English | Telugu
బ్యానర్:కింగ్ ఆఫ్ ది హిల్ ఎంటర్‌టైన్‌మెంట్, టాంగా ప్రొడక్షన్స్
Rating:2.25
విడుదలయిన తేది:Nov 12, 2021
సినిమా పేరు: పుష్పక విమానం
తారాగణం: ఆనంద్ దేవరకొండ, గీత్ సైనీ, శాన్వే మేఘన, సునీల్, నరేశ్, హర్షవర్ధన్, కిరీటి, సి.వి.ఎల్. నరసింహారావు, గిరి, శరణ్య, వైవా హర్ష
మ్యూజిక్: రామ్ మిరియాల, సిద్ధార్థ్ సదాశివుని, అమిత్ దాసాని
బ్యాగ్రౌండ్ స్కోర్: మార్క్ కె. రాబిన్
సినిమాటోగ్రఫీ: హెస్టిన్ జోస్ జోసెఫ్
ఎడిటింగ్: రవితేజ గిరిజాల
ఆర్ట్: నీల్ సెబాస్టియన్
సమర్పణ: విజయ్ దేవరకొండ
నిర్మాతలు: గోవర్ధన్ రావు దేవరకొండ, విజయ్ దషి , ప్రదీప్ ఎర్రబెల్లి
రచన-దర్శకత్వం: దామోదర
బ్యానర్స్: కింగ్ ఆఫ్ ది హిల్ ఎంటర్‌టైన్‌మెంట్, టాంగా ప్రొడక్షన్స్
విడుదల తేది: 12 నవంబర్ 2021
'దొరసాని', 'మిడిల్ క్లాస్ మెలోడీస్' మూవీస్ తర్వాత ఆనంద్ దేవరకొండ అభిరుచి ఏమిటనేది అవగాహనలోకి వచ్చింది. అతను కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్ అంటే ఇష్టపడతాడని అర్థమైంది. 'పుష్పక విమానం' సినిమా కూడా అదే తరహాలో చక్కని కాన్సెప్ట్‌తో వస్తోందని ప్రేక్షకులు ఆశించారు. రౌడీ హీరో విజయ్ దేవరకొండ సమర్పణలో, సొంత బ్యానర్‌పై తీయడం కూడా ఈ మూవీపై చెప్పుకోదగ్గ అంచనాలు ఏర్పడ్డాయి. ఒకప్పటి కమల్ హాసన్ క్లాసిక్ ఫిల్మ్ టైటిల్‌తో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం పదండి...
కథ:- గవర్నమెంట్ స్కూల్లో లెక్కల మాస్టారుగా పనిచేసే సుందర్ (ఆనంద్ దేవరకొండ)కు, మీనాక్షి (గీత్ సైని) అనే అందమైన అమ్మాయితో పెళ్లవుతుంది. కాపురం పెట్టిన కొద్ది రోజులకే మీనాక్షి తను ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోతున్నానని లెటర్ రాసి వెళ్లిపోతుంది. భార్యతో ఆనందంగా సంసార జీవితం గడపాలనుకున్న సుందర్ కలలు కల్లలవుతాయి. భార్యను చూపించమని అడుగుతున్న కొలీగ్స్ బాధ పడలేక, షార్ట్ ఫిలిమ్స్‌లో నటించే రేఖ (శాన్వీ మేఘన) అనే యువతిని భార్యగా వారికి పరిచయం చేస్తాడు. ఆ తర్వాత ఊహాతీతంగా మీనాక్షి హత్యకు గురవుతుంది. సుందర్‌ను అనుమానించిన యస్సై (సునీల్) అతడిని లాకప్‌లో ఉంచి, చిత్రహింసలు పెడతాడు. తను అమాయకుడిననీ, మీనాక్షి హత్యతో తనకు సంబంధం లేదని సుందర్ ప్రూవ్ చేసుకోగలిగాడా? అసలు మీనాక్షి హంతకులెవరు? అనేది మిగతా కథ.
ఎనాలసిస్ :
ఒక మధ్యతరగతి యువకుడు అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకొని, హాయిగా సంసార జీవితం గడపాలనుకుంటే పెళ్లయిన కొత్తలోనే ఆ భార్య ఇంట్లోంచి వెళ్లిపోతే ఎలాంటి నరకం అనుభవిస్తాడు, చుట్టుపక్కల వాళ్లకు సమాధానం చెప్పుకోలేక ఎట్లా సతమవుతాడు, ఆమె హత్యకు గురైందని తెలిస్తే ఏ రకంగా తల్లడిల్లిపోతాడనే పాయింట్‌తో నూతన దర్శకుడు దామోదర 'పుష్పక విమానం' చిత్రాన్ని రూపొందించాడు. అయితే ప్రమోషన్స్‌లో కామెడీ మూవీగా దీన్ని డైరెక్టర్ పేర్కొన్నాడు. కానీ ఇది బీభత్సరస ప్రధానమైన మర్డర్ మిస్టరీ. మీనాక్షి ఇంట్లోంచి వెళ్లిపోయిన దగ్గర్నుంచీ ఆమె హత్యకు గురయ్యిందని తెలిసేంతవరకూ సుందర్ పడే తిప్పలను కామెడీ టోన్‌తో చిత్రించాడు దామోదర.
ఇంటర్వెల్ కంటే ముందుగానే మీనాక్షి హత్యకు గురై, కథ క్రైమ్ డ్రామా కింద టర్న్ అవుతుంది. ఇది ప్రేక్షకుడ్ని ఒక్కసారిగా కుదిపేస్తుంది. ఒక ఆహ్లాదకరమైన సినిమాగా ఊహించుకొని వస్తే, అందుకు భిన్నంగా మర్డర్ మిస్టరీతో బీభత్సరస సన్నివేశాలు, క్రైమ్ డ్రామా చూడాల్సి వచ్చేసరికి మూడ్ పాడైపోయినట్లు ఫీలయ్యేవారే ఎక్కువ. టైటిల్, ప్రమోషన్స్‌కు వాడిన ఇమేజెస్, ట్రైలర్ కూడా ఇది కామెడీ సినిమాయే అన్నట్లు భ్రమ కల్పించాయి. సుందర్ భార్య లేచిపోయిందనే పాయింట్‌ను ట్రైలర్‌లో చెప్పారు కానీ, దాని వెనుక మర్డర్ మిస్టరీ దాగివుందని సాధారణ ప్రేక్షకులు ఊహించరు. ఇది వారిని అసంతృప్తికి గురిచేసే అంశం.
ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాని మేకర్స్ చెప్పారు. కానీ పిల్లలతో కలిసి చూసే పెద్దలు మధ్యమధ్యలో ఇబ్బందిపడే డైలాగ్స్, సీన్స్ ఈ సినిమాలో ఉన్నాయి. ఫస్ట్ నైట్ భార్యను మీరు వర్జిన్ కాదాండీ? అని హీరో ప్రశ్నిస్తాడు. ఈ వర్జిన్ అనే మాట చుట్టూ అల్లుకున్న సీన్లు అప్పుడప్పుడూ వస్తుంటాయి. ఇవి ఫ్యామిలీతో కలిసొచ్చిన ఆడియెన్స్‌ను చికాకు పెడతాయి.
'ఒక సింపుల్ మ్యాన్ కాంప్లికేటెడ్ స్టోరీ' అని ప్రమోషన్స్‌లో చెప్పారు. నిజమే. యథార్థ ఘటనల ఆధారంగా దామోదర రాసుకున్న ఈ కథ కాంప్లికేటెడ్‌గానే ఉంది. స్టోరీయే కాదు, క్యారెక్టర్స్‌ను కూడా తను కాంప్లికేటెడ్‌గానే డిజైన్ చేశాననే విషయాన్ని అతను గుర్తించలేకపోయాడు. మెయిన్ క్యారెక్టర్ సుందర్ పడే స్ట్రగుల్స్‌తో ఆడియెన్స్ కనెక్ట్ అయితేనే స్టోరీ ఆసక్తిదాయకంగా అనిపిస్తుంది. అలా లేకపోవడమే 'పుష్పక విమానం'కు మైనస్. మీనాక్షి క్యారెక్టర్ కానీ, భార్యగా అరువు తెచ్చుకున్న రేఖ క్యారెక్టర్ కానీ ప్రేక్షకుల్ని ఎట్రాక్ట్ చేసే రీతిలో లేవు. యస్సైగా చేసిన సునీల్ క్యారెక్టర్‌కు కూడా డైరెక్టర్‌లోని రైటర్ సరైన న్యాయం చెయ్యలేదు. మర్డర్ వెనుక ఉండే మిస్టరీని కూడా చాలామంది ప్రేక్షకులు ముందుగానే ఊహించేస్తారు.
సినిమాలో ఆకట్టుకున్నవి పాటలు. వాటిని సందర్భానుసారం దర్శకుడు వాడిన తీరు మాత్రం బాగుంది. డైరెక్టర్ ఆలోచనలకు తగ్గట్లు మార్క్ కె రాబిన్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. హెస్టిన్ జోస్ జోసెఫ్ సినిమాటోగ్రఫీ ఇంప్రెసివ్‌గా ఉంది. డైరెక్టర్ ఇచ్చిన సీన్లను శక్తివంచన లేకుండా ఆసక్తికరంగా ఎడిటింగ్ చేయడానికి రవితేజ కష్టపడ్డాడు. నీల్ సెబాస్టియన్ ఆర్ట్ వర్క్ వంక పెట్టలేని విధంగా ఉంది.
నటీనటుల పనితీరు:- పెళ్లి చేసుకొని, తొలి రాత్రి భార్యను టెన్షన్‌తో "మీరు వర్జిన్ కాదాండీ?" అంటూ కథను కాంప్లికేటెడ్ చేసుకున్న సుందర్‌గా ఆనంద్ దేవరకొండ రాణించాడు. తన బాడీ లాంగ్వేజ్‌కు తగ్గ పాత్రకు న్యాయం చేకూర్చాడు. డైలాగ్ డిక్షన్, ఎక్స్‌ప్రెషన్స్ విషయంలో మునుపటి కంటే మరింత మెచ్యూరిటీ కనపర్చాడు. అయితే క్యారెక్టర్‌ను ఈజ్‌తో చేయడం కూడా అతను అలవర్చుకోవాలి.
మీనాక్షిగా కొత్తమ్మాయి గీత్ సైనీ ఫర్వాలేదు. ఆమెకంటే మీనాక్షిగా నటించడానికి వచ్చిన యాక్టర్ రేఖ క్యారెక్టర్ చేసిన శాన్వే మేఘన ఆకట్టుకుంది. పాత్రను అర్థంచేసుకొని చలాకీగా, చులాగ్గా దాన్ని చేసేసింది. యస్సైగా సీరియస్ రోల్‌ను సమర్థవంతంగా చేశాడు సునీల్. స్కూల్ హెడ్‌మాస్టర్ క్యారెక్టర్‌లో నరేశ్ ఎప్పట్లా ఇట్టే ఇమిడిపోయారు. సోషల్ టీచర్‌గా గిరి చక్కగా రాణించాడు. ఫెయిల్డ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా హర్షవర్ధన్ ఆకట్టుకున్నాడు. మిగతా ఆర్టిస్టులు కూడా పరిధుల మేరకు నటించారు.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
'పుష్పక విమానం' అనేది.. హాయిగా నవ్వుకొనే కామెడీ సినిమా చూద్దామనుకొని వెళ్లేవారి మూడ్ చెడగొట్టే సినిమా. ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్లేవారిని కొంతమేరకు శాటిస్‌ఫై చేసే మర్డర్ మిస్టరీ.
- బుద్ధి యజ్ఞమూర్తి