Read more!

English | Telugu

సినిమా పేరు:పొన్నియిన్ సెల్వ‌న్
బ్యానర్:లైకా ప్రొడ‌క్ష‌న్స్‌, మ‌ద్రాస్ టాకీస్‌
Rating:3.00
విడుదలయిన తేది:Sep 30, 2022

సినిమా పేరు: పొన్నియిన్ సెల్వ‌న్‌
తారాగ‌ణం: చియాన్ విక్ర‌మ్‌, జ‌యం ర‌వి, కార్తీ, ఐశ్వ‌ర్యా రాయ్‌, త్రిష‌, శ‌ర‌త్ కుమార్‌, పార్తీప‌న్‌, రెహ‌మాన్‌, జ‌య‌రామ్‌, ప్ర‌కాశ్ రాజ్‌, ప్ర‌భు, విక్ర‌మ్ ప్ర‌భు, శోభిత ధూళిపాళ‌, ఐశ్వ‌ర్య ల‌క్ష్మి, కిశోర్‌, అశ్విన్ కాకుమాను, జ‌య‌చిత్ర‌
క‌థ: క‌ల్కి కృష్ణ‌మూర్తి
స్క్రీన్‌ప్లే: మ‌ణిర‌త్నం, జ‌య‌మోహ‌న్‌, కుమ‌ర‌వేల్‌
సంభాష‌ణ‌లు: త‌నికెళ్ల భ‌ర‌ణి
పాట‌లు: అనంత శ్రీ‌రామ్‌
సంగీతం: ఎ.ఆర్‌. రెహ‌మాన్‌
సినిమాటోగ్ర‌ఫీ: ర‌వివ‌ర్మ‌న్‌
ఎడిటింగ్: ఎ. శ్రీ‌క‌ర్ ప్ర‌సాద్‌
ప్రొడ‌క్ష‌న్ డిజైన్: తోట త‌ర‌ణి
కొరియోగ్ర‌ఫీ: బృంద‌
నిర్మాతలు: సుభాస్క‌ర‌న్‌, మ‌ణిర‌త్నం
ద‌ర్శ‌క‌త్వం: మ‌ణిర‌త్నం
బ్యాన‌ర్స్: లైకా ప్రొడ‌క్ష‌న్స్‌, మ‌ద్రాస్ టాకీస్‌
విడుద‌ల తేదీ: 30 సెప్టెంబ‌ర్ 2022

దేశంలోని గొప్ప ద‌ర్శ‌కుల్లో ఒక‌రిగా కీర్తి సంపాదించుకున్న మ‌ణిర‌త్నం నుంచి కొన్నాళ్లుగా ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందిన సినిమా రాలేదు. ఆయ‌న చోళ రాజ్యం నేప‌థ్యంలో సినిమా తీస్తున్నార‌నే వార్త‌, ఆ సినిమాలో తెలుగువారికి కూడా సుప‌రిచితులైన త‌మిళ చిత్ర‌రంగానికి చెందిన ప‌లువురు హేమాహేమీల్లాంటి న‌టులతో పాటు ఐశ్వ‌ర్య‌రాయ్ కూడా న‌టిస్తోంద‌నే వార్త బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్ప‌ట్నుంచీ.. 'పొన్నియిన్ సెల్వ‌న్' మూవీ కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తూ వ‌స్తున్నారు సినీ ప్రియులు. రిలీజ్ ద‌గ్గ‌ర‌య్యే కొద్దీ ఆ సినిమాపై అంచ‌నాలు అమితంగా పెరిగిపోతూ వ‌చ్చాయి. అలాంటి అంచ‌నాల మ‌ధ్య ఈరోజు మ‌న ముందుకు వ‌చ్చిన 'పొన్నియిన్ సెల్వ‌న్' ఎలా ఉందంటే..

క‌థ‌

చోళ యువ‌రాజుల్లో పెద్ద‌వాడైన ఆదిత్య క‌రికాలుడు రాజ్యాన్ని విస్త‌రించడంలో భాగంగా చుట్టుప‌క్క‌ల రాజ్యాల‌పై దండెత్తి, ఒక్కో రాజ్యాన్ని హ‌స్త‌గ‌తం చేసుకొనే ప‌నిలో ఉండ‌గా, చిన్న‌వాడు అరుళ్‌మోళి అలియాస్ పొన్నియిన్ సెల్వ‌న్ (జ‌యం ర‌వి) శ్రీ‌లంక‌ను స్వాధీనం చేసుకోవ‌డానికి వెళ్తాడు. ఆ స‌మ‌యంలో చోళ రాజు సుంద‌ర చోళుడు (ప్ర‌కాశ్‌రాజ్‌) అనారోగ్యం పాల‌వుతాడు. ఇదే అద‌నుగా భావించిన సామంత‌రాజు పెద్ద ప‌ళువేట్ట‌రాయుడు (శ‌ర‌త్‌కుమార్‌) తోటి సామంతుల‌తో క‌లిసి చోళ రాజ్యాన్ని క‌బ‌ళించి, మ‌ధురాంత‌కుడి (రెహ‌మాన్‌)ని దానికి రాజును చెయ్యాల‌ని మంత‌నాలు చేస్తుంటాడు. ఈ విష‌యం వేగుల ద్వారా తెలుసుకొని, వివ‌రాలు తెలుసుకోవాల్సిందిగా త‌న మిత్రుడు వ‌ల్ల‌వ‌రాయుడి (కార్తీ)ని తంజావూరు పంపిస్తాడు క‌రికాలుడు. ఒక‌ప్పుడు అత‌ని ప్రేయ‌సి, ప్ర‌స్తుతం పెద్ద ప‌ళువేట్ట‌రాయుడి పట్ట‌మ‌హిషి అయిన నందిని ప్ర‌తీకారం కోసం ఎదురుచూస్తుంటుంది. పాండ్య‌రాజును హ‌త‌మార్చిన ఆదిత్య క‌రికాలుడితో పాటు, చోళ వంశాన్ని నామ‌రూపాలు లేకుండా చెయ్యాల‌ని పాండ్య రాజ వంశ‌స్థులు ప్ర‌య‌త్నిస్తుంటారు. ఈ ప్ర‌త్య‌ర్థుల నుంచి చోళ యువ‌రాజులు త‌మ‌ను తాము కాపాడుకున్నారా, లేదా? అనేది మిగ‌తా క‌థ‌.


ఎనాలసిస్ :

క‌ల్కి కృష్ణ‌మూర్తి ర‌చించిన ఫేమ‌స్ న‌వ‌ల 'పొన్నియిన్ సెల్వ‌న్' ఆధారంగా మ‌ణిర‌త్నం తీసిన రెండు భాగాల సినిమాలో మొద‌టి భాగం 'పీఎస్‌-1'. సినిమా అంతా భారీత‌నం కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తుంది. దానికి మ‌ణిర‌త్నం శైలి చిత్రీక‌ర‌ణ తోడైంది. విజువ‌ల్స్‌, మ్యూజిక్‌, ఆర్ట్ డైరెక్ష‌న్ అత్యున్న‌త స్థాయిలో ఉన్నాయి. ప్ర‌థ‌మార్ధంలో క‌థ‌ని కార్తీ పోషించిన వ‌ల్ల‌వ‌రాయుడి పాత్ర న‌డిపిస్తున్న‌ట్లుగా స్క్రీన్‌ప్లేని అల్లారు. వ‌ల్ల‌వ‌రాయుడి క్యారెక్ట‌రైజేష‌న్ ఆక‌ట్టుకొనే రీతిలోనే ఉంది. స‌ర‌సత మేళ‌వించిన వీరునిగా ఆ పాత్ర‌ను మ‌లిచాడు ద‌ర్శ‌కుడు. పాత్ర‌లు మ‌రీ ఎక్కువ‌వ‌డం, పాత్ర‌ల పేర్లు తెలుగువారికి ప‌రిచిత‌మైన‌వి కాక‌పోవ‌డంతో మొద‌ట్లో కొంత తిక‌మ‌క అనిపిస్తుంది. పోను పోనూ ఏ పాత్ర ఏమిట‌నేది గ్ర‌హింపుకొస్తూ, క‌థ‌లో లీన‌మ‌వుతాం.

సినిమాటో టైటిల్ పాత్ర‌ధారి జ‌యం రవి. అయితే ఆ పాత్ర‌ను ఇంట‌ర్వెల్ అయిన త‌ర్వాతే ఇంట్ర‌డ్యూస్ చేయ‌డం క‌రెక్టుగా అనిపించ‌లేదు. క‌నీసం ఇంట‌ర్వెల్ బ్యాంగ్‌గా ఆ క్యారెక్ట‌ర్‌ను ప‌రిచ‌యం చేసిన‌ట్ల‌యితే సెకండాఫ్‌కు మంచి ఊపు వ‌చ్చి ఉండేది. విక్ర‌మ్ పోషించిన ఆదిత్య క‌రికాలుని పాత్ర‌ను వీరోచితంగా ప‌రిచ‌యం చేసి, అరుళ్‌మోళి అలియాస్ పొన్నియిన్ సెల్వ‌న్‌ను సాదాసీదాగా తెర‌పై ప్రెజెంట్ చేయ‌డం కూడా స్క్రీన్‌ప్లే ప‌రంగా దొర్లిన ఒక పొర‌పాటు.

అలాగే ఐశ్వ‌ర్యారాయ్ చేసిన నందిని పాత్ర విష‌యంలో ప‌లు సందేహాలు మిగిలిపోతాయి. టీనేజ్‌లో ఆదిత్య క‌రికాలుడు, నందిని మ‌ధ్య ప్రేమ పెన‌వేసుకున్న విష‌యం చెప్పారు కానీ, ఆ ఇద్ద‌రూ ఎలా విడిపోయారు, నందిని ఎలా పాండ్య‌రాజు ద‌గ్గ‌ర చేరింది, ఆ త‌ర్వాత ఎలా పెద్ద ప‌ళువేట్ట‌రాయుని భార్య అయ్యింద‌నే విష‌యం ఈ భాగంలో చెప్ప‌లేదు. వాటికి స‌మాధానం రెండో భాగంలో దొరుకుతుందేమో. విక్ర‌మ్‌కు డ‌బ్బింగ్ చెప్పిందెవ‌రో కానీ.. సగం డైలాగులు స‌రిగా అర్థం కాలేదు. మిగ‌తా వారి డ‌బ్బింగ్ విష‌యంలో ఈ స‌మ‌స్య లేదు. పాండ్య‌రాజు (నాజ‌ర్‌) పాత్ర‌ను కేవ‌లం ఒకే ఒక్క సీన్‌కు ప‌రిమితం చేయ‌డం స‌రైన ప‌నిగా తోచ‌లేదు. రెండో భాగంలో ఆయ‌న పాత్ర ఎక్కువ‌గా ఉంటుంద‌ని తెలుస్తున్నా.. మొద‌టి భాగంలోనూ ఆయ‌న పాత్ర‌కు మ‌రికొన్ని సీన్లు ఇవ్వాల్సింది.

సినిమాలో ముగ్గురు క‌థానాయ‌కులు.. ఆదిత్య క‌రికాలుడు, అరుళ్‌మోళి (పొన్నియిన్ సెల్వ‌న్‌), వ‌ల్ల‌వ‌రాయుడు. అ టైటిల్ పాత్ర‌ధారి అయిన జ‌యం ర‌వి క్యారెక్ట‌ర్‌లోని అస‌మాన వీరుడిని ఎలివేట్ చేయ‌డానికి మ‌ణిర‌త్నం ప్ర‌య‌త్నించ‌లేదు. 'పొన్నియిన్ సెల్వ‌న్' అనేది చ‌రిత్ర‌ను ఆధారం చేసుకొని తీసిన సినిమాయే కావ‌చ్చు కానీ.. నేటి కాలానికి త‌గ్గ‌ట్లు హీరోల‌ను తెర‌పై ఎలా ప్ర‌జెంట్ చేయాలో, వారిలోని హీరోయిజాన్ని ఎలా ఎలివేట్ చేయాలో మ‌ణిర‌త్నం లాంటి గొప్ప ద‌ర్శ‌కుడికి తెలీకుండా ఉంటుందా! అయినా ఆ విష‌యంలో ఆయ‌న శ్ర‌ద్ధ చూపించ‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించే విష‌యం.  

టెక్నిక‌ల్‌గా 'పొన్నియిన్ సెల్వ‌న్' అత్యున్న‌త స్థాయిలో ఉంది. ర‌వివ‌ర్మ‌న్ సినిమాటోగ్ర‌ఫీ ఈ మూవీకి ప్ర‌ధాన బ‌లం. విజువ‌ల్ ఎక్స్‌ట్రావాగంజాగా మూవీ వ‌చ్చిందంటే ర‌వివ‌ర్మ‌న్ కెమెరాదే ప్ర‌ధాన పాత్ర‌. ఇక ఎ.ఆర్‌. రెహ‌మాన్ మ్యూజిక్ గురించి చెప్ప‌దేముంది! స‌న్నివేశాల్లోని మూడ్‌కు త‌గ్గ‌ట్లు ఆయ‌న బ్యాగ్రౌండ్ స్కోర్ మ్యాజిక్ చేసింది. పాట‌లు కూడా బాగున్నాయి. లెజెండ‌రీ ఆర్ట్ డైరెక్ట‌ర్ తోట త‌ర‌ణి వేసిన కోట సెట్టింగ్స్ కానీ, అంతఃపురం సెట్లు కానీ, కూడ‌ళ్లు కానీ సూప‌ర్బ్‌! ద‌ర్శ‌కుడు త‌న చేతికిచ్చిన స‌న్నివేశాల్ని సాధ్య‌మైనంత ఆక‌ర్ష‌ణీయంగా, ఆస‌క్తిక‌రంగా ప్రెజెంట్ చేయ‌డానికి క‌షి చేశాడు ఎడిట‌ర్ శ్రీ‌క‌ర్ ప్ర‌సాద్‌. వీఎఫ్ఎక్స్ వ‌ర్క్ కూడా చాలా క్వాలిటీతో ఉంది. త‌నికెళ్ భ‌ర‌ణి సంభాష‌ణ‌లు కూడా బాగున్నాయి. నంబి పాత్ర‌ధారి జ‌య‌రామ్‌కు ఆయ‌న వాయిస్ బాగా న‌ప్పింది కూడా.

న‌టీన‌టుల అభిన‌యం

సినిమాలో చాలా పాత్ర‌లున్నాయి. ప్ర‌ధాన పాత్ర‌ధారులంతా గొప్ప‌గా అభిన‌యాన్ని ప్ర‌ద‌ర్శించారు. ప్ర‌ధానంగా ఆదిత్య క‌రికాలునిగా విక్ర‌మ్ ఆవేశం, ఉక్రోషం మేళ‌వింపుతో చూపిన హావ‌భావాలు, మ‌న‌సులో ప‌గ‌తో ర‌గులుతూ, పైకి న‌వ్వుతూ క‌నిపించే నందిని పాత్ర‌లో ఐశ్వ‌ర్యా రాయ్ ప్ర‌ద‌ర్శించిన న‌ట‌న‌, ఆమె అంద‌చందాలు, ఓవైపు తార‌స‌ప‌డిన ఆడ‌వాళ్లంద‌రితోనూ స‌ర‌సాలాడుతూ, ఇంకోవైపు యుద్ధ‌భూమిలో వీరునిగా పరాక్ర‌మాన్ని ప్ర‌ద‌ర్శించే వ‌ల్ల‌వ‌రాయునిగా కార్తీ న‌ట‌న ఉన్న‌త స్థాయిలో ఉన్నాయి. అరుళ్‌మోళిగా జ‌యం ర‌వి, కుంద‌వ‌ల్లిగా త్రిష‌, పెద్ద ప‌ళువేట్ట‌రాయునిగా శ‌ర‌త్‌కుమార్‌, చిన్న ప‌ళువేట్ట‌రాయునిగా పార్తీప‌న్‌, ప‌డ‌వ న‌డిపే యువ‌తి పూంగ‌వ‌ల్లిగా ఐశ్వ‌ర్య ల‌క్ష్మి, అరుళ్‌మోళిని పెళ్లాడాల‌నుకొనే వాన‌తిగా శోభిత ధూళిపాళ‌, వైష్ణ‌వునిగా క‌నిపించే నంబి పాత్ర‌లో జ‌య‌రామ్‌, సైన్యాధిప‌తిగా ప్ర‌భు, పార్తివేంద్ర ప‌ల్ల‌వునిగా విక్ర‌మ్ ప్ర‌భు, పాండ్య వంశ‌స్థునిగా కిశోర్‌, చోళ రాజ్యానికి రాజు కావాల‌ని త‌పించే మ‌ధురాంత‌కునిగా రెహ‌మాన్‌, సుంద‌ర చోళునిగా ప్ర‌కాశ్ రాజ్ త‌మ పాత్ర‌ల ప‌రిధి మేర‌కు న‌టించారు.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

స్క్రీన్‌ప్లేని మ‌రింత బ‌లంగా రాసుకున్న‌ట్ల‌యితే, అరుళ్‌మోళిని సెకండాఫ్‌లో ప‌రిచ‌యం చేయ‌కుండా ఇంట‌ర్వెల్ బ్యాంగ్‌గా అత‌డి క్యారెక్ట‌ర్‌ను వీరోచితంగా ప‌రిచ‌యం చేసిన‌ట్ల‌యితే ఇప్పుడు వ‌చ్చిన దానికంటే 'పొన్నియిన్ సెల్వ‌న్' మ‌రింత బాగా వ‌చ్చి ఉండేది. సినిమాలో ఎన్ని లోపాలున్నా.. గ్రాండియ‌ర్ అనిపించే విజువ‌ల్స్‌, ఉన్న‌త‌స్థాయి అభిన‌యాలు, మ‌ణిర‌త్నం టేకింగ్ క‌లిసి ఈ మూవీని ఒక్క‌సారైనా చూడాల‌నిపించే విధంగా మ‌లిచాయి.

- బుద్ధి య‌జ్ఞ‌మూర్తి