ తో ఫస్ట్ హాఫ్ ముగుస్తుంది. ఇక సెకండ్ హాఫ్ మొదలైన కాసేపటికి వచ్చే ట్విస్ట్ సినిమాకే హైలైట్ అని చెప్పొచ్చు. ఆ సస్పెన్స్ ని మైంటైన్ చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. అయితే ఇలా ఒకట్రెండు ఆకట్టుకునే సన్నివేశాలు తప్ప.. ఆడియన్స్ ని కట్టిపడేసే సన్నివేశాలు కరువయ్యాయి. అదే సినిమాకి పెద్ద మైనస్ అయ్యింది. డైరెక్టర్ అనుకున్న ప్లాట్ ఆసక్తికరంగా ఉన్నా.. దాన్ని ఎగ్జిక్యూట్ చేయడంలో మాత్రం అతను విఫలమయ్యాడు.
ప్రశాంత్ విహారి సంగీతం అందించిన ఈ సినిమా సాంగ్స్ ఆకట్టుకునేలా లేవు. బ్యాగ్రౌండ్ స్కోర్ సోసో గా ఉంది. సినిమాటోగ్రఫర్ మౌళి పనితనం ఆకట్టుకుంది.
నటీనటుల పనితీరు:-
నటుడిగా ఇప్పటికే 'ఆర్ఎక్స్ 100', 'గ్యాంగ్ లీడర్' వంటి సినిమాలతో ప్రూవ్ చేసుకున్న కార్తికేయ ఈ సినిమాతోనూ ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ఈ సినిమాలో తెలివైన తింగరోడుగా కనిపించే కార్తికేయ.. తన ఫేస్ లో ఆ తింగరితనాన్ని చూపించగలిగాడు. అయితే కామెడీ చేసి నవ్వించడంలో మాత్రం కాస్త ఇబ్బంది పడ్డాడు. తాన్య రవిచంద్రన్ ఉన్నంతలో నేచురల్ గా చేసి మెప్పించింది. సీనియర్ నటులు తనికెళ్ల భరణి, సాయి కుమార్ లు పోషించిన పాత్రలు రొటీన్ గానే ఉన్నా.. వాళ్ల సీనియారిటీతో పాత్రలను నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఇన్సూరెన్స్ ఏజెంట్ పాత్రలో కనిపించిన అమృతం ఫేమ్ హర్షవర్ధన్ బాగానే నవ్వించాడు. ఇక తన లుక్ కి, పర్సనాలిటీకి మించిన పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించిన సుధాకర్ కోమాకుల తన శక్తిమేర పాత్రకు న్యాయం చేయడానికి ట్రై చేశాడు.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
'రాజా విక్రమార్క' పేరులో ఉన్న పవర్ సినిమాలో లేదు. ఈ సినిమాతో హీరోగా రెండో విజయాన్ని అందుకోవాలనుకున్న కార్తికేయ ఆశ నెరవేరలేదనే చెప్పాలి.
-గంగసాని