English | Telugu
బ్యానర్:అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
Rating:2.50
విడుదలయిన తేది:Aug 19, 2021
నటీనటులు: శ్రీవిష్ణు, సునైన, మేఘా ఆకాష్, రవిబాబు, అజయ్ ఘోష్, గంగవ్వ, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు
సినిమాటోగ్రఫీ: వేదరామన్ శంకరన్
సంగీతం: వివేక్ సాగర్
నిర్మాతలు: టిజి విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్
రచన, దర్శకత్వం: హసిత్ గోలి
విడుదల తేదీ: 19 ఆగస్టు 2021
శ్రీవిష్ణు మృధుస్వభావి. తన సినిమాల గురించి చాలా తక్కువ మాట్లాడతారు. కానీ, 'రాజ రాజ చోర' ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో సినిమా గురించి ఎక్కువ మాట్లాడారు. వెంకటేష్ క్లాసిక్ సినిమాల్లా ఉంటుందని చెప్పారు. నవ్వి నవ్వి మాస్క్ లు పగిలిపోతాయన్నారు. ప్రచార చిత్రాలు చూస్తే శ్రీవిష్ణు మరోకొత్త ప్రయత్నం చేశాడనే భావన కలిగింది. కొత్తదనం, వినోదం కనిపించాయి. మరి, సినిమా ఎలా ఉంది? శ్రీవిష్ణుకు మరో సక్సెస్ ఇచ్చిందా?
కథ:
భాస్కర్ (శ్రీవిష్ణు) ఓ జిరాక్స్, స్టేషనరీ షాపులో పని చేస్తుంటాడు. కానీ, సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అని అబద్ధం చెప్పి సంజు అలియాస్ సంజన (మేఘా ఆకాష్)ను ప్రేమలో పడేస్తాడు. ఆమెను పెళ్లి చేసుకుని, ఓ ఇల్లు కొనుక్కుని సెటిల్ అవ్వాలని అనుకుంటాడు. అయితే, ఆల్రెడీ భాస్కర్‌కు పెళ్లైంది. భార్య విద్య (సునైన), ఓ పిల్లాడు ఉన్నాడు. ఇంట్లో అవసరాలు, ప్రియురాలి ముందు గొప్పలు... వెరసి భాస్కర్‌ను దొంగగా మారుస్తాయి. దొరకనంతవరకూ దొరలా దర్జాగా తిరిగాడు. దొరికిన తర్వాత ఏమైంది? భాస్కర్ దొంగతనాల్లో అంజు (గంగవ్వ) ఇచ్చిన కిరీటం ఎటువంటి పాత్ర ఏమిటి? అతడిని దొంగతనం కేసు నుండి ఎవరు బయటపడేశారు? మళ్లీ దొంగతనం చేయకూడదని అనుకున్న భాస్కర్ తో దొంగతనాలు చేయించించింది ఎవరు? చివరికి ఏమైంది? ఇంట్లో ప్రియురాలి విషయం తెలిసిందా? ప్రియురాలికి భాస్కర్ చెప్పినవన్నీ అబద్ధాలని తెలిశాక ఏం చేసింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
ఎనాలసిస్ :
లాజిక్కులతో సినిమా తియ్యడం ఒక శైలి. లాజిక్కులను పక్కనపెట్టి కేవలం మేజిక్ ను నమ్ముకుని తియ్యడం మరోశైలి. నలుగుర్ని నవ్వించాలని అనుకున్నప్పుడు దర్శక రచయితలు ఎక్కువగా ఆధారపడేది మేజిక్ మీద. కొత్త దర్శకుడు హసిత్ గోలి అటు లాజిక్కును కాసేపు, ఇటు మేజిక్కును కాసేపు నమ్ముకోవడంతో 'రాజ రాజ చోర' రెండు అడుగులు ముందుకు, ఓ అడుగు వెనక్కి వేసింది. జిరాక్స్ షాపులో పనిచేసే వాడిని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అని ఎంసీఏ చదివిన అమ్మాయి ఎలా నమ్మిందో అర్థం కాదు. లాజిక్ ఉండదు. అదే దర్శకుడు సెకండాఫ్ లో దొంగతనాలకు వచ్చేసరికి లాజిక్స్ పెట్టాడు. ప్రథమార్థంలో లాజిక్స్ ఏమయ్యాయో మరి? ఇవన్నీ పక్కన పెడితే... దర్శకుడి మేజిక్ చాలాచోట్ల వర్కవుట్ అయ్యింది.
రచయితగా హసిత్ గోలి కథను కొత్తగా చెప్పే ప్రయత్నం చేశాడు. ప్రవచనాలతో కథను ముడిపెట్టిన తీరు బావుంది. అయితే, అది ఎంతమందికి అర్థమవుతుందనేది ప్రశ్న. ప్రవచనాలు లేకున్నా పర్వాలేదేమో! ప్రథమార్థం వినోదాత్మకంగా సాగితే, ద్వితీయార్థంలో వినోదం తగ్గి భావోద్వేగం పెరిగింది. ప్రేక్షకుడిపై భారం పడింది.
సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే...
వివేక్ సాగర్ నేపథ్య సంగీతం కొత్తగా ఉంది. కొన్నిచోట్ల లౌడ్ అనిపించి, ఇబ్బంది పెట్టింది. పాటలు సైతం వివేక్ సాగర్ శైలిలో ఉన్నాయి. 'మాయ... మాయ'లో సౌండింగ్, 'రాజ రాజ చోర' టైటిల్ సాంగ్ సౌండింగ్ ఫ్రెష్ ఫీల్ ఇచ్చాయి. ప్రేక్షకులకు నచ్చుతాయి. గంగవ్వ చోరగాథ సినిమాలో లేదు. సిద్ శ్రీరామ్ పాడిన ఎమోషనల్ సాంగ్ అంతగా పండలేదు. సినిమాటోగ్రఫీ బావుంది. కనులకు అందంగా సినిమాను చూపించారు. నిర్మాణ విలువలు ఉన్నతస్థాయిలో ఉన్నాయి. మిగతావాళ్ళు పర్వాలేదు.
నటీనటుల పనితీరు:
శ్రీవిష్ణు ఎప్పటిలా బాగా చేశాడు. పాత్ర మాత్రమే కనిపించేలా నటించాడు. అతడి నటనలో వంక పెట్టడానికి లేదు. 'నీదీ నాదీ ఒకే కథ', ఇంకా పలు చిత్రాల్లో భావోద్వేగ సన్నివేశాల్లో నటించి మెప్పించాడు. అయితే, ఈ సినిమాలో కుమారుడి ముందు ఒకరి (కథ మొత్తం చెప్పకూడదు కాబట్టి ఆ ఒకరు ఎవరనేది చెప్పడం లేదు) చేతిలో చెంపదెబ్బ తిన్న తర్వాత అతడు చేసిన అభినయం అందర్నీ ఆకట్టుకుంటుంది. హీరోయిన్లలో సునైన ప్రేక్షకులకు ఎక్కువరోజులు గుర్తుంటుంది. అంత అద్భుతంగా నటించింది. ఆమె సెలక్షన్ పర్‌ఫెక్ట్. మేఘా ఆకాష్ కొత్త పాత్రలో నటించింది. ఆమె అభినయం కూడా ఆకట్టుకుంటుంది. రవిబాబు పాత్ర గతంలో అతడు చేసిన పోలీస్ పాత్రను గుర్తు చేయవచ్చు. అజయ్ ఘోష్, శ్రీకాంత్ అయ్యంగార్, గంగవ్వకు కీలక మలుపుల్లో వచ్చే సన్నివేశాల్లో కనిపించే పాత్రల్లో నటించే అవకాశం దక్కింది.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
కథలో, కథనంలో కొత్తదనం ఉంది. అయితే... శ్రీవిష్ణు చెప్పినట్టు మరీ మాస్క్ లు పగిలిపోయేంత నవ్వులు లేవు. కానీ, ప్రథమార్థంలో వినోదాత్మక సన్నివేశాలు ఉన్నాయి. ముఖంలో చిరునవ్వులు పూయిస్తాయి. మంచి ఇంటర్వెల్ బ్యాంగ్ పడింది. అయితే, ఆ తర్వాత సినిమాలో నవ్వులు తగ్గాయి. ఎప్పుడైతే ఎమోషన్, డ్రామా ఫ్రంట్ సీట్ తీసుకున్నాయో, అప్పుడు కామెడీ బ్యాక్ సీటుకు వెళ్లింది. సినిమా కొన్నిసార్లు భారంగా క్లైమాక్స్ వైపు కదిలింది. సెకండాఫ్ సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. థియేటర్ నుండి బయటకు వచ్చేటప్పుడు ఏదో చిన్న అసంతృప్తి, వెలితి. హీరో హీరోయిన్లు, సంగీత దర్శకుడు తమ శక్తిమేరకు సినిమాను నిలబెట్టడానికి ప్రయత్నించారు.