English | Telugu

సినిమా పేరు:పొట్టేల్
బ్యానర్:ప్రగ్న్య సన్నిధి క్రియేషన్స్,నిశా ఎంటర్ టైన్మెంట్స్
Rating:2.50
విడుదలయిన తేది:Oct 25, 2024

తారాగణం:యువ చంద్ర,అనన్య నాగళ్ల, అజయ్, ఛత్రపతి శేఖర్, తనస్వి చౌదరి,ప్రియాంక శర్మ, నోయల్, శ్రీకాంత్ అయ్యంగార్, తదితరులు
సంగీతం: శేఖర్ చంద్ర
డీఓపీ: భూపతి రాజు 
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్
రచన, దర్శకత్వం:సాహిత్ మోతుకూరి 
నిర్మాతలు: సురేష్ కుమార్, నిషాంక్ రెడ్డి
బ్యానర్: ప్రగ్న్య సన్నిధి క్రియేషన్స్,నిశా ఎంటర్ టైన్మెంట్స్ 
రిలీజ్:మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ 
విడుదల తేదీ: అక్టోబర్ 25 ,2024 

కాస్టింగ్ తో సంబంధం లేకుండా కొన్ని చిత్రాలు రిలీజ్ టైం లో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తాయి.అలా ఆసక్తిని కలిగించిన  సినిమాల్లో పొట్టేల్ కూడా ఒకటి.కొన్ని ఏరియాల్లో ప్రీమియర్స్ షోస్ కూడా వెయ్యడం జరిగింది.మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.

కథ
పెద్ద గంగాదరీ( యువ చంద్ర) తనకి ఇష్టం లేకుండానే చిన్నతనం నుంచే వారసత్వపు వృత్తిగా వచ్చిన గొర్రెలని మేపుతు ఉంటాడు. ఈ క్రమంలోనే తన గ్రామం యొక్క ఆచారం ప్రకారం 'బాలమ్మ' అమ్మవారి అనుగ్రహంగా ఊరి వాళ్ళు భావించే   'పొట్టెల్'(pottel)ని పెంచుతుంటాడు.తన భార్య బుజ్జమ్మ(అనన్య నాగళ్ళ) కోరిక మేరకు తన కూతురు సరస్వతి( తనస్వి చౌదరి) ని చదివించాలనే పట్టుదలతో ఉంటాడు.భూస్వామి పటేల్ (అజయ్) పెద్ద గంగాదరీ తో సహా గ్రామంలో ఉన్నవాళ్ళందరి మీద అజమాయిషీ చెలాయిస్తూ ఇష్టా రీతిలో వ్యవహరిస్తుంటాడు.తక్కువ కులం వాళ్ళని తన దగ్గరకి కూడా రానివ్వడు.కానీ అందరు పటేల్ ని ఒక దేవుడిలా కొలుస్తుంటారు.ఆ ఊరి 'బాలమ్మ' తల్లి పటేల్ కి ఆవహించి పటేల్ ద్వారా మంచి చెడ్డల్ని చెప్తుంది.బాలమ్మ తల్లి  'పొట్టెల్' ని పటేల్ అపహరించి పెద్ద గంగాదరీ ని ఊరి ముందు దోషిగా నిలబెడతాడు. పటేల్ కి పెద్ద గంగాధరి అంటే ఎందుకు పగ?  పెద్ద గంగాదరీ  పొట్టెల్ ని ఎలా కనిపెట్టాడు? ఆ ప్రాసెస్ లో పెద్ద గంగాదరీ కి ఎదురైన అపాయాలు ఏంటి? సరస్వతి చదువుకుందా లేదా? సరస్వతి చదువు విషయంలో పెద్ద గంగాధారి ఎందుకు అంతలా పట్టుబడుతున్నాడు? అసలు  పటేల్ కి నిజంగానే అమ్మవారు ఆవహిస్తారా? ఊరి వాళ్ళు పెద్ద గంగాధరీ, పటేల్ లలో ఎవరి పక్కన నిలబడ్డారు?  అనేదే  ఈ కథ 


ఎనాలసిస్ :

ఒక మంచి సినిమాని ప్రేక్షకులకి అందించడానికి ఇంత కంటే కథ అవసరం లేదు. పైగా దర్శకుడు 1970 ,80 , 90 ల దశకంలో జరిగే కథ చెప్తున్నాడు కాబట్టి చాలా లాజిక్ లని కూడా మనం పట్టించుకోవలసిన అవసరం ఉండదు.దాంతో దర్శకుడు చాలా పకడ్బందీగా స్క్రిప్ట్ ని తయారు చేసుకోవచ్చు. కానీ సినిమా చూస్తున్నంత సేపు ఎన్నో లాజిక్ లు ప్రేక్షకులకు తగులుతూనే ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ విషయానికి వస్తే పెద్ద గంగాదరీ పాత్ర పరిచయం,అతని తండ్రి క్యారక్టర్ ని చాలాసేపు చూపించి మెయిన్ కథ లోకి  ఎక్కువ టైం తీసుకున్నారు.పాత్రల పరిచయాలకి వాయిస్ ఓవర్ ఎక్కువగా ఉన్నాయి.పెద్ద గంగాదరీ క్యారక్టర్ డిజైన్ బాగానే ఉన్నా కూడా, దాని చుట్టూ అల్లుకున్న పాయింట్స్ మాత్రం అసలు బాగోలేదు. అనన్య నాగళ్ళ క్యారక్టర్ ని కూడా కొన్ని సీన్స్ కే పరిమితం చేసారు.పెద్ద గంగాధారి ,అనన్య మధ్య లవ్ ని ఫస్ట్ ఆఫ్ లో కొంచం లెన్త్ కూడా చుపించాల్సింది.అజయ్ సీన్స్ మొదట్లో బాగానే ఉన్నా కూడా కథ లోకి వెళ్లే కొద్దీ రొటీన్ గా అనిపించాయి. కాకపోతే అమ్మవారి పూనిన  సీన్స్ మాత్రం కొత్తగా బాగున్నాయి.మిగతా పాత్రల మధ్య పెద్దగా కథ ఏం ఉండదు.ఫస్ట్ ఆఫ్ రన్ అయిన కాసేపటికే కథ ఏంటో అర్థమైపోతుంది. సెకండ్ ఆఫ్ లో  'పొట్టెల్' కథ కి కూతురు చదువుకోవాలనే లక్ష్యాన్ని కూడా చేర్చి ఆడియన్స్ లో కొంత ఇంట్రెస్టింగ్ ని కలిగించారు.కానీ  పొట్టెల్, పాప చదువుకి మధ్య లింక్ కుదరలేదు. సీన్స్ కూడా తేలిపోయాయి.కాకపోతే చదువు గురించి పాప చెప్పిన మాటలు మాత్రం చాలా బాగున్నాయి. క్లైమాక్స్ కొంతలో కొంత ఊరట అని చెప్పుకోవచ్చు.

నటినటులు సాంకేతిక నిపుణుల పనితీరు

కొత్త హీరో అయినా కూడా పెద్ద గంగాదరీ క్యారక్టర్ లో యువ చంద్ర(yuva chandra)చాలా పరిణితి చెందిన నటుడుగా చాలా బాగా చేసాడు. సెంటిమెంట్,డాన్స్, ఫైట్స్ లో ఎలాంటి తడబాటు లేకుండా పెద్ద గంగాదరీ క్యారక్టర్ ప్రేక్షకుల కళ్ళకి కనపడేలా చెయ్యడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. బుజ్జమ్మ పాత్రలో అనన్య(ananya nagella)కూడా పర్ఫెక్ట్ గా సూటయ్యింది. అవకాశాలు వస్తే మంచి నటిగా ప్రూఫ్ చేసుకునే అవకాశం ఉంది. ఇక పటేల్ గా  అజయ్ విజృంభించి నటించాడు.గతంలో  రాజమౌళి(rajamouli)దర్శకత్వంలో వచ్చిన విక్రమార్కుడు లోని అజయ్(ajay)క్యారక్టర్  ఎలా ఐతే గుర్తుండిపోయిందో  ఈ పొట్టేల్ కూడా అలాగే గుర్తిండిపోతుంది.టీచర్ క్యారెక్టర్ లో శ్రీకాంత్ అయ్యంగార్ కూడా చాలా పర్ఫెక్ట్ గా సూటయ్యాడు.సరస్వతి గా చేసిన తనస్వి చౌదరి తో పాటు అజయ్ భార్యగా చేసిన ప్రియాంక శర్మ కూడా చాలా బాగా చేసారు.ఇక దర్శకుడు విషయానికి వస్తే టేకింగ్ బాగున్నా కూడా అనేక సినిమాల ప్రభావంతో సీన్స్ రాసుకున్నాడనే విషయం అర్ధమవుతుంది.ఎందుకంటే రైటర్ కూడా అతనే. తను అనుకున్న పాయింట్ చుట్టూ సన్నివేశాలని, భావోద్వేగాలని సృష్టించడంలో ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి.  ఎంతో బలం ఉన్న సన్నివేశాలని కూడా త్వరగా తేల్చి పడేసాడు. ఇక కెమెరా పని తనం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.అంత అద్భుతంగా ఉంది. సినిమా చివరి దాకా ప్రేక్షకుడు థియేటర్ లో కుర్చున్నాడంటే అది ఫొటోగ్రఫీపని తనం అని చెప్పవచ్చు.శేఖర్ చంద్ర ఇచ్చిన  ఆర్ ఆర్ కూడా ప్రేక్షకుడ్ని కట్టి పడేసింది.నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

మంచి మెసేజ్ ఉన్న సినిమా అయినా కూడా కథనంలోని లోపాలవల్ల ప్రేక్షకులని ఆకట్టుకునే అవకాశాలు తక్కువ 

- అరుణా చలం