Read more!

English | Telugu

సినిమా పేరు:ఒక్క అమ్మాయి తప్ప
బ్యానర్:అంజిరెడ్డి ప్రొడక్షన్స్
Rating:1.00
విడుదలయిన తేది:Jun 10, 2016

మంచి సినిమాకి ఉండాల్సిన అర్హ‌త ఏమిటి?
మంచి క‌థ‌
క‌థ‌నం
వినోదం
నిజానికి ఇవేం కాదు.  ప్రేక్ష‌కుడ్ని రెండు గంట‌ల పాటు థియేట‌ర్లో కూర్చోబెట్ట‌డం. ఇది చేత కాక‌పోతే చేతిలో ఎంత మంచి క‌థ ఉన్నా... వ్య‌ర్థ‌మే. ఇప్పుడున్న యంగ్ డైరెక్ట‌ర్లు - కొత్త క‌థ‌ల‌తోనే వ‌స్తున్నారు. కాన్సెప్టుని ప‌ట్టుకొని.. వాటితో మెప్పించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అయితే చేతిలో ఉన్న క‌థ, న‌మ్ముకొన్న కాన్సెప్టు ప్రేక్ష‌కుల్ని రెండు గంట‌ల పాటు థియేట‌ర్లో కూర్చోబెట్ట‌డానికి స‌రిపోతుందా అనేది మాత్రం ఆలోచించ‌డం లేదు. ఒక్క అమ్మాయి త‌ప్ప‌.. కూడా కాన్సెప్ట్ బేస్డ్ మూవీనే. మ‌రి ఈ కాన్సెప్ట్‌తో ద‌ర్శ‌కుడిగా అడుగుపెట్టిన రాజ‌సింహా మెప్పించాడా..?  సందీప్ - నిత్య‌ల కెమిస్ట్రీ కుదిరిందా?  అస‌లు ఈ సినిమా క‌థేంటి?   ఎలా తీశారు?  తెలుసుకొందాం.. రండి.

కథ:

హైద‌రాబాద్‌లోని ఫ్లైఓవ‌ర్‌ని అడ్డుపెట్టుకొని జైల్లో ఉన్న ఉగ్ర‌వాదిని విడుద‌ల చేయ‌డానికి ఓ ముఠా ప్లాన్ వేస్తుంది. ఫ్లై ఓవ‌ర్‌పై ట్రాఫిక్ జామ్ చేసి... అక్క‌డ స్ట్ర‌క్ అయిపోయిన వంద‌ల మందిని చంపుతామ‌ని బెదిరించి జైల్లో ఉన్న ఉగ్ర‌వాదిని విడిపించ‌డానికి పెద్ద స్కెచ్చే వేస్తుంది. ఆ ట్రాఫిక్ జామ్‌లోనే హీరో (సందీప్ కిష‌న్‌) కూడా చిక్కుకొంటాడు. అదే ట్రాఫిక్ జామ్ లో ఉన్న అమ్మాయి (నిత్య‌మీన‌న్‌)ని చూసి ఇష్ట‌ప‌డ‌తాడు. ఆ అమ్మాయి, తాను చిన్న‌ప్పుడు ఇష్ట‌ప‌డిన మ్యాంగో ఒక్క‌రే అని తెలిసి షాక్ అవుతాడు. అనుకోకుండా ఉగ్ర‌వాదుల ప్లాన్ ఫెయిల్ అవుతుంది. దాంతో ఉగ్ర‌వాదుల దృష్టి ప్లైఓవ‌ర్‌పై ఉన్న హీరోపై ప‌డుతుంది. హీరోని టార్గెట్ చేసి, అత‌ని ద్వారా బాంబు పేల్చాల‌ని ప్ర‌య‌త్నిస్తారు. అదెలా సాధ్య‌మైంది?  ఫ్లై ఓవ‌ర్‌పై బాంబులు పేల‌కుండా హీరో ఏం చేశాడు?  త‌న ప్రియురాల్ని ఎలా కాపాడాడు?  అన్న‌దే క‌థ‌.


ఎనాలసిస్ :

ఫ్లైఓవ‌ర్‌పై ఓ బాంబు ఉంది. అక్క‌డే హీరో కూడా ఉన్నాడు అన‌గానే...  ఆ బాంబు పేల‌దు, హీరో కాపాడేస్తాడు అన్న విష‌యం అర్థ‌మైపోతుంది. అంటే.. ద‌ర్శ‌కుడు రాసుకొన్న పాయింట్ లోనే ఆస‌క్లి లేదు. కాక‌పోతే ఉగ్ర‌వాదులు త‌మ మిష‌న్‌లో భాగంగా హీరోని వాడుకోవాల‌ని చూడ‌డం మాత్ర‌మే రాజ‌సింహా రాసుకొన్న క‌థ‌లో కొత్త పాయింట్‌. అయితే ఆ పాయింట్ ఇంట్ర‌వెల్‌కి గానీ మొద‌లు కాదు. అంటే.. విశ్రాంతి ముందు వ‌ర‌కూ ద‌ర్శ‌కుడు రాజ‌సింహా క‌థ‌ని బ‌ల‌వంతంగా న‌డ‌పాల‌న్న‌మాట‌. అక్క‌డే... రాజ‌సింహా ప్రేక్ష‌కుల చేత 33 చెరువుల నీళ్లు తాగించాడు. తొలి అర్థ‌భాగంలో స‌న్నివేశాల్ని ఫిల్ చేయాల‌ని చూసిన ఆయ‌న ప్ర‌య‌త్నం విఫ‌ల‌మైంది. అలీతో పెళ్లి చూపుల ఎపిసోడ్ ఏమాత్రం పండ‌కపోగా.. విసుగు తెప్పించింది. తాగుబోతు ర‌మేష్‌, స‌ప్త‌గిరి, ఫృద్వీల‌ను ఫ్లై ఓవ‌ర్‌పై లాక్ చేసి మంచి ప‌ని చేశాడు. కానీ వాళ్ల నుంచి కామెడీ రాబట్టుకోవ‌డంలో ద‌ర్శ‌కుడు విఫ‌ల‌మ‌య్యాడు. సెకండాఫ్‌లో అయినా క‌థ వేగంగా సాగుతుందా అంటే అదీ లేదు. హీరో, విల‌న్లు ఫోన్ లో మాట్లాడుకోవ‌డంతోనే సాగిపోయింది. చివ‌ర్లో హీరో త‌న తెలివి తేట‌ల్ని ఉప‌యోగించి.. విల‌న్ ఆట క‌ట్టిస్తాడు. అంత‌కు మించి సినిమాలో కొత్త‌ద‌నం ఏమీ లేదు..

క‌థ ఓకే గానీ.. క‌థ‌నం లాజిక్‌ల‌కు దూరంగా సాగింది. 12 గంట‌ల పాటు ట్రాఫిక్ జామ్ అయితే.. పోలీసులేం చేయ‌లేదా?  ఇంత అత్యాధునిక టెక్నాల‌జీ కూడా ప‌నిచేయ‌కుండా పోతుందా? అని ఆలోచిస్తే... ఈ సినిమా ఎప్పుడో తేలిపోతుంది. ముస్లింలు బాంబు పెట్టార‌ని చూపించి... అదే క‌థ‌లో ముస్లిం జాతి గొప్ప‌ద‌నాన్ని అన‌ర్గ‌ళంగా క్లాసు పీకిన‌ట్టు చెప్ప‌డం.. జాతి స‌మైక్య‌త‌కు సంబంధించిన అరిగిపోయిన డైలాగులు వేసుకోవ‌డం బోరింగ్‌గా అనిపిస్తుంది. డైలాగుల ద్వారా దేశ‌భ‌క్తి రాదు. అది కంటెంట్‌లో ఉండాలి. స‌న్నివేశాన్ని తెర‌పైచూపిస్తున్న విధానంతో రావాలి. కానీ... ఈ సినిమాలో అది జ‌ర‌గ‌లేదు.

పెర్ఫామెన్స్:

సందీప్ కిష‌న్, నిత్య‌మీన‌న్ ఇద్ద‌రూ ప్ర‌తిభావంతులే. చురుగ్గా, హుషారుగా న‌టించారు. అయితే హీరోని ఫ్లై ఓవ‌ర్ కీ, నిత్య‌ని ఆటోకీ అంకితం చేసేశారు. సెకండాఫ్‌లో నిత్య చేసిందేం లేదు. అస‌లు ఈ పాత్ర‌కి నిత్య‌మీన‌న్‌నే ఎందుకు తీసుకోవాలి??  సందీప్ త‌ప్ప‌.. మిగిలిన ఎవ్వ‌రికీ న‌టించే ఛాన్స్ ఇవ్వ‌లేదు. కామెడీ గ్యాంగ్ అంత‌మంది ఉన్నా... వినోదం పండించ‌లేక‌పోయారంటే అది ర‌చ‌యిత త‌ప్పిద‌మే.

టెక్నికల్ గా:

చోటా కెమెరా వ‌ర్క్ సూప‌ర్బ్‌. కాక‌పోతే సీజీ చేసిన సంగ‌తి గుర్తొస్తుంటుంది. మిక్కీ పాట‌ల్లో కొత్త‌ద‌నం ఏమీ లేదు. నేపథ్య సంగీతం కూడా అంతంత మాత్రంగానే సాగింది. కాన్సెప్ట్ ప‌రంగా ఈ సినిమా ఓకే. కానీ ఎగ్జిక్యూష‌న్ ప‌రంగా ద‌ర్శ‌కుడు ఘోరంగా ఫ్లాప్ అయ్యాడు.  అస‌లు ఈ క‌థ‌కీ ఒక్క అమ్మాయి త‌ప్ప టైటిల్‌కీ ఎక్క‌డ లింకు కురిదిందో అర్థం కాదు.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

ఒక్క అమ్మాయి త‌ప్ప‌.. ఓ త‌ప్పుల కుప్ప‌!!