Read more!

English | Telugu

సినిమా పేరు:పంజా
బ్యానర్:అర్క మీడియా అండ్ సంగామిత్ర ఆర్ట్స్
Rating:3.00
విడుదలయిన తేది:Dec 9, 2011

కథ - పదిహేనేళ్ళ జై (పవన్ కళ్యాణ్) అతని తల్లి, చెల్లితో కలసి కలకత్తా నగరానికి వస్తే అక్కడి కామాంధులు అతని చెల్లినీ, తల్లినీ రేప్ చేసి చంపేస్తారు. శవాల దగ్గర ఏడుస్తున్న జై దగ్గరికి భగవాన్ (జాకీ ష్రాఫ్) వచ్చి రేప్ చేసినోళ్ళని జై చేత చంపిస్తాడు. అప్పటి నుండీ భగవాన్ కి తోడు నీడగా ఉంటాడు జై. జైని చూసి కులకర్ణి (అతుల్ కులకర్ణి) అనే మరో గ్యాంగ్ స్టర్ భగవాన్ కి భయపడుతూంటాడు. జై అంటే క్లబ్ డ్యాన్సర్ జాహ్నవి( అంజలీ లావానియా) కి ఇష్టం. కానీ సంధ్య (సారాజేన్ దియాస్) అనే అమ్మాయిని జై ఇష్టపడతాడు.

అమెరికాలో ఉండే భగవాన్ కొడుకు మున్నా ( శేష్ అడవి) ఇండియాకి తిరిగొస్తాడు. మున్నా ఒక భయంకరమైన శాడిస్టు. క్లబ్ లో జాహ్నవి అందాన్ని మెచ్చుకున్నాడని ఒకతన్ని చంపినంతపనిచేస్తాడు మున్నా. అలాగే సభాపతి (పరుచూరి వెంకటేశ్వరరావు) భగవాన్ వ్యాపార వ్యవహారాలన్నీ చూస్తుంటాడు. అతని మీద యూరిన్ పోసి అతన్ని దారుణంగా అవమానిస్తాడు మున్నా. దాంతో సభాపతి మరో గ్యాంగ్ స్టర్ కులకర్ణి పంచన చేరతాడు.

సభాపతిని చంపమని జైకి భగవాన్ చెపితే, "జరిగిందేంటో కనుక్కుందాం నేను సభాపతిని తీసుకొస్తా"నని కులకర్ణి దగ్గరికి వెళుతూ, కులకర్ణి దగ్గరుండే సంపత్ కొడుకుని క్లబ్ లో గురు (తనికెళ్ళ భరణి) ఆధీనంలో ఉంచి వెళతాడు జై. జై ఫ్లాట్ లో ఉన్న జాహ్నవి దగ్గరికి మున్నా వెళతాడు...అక్కడ ఆమెను హింసించి చంపుతాదు..అక్కడికి వచ్చిన జైతో గొడవపడటంతో జై చేతిలో మున్నా చచ్చిపోతాడు.

సంధ్య వాళ్ళ ఊరు పలాసకి వెళతాడు జై. భగవాన్ జై అసిస్టెంట్ ఛోటూ (ఆలీ)ని చంపి అతని ఫోన్ లో ఉన్న సంధ్య ఫొటో ద్వారా సంధ్య అడ్రస్ కనుక్కుని ఆమెను కిడ్నాప్ చేయిస్తాడు భగవాన్. ఆ తర్వాత ఏమయిందనేది మిగిలిన కథ.


ఎనాలసిస్ :

విశ్లేషణ - ఇలాంటి కథలు గతంలో చాలానే వచ్చాయి. నాగార్జున "అంతం", పవన్ కళ్యాణ్ "బాలు" వంటి సినిమాలు ఈ కోవకు చెందినవే. కాకపోతే లొకేషన్లు, నటీనటులు, సాంకేతిక నిపుణులూ మారినట్టుందీ చిత్రం. దర్శకుడు తమిళియన్ అవటం వలన ఈ విషయం అతనికి తెలియకపోవచ్చు. ఈ సినిమాలో పెద్ద కామెడీ ఏమిటంటే చక్కని పవర్ ఫుల్ టైటిల్ సాంగ్ ని సినిమాకి అవసరమైన చోట వాడకుండా...సినిమా పూర్తయిన తర్వాత వేయటం వెటకారానికి పరాకాష్ట. ఆ విధంగా ఆ పాటని నిర్వీర్యం ఎందుకు చేయాల్సి వచ్చిందో కారణం తెలియదు కానీ అది ఒక బ్లండర్ మిస్టేక్ అని చెప్పవచ్చు. ఇక టెక్నికల్ గా ఈ సినిమాని తీయటానికి దర్శకుడు ఎక్కువ శ్రద్ధ చూపించినట్టుంది. టేకింగ్ అదీ బాగున్నా...కథలో దమ్ము లేకపోవటంతో సినిమా మనల్ని ఆకట్టుకుంటుందనటానికి పెద్దగా ఆస్కారం లేకుండా పోయింది. బ్రహ్మానందం పాత్ర ఆశించిన స్థాయిలో పండలేదు. ఆ పాత్రతో పవన్ కళ్యాణ్ వంటి పవర్ ఫుల్ స్టార్ మీద అధార్టీ చెలాయించేలా చేయటం, ఒక పాట కూడా పెట్టటం ప్రేక్షకులు జీర్ణించుకోరనిపిస్తుంది. పవన్ ఫ్యాన్స్ అయితే ఆ విషయంలో దర్శకుణ్ణి తిట్టుకున్నా ఆశ్చర్యపోనక్కరలేదు. జై పాత్ర కులకర్ణి దగ్గరికి వెళ్ళి తిరిగొచ్చేటప్పుడు గన్స్ తో ఎంతమంది కాలుస్తారో లెక్కుండదు. అయినా జై అన్నింటినీ తప్పించుకున్నట్టు చూపించే సీన్ సరిగ్గా అంటే ప్రేక్షకులను అంగీకరింపజేసే స్థాయిలో లేదు.

నటన - పవన్ కళ్యాణ్ పవర్ గురించి చెప్పటం, ఆయన బాగా నటించాడని చెప్పటం ఆయన్ని అవమానించటమే. సినిమా మీద ఆయనకున్న ప్యాజన్ గురించి అందరికీ తెలిసిందే. ఆయనీ చిత్రంలో చక్కని నటన కనపరిచారు. అలాగే హీరోయిన్ గా సారా జేన్ దియాస్, క్లబ్ డ్యాన్సర్ గా అంజలీ లావానియా చక్కని నటన కనపరచారు. ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పాల్సింది మున్నా పాత్రధారి గురించి. ఆ పాత్రలో నటించిన అడవి శేష్ ఆ పాత్రలో ఎక్కువగా అంటే అతిగా చేయకుండా, అలాగని తక్కువగా చేయకుండా సరిగ్గా కొలిచినట్టు నూటికి నూరు శాతం న్యాయం చేశాడు. అతని నటనలో, హావభావ ప్రదర్శనలో, బాడీ లాంగ్వేజ్ లో ఆ పోకడ కొట్టొచ్చినట్టు కనపడుతుంది. తెలుగు సినీ పరిశ్రమకు ఒక చక్కని తెలుగు నటుడు దొరికాడు. భవిష్యత్తులో ఈ ఆరడుగుల రెండంగుళాల అందగాడు అద్భుతాలు చేసే అవకాశముంది. బ్రహ్మానందం నటించటానికి పెద్దగా ఏం లేదు అనేకంటే అతన్ని సరిగ్గా ఉపయోగించుకోలేదంటే సమంజసంగా ఉంటుంది. ఆలీ, తనికెళ్ళ భరణి, జాకీ ష్రాఫ్, అతుల్ కులకర్ణి, ఝాన్సీ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సంగీతం - యువన్ శంకర్ రాజా సంగీతం బాగుంది. టైటిల్ సాంగ్ చాలా బాగుంది. రీ-రికార్డింగ్ కూడా ఫరవాలేదు.

సినిమాటోగ్రఫీ - వినోద్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది.

మాటలు - అబ్బూరి రవి మాటలు కొన్ని సందర్భాల్లో ఆకట్టుకుంటాయి.

పాటలు - రామజోగయ్య శాస్త్రి వ్రాసిన టైటిల్ సాంగ్, క్లబ్ సాంగ్, పాపారాయుడు పాటలు బాగున్నాయి.

ఎడిటింగ్ - శ్రీకర ప్రసాద్ ఎడిటింగ్ బాగుంది.

ఆర్ట్ - ఒ.కె.

కొరియోగ్రఫీ - "పాపా రాయుడు" పాటలో పవన్ కళ్యాణ్ డ్యాన్స్ బాగుంది.

యాక్షన్ - ఒ.కె.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

కథలో దమ్ము లేకపోతే, ఎంటర్ టైన్ మెంట్ మిస్సయితే సినిమాలో ఎంత పెద్ద హీరోఉన్నా, ఎంత భారీ బడ్జెట్ తో నిర్మించినా, సాంకేతికంగా ఎంతటి ఉన్నత ప్రమాణాలున్నా ఆ సినిమా విజయం సాధించటం కష్టం. అది ఈ సినిమా నిరూపిస్తుంది. ఈ సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటన కోసం ఒకసారి చూడవచ్చు.