English | Telugu

సినిమా పేరు:ఆపరేషన్ గోల్డ్ ఫిష్
బ్యానర్:వినాయకుడు టాకీస్
Rating:2.25
విడుదలయిన తేది:Oct 18, 2019

తారాగణం: ఆది సాయికుమార్, సాషా చెత్రి, కార్తీక్ రాజు, పార్వతీశం, నిత్యా నరేశ్, అబ్బూరి రవి, కృష్ణుడు, రావు రమేశ్, మనోజ్ నందం, అనీశ్ కురువిల్లా
దర్శకత్వం: అడివి సాయికిరణ్
నిర్మాతలు: ప్రతిభా అడివి, కట్టా ఆశిష్ రెడ్డి, కేశవ్ ఉమా స్వరూప్, పద్మనాభ రెడ్డి, గ్యారీ బిహెచ్‌, సతీష్ డేగల
బ్యానర్: వినాయకుడు టాకీస్
సహ నిర్మాత: దామోదర్ యాదవ్
మ్యూజిక్: శ్రీచరణ్ పాకాల
సినిమాటోగ్రఫీ: జైపాల్‌రెడ్డి నిమ్మల
ఎడిటింగ్: గ్యారీ బీహెచ్ 
స్క్రిప్ట్ డిజైన్: అబ్బూరి రవి
పాటలు: రామజోగయ్యశాస్త్రి
ఫైట్స్: రామకృష్ణు, సుబ్బు-నభా
విడుదల తేదీ: 18 అక్టోబర్ 2019

మనదేశంలోనే మనవాళ్లయిన కశ్మీరీ పండిట్లు కాందిశీకుల్లా ఇతర రాష్ట్రాల్లో తలదాచుకోవడమనే బాధాకరమైన విషయాన్ని హైలెట్ చేస్తూ, కశ్మీర్ అనేది మనదేశంలో అంతర్భాగమనే విషయాన్ని గట్టిగా ఈ సినిమాలో చెప్పామని డైరెక్టర్ సాయికిరణ్ అడివి చెప్పడంతో 'ఆపరేషన్ గోల్డ్ ఫిష్'పై ఒక వర్గం ప్రేక్షకులు ఆసక్తి చూపించారు. అయితే ఈ సినిమా విడుదల కోసం నిర్మాతలు చాలా అగచాట్లే పడ్డారు. ఆర్థిక ఇబ్బందులతో సరిగా ప్రమోషన్ కూడా చెయ్యలేకపోయారు. ఈ నేపథ్యంలో వచ్చిన 'ఆపరేషన్ గోల్డ్ ఫిష్' ఆకట్టుకొనే రీతిలో ఉందా?...

కథ

కశ్మీర్.. పాకిస్తాన్‌దేననే, అందుకోసం జిహాదీని నడుపుతున్నామని చెప్పే టెర్రరిస్ట్ నేత ఘాజీ బాబా (అబ్బూరి రవి) తన కుట్రలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చిన విషయాన్ని పసిగట్టిన నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్‌కు చెందిన కమాండో అర్జున్ పండిట్ (ఆది సాయికుమార్), అతడ్ని పట్టుకుంటాడు. అక్కడే అతడ్ని తన గన్‌తో కాల్చివేద్దామనుకుంటాడు. కానీ పై అధికారుల ఆర్డర్స్ కారణంగా, ప్రభుత్వానికి అప్పగిస్తాడు. భారత్ సైన్యం చేతికి ఘాజీ దొరికిపోయాడనే విషయం తెలుసుకున్న అతని అనుయాయులు ఫరూఖ్ ఇక్బాల్ (మనోజ్ నందం) నేతృత్వంలో 'గోల్డ్ ఫిష్'ను కిడ్నాప్ చేసి, ఘాజీని విడిపించుకోవాలని కుట్ర చేస్తారు. ఆ విషయాన్ని తెలుసుకున్న అర్జున్ పండింట్.. 'ఆపరేషన్ గోల్డ్ ఫిష్' చేపడతాడు. గోల్డ్ ఫిష్ ఎవరు? ఘాజీ బాబాను ఫరూఖ్ విడిపించుకోగలిగాడా? అర్జున్ పండిట్ గతమేమిటి? అతని గతానికీ, ఘాజీ బాబాకీ ఉన్న లింకేమిటి?.. అనేది మిగతా కథ.


ఎనాలసిస్ :

డైరెక్టర్ ఎంచుకున్న సబ్జెక్ట్ బాగానే ఉంది. దేశభక్తిని ప్రేరేపించే కథ. పాకిస్తాన్ ప్రేరేపిత టెర్రరిస్టులు వేలాది మంది కశ్మీరీ పండిట్లను ఊచకోత కోయడంతో, ప్రాణాలు దక్కించుకోడానికి చాలామంది కశ్మీరీ పండిట్లు తమ మాతృభూమి కశ్మీర్‌ను వదిలి మిగతా రాష్ట్రాలకు వలసపోయి జీవితాలు సాగిస్తున్నారు. ఈ విషయాన్ని హైలైట్ చేయడంతో పాటు, కశ్మీర్ ఎప్పటికీ భారత్‌దేనని చెప్పడానికీ, ఆర్టికల్ 370 రద్దు ద్వారా కేంద్రం సరైన పని చేసిందని ప్రశంసించడానికీ ఈ సినిమాను ఉపయోగించుకున్నాడు డైరెక్టర్ సాయికిరణ్ అడివి. కాకపోతే తన కథను క్వాలిటీగా తెరపైకి తీసుకు రావడానికి అతడికి ఆర్థిక వనరులు కలిసి రాలేదని సినిమా చూస్తుంటే అర్థమైపోతుంది. ఇలాంటి కథకు బలమైన సన్నివేశాలు, బిగువైన కథనం అవసరం. ప్రథమార్థంలో అలాంటి బలమైన సన్నివేశాలు లేవు. సినిమా ఆరంభ సన్నివేశాలే బలహీనంగా, ఒక ఫార్సులాగా అనిపించడం.. మిగతా సినిమాపై తప్పకుండా ప్రభావాన్ని కలిగిస్తాయి.

ప్రధాన కథ సీరియస్ పాయింట్ మీద నడిచేది కావడంతో, ప్రేక్షకులకు కాస్త రిలీఫ్ కలిగించడానికన్నట్లు ఒక కాలేజీ స్టూడెంట్స్ స్టోరీని దానికి జోడించారు. అందులో కాలేజీలో కొత్తగా చేరిన ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిల మధ్య స్నేహాన్ని సృష్టించి, ఆ ఇద్దరమ్మాయిల్లో ఒకరిని ఇద్దరబ్బాయిలూ ప్రేమించేట్లు చేసి, లవ్ డ్రామా సృష్టించాడు. ఈ లవ్ డ్రామా అంతగా ఆకట్టుకోదు. కాలేజీ ప్రిన్సిపాల్‌కు కానీ, ఇంకెవరికీ గానీ చెప్పకుండా ఆ నలుగురూ ట్రిక్కింగ్‌కు వెళ్లి, టెర్రరిస్టుల బారిన పడటం, వాళ్లను రక్షించడానికి అర్జున్ పండిట్ రంగంలోకి దిగడం.. కొంత ఆసక్తిని కలిగిస్తాయి. 'గోల్డ్ ఫిష్'గా మనకు ప్రొజెక్ట్ చేసేవాళ్ల విషయంలో డైరెక్టర్ ట్విస్ట్ పెట్టాడు కానీ, మొదట్లోనే దాన్ని మనం పసిగట్టేస్తాం. ఇలాంటి సినిమాలకు క్లైమాక్స్ కీలకం. ఆ పతాక సన్నివేశాల్ని బలంగా రాసుకోవడంలో, చిత్రీకరించడంలో రచయిత, దర్శకుడు ఫెయిలయ్యారు. ఒక సాధారణ యాక్షన్ సినిమా స్థాయి క్లైమాక్స్ లాగా తీసేశారు.  సినిమాలో మూడు పాటలున్నాయి.. వాటి ప్రభావం స్వల్పం. కాకపోతే అవి పంటికింద రాళ్లులా లేకపోవడం రిలీఫ్‌నిచ్చే విషయం. నేపథ్య సంగీతం ఫర్వాలేదు. సినిమాటోగ్రఫీలో మెరుపులేమీ లేవు. సాధారణ స్థాయిలో ఉంది. బలహీన సన్నివేశాల వల్ల ఎడిటింగ్ తేలిపోయింది. కొన్నిచోట్ల డైలాగ్స్.. న్యూస్ చెప్పే తరహాలో సాగాయి. డైరెక్షన్ లోపాలు పలుచోట్ల బహిర్గతమయ్యాయి.

ప్లస్ పాయింట్స్
కథ
అర్జున్ పండిట్ కేరెక్టర్
సెకండాఫ్‌లో 'గోల్డ్ ఫిష్' చుట్టూ నడిచే సన్నివేశాలు

మైనస్ పాయింట్స్
బలహీన సన్నివేశాలు
స్క్రీన్‌ప్లేలో బిగువు లేకపోవడం
మిస్ కేస్టింగ్ 
ప్రొడక్షన్ విలువలు నాణ్యంగా లేకపోవడం
క్లైమాక్స్ అంచనాల్ని అందుకోకపోవడం

నటీనటుల అభినయం
నిజం చెప్పుకోవాలంటే ఇది మిస్ కేస్టింగ్ మూవీ. రావు రమేశ్ మినహా ప్రధాన పాత్రధారుల్లో ఎవరూ ఆకట్టుకోలేకపోయారు. అర్జున్ పండిట్‌గా ఆది కొత్తగా ఉన్నాడు. కానీ అతని అభినయం, డైలాగ్ డెలివరీ ఆ పాత్రకు తగ్గ స్థాయిలో లేవు. మాజీ ఆర్మీ అధికారిగా అనీశ్ కురువిల్లా అభినయం ఓకే కానీ, ఆయన డైలాగ్ డిక్షన్ విచిత్రంగా అనిపించింది. కీలకమైన ఘాజీ బాబా కేరెక్టర్‌లో రైటర్ అబ్బూరి రాణించలేకపోయాడు. ఆ పాత్రలో ఆయన హావభావాలు అపరిపక్వంగా ఉన్నాయి. డైలాగ్స్ చెప్పడంలోనూ అనుభవలేమి స్పష్టం. ఫరూఖ్ కేరెక్టర్‌లో మనోజ్ నందం కాస్త బెటర్. కానీ కరడుగట్టిన ఉగ్రవాదికి ఉండాల్సిన ఫేస్ అతనిలో కనిపించలేదు. నలుగురు స్టూడెంట్స్‌లో కార్తీక్ రాజు, పార్వతీశం, సాషా చెత్రి ఫర్వాలేదు. నిత్యా నరేశ్ ఏమాత్రం ఆకట్టుకోలేదు. మతిమరుపు వాచ్‌మన్‌గా కృష్ణుడు ఓకే.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

కశ్మీర్ అనేది పాకిస్తాన్‌ది కాదు, భారత్‌దేనని చెప్పడానికి తీసిన ఈ సినిమా.. మేకింగ్‌లో నాణ్యత లోపించడం వల్లా, ఆకట్టుకొనే కథనం లేనందు వల్లా.. అక్కడక్కడా మినహాయిస్తే, ఎక్కువసేపు విసుగునే తెప్పిస్తుంది.

- బుద్ధి యజ్ఞమూర్తి 

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.00

తెలుగు వన్ రేటింగ్ : 3.00

తెలుగు వన్ రేటింగ్ : 2.25

తెలుగు వన్ రేటింగ్ : 1.75

తెలుగు వన్ రేటింగ్ : 2.25