English | Telugu
బ్యానర్:గోపీకృష్ణా మూవీస్, యువి క్రియేషన్స్
Rating:2.50
విడుదలయిన తేది:Mar 11, 2022
సినిమా పేరు: రాధే శ్యామ్
తారాగణం: ప్రభాస్, పూజా హెగ్డే, కృష్ణంరాజు, భాగ్యశ్రీ, సచిన్ ఖెడేకర్, జగపతిబాబు, ప్రియదర్శి, మురళీశర్మ, రిద్ధి కుమార్, సాషా చెత్రి, సూర్య
పాటలు: కృష్ణకాంత్
సంగీతం: జస్టిన్ ప్రభాకరన్
బ్యాగ్రౌండ్ స్కోర్: తమన్
సినిమాటోగ్రఫీ: మనోజ్ పరమహంస
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు
ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్
యాక్షన్: నిక్ పావెల్
సౌండ్ డిజైన్: రసూల్ పోకుట్టి
నిర్మాతలు: వంశీ, ప్రమోద్, ప్రసీద
రచన-దర్శకత్వం: రాధాకృష్ణ కుమార్
బ్యానర్స్: గోపీకృష్ణా మూవీస్, యువి క్రియేషన్స్
విడుదల తేదీ: 11 మార్చి 2022
'బాహుబలి'తో వచ్చిన అమేయమైన ఇమేజ్ తర్వాత యాక్షన్ ఫిల్మ్ 'సాహో'తో ప్రేక్షకుల ముందుకు వచ్చి పాక్షికంగా ప్రేక్షకులను రంజింపజేసిన ప్రభాస్.. దాని తర్వాత 'రాధే శ్యామ్' అనే ఒక ప్యూర్ లవ్ స్టోరీతో వస్తున్నాడనేసరికి ఫ్యాన్స్‌తో పాటు, సాధారణ సినీ ప్రేమికులూ ఆసక్తితో ఎదురుచూశారు. 'వర్షం', 'డార్లింగ్' లాంటి సినిమాల్లో ప్రేమికునిగా అలరించిన ప్రభాస్ ఇన్నాళ్ల తర్వాత ఎలాంటి లవ్ స్టోరీతో వస్తాడా అనే కుతూహలం వారిలో వ్యక్తమవుతూ వచ్చింది. అతను హస్తసాముద్రికునిగా కనిపించనున్నాడనే విషయం ముందుగానే దర్శకుడు రాధాకృష్ణ కుమార్ వెల్లడించాడు. ఇటలీ నేపథ్యంలో రూపొందిన లవ్ స్టోరీ 'రాధే శ్యామ్' ఎలా ఉందో చదివేద్దాం...
కథ:- ఇండియా నుంచి ఇటలీకి వలస వెళ్లిన విక్రమాదిత్య (ప్రభాస్) కు ఐన్‌స్టీన్ ఆఫ్ పామిస్ట్రీ అనే ఖ్యాతి లభిస్తుంది. అతను అంతదాకా చెప్పిన జ్యోతిష్యాలు 100 శాతం నిజమవుతాయి. తన చేతిలో లవ్ లైన్ లేదని నమ్మే అతను ఏ అమ్మాయితోనూ ఎక్కువ కాలం అనుబంధం పెట్టుకోడు. అలాంటివాడికి ప్రేరణ (పూజా హెగ్డే) అనే అందమైన డాక్టర్ పరిచయమవుతుంది. ఆమెతో ఆకర్షణలో పడిపోతాడు ఆదిత్య. ఆమె అతడిని ప్రేమిస్తుంది. అందరి జాతకాలూ చెప్పే అతడిని తన జాతకం చెప్పమంటుంది ప్రేరణ. ఆమె ఆరడుగుల అందగాడ్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటుందనీ, డాక్టర్‌గా ఎంతో పేరు సంపాదించుకుంటుందనీ, నూరేళ్లు బతుకుతుందనీ చెప్తాడు ఆదిత్య. ఆమె ఒక ప్రాణాంతక వ్యాధితో బాధపడుతోందనీ, రెండు మూడు నెలలకు మించి బతకదనీ అప్పటికే డాక్టర్లు చెప్పిన విషయం అతడికి తెలీదు. ఆ తర్వాత ఏం జరిగింది? ప్రేరణ బతికిందా? ఆమె జాతకం సరే.. ఆదిత్య జాతకం ఏమిటి? విధి రాసిన రాతకు ఎదురీదిన వారి ప్రేమ గెలిచిందా? అనే ప్రశ్నలకు మిగతా సినిమాలో మనకు సమాధానాలు దొరుకుతాయి.
ఎనాలసిస్ :
1970ల నేపథ్యంలో ఇటలీలో జీవనం సాగించే ఇద్దరు భారతీయ యువతీ యువకుల మధ్య స్వచ్ఛమైన ప్రేమను కవితాత్మకంగా, అందమైన పెయింటింగ్‌గా సెల్యులాయిడ్‌పై మలచాలని దర్శకుడు రాధాకృష్ణ కుమార్ తపించినట్లు 'రాధే శ్యామ్'ను చూస్తే అర్థమవుతుంది. 18 సంవత్సరాల క్రితం డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి ఇచ్చిన ఐడియాతో ఈ కథను అతను రాసుకున్నాడు. నిజానికి ఇందులో పెద్ద కథేమీ లేదు. ఒక అందమైన డాక్టర్‌తో ప్రేమలో పడిన ఒక హస్తసాముద్రికుడు ఆ ప్రేమను బయటకు అంగీకరించలేక, ఆమెను వదిలి ఉండలేక ఎలా తనతో తను సంఘర్షణ పడ్డాడు, దాని వెనుక ఉన్న కారణమేంటనేది ఇందులోని ప్రధానాంశం.
విక్రమాదిత్య, ప్రేరణ మధ్య పరిచయ సన్నివేశాలు, ఆ పరిచయం క్రమేణా ప్రేమగా పరిణమించే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. మధ్య మధ్యలో చిక్కని సాహిత్యంతో వచ్చే పాటలతో వారి ప్రేమను అందంగా చూపించడానికి దర్శకుడు ప్రయత్నించాడు. జస్టిన్ ప్రభాకరన్ మెలోడియస్ ట్యూన్స్‌కు, కృష్ణకాంత్ ఇచ్చిన లిరిక్స్ హృదయాన్ని స్పృశిస్తాయి. ఈ క్రమంలో ఇటలీ అందాలు అలరిస్తాయి. కథలోని ఆత్మను పట్టుకున్నట్లు మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ గొప్పగా సన్నివేశాలను చూపించింది. తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఎప్పట్లాగే సన్నివేశాల్లోని గాఢతను పెంచే ప్రయత్నం చేసింది. షిప్‌లో తీసిన క్లైమాక్స్ సన్నివేశాలు గగుర్పాటు కలిగిస్తాయి. ఇక్కడ ప్రొడక్షన్ డిజైనర్ రవీందర్‌కు హ్యాట్సాఫ్ చెప్పాలి.
ఎటొచ్చీ.. మణిరత్నం క్లాసిక్ ఫిల్మ్ 'గీతాంజలి' లైన్‌లో 'రాధే శ్యామ్' నడుస్తున్న విషయం క్రమేపీ మనకు అర్థమైపోతుంది. 'గీతాంజలి'లో హీరో హీరోయిన్లు నాగార్జున, గిరిజ మధ్య వచ్చే సన్నివేశాలు, సంభాషణలను 'రాధే శ్యామ్'లో ప్రభాస్, పూజా మధ్య వచ్చే కొన్ని సీన్లు, డైలాగ్స్ గుర్తుచేస్తాయి. మణిరత్నం ఛాయల్లో సినిమా తియ్యడానికి ప్రయత్నించిన రాధాకృష్ణ కొంతమేరే సక్సెస్ కాగలిగాడు. అది సినిమా టేకింగ్‌కు సంబంధించిన అంశం. 'గీతాంజలి' తీసేనాటికి నాగార్జున ఇమేజ్ వేరు, 'రాధే శ్యామ్' తీసేనాటికి ప్రభాస్ ఇమేజ్ వేరు. దేశవ్యాప్తంగా మాస్‌లోకి వెళ్లిపోయిన ఒక బిగ్గెస్ట్ స్టార్‌తో ఇలాంటి సున్నితమైన ప్రేమకథను తీయడం పెద్ద సాహసం.. కాదు.. దుస్సాహసం. యాక్షన్ స్టార్‌గా విపరీతమైన ఇమేజ్ వచ్చేశాక ప్యూర్ లవ్ స్టోరీలో ప్రభాస్‌ను చూడ్డం ఒక సెక్షన్ ఆఫ్ ఆడియెన్స్‌కు మాత్రమే నచ్చే విషయం. భయంకరమైన విలన్ ఉండి, అతడిని ఢీకొట్టి, చావకొట్టే పరాక్రమవంతుడిగా ప్రభాస్‌ను చూడాలనుకొనే కోట్లాదిమంది ఫ్యాన్స్ ఇలాంటి క్యారెక్టర్‌లో ఆయనను చూడగలరా!?
ప్లస్ పాయింట్స్
ప్రభాస్, పూజా హెగ్డే ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ
సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, ప్రొడక్షన్ డిజైన్
రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్
మైనస్ పాయింట్స్
'గీతాంజలి' తరహాలో నడిచే కథ, పాత్రలు
ప్రభాస్ యాక్షన్ ఇమేజ్‌కు భిన్నమైన క్యారెక్టర్
గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే మిస్సవడం
పలు సపోర్టింగ్ క్యారెక్టర్లు బలంగా లేకపోవడం
నటీనటుల పనితీరు:- 'రాధే శ్యామ్'లో ఎక్కువ పాత్రలు లేవు. ఉన్న కొద్ది పాత్రల్లోనూ పేరుపొందిన ఆర్టిస్టులతో చేయించారు. వారిలో ఎక్కువమందికి పెద్దగా కష్టపడాల్సిన.. ఐ మీన్.. నటించాల్సిన అవసరం కలుగలేదు. విక్రమాదిత్య పాత్రలో ప్రభాస్ చక్కని నటనను ప్రదర్శించాడు. కొన్ని చోట్ల అతని ఎక్స్‌ప్రెషన్స్ టాప్ క్లాస్‌లో ఉన్నాయి. అయితే 'బాహుబలి'లో మాదిరిగా, అంతకు ముందు సినిమాల్లో కనిపించిన మాదిరిగా ఈ సినిమాలో అతను అంత అందంగా కనిపించలేదు. కారణం.. మేకప్పేనా? దగ్గరకు ట్రిమ్ చేసిన మీసాలు, గడ్డం అతనికి నప్పలేదనిపిస్తుంది. ప్రేరణగా పూజా హెగ్డే మాత్రం ఇటు అందంగానూ ఉంది, అటు నటిగానూ మెప్పించింది. ప్రభాస్‌తో ఆమె ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ సూపర్బ్.
మిగతా యాక్టర్లలో సచిన్ ఖెడేకర్‌కు ఎక్కువ స్పేస్ లభించింది. ప్రేరణ పెదనాన్నగా, హాస్పిటల్ డీన్‌గా ఆయన చక్కగా రాణించారు. ఆదిత్య గురువు పరమహంసగా స్పెషల్ రోల్‌కు కృష్ణంరాజు న్యాయం చేశారు. భారతదేశపు అత్యంత సంపన్నునిగా జగపతిబాబు కనిపించారు. ఆయనకు రెండు సీన్లకు మించి కనిపించే అవకాశం రాలేదు. ఆదిత్య తల్లిగా భాగ్యశ్రీ ముచ్చటగా ఉన్నారు. ఆమెది సాఫీగా నడుస్తూ.. అప్పుడప్పుడు అలా ప్రత్యక్షమై, ఇలా మాయమయ్యే పాత్ర. ప్రేరణ తండ్రిగా మురళీశర్మను ఎందుకు తీసుకున్నారో తెలీదు. ఆయనకు సినిమా మొత్తం మీద రెండు డైలాగ్స్ మించి లేవు. ప్రియదర్శి, రిద్ధి కుమార్, సాషా చెత్రి లాంటివాళ్లు తమ పాత్రలకు న్యాయం చేకూర్చారు.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
'గీతాంజలి' లాంటి క్లాసిక్ ఫిల్మ్ తరహాలో తీసిన 'రాధే శ్యామ్' దానికి నకలుగానే మిగిలిపోతుందని చెప్పాలి. ఆడియెన్స్‌ను సమ్మోహితుల్ని చేసేంత బలమైన సన్నివేశాలు కానీ, భావోద్వేగంతో ఊపిరాడకుండా చేసే కథనం కానీ లేకపోవడం దీనికి ప్రధాన కారణం. వందలాది మంది రౌడీలను, భయంకరమైన విలన్‌ను చావ చితక్కొట్టే యాక్షన్ స్టార్‌గా ప్రభాస్‌ను చూడాలనుకొనే అశేష ఫ్యాన్స్ ఇలాంటి పాత్రలో ఆయనను చూసి పరవశిస్తారా? బిగ్ డౌట్..
- బుద్ధి యజ్ఞమూర్తి