Read more!

English | Telugu

సినిమా పేరు:ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్
బ్యానర్:యు.వి. క్రియేష‌న్స్‌, జీఏ2 పిక్చ‌ర్స్‌
Rating:2.50
విడుదలయిన తేది:Jul 1, 2022

సినిమా పేరు: ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌
తారాగ‌ణం: గోపీచంద్‌, రాశీ ఖ‌న్నా, స‌త్యరాజ్‌, రావు ర‌మేశ్‌, అజ‌య్ ఘోష్‌, సియా గౌత‌మ్‌, శ్రీ‌నివాస‌రెడ్డి, స‌ప్త‌గిరి, ప్ర‌వీణ్‌, జ‌య‌ల‌లిత‌, ర‌ఘు కారుమంచి, వైవా హ‌ర్ష‌, వ‌ర‌లక్ష్మీ శ‌ర‌త్‌కుమార్ (గెస్ట్‌)
సాహిత్యం: సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి, భాస్క‌ర‌భ‌ట్ల ర‌వికుమార్‌, కృష్ణ‌కాంత్‌
మ్యూజిక్: జేక్స్ బిజోయ్‌
సినిమాటోగ్ర‌ఫీ: క‌ర్మ్ చావ్లా
ఎడిటింగ్: ఎస్‌.బి. ఉద్ధ‌వ్‌
ఆర్ట్: ర‌వీంద‌ర్‌
స‌మ‌ర్ప‌ణ: అల్లు అర‌వింద్‌
నిర్మాత: బ‌న్నీ వాస్‌
ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: మారుతి
బ్యాన‌ర్స్: యు.వి. క్రియేష‌న్స్‌, జీఏ2 పిక్చ‌ర్స్‌

యాక్ష‌న్ హీరోగా ఇమేజ్ పొందిన గోపీచంద్‌, కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్స్‌కు పేరు పొందిన ద‌ర్శ‌కుడు మారుతి క‌లిసి సినిమా చేస్తున్నార‌నేస‌రికి జ‌నంలో కొంత ఆస‌క్తి రేకెత్తిన మాట నిజం. 'జిల్' లాంటి హిట్‌, 'ఆక్సిజ‌న్' లాంటి డిజాస్ట‌ర్ మూవీల‌లో క‌లిసి న‌టించిన గోపీచంద్‌, రాశీ ఖ‌న్నా జోడీగా న‌టించిన ఈ మూడో సినిమాని అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో యు.వి. క్రియేష‌న్స్‌, జీఏ2 పిక్చ‌ర్స్ సంయుక్తంగా నిర్మించాయి. టీజ‌ర్‌, ట్రైల‌ర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచ‌గా, సాంగ్స్ మాత్రం ఆశించిన రీతిలో పాపుల‌ర్ కాలేక‌పోయాయి. ఈ నేప‌థ్యంలో జూలై 1న వ‌చ్చిన 'ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్' సినిమా ఎట్లా ఉన్న‌ద‌య్యా అంటే...

క‌థ‌:- సూర్య‌నారాయ‌ణ (స‌త్య‌రాజ్‌) నిజాయితీప‌రుడైన న్యాయ‌మూర్తి. కానీ ఒక కేసులో దుర్మార్గుడైన వివేక్ (రావు ర‌మేశ్‌) అనే అత‌ను డ‌బ్బుతో సాక్ష్యాన్ని కొనివేయ‌డంతో ఒక అమాయ‌కురాలికి శిక్ష వేస్తూ తీర్పు చేప్పాల్సి వ‌స్తుంది ఆయ‌న‌కు. ఆ అమ్మాయి ఉరివేసుకొని చ‌నిపోవ‌డంతో, ఆయ‌న తీర్పు వ‌ల్లే ఆమె ఆత్మ‌హ‌త్య చేసుకుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. దాంతో మ‌న‌స్తాపానికి గురైన సూర్య‌నారాయ‌ణ త‌న జ‌డ్జి ప‌ద‌వికి రాజీనామా చేసి, కిరాణా కొట్టు పెట్టుకుంటాడు. కొన్నేళ్లు గ‌డిచాక ఆయ‌న కొడుకు ల‌క్కీ (గోపీచంద్‌) పేరుపొందిన క్రిమిన‌ల్ లాయ‌ర్‌గా పేరు తెచ్చుకుంటాడు. అయితే అత‌ను ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌. డ‌బ్బు కోసం, ఖ‌రీదైన గిఫ్టుల కోసం ఎంత‌టి నేర‌గాళ్ల‌కైకా కొమ్ముకాసి, వాళ్ల త‌ర‌పున కేసులు వాదించి కేసులు గెలుస్తుంటాడు. సూర్యానారాయ‌ణ‌కు తెలిసిన ఒక ఫ్యామిలీ వివేక్ వ‌ల్ల తీవ్రంగా న‌ష్ట‌పోయి, న్యాయం చెయ్య‌మ‌ని ఆయ‌న ద‌గ్గ‌ర‌కు వ‌స్తుంది. ఆ కేసును వాదించ‌మ‌ని ల‌క్కీని అడుగుతాడు సూర్య‌నారాయ‌ణ‌. కానీ, వాళ్లు త‌న‌కు ఫీజు ఏమిస్తార‌ని వెట‌కారం చేసి, వివేక్ త‌ర‌పున వాదించ‌డానికి ఒప్పుకుంటాడు. దాంతో పాతికేళ్ల క్రిత వ‌దిలేసిన కోటును వేసుకొని లాయ‌ర్‌గా కోర్టులో అడుగుపెడ‌తాడు సూర్య‌నారాయ‌ణ‌. తండ్రీ కొడుకుల ఛాలెంజ్‌లో ఎవ‌రు గెలిచారు? ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ అయిన ల‌క్కీ క‌ళ్లు తెరుచుకున్నాయా? అనేది మిగ‌తా క‌థ‌.


ఎనాలసిస్ :

ఈ క‌థ‌లో కొత్త‌ద‌నం ఏమీ లేదు. మారుతి సినిమాలో కొత్తద‌నం ఎక్స్‌పెక్ట్ చేయ‌డం అత్యాశ‌. ఒక పాయింట్ మీద క‌థ అల్లుకొని, క్యారెక్ట‌రైజేష‌న్స్‌తో, కామెడీ సీన్ల‌తో, న‌వ్వు తెప్పించే నాలుగు డైలుగుల‌తో ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌గా సినిమా తీయ‌డం అత‌నికి తెలిసిన విద్య‌. మ‌రోసారి అదే ఫార్మ‌ట్‌లో, త‌న స్టైల్‌లో ఈ మూవీని తీశాడు. గోపీచంద్ చేసిన ల‌క్కీ, స‌త్య‌రాజ్ చేసిన‌ సూర్య‌నారాయ‌ణ, రావు ర‌మేశ్ చేసిన వివేక్ అనే మూడు ప్ర‌ధాన పాత్ర‌ల చుట్టూ ఈ సినిమా క‌థ‌ని న‌డిపించాడు. రాశీ ఖ‌న్నా చేసిన లాయ‌ర్ ఝాన్సీ అలియాస్ శిరీష పాత్ర‌ అద‌న‌పు ఆక‌ర్ష‌ణ లాంటిది. ఆమె అస‌లు పేరు శిరీష అయితే, లాయ‌ర్ ఝాన్సీ అనేది ఆమె న‌టించే సీరియ‌ల్‌లోని క్యారెక్ట‌ర్ పేరు. ఆ క్యారెక్ట‌ర్‌నే నిజ జీవితంలో ఊహించుకొని హాస్యాన్ని పంచుతుంటుంది. 

తండ్రీ కొడుకుల ఛాలెంజ్‌లో మ‌న‌కు కొడుకు ల‌క్కీ విల‌న్‌గా క‌నిపిస్తుంటాడు. సినిమా మొద‌ట్లోనే ఫ‌స్ట్ ఫైట్‌లో తాను హీరో కాద‌నీ, విల‌న్ అనీ చెప్పి, త‌న క్యారెక్ట‌రైజేష‌న్ ఎలాంటిదో చెప్పేశాడు. అయితే అదేం చిత్ర‌మో కానీ, అత‌ను చేసే ప్ర‌తి ఫైటూ సీరియ‌స్ టోన్‌లో కాకుండా కామెడీ టోన్‌లోనే క‌నిపిస్తుంది. డ‌బ్బు కోసం దుర్మార్గుల కొమ్ము కాస్తూ, వారిచ్చే డ‌బ్బుల‌కు ఆశ‌ప‌డి వారిని గెలిపిస్తూ, అమాయ‌కుల‌కు అన్యాయం చేస్తూ వ‌స్తున్న అత‌నిపై మ‌న‌కు ప్రేమాభిమానాలు ఎలా క‌లుగుతాయి? 

క్రిమిన‌ల్స్ అయిన అయూబ్ ఖాన్ (దేవ్ గిల్‌), అత‌ని త‌మ్ముడు జ‌లీల్ ఖాన్‌ను ఓ కేసులో గెలిపించి న్యాయాన్ని ఓడించేలా చేసిన అత‌ను, ఇంకో కేసులో అదే అన్న‌ద‌మ్ముల త‌ర‌పున వాదించ‌డానికి ఒప్పుకొని, కోర్టుకు తండ్రి రావ‌డం చూసి, చివ‌రి క్ష‌ణంలో వాళ్ల‌నే ఆ కేసులో ఇరికించి, వారి ఎద‌రి ప‌క్షం అయిన వివేక్ గెలిచేట్లు చేస్తాడు. ఎందుకంటే.. పాపం.. ఆ తండ్రి త‌న కొడుకు అమాయ‌కుల త‌ర‌పున వాదించి, వారిని గెలిపిస్తున్నాడ‌ని న‌మ్ముతుంటాడు క‌నుక‌. కానీ అత‌ను గెలిపించింది ఒక‌ప్పుడు త‌న రాజీనామాకు కార‌కుడైన వివేక్‌ని అనే విష‌యం తెలిసి ఆ తండ్రి హ‌ర్ట‌వుతాడు. అప్పుడు తండ్రీ కొడుకుల ఛాలెంజ్ మొద‌ల‌వుతుంది. ఇక్క‌డ చిత్ర‌మేమంటే కోర్టులో ల‌క్కీ అంతు చూస్తామ‌ని చెప్పిన అయూబ్ ఖాన్ ఆ త‌ర్వాత ఏమైపోయాడో డైరెక్ట‌ర్‌కే తెలియాలి. అంటే ఆ క్యారెక్ట‌ర్‌ను అలా మ‌ధ్యలో వ‌దిలేసి, దానికి తీర‌ని అన్యాయం చేశాడు మారుతి. సూర్య‌నారాయ‌ణ‌, ల‌క్కీ మ‌ధ్య కాన్‌ఫ్లిక్ట్ కూడా ఏమంత ఆక‌ట్టుకోదు. ఫోర్స్‌డ్‌గా క‌నిపిస్తుంది.

త‌న సినిమాల్లో రాశీ ఖ‌న్నాకు ఎంట‌ర్‌టైనింగ్ రోల్స్ ఇవ్వ‌డం ఈ సినిమాలోనూ అత‌ను కొన‌సాగించాడు. ఆమె ఇద్ద‌రు అసిస్టెంట్ల (స‌ప్త‌గిరి, వైవా హ‌ర్ష‌)తో హ‌ల్‌చ‌ల్ చేస్తూ న‌వ్వు తెప్పించేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నించింది. పాత సినిమాల్లో రావు గోపాల‌రావు - అల్లు రామ‌లింగ‌య్య జోడీ త‌ర‌హాలో ఈ సినిమాలో రావు ర‌మేశ్‌, అత‌ని అసిస్టెంట్ దివాక‌రంగా న‌టించిన అజ‌య్ ఘోష్ క‌నిపిస్తారు.  నేనింతే మూవీలో రవితేజ స‌ర‌స‌న‌ హీరోయిన్‌గా క‌నిపించిన‌ సియా గౌత‌మ్ ఈ మూవీలో ఓ ట్విస్ట్ కోసం ఉప‌యోగ‌ప‌డే క్యారెక్ట‌ర్ చేసింది. క్లైమాక్స్ మ‌న ఊహ‌కు త‌గ్గ‌ట్లే ఉటుంది.

టెక్నిక‌ల్ విష‌యాల‌కొస్తే.. మారుతి ప‌లుచోట్ల‌ సంభాష‌ణ‌లు ఆక‌ట్టుకుంటాయి. కొన్ని చోట్ల చీప్‌గా అనిపిస్తాయి. స్క్రీన్‌ప్లే ఇంకా గ్రిప్పింగ్‌గా రాసుకోవాల్సింది. జేమ్స్ బిజోయ్ మ్యూజిక్ ఆక‌ట్టుకునే రీతిలోనే ఉంది. పాట‌లు చిత్రీక‌ర‌ణ ప‌రంగా బాగున్నా, సినిమాకు అద‌న‌పు ఆక‌ర్ష‌ణ తెచ్చే స్థాయిలో లేవు. క‌ర్మ్ చావ్లా సినిమాటోగ్ర‌ఫీ ఎఫెక్టివ్‌గా ఉంది. ఉద్ధ‌వ్ ఎడిటింగ్ ఫ‌ర్వాలేదు. ర‌వీంద‌ర్ ఆర్ట్ వ‌ర్క్ ఎప్ప‌ట్లా మెప్పించింది. నిర్మాణ విలువ‌లు క్వాలీటీగా ఉన్నాయి.

న‌టీన‌టుల ప‌నితీరు:- ల‌క్కీ పాత్ర‌లో 'ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్' సినిమాను త‌న భుజాల మీద మోసుకు వెళ్లాడు గోపీచంద్‌. క్లైమాక్స్‌లో మ‌నం ముందే ఊహించే ట్విస్ట్ ఉన్న ల‌క్కీ క్యారెక్ట‌ర్‌లోకి సునాయాసంగా ప‌ర‌కాయ ప్ర‌వేశం చేశాడు. అత‌ని పాత్ర ముందు స‌త్య‌రాజ్ చేసిన సూర్య‌నారాయ‌ణ పాత్ర వెల‌వెల‌బోయింది. ఆ పాత్ర‌ను వీక్ చేయ‌డంతో స‌త్య‌రాజ్ విజృంభించి న‌టించ‌డానికి అవ‌కాశం లేక‌పోయింది. అయిన‌ప్ప‌టికీ ఆ పాత్ర‌లో స‌త్య‌రాజ్ హుందాగా క‌నిపించాడు. వివేక్‌గా విల‌నీని త‌న‌దైన త‌ర‌హాలో పండించాడు రావు ర‌మేశ్‌. గోపీచంద్‌కు దీటుగా రాశీ ఖ‌న్నా వినోదం పంచింది. దివాక‌రంగా అజ‌య్ ఘోష్ కామెడీ, డైలాగ్స్ అల‌రిస్తాయి. క్లైమాక్స్‌లో వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్ అతిథి పాత్ర‌లో మెరిసింది. మిగ‌తా వాళ్లు త‌మ ప‌రిధుల మేర‌కు న్యాయం చేశారు.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

కొత్త‌ద‌నం లేని క‌థ‌, అంత గ్రిప్పింగ్‌గా లేని స్క్రీన్‌ప్లేతో న‌డిచే 'ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్' కొంత‌మేర‌కు ఆడియెన్స్‌కు వినోదాన్ని పంచుతుంది. కాల‌క్షేపం కోసమే కాకుండా గోపీచంద్ కోసం కూడా ఓసారి చూడొచ్చు.

 

- బుద్ధి య‌జ్ఞ‌మూర్తి