English | Telugu

సినిమా పేరు:ఓం న‌మో వేంక‌టేశాయ‌
బ్యానర్:ఎ యమ్ ఆర్ సాయి కృపా ఎంటర్‌టైన్‌మెంట్స్
Rating:2.50
విడుదలయిన తేది:Feb 10, 2017

మాస్ మ‌సాలా క‌థ‌ల‌కు అల‌వాటు ప‌డిపోయిన తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఆధ్యాత్మిక కోణం చూపించిన ద‌ర్శ‌కుడు కె.రాఘ‌వేంద్ర‌రావు. అన్న‌మ‌య్య‌తో ఆయ‌న ప్రయాణం పూర్తిగా మారిపోయింది. ఆయ‌న‌పై అప్ప‌టి వ‌ర‌కూ ఉన్న అభిప్రాయం కూడా మారింది. దేవుడి క‌థ‌లు, భ‌క్తుల క‌థ‌ల‌కూకాసులు రాల‌తాయన్న నిజం తెలిసింది. అన్న‌మ‌య్య‌, శ్రీ‌రామ‌దాసు.. ఇవి రెండూ నాగార్జున‌లోని న‌టుడ్ని స‌రికొత్త‌గా ప‌రిచ‌యం చేసిన చిత్రాలే. ఇప్పుడు వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో ఓం న‌మో వేంక‌టేశాయ వ‌చ్చేసింది. మ‌రి ఈ సినిమా ఎలా ఉంది??  అన్న‌మ‌య్య‌, రామ‌దాసు స‌ర‌స‌న చేరిందా?  లేదంటే శిరిడీసాయిలా నిరాశ ప‌రుస్తుందా?  తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

* క‌థ‌

రామ (నాగార్జున‌) చిన్న‌ప్ప‌టి నుంచీ వేంక‌టేశ్వ‌ర‌స్వామి భ‌క్తుడు. భ‌గ‌వంతుడ్ని నేరుగా చూడాల‌ని క‌లలు కంటాడు. అందుకే ఇంట్లోంచి వ‌చ్చేస్తాడు. దేవుడ్ని చూసే చ‌దువుకావాలంటూ గురువు (సాయికుమార్‌)ని వేడుకొంటాడు. దేవుడ్ని చూసే చ‌దువు చెప్ప‌లేను... కానీ దేవుడు ఎదురైతే గుర్తించే చదువు చెబుతా అంటూ ఆ గురువు రామ‌ని చేర‌దీస్తాడు. దేవుడి ద‌ర్శ‌న‌మైనా, దాన్ని గుర్తించ‌లేని రామ‌... కొన్నాళ్ల‌కు ఇంటికి వ‌చ్చేస్తాడు. ఇంట్లో రామ‌కి పెళ్లి సంబంధాలు చూస్తుంటారు. భ‌వానీ (ప్ర‌గ్యా జైస్వాల్‌) రామ‌ని పెళ్లి చేసుకొందామ‌నుకొంటుంది. ఈ త‌రుణంలో మ‌ళ్లీ ఇంటి నుంచి తిరుమ‌ల వ‌చ్చేస్తాడు రామ‌. ఈసారైనా రామ‌కి స్వామి ద‌ర్శ‌నం క‌లిగిందా?  కొండ‌పై ప‌రిచ‌మైన కృష్ణ‌మ్మ (అనుష్క‌) ఎవ‌రు?   రామ అనే భ‌క్తుడు హాథీరామ్ బాబాగా ఎలా మారాడు? ఏడుకొండ‌ల వాడు దిగివ‌చ్చి హాథీరామ్ ని ఎలా ప‌రీక్షించాడు?  కొండ‌పై హాథీరామ్‌కి ఎదురైన స‌వాళ్లేంటి? అనేదే చిత్ర‌క‌థ‌.


ఎనాలసిస్ :

మ‌హా భ‌క్తుడు హాథీరామ్ పుణ్య చ‌రిత ఇది... అంటూ ఈ టైటిల్ కింద ఓ ట్యాగ్ లైన్ పెట్టారు. అయితే.. అటు హాథీరామ్ బాబా చ‌రిత్ర‌తో పాటు తిరుమ‌ల క్షేత్ర పురాణం చెప్ప‌డానికి ఈ సినిమా తీసిన‌ట్టు అనిపిస్తుంది. హాథీరామ్ బాబా బాల్యం, య‌వ్వ‌నం, స్వామితో చేసిన ప్ర‌యాణం, జీవ స‌మాధి వీట‌న్నింటినీ మేళ‌విస్తూ - వేంక‌టేశ్వ‌ర‌స్వామి మ‌హాత్య్యాలు చెప్ప‌డానికి `ఓం న‌మో వేంక‌టేశాయ‌`ని వేదిక చేసుకొన్నారు రాఘ‌వేంద్ర‌రావు.   నిత్యం తిరుమ‌ల వెళ్తున్నా... మ‌న‌కు తెలియ‌ని చాలా విష‌యాల్ని ఈ సినిమాలో స‌వివ‌రంగా చెప్పే ప్ర‌య‌త్నం చేశారు.  నిత్య క‌ల్యాణం ఎందుకు జ‌రుపుతారు?  న‌వ‌నీత సేవ ఎలా వ‌చ్చింది?  వ‌రాహ స్వామిని ఎందుకు ద‌ర్శించుకోవాలి? ఇలాంటి విష‌యాల గురించి విపులంగా చెప్పారు.  ఏ సేవ ఎందుకు చేస్తారు?  అస‌లు తిరుమ‌ల‌లో ఏం చేయాలి, ఏం చేయ‌కూడ‌దు అనే విష‌యాల‌పై డాక్యుమెంట‌రీ తీసిన‌ట్టు అనిపిస్తాయి కొన్ని దృశ్యాలు.  వేంక‌టేశ్వ‌ర స్వామి భ‌క్తుల‌కు మ‌రీ ముఖ్యంగా యువ‌త‌రానికి తెలియ‌ని చాలా విష‌యాల్ని ఇందులో పొందుప‌రిచారు. అయితే.. అవ‌న్నీ నిజ‌మేనా?  ఈ విష‌యాల‌కు ప్రామాణిక‌త ఏది?  అనే విష‌యాల‌పై స్ప‌ష్ట‌త లేదు.  హాథీరామ్ బాబా గురించి చ‌రిత్ర‌లో ఉన్నది కొంతే. ఆ కొంత‌దాన్నే.. ముక్క‌లు ముక్క‌లుగా చెప్పారు. అంతేత‌ప్ప‌... హాథీరామ్ బాబా కుటుంబం గురించి గానీ, వ్య‌క్తిగత జీవిత విశేషాల గురించి గానీ లోతుల‌కు వెళ్లే ప్ర‌య‌త్నం చేయ‌లేదు. తొలిస‌గం బాగా నిదానం సాగింది. అక్క‌డ‌క్క‌డ కామెడీ ట్రాకులు పెట్ట‌డం చికాకు క‌లిగించేదే. కొండ‌పై న‌డిచే స‌న్నివేశాల‌న్నీ దాదాపుగా డాక్యుమెంట‌రీ స్థాయిలో ఉంటాయి. అయితే... భ‌క్తుల‌కు ఆ విష‌యాలే ఆక‌ట్టుకొంటాయి. ద్వితీయార్థంలోనూ డ్రామా పండ‌లేదు. అయితే ప‌తాక స‌న్నివేశాలు ఆక‌ట్టుకొంటాయి. అన్న‌మ‌య్య స్థాయిలో కాక‌పోయినా.. ఈ సినిమాపై ఓ మంచి అభిప్రాయం ఏర్ప‌డ‌డానికి ప‌తాక దృశ్యాలు ఓ కార‌ణ‌మ‌వుతాయి.   విజువ‌ల్‌గా ఈసినిమా చాలా బాగుంది. కొండ‌లు, జ‌ల‌పాతాలు మ‌నోహ‌రంగా చూపించారు. రెండు పాట‌లు రాఘ‌వేంద్ర‌రావు గ్లామ‌ర్ ట‌చ్‌తో సాగుతాయి. కుటుంబ ప్రేక్ష‌కుల‌కు అవి కాస్త ఇబ్బంది క‌లిగించే సంద‌ర్భాలే.

* న‌టీన‌టుల ప్ర‌తిభ‌

నో డౌట్‌. ఇలాంటి సినిమాల్ని నాగార్జున మాత్ర‌మే చేయ‌గ‌ల‌డు. భ‌క్తుడిగా అత‌ని న‌ట‌న చిర‌స్మ‌ర‌ణీయ‌మైన‌ది.  స్వామి వారిని ద‌ర్శించేట‌ప్పుడు ఆ క‌ళ్ల‌లో మెరుపు, నాగ్ ప్ర‌ద‌ర్శించిన హావ‌భావాలు... అబ్బుర ప‌రుస్తాయి. అయితే అన్న‌మ‌య్య స్థాయిలో ఊహించుకొంటే మాత్రం కాస్త నిరాశ‌ప‌డ‌క మాన‌దు. అనుష్క అత్యంత సంప్ర‌దాయంగా క‌నిపించింది. కృష్ఱ‌మ్మ పాత్ర‌కు త‌నే యాప్ట్ అనిపించింది. జ‌గ‌ప‌తిబాబు క‌నిపించింది కాసేపే. కానీ ఆ ఇంపాక్ట్ మాత్రం ఎక్కువ‌గా ఉంటుంది. సౌర‌భ్ జైన్‌ని ఎంపిక చేసుకొనేట‌ప్పుడు కొన్ని అనుమానాలు రేగాయి. స్వామి పాత్ర‌కు ఇంకెవ్వ‌రూ క‌నిపించ‌లేదా?  అనిపించింది. అయితే తన ఎంపిక ఎంత క‌రెక్టో.. సౌర‌భ్ జైన్ నిరూపించుకొన్నాడు. ఎస్ పీ బాలు ఇచ్చిన నేప‌థ్య గాత్రం.. ఆ పాత్ర‌కు మ‌రింత హుందాత‌నం తీసుకొచ్చింది.


* సాంకేతి వ‌ర్గం

అన్నింటికంటే ఎక్కువ మార్కులు భార‌వి రాసిన డైలాగుల‌కు ప‌డ‌తాయి.  చాలా సంద‌ర్భాల్లో సంభాష‌ణ‌లు ఆలోచింప‌జేసేవిలా ఉన్నాయి. భ‌గ‌వంతుడుడీ - భ‌క్తుడికీ మ‌ధ్య మాట‌ల యుద్ధం ఆక‌ట్టుకొంటుంది. కీర‌వాణి సంగీతం.. ఈ చిత్రానికి ప్రాణం పోసింది. నేప‌థ్య సంగీతంతో... ఓల‌లాడించారు. క్వాలిటీ విష‌యంలో నిర్మాత‌లు ఎక్క‌డా రాజీ ప‌డ‌లేదు. గ్రాఫిక్స్ ని కూడా బాగా వాడుకొన్నారు. ఇలాంటి సినిమాలు చేయాలంటే రాఘ‌వేంద్ర‌రావే చేయాలి అనేది మ‌రోసారి నిరూపిత‌మైంది. అన్న‌మ‌య్య‌లాంటి గొప్ప సినిమా కాక‌పోవొచ్చు గానీ.. ఈ సినిమాపై పెంచుకొన్న అంచ‌నాల్ని త‌ప్ప‌కుండా అందుకొనేలా తీర్చిదిద్దారు.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

ఓం న‌మో వేంక‌టేశాయ‌.. తిరుమ‌ల వైభ‌వానికి ప్ర‌తీక‌

తెలుగు వన్ రేటింగ్ : 2.50

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.00

తెలుగు వన్ రేటింగ్ : 3.00

తెలుగు వన్ రేటింగ్ : 2.25

తెలుగు వన్ రేటింగ్ : 1.75

తెలుగు వన్ రేటింగ్ : 2.25