Read more!

English | Telugu

సినిమా పేరు:నేను మీకు బాగా కావాల్సినవాడిని
బ్యానర్:కోడి దివ్య ఎంటర్టైన్మెంట్
Rating:2.00
విడుదలయిన తేది:Sep 16, 2022

సినిమా పేరు: నేను మీకు బాగా కావాల్సినవాడిని
తారాగణం: కిరణ్ అబ్బవరం, సంజనా ఆనంద్, సిద్ధార్థ్ మీనన్, సోనూ ఠాకుర్, బాబా భాస్కర్, ఎస్వీ కృష్ణారెడ్డి, సమీర్, గెటప్ శ్రీను
సంగీతం: మణిశర్మ
సినిమాటోగ్రఫీ: రాజ్ నల్లి
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
నిర్మాత: కోడి దివ్య దీప్తి
స్క్రీన్ ప్లే, డైలాగ్స్: కిరణ్ అబ్బవరం 
దర్శకత్వం: శ్రీధర్ గాదె
బ్యానర్: కోడి దివ్య ఎంటర్టైన్మెంట్స్
విడుదల తేదీ: 16 సెప్టెంబర్ 2022

'రాజా వారు రాణి గారు', 'ఎస్ఆర్ కళ్యాణమండపం' సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో కిరణ్ అబ్బవరం ఇతర కుర్ర హీరోల కంటే వేగంగా వరుస సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే ఈ ఏడాది అతను నటించిన 'సెబాస్టియన్', 'సమ్మతమే' సినిమాలు విడుదల కాగా అవి ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. 'సమ్మతమే' అయినా కాస్త పర్లేదు అనే టాక్ తెచ్చుకుంది కానీ, 'సెబాస్టియన్' మాత్రం దారుణంగా నిరాశపరిచింది. ఇక ఈ ఏడాది ముచ్చటగా మూడో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అదే 'నేను మీకు బాగా కావాల్సినవాడిని'. ఇందులో కిరణ్ పూర్తి మాస్ రోల్ లో కనిపిస్తున్నాడు. మరి ఈ చిత్రం కిరణ్ కి విజయాన్ని అందించేలా ఉందో లేక కేవలం తాను చేసిన సినిమాల సంఖ్య పెంచుకోవడానికి అన్నట్లు ఉందో రివ్యూలో చూద్దాం.

కథ:

సిటీలో క్యాబ్ డ్రైవర్ గా పని చేసే వివేక్(కిరణ్)కి సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తున్న తేజు(సంజనా) గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంటుంది. ఎందుకంటే ఆమె ఎప్పుడూ ఏదో కోల్పోయిన దానిలా బాధగా, దేవదాసులా మందు తాగుతూ ఉంటుంది. అసలు ఆమె మనసులో ఉన్న బాధ ఏంటి? ఆమె ఇలా మద్యానికి బానిస ఎందుకైంది? అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు వివేక్. తేజు జీవితంలో జరిగిన విషాదం ఏంటి? అసలు వివేక్ ఎవరు? అతనికి, తేజుకి సంబంధం ఏంటి? అతను తేజు గురించి తెలుసుకోవడానికి ఎందుకంత తపన పడుతున్నాడు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.


ఎనాలసిస్ :

ప్రేక్షకులు సినిమా చూసే విధానం ఎప్పుడో మారిపోయింది. కానీ కొందరు ఫిల్మ్ మేకర్స్ మాత్రం ఇంకా మారడం లేదు. 'శశిరేఖా పరిణయం' మూవీలోని మెయిన్ పాయింట్ తీసుకొని, దానికి ఓ రెండు కథలు జోడించి, రెండు గంటలు ఏదో అలా అలా నడిపించేసి చివరిలో ట్విస్ట్ రివీల్ చేసి, ఏదో సినిమా చేసేశాంలే అన్నట్లుగా ప్రేక్షకుల మీద వదిలారు. నిజానికి ఈ చిత్రానికి దర్శకుడిగా మొదట కార్తీక్ శంకర్ పేరు ప్రకటించారు. తర్వాత ఏమైందో ఏమో కానీ 'ఎస్ఆర్ కళ్యాణమండపం' ఫేమ్ శ్రీధర్ గాదె దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నాడు. కథ, కొంత దర్శకత్వం ఏమో కార్తీక్, స్క్రీన్ ప్లే-డైలాగ్స్ ఏమో కిరణ్, మిగతా దర్శకతం శ్రీధర్. అందుకేనేమో సినిమా కిచిడీ అయిపొయింది.

ఈ సినిమా ఫస్ట్ హాఫ్ చూస్తే ఇందులో అసలు కిరణ్ హీరోనా? లేక అతిథి పాత్ర చేశాడా? అనే అనుమానం కలుగుతుంది. పక్కా కమర్షియల్ హీరోలా ఎంట్రీ ఇస్తాడు. ఆ తర్వాత సాంగ్, ఫైట్, హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్, ఇంటర్వెల్. ఫస్ట్ హాఫ్ లో కేవలం ఓ సాంగ్, ఓ ఫైట్, కొన్ని డైలాగ్స్ తో సరిపెట్టుకున్నాడు కిరణ్. పోనీ సెకండాఫ్ అయినా పైసా వసూల్ అనేలా ఉంటుందా అంటే అదీ లేదు. బాబా భాస్కర్ తో కలిసి కిరణ్ అందించిన 'లాయర్ పాప లవ్ స్టోరీ' చాలా చప్పగా సాగింది. హీరోయిన్ కథతో ఫస్టాఫ్, హీరో కథతో సెకండాఫ్ నడిపించి.. క్లైమాక్స్ లో ఓ ట్విస్ట్ తో సినిమాని మమా అనిపించారు.

కిరణ్ తనను తాను మాస్ హీరోగా పరిచయం చేసుకోవడానికి ట్రయిల్ గా ఈ సినిమా చేసినట్లుంది. రెండు సాంగ్స్, రెండు ఫైట్స్, బిల్డప్ షాట్స్ తప్ప పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు. ఓ వైపు అడివి శేష్, నిఖిల్ వంటి హీరోలు విభిన్న చిత్రాలతో ఆకట్టుకుంటుంటే.. కిరణ్ ఇంకా పాత చింతకాయ పచ్చడి కథలు చేయడం ఆశ్చర్యంగా ఉంది. ఎక్కువ సినిమాలు చేయడం ముఖ్యం కాదు, కంటెంట్ ఉన్న సినిమాలు చేయడం ముఖ్యమని ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. ఇలాగే వరుస పెట్టి ఇలాంటి సినిమాలు చేసుకుంటూ పోతే.. ముందు ముందు అసలు అతని సినిమాలు ఎప్పుడు వచ్చాయో ఎప్పుడు పోయాయో కూడా ప్రేక్షకులకు తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. దానికి తోడు కిరణ్ తన సినిమాలకు తానే స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నాడు. ఆ బాధ్యతను ఫుల్ టైం రైటర్స్ కి అప్పగించి, తన కథల ఎంపిక పైన, నటన పైన పూర్తి దృష్టి పెడితే బెటర్. ఎందుకంటే ఇంచు మించు అతని అన్ని సినిమాల్లోనూ డైలాగ్స్ ఒకేలా అనిపిస్తున్నాయి.

ఈ సినిమాకి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం దర్శకుడు. అయితే పాటలు ఆయన స్థాయికి తగ్గట్లు లేవు. ఆయన స్థాయికి తగ్గట్లు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇవ్వడానికి సన్నివేశాల్లో బలం లేదు. మణిశర్మ పేరు కేవలం ఒక బ్రాండ్ లా పని చేసింది అనే చెప్పొచ్చు. 'చిలక పచ్చ కోక', 'ఆట కావాలా' పాటల రీమిక్స్ బిట్స్ మాత్రం ఆడియన్స్ కి కిక్ ఇచ్చేలా ఉన్నాయి. రాజ్ నల్లి కెమెరా పనితనం, ప్రవీణ్ పూడి కూర్పు బాగానే ఉన్నాయి. దర్శకుడిగా ఎన్నో గొప్ప సినిమాలు అందించిన దివంగత కోడి రామకృష్ణ కుమార్తె దివ్య దీప్తి ఈ చిత్రానికి నిర్మాత. ఆమె స్క్రిప్ట్ విషయంలో శ్రద్ధ వహించాలి. ఇలాంటి పేలవమైన కథా కథనాలు ఉన్న సినిమాలు చేస్తే ఆమె నిర్మాతగా రాణించడం కష్టమే.

నటీనటుల పనితీరు:

ఇందులో కిరణ్ పేరుకి హీరోనే కానీ ఎక్కువగా సాంగ్స్, ఫైట్స్, కాస్త ఎంటర్టైన్మెంట్ కే పరిమితమయ్యాడు. అయితే పాత్రకు తగ్గట్లు ఎనర్జిటిక్ గా పర్ఫామ్ చేశాడు. మాస్ స్టెప్పులతో, ఫైట్స్ తో ఆకట్టుకున్నాడు. క్లైమాక్స్ లో ఎమోషనల్ డైలాగ్స్ తో మెప్పించాడు. అయితే ఆడియన్స్ అప్డేట్ అయిన ఈ టైంలో ఇలాంటి రొటీన్ పాత్రలు, రొటీన్ సినిమాలకు కిరణ్ దూరంగా ఉంటే బెటర్. ఇందులో హీరోయిన్ సంజనా ఆనంద్ పాత్రకు బాగానే ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా ఫస్టాఫ్ అంతా ఆమె చుట్టూనే తిరుగుతుంది. ఆ పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. ఫ్లాష్ బ్యాక్ లో సంజన బాయ్ ఫ్రెండ్ పాత్రలో సిద్ధార్థ్ మీనన్ ఆకట్టుకున్నాడు. ఫస్టాఫ్ లో కాసేపు అతనే హీరో అన్న అభిప్రాయం కలుగుతుంది. సోనూ ఠాకుర్, బాబా భాస్కర్, ఎస్వీ కృష్ణారెడ్డి, సమీర్, గెటప్ శ్రీను తదితరులు పాత్రల పరిధి మేరకు రాణించారు.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

టైటిల్ అయితే 'నేను మీకు బాగా కావాల్సినవాడిని' అని ఆసక్తికరంగా పెట్టారు కానీ సినిమానే ఆకట్టుకునేలా లేదు. రొటీన్ కథా కథనాలతో చాలా సాదాసీదాగా సాగిపోయింది. ఎంతో భవిష్యత్ ఉన్న కిరణ్ అబ్బవరం వంటి కుర్ర హీరో ఇలాంటి రొటీన్ సినిమాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

-గంగసాని