Read more!

English | Telugu

సినిమా పేరు:పఠాన్
బ్యానర్:యశ్ రాజ్ ఫిలిమ్స్
Rating:2.75
విడుదలయిన తేది:Jan 25, 2023

సినిమా పేరు: పఠాన్
తారాగణం: షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె, జాన్ అబ్రహం, సల్మాన్ ఖాన్(అతిథి పాత్రలో), అశుతోష్ రానా, డింపుల్ కపాడియా
సినిమాటోగ్రఫీ: సత్‌చిత్ పౌలోస్
సంగీతం: విశాల్-శేఖర్
నేపథ్య సంగీతం: సంచిత్ బల్హార - అంకిత్ బల్హార 
ఎడిటర్: ఆరిఫ్ షేక్
రచన, దర్శకత్వం: సిద్ధార్థ్ ఆనంద్
నిర్మాత: ఆదిత్య చోప్రా
బ్యానర్: యశ్ రాజ్ ఫిలిమ్స్
విడుదల తేదీ: జనవరి 25, 2023

కొంతకాలంగా బాలీవుడ్ పరిస్థితి అంతగా బాలేదు. విజయాల శాతం బాగా తగ్గిపోయింది. స్టార్ హీరోల సినిమాలు సైతం భారీ వసూళ్లు రాబట్టలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన 'పఠాన్'పై అందరి దృష్టి పడింది. నాలుగేళ్ల తర్వాత షారుఖ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో పాటు.. ఇది యశ్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో భాగం కావడంతో 'పఠాన్'పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలను నిజం చేస్తూ 'పఠాన్' బాలీవుడ్ కి సరికొత్త ఉత్సాహాన్ని ఇచ్చేలా ఉందా?..

కథ:

భారత ప్రభుత్వం ఆర్టికల్ 370ను రద్దు చేయడంతో పాకిస్థాన్ కి చెందిన ఓ అధికారి భారత్ పై దాడికి ప్లాన్ చేస్తాడు. దానికోసం ప్రైవేట్ టెర్రరిస్ట్ ఏజెంట్ అయిన జిమ్(జాన్ అబ్రహం)ను రంగంలోకి దింపుతాడు. మాజీ భారత సైనికుడైన జిమ్ దేశద్రోహిగా ఎందుకు మారాడు? అతను భారత్ ను దెబ్బకొట్టడానికి ప్రయోగించాలనుకున్న రక్తబీజ్ అంటే ఏంటి? దానిని అరికట్టడానికి మాజీ సైనికులతో ఏర్పాటైన జోకర్(JOCR) బృందంలోని పఠాన్ ఏం చేశాడు? ఆ రక్తబీజ్ గురించి తెలుసుకొని ఆ ప్రమాదం నుంచి దేశాన్ని రక్షించగలిగాడా? ఈ కథలో పాకిస్థాన్ ఐఎస్ఐ ఏజెంట్ రూబై(దీపికా పదుకొణె) పాత్ర ఏంటి? అనేవి సినిమా చూసి తెలుసుకోవాలి.


ఎనాలసిస్ :

'యశ్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్' నుంచి ఇప్పటికే వచ్చిన 'ఏక్ థా టైగర్', 'టైగర్ జిందా హై', 'వార్' అలరించాయి. 'పఠాన్' కూడా ఆ యూనివర్స్ లో భాగమే కాబట్టి మామూలుగానే ఆ సినిమాల ఛాయలు కనిపిస్తాయి. స్పై థ్రిల్లర్ సినిమాలలో యాక్షన్ సన్నివేశాలకు కొదవ ఉండదు. 'పఠాన్' కూడా ఆ కోవలోకే వస్తుంది. అయితే దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ కథకథనాల మీద పెద్దగా దృష్టి పెట్టకుండా.. యాక్షన్ సన్నివేశాల మీదే ఎక్కువ దృష్టి పెట్టినట్లు అనిపిస్తుంది. సినిమా అంతా యాక్షన్ తో నిండిపోయింది. ఎమోషనల్ కంటెంట్ కి స్కోప్ ఉన్నా.. దానిని ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా చేయడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడు.

కొన్ని యాక్షన్ సన్నివేశాలు, దీపిక అందచందాలు, ఒకట్రెండు ట్విస్ట్ లతో ఫస్టాఫ్ నడుస్తుంది. ఆ ట్విస్ట్ లు కూడా మరీ ప్రేక్షకుల ఊహలకు అందకుండా ఉండవు. ఇంటర్వెల్ సీక్వెన్స్ పర్లేదు. ఫస్టాఫ్ తో పోలిస్తే సెకండాఫ్ మెరుగ్గా ఉంది. యూనివర్స్ లో భాగంగా సెకండాఫ్ లో సల్మాన్ ఖాన్ ఎంట్రీ ఆకట్టుకుంది. షారుఖ్, సల్మాన్ కలిసి ఫైట్ చేయడం.. వారి మధ్య సరదా సంభాషణ ప్రేక్షకులను అలరిస్తాయి. సెకండాఫ్ లో ఫస్టాఫ్ ని మించిన భారీ యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయి. కథనంలో ఊహించని మలుపులు లేకపోయినా యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. కాస్త ల్యాగ్ అనిపించినా క్లైమాక్ ముగించిన తీరు బాగానే ఉంది.

విశాల్-శేఖర్ స్వరపరిచిన పాటలు తెలుగులో తేలిపోయాయి. సంచిత్ బల్హార - అంకిత్ బల్హార నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. సన్నివేశాలను బాగానే ఎలివేట్ చేసింది. సత్‌చిత్ పౌలోస్ కెమెరా పనితనం బాగుంది. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. సినిమాలో కొన్ని కొన్ని సంభాషణలు బాగున్నాయి. అక్కడక్కడా సంభాషణలతో హాస్యం కూడా బాగానే పండింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్రతి ఫ్రేమ్ లోనూ భారీతనం కనిపించింది.

నటీనటుల పనితీరు:

పఠాన్ పాత్రలో షారుఖ్ ఖాన్ తనదైనశైలిలో మెప్పించాడు. ఆయన స్క్రీన్ ప్రజెన్స్, యాక్షన్ అలరించాయి. దేశంకోసం తన ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా పోరాడే సైనికుడిగా ఆకట్టుకున్నాడు. ఇక దీపిక తన అందచందాలతో మాయ చేయడమే కాకుండా.. యాక్షన్ తోనూ ఆదరగొట్టింది. దేశ సైనికుడి నుంచి దేశ ద్రోహిగా మారిన జిమ్ పాత్రలో జాన్ అబ్రహం రాణించాడు. విలనిజాన్ని చక్కగా ప్రదర్శించాడు. అతిథి పాత్రలో సల్మాన్ అలరించాడు. స్క్రీన్ మీద తక్కువ సేపే కనిపించినప్పటికీ.. షారుఖ్ తో కలిసి స్క్రీన్ మీద మ్యాజిక్ చేశాడు. అశుతోష్ రానా, డింపుల్ కపాడియా తదితరులు పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు. 


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

కథాకథనాలు సాదాసీదాగా ఉన్నా యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. యశ్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా వచ్చిన ఈ చిత్రం షారుఖ్ అభిమానులను, యాక్షన్ ప్రియులను అలరించేలా ఉంది.

-గంగసాని