English | Telugu
బ్యానర్:శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, లక్కీ మీడియా
Rating:2.00
విడుదలయిన తేది:Aug 14, 2021
సినిమా పేరు: పాగల్
తారాగణం: విష్వక్‌సేన్, నివేదా పేతురాజ్, మురళీశర్మ, భూమిక, మేఘలేఖ, సిమ్రన్ చౌదరి, ఇంద్రజా శంకర్, రాహుల్ రామకృష్ణ, మహేశ్ ఆచంట, ఆటో రామ్‌ప్రసాద్
కథ, స్క్రీన్‌ప్లే: నరేశ్ కుప్పిలి
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి, కె.కె., చంద్రబోస్, అనంత శ్రీరామ్
మ్యూజిక్: రథన్
బ్యాగ్రౌండ్ మ్యూజిక్: లియోన్ జేమ్స్
సినిమాటోగ్రఫీ: ఎస్. మణికందన్
ఎడిటింగ్: గ్యారీ బీహెచ్
ప్రొడక్షన్ డిజైన్: లతా తరుణ్
ఫైట్స్: దిలీప్ సుబ్బరాయన్, రామకృష్ణ
కొరియోగ్రఫీ: విజయ్ బిన్ని
సమర్పణ: దిల్ రాజు
నిర్మాత: బెక్కెం వేణుగోపాల్
దర్శకత్వం: నరేశ్ కుప్పిలి
బ్యానర్స్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, లక్కీ మీడియా
విడుదల తేదీ: 14 ఆగస్ట్ 2021
విష్వక్‌సేన్ హీరోగా 'పాగల్' మూవీని తీస్తున్నట్లు దిల్ రాజు ప్రకటించగానే చాలామందిలో క్యూరియాసిటీ కలిగింది. ఫ్యామిలీ డ్రామాలు, లవ్ స్టోరీలు తీయడానికి పేరుపడ్డ బ్యానర్ విష్వక్‌సేన్‌తో సినిమా తీస్తుండటంతో అతను కమర్షియల్ జానర్‌లోకి వస్తున్నాడని అర్థమైంది. మొదట ఏప్రిల్ 30న, తర్వాత మే 1 సినిమా రిలీజ్ అవుతుందని నిర్మాతలు ప్రకటించారు. కానీ కొవిడ్ సెకండ్ వేవ్‌తో థియేటర్లు రెండోసారి మూతపడటంతో విడుదల ఆగి, ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నరేశ్ కుప్పిలి డైరెక్టర్‌గా పరిచయమైన 'పాగల్' ఎలా ఉందంటే...
కథ
టైటిల్‌కు తగ్గట్లే ప్రేమ కోసం తహతహలాడే ఓ పాగల్ స్టోరీ ఇది. ప్రేమ్ (విష్వక్‌సేన్) చిన్ననాడే తల్లి (భూమిక) కేన్సర్‌తో చనిపోతుంది. కానీ ఆమె అందించిన ప్రేమను ప్రేమ్ మరచిపోలేకపోతుంటాడు. ఒక అమ్మాయిని ప్రేమిస్తే, ఆ అమ్మాయి నుంచి తల్లి ప్రేమ దొరుకుతుందని టీనేజ్‌లో ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్ చెబితే, అప్పట్నుంచి అమ్మాయిలను ప్రేమించడం మొదలుపెడతాడు. ఒకరిద్దరు కాదు, ఏకంగా 1600 మందిని ప్రేమిస్తాడు. అందరూ రిజెక్ట్ చేస్తారు. ఒక ముగ్గురు మాత్రం అతన్ని ప్రేమించానని చెప్పి తర్వాత ఏదో ఒక కారణంతో విడిపోతారు. ఎవరి దగ్గరా తను ఆశించిన ప్రేమ లభించకపోవడం, అందరూ తనను రిజెక్ట్ చేస్తుండటంతో ఫ్రస్ట్రేషన్‌కు గురైన ప్రేమ్.. ఒకరోజు ఫ్లైఓవర్ మీద నుంచి కిందకు దూకి చనిపోదామని ప్రయత్నించినప్పుడు తీర (నివేదా పేతురాజ్) అనే అమ్మాయి అతడికి 'ఐ లవ్ యూ' చెబుతుంది. అయితే అప్పటికే తనకు మరొకరితో నిశ్చితార్ధం జరిగిందని చెప్పిన ఆమె, పెళ్లికి ఆరు నెలల టైమ్ ఉందనీ, అంతదాకా ప్రేమిస్తానని చెప్తుంది. ఆ ఆరు నెలల కాలంలో వాళ్లిద్దరూ ఎలాంటి అనుభవాలు, అనుభూతులు పొందారు, ఆరు నెల్ల తర్వాత ఏమైందనేది మిగతా కథ.
ఎనాలసిస్ :
'అమ్మ ప్రేమ' అనే పాయింట్ చుట్టూ అల్లుకున్న ప్రేమకథ 'పాగల్'. దాన్ని ఎంటర్‌టైనింగ్‌గా చూపించేందుకు కొత్త దర్శకుడు నరేశ్ కుప్పిలి ప్రయత్నించాడు. రైటర్‌గా అతనిలో మంచి విషయం ఉందని అతను రాసుకున్న స్క్రీన్‌ప్లే తెలియజేసింది. ఇంటర్వెల్ బ్యాంగ్ నుంచి రైటర్‌గా అతను ఇంప్రెస్ చేశాడు. కాకపోతే రెండు ప్రధాన పాత్రల క్యారెక్టరైజేషన్స్ తీర్చిదిద్దిన విధానంలో అతను పొరపాటు పడ్డాడు. చిన్నతనంలో తల్లితో ప్రేమ్ సీన్లు ఆకట్టుకున్నాయి. తనకు అన్నీ అయిన అమ్మ చిన్నప్పుడే చనిపోతే, ఒంటరివాడైన ప్రేమ్‌ను ఎవరు పెంచి పెద్దచేశారు, చదివించారనే విషయం ఒక ప్రశ్నగా ఉండిపోయింది.
అమ్మ లాగా ప్రేమించే అమ్మాయి కోసం నిరంతరం అన్వేషించే ప్రేమ్ వారివెంట రోమియోలాగా పడటం కరెక్టు కాదు కదా! ఆ ప్రేమల్ని కూడా కామెడీగా చూపించడం మరో పొరపాటు. వైజాగ్‌లో సముద్రం ఉందనీ, అక్కడ సముద్రమంత ప్రేమ దొరుకుతుందని ఎవరో చెప్తే, అక్కడకు వెళ్లి అమ్మాయిల కోసం వెంపర్లాడే ప్రేమ్‌తో సహానుభూతి చెందడం కష్టమే. తాననుకున్న ప్రేమ వైజాగ్‌లో దొరకలేదని, తిరిగి హైదరాబాద్‌కు వచ్చి, రాజారెడ్డి (మురళీశర్మ) అనే పొలిటీషియన్‌ను ప్రేమిస్తున్నాని వెంటపడ్డం, అతను తాను గేని కానని మొదట బెట్టుచేసి ప్రేమ్‌ను చావగొట్టించడం, అయినా ప్రేమ్ చలించకుండా ప్రత్యర్థుల నుంచి రాజారెడ్డిని కాపాడ్డం, దాంతో ఇంప్రెస్ అయిన రాజారెడ్డి అతడ్ని ప్రేమిస్తున్నానని చెప్పడం, ఆ తర్వాత ఆ ఇద్దరి మధ్య వచ్చే సీన్లు మనకు ఇబ్బంది కలిగించేవే. అయితే ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం సెకండాఫ్‌పై ఇంట్రెస్ట్‌ను నిలిపింది. రాజారెడ్డిని ప్రేమ్ గన్‌తో కాల్చడం ఆ ఇంటర్వెల్ బ్యాంగ్! దాంతో రాజారెడ్డి వెనుక ప్రేమ్ పడడంలో పెద్ద కథ ఉందనే విషయం అర్థమైంది.
మనకు కథానాయిక తీర పరిచయమయ్యేది సెకండాఫ్‌లోనే. ఈ సెకండాఫ్ స్టోరీ అంతా రాజారెడ్డికి ప్రేమ్ చెప్పే కథన్న మాట. తీర, ప్రేమ్ మధ్య సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఆరు నెలల పాటు ప్రేమించుకున్న తర్వాత వచ్చే ట్విస్ట్ కథకు కీలకం. కానీ ఇక్కడే రాజారెడ్డి క్యారెక్టరైజేషన్‌లో తప్పులు చేశాడు డైరెక్టర్. అలాగే హీరోకూ, అతని ఫ్రెండ్స్‌కూ మధ్య సీన్లు ఫార్సుగా, ఫోర్సుడుగా అనిపించాయి. రాహుల్ రామకృష్ణ గ్యాంగ్‌తో హీరో సీన్లు కూడా అదే తరహాలో సాగాయి. ఓవరాల్‌గా కామెడీ వర్కవుట్ కాలేదు. డైలాగ్స్ విషయంలో మరింత శ్రద్ధ వహిస్తే బాగుండేది.
టెక్నికల్ అంశాలకు వస్తే.. పాటలకు రధన్ ఇచ్చిన మ్యూజిక్ ఆకట్టుకుంది. గూగుల్ గూగుల్, ఈ సింపుల్ చిన్నోడే సాంగ్స్ ఆకట్టుకున్నాయి. లియోన్ జేమ్స్ బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా ఓకే. మణికందన్ సినిమాటోగ్రఫీ ఇంప్రెసివ్‌గా ఉంది. గ్యారీ బీహెచ్ ఎడిటింగ్ కూడా ఓకే.
నటీనటుల అభినయం:
ఇప్పటిదాకా చేసిన సబ్జెక్టులకు భిన్నమైన లవ్ స్టోరీలో కొత్తగా కనిపించాడు విష్వక్‌సేన్. ప్రేమ్ క్యారెక్టర్‌కు అతికినట్లు సరిపోయాడు. ఎమోషన్స్‌ను బాగా పండించాడు. అయితే అతనిచేత పాటల్లో డాన్స్ చేయించకుండా ఉంటే మంచిది. తీర పాత్రకు వంద శాతం న్యాయం చేసింది నివేదా పేతురాజ్. ఆమె ఫ్యామిలీ లుక్ తీర పాత్రకు పర్ఫెక్టుగా సూటయ్యింది. విష్వక్‌సేన్‌తో ఆమె కెమిస్ట్రీ కూడా బాగా వర్కవుట్ అయ్యింది. రాజకీయనాయకుడు రాజారెడ్డిగా, కథకు కీలకమైన పాత్రలో మురళీశర్మ ఎప్పట్లా తన ముద్రను వేశాడు. హీరో తల్లిగా స్పెషల్ క్యారెక్టర్‌లో భూమిక ఆకట్టుకున్నారు. హీరోను తమతో ప్రేమపేరుతో తిప్పించుకొని వదిలేసే అమ్మాయిలుగా మేఘలేఖ, సిమ్రన్ చౌదరి, ఇంద్రజా శంకర్ పాత్రల పరిధి మేరకు నటించారు. రాహుల్ రామకృష్ణ, మహేశ్ ఆచంట, ఆటో రామ్‌ప్రసాద్ లాంటివాళ్లు కూడా ఇంప్రెస్ చేయలేకపోయారు.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
సినిమాలో ప్రేమ్ క్యారెక్టర్ ప్రేమకోసం అర్రులు చాస్తాడు కానీ.. అతని ప్రేమతో, అతని ఎమోషన్స్‌తో ప్రేక్షకులు కనెక్ట్ కాకపోవడం 'పాగల్' సినిమాకు పెద్ద మైనస్ పాయింట్. విష్వక్‌సేన్, నివేదా పేతురాజ్ నటన, రెండు పాటలు మినహా చెప్పుకోడానికి పెద్దగా విషయం లేని సినిమా ఇది. మంచి సబ్జెక్టు దొరికితే డైరెక్టర్ నరేశ్ ఫ్యూచర్‌లో రాణిస్తాడని మాత్రం చెప్పవచ్చు.