English | Telugu
బ్యానర్:డి వి వి ఎంటర్ టైన్ మెంట్స్
Rating:3.25
విడుదలయిన తేది:Mar 25, 2022
సినిమా పేరు: ఆర్ఆర్ఆర్
తారాగణం: రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్, ఆలియా భట్, ఒలీవియా మోరిస్, సముద్రకని, అజయ్ దేవ్‌గణ్, శ్రియ, రే స్టీవెన్సన్, అలీసన్ డూడీ, రాహుల్ రామకృష్ణ, ఛత్రపతి శేఖర్, మకరంద్ దేశ్‌పాండే, రాజీవ్ కనకాల (గెస్ట్), ఎడ్వర్డ్ సోనెన్‌బ్లిక్, వరుణ్ బుద్ధదేవ్, స్పందన్ చతుర్వేది
కథ: వి. విజయేంద్రప్రసాద్
మాటలు: సాయిమాధవ్ బుర్రా
పాటలు: సుద్దాల అశోక్‌తేజ, చంద్రబోస్, రామజోగయ్య శాస్త్రి, ఎం.ఎం. కీరవాణి
సంగీతం: ఎంఎం కీరవాణి
సినిమాటోగ్రఫీ: కె.కె. సెంథిల్‌కుమార్
ఎడిటింగ్: ఎ. శ్రీకరప్రసాద్
ప్రొడక్షన్ డిజైనర్: సాబు సిరిల్
స్టంట్స్: నిక్ పావెల్
కొరియోగ్రఫీ: ప్రేమ్ రక్షిత్
వీఎఫ్ఎక్స్: శ్రీనివాసమోహన్
లైన్ ప్రొడ్యూసర్: యస్.యస్. కార్తికేయ
నిర్మాత: డీవీవీ దానయ్య
స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: యస్.యస్. రాజమౌళి
బ్యానర్: డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్
విడుదల తేదీ: 25 మార్చి 2022
మూడు సంవత్సరాలుగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' సినిమా మన ముందుకు వచ్చేసింది. బాహుబలి ఫ్రాంచైజ్ తర్వాత యస్.యస్. రాజమౌళి సినిమా కావడం, అందులోనూ మాస్‌లో సమాన ఇమేజ్ వున్న ఇద్దరు స్టార్ హీరోలు రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటించడంతో ఆర్ఆర్ఆర్ పై వెల్లువెత్తిన అంచనాలకు హద్దులు లేకుండా పోయాయి. ఇప్పటికే విడుదలైన పాటలు కానీ, టీజర్లు కానీ, ట్రైలర్ కానీ ఈ అంచనాలను మరింత పెంచాయి. అలాంటి ఆర్ఆర్ఆర్ ఎలా ఉందో చూసేద్దామా...
కథ:- ఆదిలాబాద్‌లోని గోండు తండాకు చెందిన పచ్చబొట్లు బాగా వేసే మల్లి అనే అమ్మాయిని బ్రిటీష్ దొర స్కాట్ తమతో పాటు ఢిల్లీకి తీసుకుపోతాడు. గోండు నాయకుడైన భీమ్.. ఆ అమ్మాయిని ఎలాగైనా తీసుకురావాలని తన అనుచరులతో ఢిల్లీకి వెళ్తాడు. స్కాట్ దొరను అంతమొందించి, మల్లిని తీసుకుపోవడానికి భీమ్ వచ్చాడనే విషయం బ్రిటీషర్లకు తెలుస్తుంది. బ్రిటీష్ సైన్యంలో పనిచేసే రామరాజుతో భీమ్‌కు పరిచయమవుతుంది. ఇద్దరూ ప్రాణ స్నేహితులుగా మారతారు. స్కాట్‌కు బంధువైన జెన్నిఫర్‌తో అయిన స్నేహం కారణంగా స్కాట్ రాజమందిరంలోకి అడుగుపెట్టే అవకాశం లభిస్తుంది భీమ్‌కు. మల్లిని తీసుకుపోవడానికి వచ్చిన అతడిని వెన్నుపోటు పొడిచి, బ్రిటీష్ వాళ్లకు అప్పగిస్తాడు రామరాజు. అందుకు నజరానాకు స్పెషలాఫీసర్‌గా అతడిని ప్రమోట్ చేస్తాడు స్కాట్. ఆ తర్వాత భీమ్‌ను బ్రిటీషర్లు ఏం చేశారు? కోటలో బందీ అయిన మల్లిని అతను కాపాడగలిగాడా? రామరాజు బ్రిటీషర్ల తరపున ఎందుకు పనిచేశాడు? దాని వెనుక ఏమైనా కథ ఉందా? మిత్రుల నుంచి శత్రువులుగా మారిన రామరాజు, భీమ్ తిరిగి కలుసుకున్నారా? తన సర్వస్వమైన రామరాజును వెతుక్కుంటూ వచ్చిన సీత అతడిని కలుసుకోగలిగిందా? వీటన్నిటికీ సెకండాఫ్‌లో సమాధానాలు లభిస్తాయి.
ఎనాలసిస్ :
ఇద్దరు స్వాతంత్ర్య పోరాట వీరులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్‌లను కల్పిత కథలో భాగం చేయడం అనేది ఒక అసాధారణ విషయం. నిజ జీవితంలో వాళ్లను ఆరాధ్యదేవుళ్లుగా భావించే అభిమానుల మనోభావాలు దెబ్బతినకుండా వాళ్ల వ్యక్తిత్వాలకు భంగం కలగకుండా వారి పాత్రలను మలచడం కత్తి మీద సాము వ్యవహారం. ఆ విషయంలో దర్శకుడు రాజమౌళి పాక్షికంగానే విజయం సాధించాడని చెప్పాలి. రామరాజు పాత్రను మొదట్లో బ్రిటీషర్లకు అనుకూలంగా, వాళ్లకు నమ్మినబంటుగా మలచడం, అందులో భాగంగా పరిచయ సన్నివేశంలోనే సామాన్య పౌరులను ఆయన నిర్దాక్షిణ్యంగా చితకబాదినట్లు చూపించడం, భీమ్‌ను బంధించి బ్రిటీషర్లకు అప్పగించడం అనేవి ఆయన ఆరాధకులకు ఏమాత్రం నచ్చని విషయాలు.
అలాగే మల్లిని కాపాడేందుకు భీమ్.. ఒక వాహనంలో వన్యప్రాణుల్ని తీసుకువెళ్లి, బ్రిటీష్ సైనికులపైకి వాటిని ఉసిగొల్పడం, వారు ఆ వన్యమృగాలపై కాల్పులు జరపడం అనే సన్నివేశం ఏమాత్రం సమర్ధనీయమైన విషయం కాదు. ఒక అడవి బిడ్డ, ఒక గోండు వీరుడు అలా చేస్తాడనేది ఊహించుకోడానికి సైతం ఇబ్బంది పెడుతుంది. 'ఆర్ఆర్ఆర్'ను కేవలం ఏదో కమర్షియల్ సినిమాగా భావించుకొని, ఎంజాయ్ చేద్దామంటే చరిత్ర పురుషులైన రామరాజు, భీమ్ పాత్రలు కళ్లముందు అనుక్షణం కదలాడుతున్నాయయ్యే! విజయేంద్రప్రసాద్ లాంటి సీనియర్ రచయిత ఇలా చరిత్రలో నిలిచిపోయిన గొప్ప వీరులను వాళ్ల వ్యక్తిత్వానికి భిన్నమైన తరహాలో చూపించడం ఎంతవరకు న్యాయం!!
రామరాజు ఇంట్రడక్షన్ సీన్ రామ్‌చరణ్ అభిమానులకు నచ్చవచ్చు కానీ, సాధారణ పౌరులపై అసాధారణ రీతిలో దాడిచేసి, వారిని విపరీతంగా హింసిస్తూ, తాను దెబ్బలు తింటూ, బ్రిటీష్ పోలీస్‌గా అతను కనిపించడమే కరెక్టనిపించదు. అయితే ఆ సీన్‌ను తీసిన విధానం మాత్రం వేరే లెవల్ అనిపిస్తుంది. భీమ్ ఇంట్రడక్షన్ సీన్‌ను కూడా బాగానే తీశాడు రాజమౌళి. ఒక పులి అతని వెంటపడితే, అతను దాన్ని బంధించి, దాంతో పాటే గాండ్రించడం.. రాజమౌళి మార్క్ విన్యాసం అనిపిస్తుంది. సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ అన్నీ రోమాలు నిక్కబొడుచుకొనే రీతిలో ఉన్నాయి. హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ నిక్ పావెల్ డిజైన్ చేసిన విధానంతో సినిమాకి అవి ఓ హైలైట్ పాయింట్‌గా నిలిచాయి. రామరాజును భీమ్ భుజాలపై మోస్తుండగా చిత్రీకరించిన ఫైట్ సూపర్బ్.
ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే వెంకట్రామరాజు ఎపిసోడ్ కూడా ఆకట్టుకుంటుంది. స్వతంత్రం కోసం కొట్లాడడానికి తనవాళ్లకు తుపాకులను పేల్చడంలో శిక్షణనిస్తూ, బ్రిటీషర్లతో అతను పోరాడి, అమరుడయ్యే సన్నివేశాలు గుండెలను హత్తుకుంటాయి. బ్రిటీష్ అమ్మాయి జెన్నిఫర్ అమాయకంగా కనిపించే భీమ్‌ను అభిమానించి, అతడి ప్రేమలో పడే సన్నివేశాలు కానీ, ఆ సందర్భంగా రామరాజు, భీమ్‌పై వచ్చే నాటు నాటు సాంగ్ కానీ అలరిస్తాయి. సీత పాత్ర తక్కువసేపే కనిపించినా, దాన్ని తెరపై ప్రెజెంట్ చేసిన తీరు బాగుంది. పాటలన్నీ చిత్రీకరణ పరంగా బాగున్నాయి. తనకు బహిరంగ శిక్ష వేసినప్పుడు, మోకాళ్లపై నిల్చొని క్షమాపణ అడగడానికి నిరాకరించినప్పుడు, రామరాజు కొరడాతో కొడ్తున్న దెబ్బలకు చర్మం చీలి రుధిరం నేలపై పడి, కాలవ కడుతుంటే "కొమరం భీముడో" అంటూ భీమ్ పాడే పాట చుట్టూ ఉండే పౌరుల్లో ఉద్వేగాన్ని రేకెత్తిస్తుంటే మనమూ వారితో సహానుభూతి చెందుతాం. సంగీతమూ, సాహిత్యమూ పోటీపడ్డ పాట అది. కీరవాణి సంగీతం సినిమాకు ఓ ఎస్సెట్.
సెంథిల్ కుమార్ కెమెరా పనితనంతో ఏ సన్నివేశానికి ఆ సన్నివేశం ఉన్నత స్థాయిలో కనిపించింది. ఎమోషనల్ సీన్లలో కానీ, యాక్షన్ సీన్లలో కానీ.. ఎలాంటి సీన్ అయినా ఆయన కెమారా ఆ ఎమోషన్‌ను క్యారీ చేసుకుంటూ వెళ్లింది. సాబు సిరిల్ ఆర్ట్ వర్క్ గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు. సినిమా మొత్తం అడుగడుగునా ఆయన కళాప్రతిభ కనిపిస్తుంది. శ్రీకరప్రసాద్ ఎడిటింగ్ వర్క్ టాప్ క్లాస్‌లో ఉంది. పాటలకు ప్రేమ్ రక్షిత్ ఇచ్చిన కొరియోగ్రఫీ మనతో కూడా డాన్స్ చేయించేట్లు ఉంది.
ఇదంతా బాగుంది కానీ.. క్లైమాక్స్ అయ్యాక ఇటు భీమ్ అభిమానులు, అటు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు.. ఇద్దరూ అసంతృప్తికి గురవుతారని చెప్పక తప్పదు. ఎందుకనేది సినిమా చూసినవాళ్లకు తెలుస్తుంది. భీమ్ తన గుర్తింపుని దాచిపెట్టడానికి అఖ్తర్ అనే ముస్లిం వేషం వేయడం.. ఆయన కథను చదువుకున్నవాళ్లకు, ఆయన జాతికీ కూడా శరాఘాతం లాంటిదే.
నటీనటుల పనితీరు:- 'ఆర్ఆర్ఆర్' అనేది రామరాజు, భీమ్ సినిమా. ఆ పాత్రల్లో రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఫస్టాఫ్‌లో రామరాజు ప్రవర్తించే తీరు నచ్చక తిట్టుకొనే మనం, సినిమా పూర్తయ్యేసరికి ఆ పాత్రతో ప్రేమలో పడతాం. ఆ పాత్రలోని వేరియేషన్‌ను చరణ్ ఉన్నత స్థాయిలో ప్రదర్శించాడు. 'రంగస్థలం' తర్వాత అతనికి ఇది మరో కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్. తారక్ సంగతి చెప్పేదేముంది! ఎప్పట్లా పాత్రలో ఇమిడిపోయాడు. భీమ్‌గా చెలరేగి నటించాడు. ఎమోషనల్ సీన్లలో తనకు ఎదురులేదని అనిపించుకున్నాడు. స్క్రీన్‌పై చరణ్, తారక్ కలిసి చేసిన సీన్లన్లీ పండాయి. ఆ ఇద్దరూ కలిసి డాన్స్ చేస్తున్నా, స్నేహితులుగా అభిమానంతో మాట్లాడుతున్నా, కలిసి బ్రిటీషర్లపై పోరాడుతున్నా మనం ఎంజాయ్ చేస్తాం.
సీతగా తెరమీద కనిపించేది తక్కువసేపే అయినా ఆలియా భట్ సమ్మోహనశక్తి ఎలాంటిదో ఈ సినిమాలో మనం చూస్తాం. అందానికి అందం, అభినయానికి అభినయం పోటీపడుతున్నట్లుగా ఉన్న ఆమె సీత పాత్రలో సునాయాసంగా ఇమిడిపోయింది. సీత పాత్రకంటే ఎక్కువ నిడివి ఉన్న పాత్ర జెన్నిఫర్‌ది. ఆ పాత్రలో బ్రిటీష్ నటి ఒలీవియా మోరిస్ అందంగా ఉంది. స్కాట్ దొరగా, ఆయన భార్యగా రే స్టీవెన్సన్, అలీసన్ డూడీ విలనీని బాగా పండించారు. రామరాజు తండ్రి వెంకట్రామరాజుగా స్పెషల్ రోల్‌లో అజయ్ దేవ్‌గణ్ స్పెషల్‌గా కనిపించాడు. కనిపించేది పది నిమిషాలసేపే అయినా మనల్ని తన వశం చేసుకున్నాడు. భీమ్ అనుచరులుగా రాహుల్ రామకృష్ణ, మకరంద్ దేశ్‌పాండే, ఛత్రపతి శేఖర్ తమ పాత్రలకు న్యాయం చేశారు. మల్లిగా నటించిన అమ్మాయి ఆ పాత్రలో చక్కగా రాణించింది. రామరాజు బాబాయ్‌గా సముద్రకని కనిపించాడు. అయితే అతని సమర్ధతకు తగ్గ పాత్ర కాదది.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
చరిత్ర గురించి, చారిత్రక పురుషుల గురించీ ఆలోచించకుండా, కేవలం ఒక కమర్షియల్ సినిమాగానే చూస్తే.. ట్రిపుల్ ఆర్ సగటు ప్రేక్షకుడికి మంచి వినోదాన్నిస్తుంది. చరణ్, తారక్ పర్ఫార్మెన్స్, యాక్షన్ ఎపిసోడ్స్, ఎమోషనల్ సీన్స్ అలరిస్తాయి. కానీ అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ వ్యక్తిత్వాల గురించి ఎంతో కొంత తెలిసినవాళ్లు, తెరపై వారు కనిపించే తీరుకు, వారు చేసే కొన్ని పనులకు తీవ్ర అసంతృప్తి చెందుతారు.
- బుద్ధి యజ్ఞమూర్తి